"కత్తిరింపులు నేర్చుకోవటం మిషన్ కొనేసి నాలుగు రోజులు టకటక చప్పుడు సేయ్యటం, కాగితాలు, గుడ్డలు కత్తిరించి యిల్లంతా పోగులు పట్టటం, ఎక్కడ చూసినా యివే కనిపిస్తుంది నాన్నా. మళ్ళీ జాకెట్ కుట్టించుకోవాలంటే బయటి టైలర్ ని పిలిచి యిస్తుంటారు. మిషన్ మాత్రం భద్రంగా మూలపడి వుంటుంది."
వసంత కొడుకు వంక కోపంగా చూసింది.
"అన్నట్లు యింకోటుంది నాన్నా!"
"ఏమిటి మామీద రీసెర్చి చేస్తున్నావా!" నందన ఉక్రోషంగా అంది.
"ఆ మధ్య అమ్మ వీణ నేర్చుకున్నది. చూశావా! ఆ టింగ్ టింగ్ లతో యిల్లంతా మార్మోగి పోయింది. ఇప్పుడు వీణ ఎక్కడుందో తడుముకోకుండా చెప్పనా వందరూపాయలు పందెం?"
"చాల్లే ఇహ ఆపు" కుమారి కోపంగా అంది.
"ఒక విషయం చెప్పనా!" అన్నాడు మూర్తి.
అంతా అతని వంక చూశారు.
తనది కాని జీవితం జీవించడానికి చాలామంది తహ తహపడతారు. కొన్నాళ్ళయ్యాక వంటికి యిమడక దాన్నుంచి విముక్తి పొందటానికి తాపత్రయ పడతారు ఇది ఈనాటి నాగరికత?"
ఎవరికీ ఎదురు చెప్పటానికి పాయింటు దొరకలేదు.
"భోజనాలయ్యాక మోహన్ ఒకసారి పైకిరా" అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు.
అయిదు నిముషాలు గడిచాక "ఏమిటి నాన్నా?" అంటూ మోహన్ తండ్రి దగ్గరకు వెళ్ళాడు.
అనంతమూర్తి ఈజీ చైర్ లో వెనక్కివాలి కూర్చుని సిగరెట్టు కాల్చుకుంటున్నాడు.
"కూర్చో"
మోహన్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎవరూ లేరు. ఎందుకో కొంచెం భయమనిపించింది.
"నువ్వు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్లు తెలిసింది నిజమేనా?"
ఒక నిమిషం టైమ్ తీసుకుని "నిజమే నాన్నా" అన్నాడు నెమ్మదిగా.
"ఆ అమ్మాయి ఎవరో కులమేమిటో, జాతి ఏమిటో నా కనవసరం. ప్రేమించుకున్న వాళ్ళకి, పోనీ ప్రేమించుకుంటున్నామని అనుకునే వాళ్ళకి చాలా ముందు చూపు వ్యక్తిత్వం వుందాలి. ఒకటి ఆ అమ్మాయి జీవితాన్ని ఏ విధంగానూ పాడుచేసే హక్కు నీకులేదు. రెండు ప్రేమ పేరుతో సోషల్ లైఫ్ కి బాయికాట్ చేయబడినట్టు దూరమై నీ జీవితాన్ని ఇరుకు జీవితం చేసుకునే హక్కు నీకు లేదు. మూడు నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలిగే శక్తి వచ్చే వరకూ వ్యవహారం పెళ్ళిదాకా పోనిచ్చే హక్కు నీకు లేదు ఈ మూడింటిని సాధించే పరిపూర్ణత నీలో వున్ననాడు నువ్వెవర్ని ప్రేమించినా నాకభ్యంతరం లేదు. ఇహ వెళ్ళు.
ఒక్క నిముషం తండ్రి ముఖంలోకి చూసి మోహన్ అక్కడ్నించి లేచి క్రిందకు దిగి వెళ్ళిపోయాడు.
* * *
"అంకుల్"
మూర్తి ఆఫీసులో టేబుల్ ముందు కూర్చుని వ్రాసుకుంటున్న వాడల్లా తల ఎత్తి చూశాడు.
విమల గుమ్మంలో నిలబడి వుంది.
రామ్మా!" అన్నాడు సాదరంగా.
విమల దగ్గరికొచ్చి నిలబడింది. మనిషి భయంతో, ఆందోళనతో కృంగిపోయినట్లు కనిపిస్తోంది.
"కూర్చో అమ్మా"
"కాఫీ తాగుతావా!"
"వద్దు అంకుల్."
"చెప్పమ్మా ఏమిటి సంగతి?
విమల తలఎత్తి అనంతమూర్తి ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"నేను....నేను....తప్పుచేశాను అంకుల్"
"ఈ సృష్టిలో తప్పుచేయంది ఎవరమ్మా? నేరంచెయ్యడం వేరు తప్పు చెయ్యటం వేరు. ఏం జరిగిందో చెప్పమ్మా!"
"మా ఆఫీసులో పనిచేసే పాషా అనే అబ్బాయితో క్లోజ్ గా వున్నాను. ఒకర్ని ఒకరు లైక్ చేశాం...కాని....కాలు జారాను అంకుల్. ఇప్పుడు-ఇదయింది...వొట్టి మనిషిని కూడా కాదు."
అనంతమూర్తి ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు.
"ఏం చెయ్యాలో చెప్పు అంకుల్."
"ఇంట్లో తెలిసిందా!"
"ఇంతవరకూ తెలియదు. నాన్న బాధపడి పోతారు. అమ్మ చంపేస్తుంది."
"మరి ఇదంతా జరుగుతుందని తెలిసి ఎందుకలా చేశావు?"
విమల తలయెత్తి అతని కళ్ళలోకి చూసింది.
"కొన్ని సందర్భాలలో...అలా చెయ్యకుండా వుండగలగటం అసాధ్యమని తెలుసుకున్నాను."
"నాన్నగారితో మాట్లాడతాను."
"నువ్వేం చేస్తావో చెయ్యాలి అంకుల్. నేనేమీ నూ వాళ్ళతో వివరించలేను. నాకా అవకాశం ఇవ్వరు వాళ్ళు ఏమయినా నేను పాషాని పెళ్ళిచేసుకొని తీరాలి. అదివినా గత్యంతరం లేదు. అర్ధమయిందా అంకుల్?"
"అలాగేనమ్మ!"
విమల వెళ్ళిపోయాక చాలాసేపు ఆలోచిస్తూ అలా కిటికీలోంచి చూస్తూ వుండిపోయాడు.
* * *
విషయం విని రాగహవ భూవిలోకి కృంగిపోయినట్లయి పోయాడు. అప్పటికే ముఖం ముడతలు పడింది. కళ్ళచుట్టూ నల్లగీతలు ఏర్పడ్డాయి. జుట్టు ముందు భాగమంతా వూడిపోయి వున్నది. కాస్త తెల్లబడిపోయింది. వెన్ను కాస్తా వొంగింది. ఇంకా అతను గుమాస్తానే.
"వీల్లేదు అలా జరగటానికి వీల్లేదు." అని అరిచాడు.
"జరగక తప్పదు. విమల ఇప్పుడు వొట్టిమనిషి కూడా కాదు. రాఘవా-కొంచెం నిదానంగా ఆలోచించు నేను పాషా అనే అతన్ని చూశాను. అతన్తో మాట్లాడాను. ఉద్యోగస్థుడు ఆఫీసులో కూడా మంచి పేరుంది. నిజాయితీ పరుడిలా కనిపించాడు."
"నేను నా కూతుర్ని అన్యమతం వాడకివ్వను."
"నువ్వివ్వద్దు వాళ్ళిద్దర్నీ పెళ్ళి చేసుకోనియ్యి. పోనీ, ఈ పెళ్ళి, నేను చేస్తాను."
"మూర్తీ నేను దాన్ని ఎంత ప్రేమగా పెంచానో నీకు తెలియదా. దానికి జబ్బు చేస్తే తల్లడిల్లిపోయాను. ఆఫీసు మాని అహర్నిశలూ దాని మంచం ప్రక్కనే శుశ్రూషలు చేస్తూ ధైర్యం చెబుతూ గడిపాను. డాక్టర్లు విసుక్కుంటున్నా పదేపదే వాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగాను. అది నాకింత అన్యాయం చేస్తుందా!"
"నీకు అన్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఆమె ఈ పని చెయ్యలేదు. నాగరికతకూ సంస్కారానికీ లొంగని సంఘటనలు కొన్ని వుంటాయి. సృష్ట్యాధి నుంచి అది తటస్థిస్తూనే వున్నాయి. మానవజాతి చరిత్రలో ఒక భాగంగా కలసిపోయాయి."
"వద్దు నాకు నీ సిద్దాంతాలు చెప్పకు. దాన్ని వెనుకేసుకురాకు....దాన్ని నేను క్షమించలేను. ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు. అదంతే." ఉద్రేకంగా అంటూ లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
* * *
రాఘవ ఇంట్లో పెద్దగొడవ జరిగింది. రాఘవ ఆమెను కసితీరా మనసులోని క్షోభంతా బయటకు కేకేసేటట్టు తిట్టాడు. లక్ష్మి అరుస్తూ కేకలు పెడుతూ, చేతులు నొప్పిట్టే వరకు ఎవరడ్డు వస్తున్నా ఆగకుండా కూతుర్ని వళ్ళు హునంచేసి తర్వాత ఫిట్ వచ్చి పడిపోయింది. ఇల్లంతా ఏడుపులు, పెడబొబ్బలు శోకాలు...
