తను కాస్త ఉప్మా నోట్లో పెట్టుకోబోయింది. సహించలేదు. అతి కష్టం మీద కాఫీ పెట్టుకుని తాగింది. ఇంట్లో పనిమనిషి కూడా లేదు. "ఇద్దరు మనుషులకి పనిమనిషేందుకు ?" అంటాడు పానకాలు. వీధి చిమ్మి ముగ్గు వెయ్యడం దగ్గరి నుంచి, అంట్లు తోముకోవడం , ఇల్లు చిమ్ముకోవడం, బట్టలుతకడం అన్నీ తనే చేసుకుంటుంది. కానీ ఆ రోజు అస్తమానం కళ్ళు తిరగడంతో నుంచోలేకపోయింది. పక్కింటి పనిమనిషిని పిలిచి ఆ నాలుగు పన్లూ చేయించుకుని, క్రితం రోజు చేసిన పదార్ధాలన్నీ దానికిచ్చేసి, వొదినకి ఉత్తరం రాసి, అడ్రసు చెప్పి, ఆ ఉత్తరాన్ని ఆటోలో వెళ్ళి ఇచ్చి రమ్మంది. ఆమె పరిస్థితి చూస్తూ కాదనలేకపోయింది పక్కింటి పనిమనిషి.
* * * *
ఒళ్ళు కాలిపోతున్న కౌసల్యని చూసి బావురుమంది రాధ. డాక్టరు దగ్గరికి తీసికెళ్ళింది. ఫ్లూ జ్వరం అంటూ ఇంజక్షన్ చేసి మందులిచ్చాడు డాక్టరు. ఆ పూట వంట రాధే చేసింది. కౌసల్యకి పాలో కాఫీయో ఏదో లిక్విడ్ తప్ప భోజనం వొద్దన్నాడు డాక్టరు. మధ్యాహ్నం రెండింటికి పానకాలు వొచ్చాడు భోజనానికి. రాధ చెప్పింది జరిగిన సంగతంతా.
"అక్కగారూ! మీ పెంపకం ఏమీ బాగా లేదండీ, టైముకి భోం చెయ్యడం, నిద్దరపోవడం, ఏమీ చేయ్యదండీ కౌసల్య! బాగా గారం చేసి పాడు చేశారు మీరు. నాకోసం ఎదురు చూడక నువ్వు భోం చేసెయ్యమని లక్ష సార్లు చెప్పాను ,వినదే! ఇలాగైతే ఎలా చెప్పండి? నేనా పొద్దున్నపొతే రాత్రెప్పుడో వస్తాను. ఆమె తిందో తినలేదో నేనెక్కడ కనిపెట్టుకుని చూడను చెప్పండి!"
"వేళకి తినకపోతే ఎలాగ? మొదటినుంచీ మా కౌసల్య తిండి విషయంలో అర్భకురాలే" అంది రాధా.
వారి సంభాషణ వింటూ వుంటే మతిపోయింది కౌసల్యకి. ఎంత చక్కగా అబద్దాలు అతికినట్టు చెబుతున్నాడు. "అతను చేసే పిచ్చి పనులూ మాట్లాడే పిచ్చి మాటలూ చెప్పినా నమ్మరెవరూ" అనుకుంది. అటు నుంచి ఇటు తిరగడానికి వొళ్ళంతా నొప్పిగా వుంటే "అమ్మా!" అంటూ మూలిగింది బాధగా.
"వస్తున్నా!" అంటూ గబగబా మంచం దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు పానకాలు.
"అక్కగారూ! కాస్త నాలుగు మెతుకులు వడ్డించండి. మళ్ళీ వెళ్లిపోవాలి. అంతవరకూ కౌసల్య దగ్గర నేనుంటాను" అన్నాడు.
'అలాగే బాబూ!" అంటూ రాధ వంటింట్లోకి కెళ్ళింది.
"ఏమే! నేను వెళ్ళిపోగానే జ్వరం నటించి మీ వదిన గారిని పిలిపిస్తావా? మరోసారి ఇట్టా చేశావంటే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త!" అన్నాడు పళ్ళు కొరుకుతూ కౌసల్య మొహం మీద మొహం పెట్టి.
"ఛీ!........"అంది తన మొహాన్ని పక్కకి జరుపుకుంటూ కౌసల్య.
"నన్ను ఛీ అంటావా? అంటే నువ్వు అందంగా వున్నావని పొగరా? మొహం చీరేస్తాను. అప్పుడు చూస్తాను ఈ అందగత్తె మొహం ఎలా వుంటుందో?" అన్నాడు పానకాలు.
"మొహం చీరేస్తానూ చంపెస్తానూ అన్నవాళ్లు అసలు నన్ను పెళ్లెందుకు చేసుకున్నారు?" కసిగా అడిగింది కౌసల్య.
"ఎందుకు చేసుకున్నానా? నాకు తెలుసు నేను అందంగా లేనని! అందుకే లోకం ఏడ్చుకునే లాగా ముక్కు మీద వేలేసుకునేలాగా అందమైన పిల్లని చూసి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. చేసుకున్నాను. కానీ నాకు తెలుసు , ఏ అందమైన పిల్లా నన్ను ప్రేమించదని అందుకే నీ అందం మీద నా కసి తీర్చుకుంటున్నాను" అన్నాడు.
ఆ మాటలు విని, ఆ మసస్తాత్వాన్ని తలుచుకుని భయంతో వోనికిపోయింది కౌసల్య. నోట మాట రాక అతని కేసి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. అంతలో "బాబూ! వడ్డించేశాను" అంటూ రాధ అటు రావడంతో పానకాలు వెంటనే స్వరం మార్చి "కౌసల్యా! నువ్వేం తింటావ్? పోనీ బ్రెడ్డు తిని పాలు తాగుతావా? బ్రెడ్డు ఇంట్లో వుందో లేదో తెలుసుకురానా?" అంటూ ఎంతో ఆప్యాయత నటిస్తూ మాట్లాడాడు.
"ఫరవాలేదులే బాబూ! నేనిందాకే కాస్త హార్లిక్స్ కలిపిచ్చాను. పక్కింటి వాళ్ళ పనిమనిషి చేత, బ్రెడ్డు, కూడా తెప్పించాను. ఏమీ వద్దంది. తిన్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను టోస్ట్ చేసి ఇస్తానులే. మీరు భోం చెయ్యండి" అంది రాధ.
