Previous Page Next Page 
అష్టపది పేజి 24


    
    "అయ్యగారికి నేను ఏమవుతానో తెలుసుకదా?" శీతల్ అడిగింది.
    
    "అయ్ గారికి మీరు కోడలవుతారమ్మా!" కొండ వినయంగా చెప్పాడు.
    
    "ఆలాంటప్పుడు నీవు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నీవు వినాలా!"
    
    "మీరు చెప్పిందే నేను వినాలి"
    
    "మరి!"
    
    "అయ్ గారు మీకన్నా పెద్ద ముందు అయ్ గారు చెప్పిందే వినాలి కదా! పొరపాటున అమ్మాయిగారు ఈ కాంపౌండ్ దాటి బయటికి వెళతారేమో అలా వెళ్ళనివ్వకు. బయట పులులు, తోడేళ్ళు వున్నాయి అని గట్టిగా చెప్పి వెళ్ళారు. అయ్ గారు ఈ మాట చెప్పకపోతే మీరెలా వెళ్ళినా పట్టించుకునేవాడినికాదు. అంతే అమ్మాయిగారూ! దీనిలో నా తప్పేమిలేదు."
    
    "సరే అంకుల్ వచ్చిం తరువాత ఇదేమిటో అడుగుతాను" అని విసవిసా నడుచుకుంటూ గిరుక్కున వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోయింది శీతల్. కొండ నవ్వుకున్నాడు.
    
    శీతల్ ఆ ఇంట్లో అన్ని గదులలో తిరగవచ్చు, హాయిగా టి.వి. చూడొచ్చు. వి.సి.ఆర్ వుంది. నాలుగు భాషల్లోని కాసెట్స్ ఉన్నాయి. చక్కగా చిత్రాలు వేసుకుని చూడొచ్చు వార, మాస పత్రికలు, నవలలు ఉన్నాయి. చదువుకోవచ్చు. డైలీ వస్తుంది వార్తలకి తినడానికి స్వీట్స్, హాట్స్, ఐస్ క్రీమ్స్ లో అయిదు రకాలు నానా అయిటమ్స్ పెదవి కదిపి అడిగే లోపలే ప్రత్యక్షంఅవుతాయి. శీతల్ కి ఆ ఇంట్లో అన్నీ దొరుకుతాయి. బయటికిమాత్రం వెళ్ళకూడదు. శారీలు, బ్లౌజులతోపాటు రకరకాల రెడీమేడ్ దుస్తులుకూడా మర్నాడు పొద్దుతిరిగే లోపల తెప్పించాడు లోకేశ్వరరావు.
    
    ఆ ఇంటి పరిసరాలు క్షున్నంగా పరిశీలించడానికి శీతల్ కావాలని బయటికి వచ్చింది. ఎందరు మనుషులు వున్నారు. ఎక్కడెక్కడ కాపలా కాస్తున్నారు అని తెలుసుకోడానికి కావాలని బయటికి వెళతానని చెప్పింది. వాళ్ళు వద్దంటారని ఎలాగు తెలుసు సరిగ్గా అదే జరిగింది. శీతల్ ఓ పక్క కొండతో మాట్లాడుతూ మరో పక్క పరిసరాలు గమనించింది. వాళ్ళందరి కళ్ళుగప్పి పారిపోటం అన్నది జరగని పని అనికూడా గ్రహించింది.
    
    ఆ ఇంటిచుట్టూ ఎత్తయిన ప్రహరీగోడ వుంది. గోడ పైభాగాన గాజుపెంకులు తాపడంచేసి వున్నాయి. నౌకర్లలాంటి వేషాలలోవున్న వాళ్ళు మెరికల్లాంటి మనుషులు వాకిట్లో గూర్కా ఉన్నాడు. గుర్రమంత కుక్కలు రెండు ఉన్నాయి. ఇంట్లోంచి బయటపడ్డా పక్క పక్కన ఇళ్ళు లేవు కాబట్టి కొద్ది దూరం పారిపోతే తప్ప దాక్కోడానికి లేదు. ఎదురుగా సముద్రం. నురుగులు కక్కుతూ ఎగసిపడే అలలు. గాంభీర్యంగా కానవస్తున్నాడు సముద్రుడు.
    
    శీతల్ కొంతలో కొంత పరిసరాలు చూసి లోపలికి వస్తూనే తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమె ఆలోచనలు కూడా పరిపరి విధాల సాగుతున్నాయి.
    
    "ఇక్కడనుంచి పారిపోవడానికి ప్రయత్నించి పట్టు బడితే మాత్రం తన బ్రతుకు సర్వనాశనం చేస్తారు. కనుక తాను చాలా తెలివిగా మెలగాలి. ఈ లోకేశ్వరుడు ఈ లంకలోకి తీసుకువచ్చి తన నెందుకు బంధించాడో తెలియదు. ఇదో పెద్ద మిష్టరీ వచ్చిన ఆంటీ అనే ఆవిడని తను నమ్మింది ఆంటీకి, వీళ్ళకి సంబంధం వుంటే కారులో తను ఎక్కగానే ముఖాన మత్తుమందు స్ప్రేలా చల్లే అవసరం ఏమిటి? తనని ఎత్తుకు రావడానికి రెండు ముఠాలు రంగంలోకి దిగాయా! ఆన్తీగా వ్యవహరించిన ఆమెకి, వీళ్ళకి సంబంధం వుందో లేదో తెలుసుకోవాలంటే ఒక్కటే ఉపాయం. లోకేశ్వరరావుని మరింత నమ్మించిమాటల్లో పెట్టి విషయం బైటికి లాగాలి. ఈ బీరకాయ చుట్టంగాడు ఎవడో తెలుసుకుంటే చాలు విషయంచాలా వరకు అర్ధమైపోతుంది.
    
    ఈ పెళ్ళి చేసుకోడం ఇష్టంలేక తనెలాగు పారిపోవాలనుకుంది. రజియా, రంజిత్ ఏమయ్యారో తెలియదు. పీటల మీద పెళ్ళి ఆగిపోవడమే గాక తను కూడా అక్కడ నుంచి మాయం అయింది. పెళ్ళి పందిట్లో చాలా గోల జరిగివుంటుంది. మమ్మీ డాడీ ఎలా వున్నారో! డాడీ గట్టివాడు, చాలా మొండివాడు ఏం జరిగినా నిభాయించుకుని జరగవలసింది, జరపవలసింది చూస్తారు. మమ్మీ అలా కాదు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, లోలోపల భయం, కంగారుగా వుంటుంది. తన మీద మమ్మీకి ఎంతో ప్రేమ, విచారంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మంచం ఎక్కలేదుకదా? ఏమో అక్కడేం జరిగిందో ఏమి తెలియదు. అది కూడా తను లోకేశ్వరరావునుంచి తెలివిగా లాగాలి. ఈ రోజు తను చేసిన పనికి వాడికి అనుమానం వస్తుంది ముందా అనుమానం పిశాచాన్ని పారదోలాలి పారదోలాలి అంటే...
    
    శీతల్ ఎంతోసేపు అలా ఆలోచిస్తూ వుండిపోయింది.
    
                                                                   *    *    *
    
    శీతల్ బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆ ఇంట్లో వున్న ప్రతి గదికి ఎటాచ్డ్ బాత్ రూమ్ లు వున్నాయి. లోకేశ్వరరావు అవసరం నిమిత్తం ఏదో అర్జంట్ గా ఊరికి వెళ్ళి వస్తానని నాలుగు రోజుల క్రితం ఊరెళ్ళాడు.
    
    లోకేశ్వరరావుకి ఆ ఇంట్లో ఆఫీసు గది వేరే వుంచి ఆ గదిలో గోడలకి నాలుగు గాడ్రెజ్ బీరువాలు బిగించి వున్నాయి, వాటికి ఎప్పుడూ తాళాలు వేసి వుంటాయి అన్నింటికి తాళాలు వున్నా ఆ గదికి తాళం లేదు ఎవరైనా లోపలికి వెళ్ళి రావచ్చు.
    
    లోకేశ్వరరావు గది దగ్గరకు వచ్చేసరికి శీతల్ బాత్ రూమ్ కెళ్ళే అవసరం పడింది. ఆ గదిలోకి వెళ్ళి బాత్ రూమ్ లో దూరింది శీతల్. బాత్ రూమ్ నుంచి బైటకి రాబోతుండగా ఆ గదిలోకి లోకేశ్వరరావు, కొండ వచ్చారు. వాళ్ళిద్దరి మాటల మధ్య తన పేరు వినపడడంతో శీతల్ వారి మాటలు చెవి ఒగ్గి వింటూ బాత్ రూమ్ లోనే వుండిపోయింది.
    
    "నేను లేనప్పుడు శీతల్ ఏదన్నా కాని పని చేసిందా అనుమానాస్పదంగా ప్రవర్తించిందా?" లోకేశ్వరరావు అడిగాడు.
    
    "మామూలుగానే మెలిగింది బాస్! కాకపోతే చిన్న అనుమానం వచ్చింది. ఒకరోజు బైటికి వెళతానని కూర్చుంది. నేను మీరు చెప్పినట్టుగానే మంచిగా చెప్పాను, విన్నది" కొండ చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS