"థాంక్స్ రెడ్డిగారూ..... నా టాలెంట్ మీద, నా చిన్న వయసుమీద మీకున్న అభిమానానికి కృతజ్ఞుడ్ని. అయితే నేను ఇప్పుడు బాధపడుతున్నది నాకు మీరు ఇవ్వటానికి సంకోచిస్తున్న అవకాశం గురించి కాదు. మీ పిరికి తనం గురించి. ఇప్పటికి మీరు పదికోట్ల ఆస్తి సంపాదించారు.....ఏభై సినిమాల దాకా డైరెక్ట్ చేశారు. పెద్ద డైరెక్టర్ల స్థాయిలో నిలబడి వున్నారు. అయినా రమ్యశ్రీకి భయపడుతున్నారు. సినిమా మీడియంని శాసించాల్సిన ఓ డైరెక్టరు ఇలా మాట్లాడుతుంటే నవ్వాలో, ఏడవాలో తెలీకపోయినా మీలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడం కంటే బయట స్టూడియో ముందు పాన్ షాప్ పెట్టుకోవడం బెటరన్నది నా నమ్మకం.....ఓ.కే."
ఆవేశంగా ఫ్లోర్ దాటి బయటికి వస్తున్న శివ అప్పటి మానసిక స్థితేదైనాగాని లంచ్ బ్రేక్ లో ఇంటికి వెళ్ళాలని రమ్యశ్రీ కారు దగ్గరికి వస్తూ ఎదురవడం కాకతాళీయం.
"హల్లో" పలకరించింది రమ్యశ్రీ కాదు, శివ. "మొత్తానికి నా మార్గాన్ని మూసేశారు."
రమ్యశ్రీ గర్వంగా నవ్వింది. "నువ్వు పొరపాటున నాతో పెట్టుకున్నావు."
"ఇప్పటికీ నేను బాధపడటంలేదు."
"నిజమా" వ్యంగ్యంగా పలికింది.
"ఇక ముందు ఇంకా నష్టపోతావ్."
"ఏ విధంగా."
"బహుశా నీకు ఫుడ్ ప్రాబ్లం కూడా మొదలు కావచ్చు."
"ఐసీ" నవ్వాడు హేళనగా.
"ఐ విల్ సీ."
"నేను చూస్తాను."
సినిమా వ్యక్తులంతా విభ్రమంగా గమనిస్తూంటే "ఏమిటి నువ్వు చూసేది" ఆవేశంగా అంది.
"చెప్పను.... చేసి చూపిస్తాను."
"నీకింకా పైత్యం తగ్గలేదు."
"ఇప్పుడే మొదలైంది."
"అవుట్"
"నేనున్నది నీ బెడ్ రూం లో కాదు రమ్యశ్రీ.....అరవకు...." ఆమె జవాబుని ఆశించనట్టు నిర్లక్ష్యంగా ముందుకు నడిచిన శివకి తెలీదు ఈ చర్చని సుకృతి గమనించిందని.
శివలో వున్న ఆ పట్టుదలకే మనసు ఆనందించిందో లేక లేని వాడైనా శివ కూడా తనలాంటివాడే అనిపించిందో అతడ్ని చూస్తూ వుండి పోయింది విస్పారిత నేత్రాలతో.
ఇద్దరూ బాధితులే.... కాకపోతే భిన్న మార్గాల్లో.
అసలు శివ ఆమె మనసులో ఎంత బలమైన స్థానాన్ని సంపాదించిందీ ఆమెకు సైతం తెలీదు.
ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించింది. ఒక్కరాత్రే కాదు, చాలా రాత్రులు.
అందుకే ఓ రోజు షూటింగ్ కి వచ్చిన నారాయణశెట్టిని విష్ చేసింది సుకృతి.
అప్పటికి ఓ గంటగా తననే తినేస్తున్నట్టు చూస్తున్న ప్రముఖ ఫైనాన్సర్ నారాయణశెట్టి మనసు గ్రహించినట్టుగా అంది రహస్యంగా "రాత్రికి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను."
సగం మతిపోయింది నారాయణశెట్టి. తొట్రుపడిపోయాడు.
"నిజమా!"
"ఎస్."
సగం కాలిన శలభం మిగతా సగానికి వెనుకాడదు.
సుకృతి మనస్థిథీ అలాగే వుందిప్పుడు.
సాయంకాలం ఆరుగంటలు కావస్తూంది.
అప్పటికీ అరగంట సేపట్నుంచీ అలంకరించుకుంటున్న సుకృతిని చూస్తూ నిలబడ్డ అలివేలు నెమ్మదిగా అడిగింది. "ఈవేళ షూటింగ్ లేదుగా?"
షూటింగ్ కి వెళ్ళేటప్పుడైనా సుకృతి అంతలా ముస్తాబు కావడం చూడలేదు అలివేలు. అందునా వెళ్తున్నది షూటింగ్ కోసం కాదని తెలిసినా అడిగింది మళ్ళీ "సుదర్శనరావు దగ్గరికేనా?"
క్షణంపాటు అలివేలుని చూసి తల తిప్పుకుంది సుకృతి. "అతడ్ని ఒకసారి అంగీకరించాను అంటే కారణం డబ్బు కోసం."
"ఆ డబ్బు నీకు ఇప్పుడూ అవసరమేగా?"
హాస్పిటల్ బిల్లు కట్టటానికి మరో వారం గడువుంది. ఆ విషయం గుర్తు చేయలేదు- అలివేలు.
"సుకృతీ" బాధగా అంది అలివేలు. "మనకు ఇల్లు గడవటమే ఇబ్బంది అనుకుంటే దానికోసం నేనున్నాగా" సినిమాల్లో వేషాలు దొరక్కపోయినా ప్రతి రాత్రీ ఏదో ఓ మార్గంలో వందో, రెండొందలో సంపాదించగలను."
"ఇప్పుడు నేను వెళ్తున్నది మనం బ్రతకటానికి సంపాదించాల్సిన డబ్బుకోసం కాదాంటీ.....నా బ్రతుక్కి ఓ పరమార్ధం వుందని నిరూపించుకోటానికి."
