పురోహితుడు మంత్రాలు కూడా ఆపి ఇటువేపే చూస్తూ వుండటంతో సోమసుందరం లోపలికి పరుగున వెళ్ళి "పంతులుగారు! మీరు చదవండి ఏంలేదు, మన వెంకటేశంగాడే బాగా తాగి గొడవ చేస్తున్నాడు అన్నాడు.
ఆ మాటలకు కస్తూరి, దాక్షాయణిలతో పాటు పందిట్లో ఉన్న వారు ఉపిరి పీల్చుకున్నారు.
"ఏంట్రా ? ఎందుకు వాడ్ని కొడుతున్నావ్?" అడిగాడు సర్వోత్తమరావు.
"ఏం లేదండి అయ్యగారూ! మీరు చేసేది అసలు అసల్ పెళ్ళే కాదట....మా ప్రెసిడెంటుగారి అమ్మాయి పెళ్ళే ఇంకా గొప్పగా జరిగింది. మా ప్రెసిడెంటుగారి కాలి గోటికి పనికిరారు మీ అయ్యగారు" అని వాగుతున్నాడండి వీడు....చిన్నయ్యగోరేమో అసలు సంగతి తెలుసుకోకుండా నన్ను కొట్టారండి" అంటూ భోరున ఏడ్చాడు.
"సర్లే....సర్లే ...వాడేదో వాగాడని , వాడితో పాటు నువ్వు గొడవ పడటం దేనికి? వెధవ ఊరుకో" అంటూ ఇద్దర్ని మందలించి లోపలికి వెళ్ళాడు.
"అయ్యా! అందరికి అక్షింతలు పంచండి" అంటూ పురోహితులు అరవటంతో అక్షింతలు డేశాను పట్టుకుని మాధవరావు పెళ్ళిపందిరి అంతా పంచాడు.
"మాంగల్యం తంతునాం" అంటూ పురిహితుడు మంత్రాలు చదువుతుండగా, కస్తూరి, గిరిజ జడ ఎత్తి పట్టుకోగా సురేంద్ర గిరిజ మెడలో మూడుముళ్ళు వేశాడు. ఒక్కసారిగా వారిమీద అక్షింతలు వర్షం కురిసింది.
"పిన్ని! మనం అక్షింతల్లో తడిసి ముద్దయిపోతున్నాం" అంది జయంతి.
దాక్షాయణి, శివపార్వతిలతో పాటు అందరూ నవ్వారు.
అక్షింతలు వేసి, భోజనాలు చేయనివారు మెల్లగా భోజనాల వేపు నడుస్తూ వెళుతున్నారు.
"అరేయ్ మాధవా! అందరికి భోజన ఏర్పాట్లు చూడు....ఎవరికి ఏ లోటు రాకూడదు" అన్నాడు సర్వోత్తమరావు.
"అలాగే అన్నయ్యా! మీరు కంగారుపడకండి....ఇప్పటికే దాదాపు అందరూ భోంచేశారు. రెండుమూడు వందలమంది మాత్రమే ఉంటారు అంతే" అన్నాడు మాధవరావు.
పురోహితుడు ఇంకా ఏవో మంత్రాలు చదువుతూ, పెళ్ళికొడుకుకి, పెళ్ళి కూతురికి ఏవో సూచనలు ఇస్తున్నాడు.
వాటిని నిశ్సబ్దంగా అనుకరిస్తున్నారు ఆ నూతన దంపతులు.
"అమ్మయ్యా! మొత్తానికి గిరిజక్క పెళ్ళయిపోయింది...." అంది జయంతి, అందరూ తృప్తిగా నవ్వారు.
12
గిరిజ పెళ్ళి జరిగి వారం రోజులయింది.
బంధువులంతా దాదాపుగా వెళ్ళిపోయారు.
హడావుడి అంతా సద్దుమణిగింది.
ఇంటిముందు పందిరి తీయలేదు. వేసవికాలం కావడం వల్ల చల్లగా వుంటుందని ఆ నెలంతా అలాగే వుంచమన్నాడు సర్వోత్తమరావు. క్రమంగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈరోజే మాధవరావు దుకాణం తీయటానికి పట్నం వెళ్ళాడు.
మధ్యాహ్నం భోజనం ముగించుకుని సర్వోత్తమరావు, రామశేషు అన్నాదమ్ములిద్దరూ పందిరి కింద మంచాలపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చుట్టలు కాల్చుకుంటున్నారు.
"పెళ్ళి మాత్రం చాలా ఘనంగా చేశావురా తమ్ముడూ! అమ్మా నాన్నలు వుంటే చూసి ఎంత సంతోషించేవారో...."అన్నాడు రామశేషు.
"మనకున్నదానిలో చేశామన్నయ్యా? వాళ్ళ దీవెనలు పైనుంచి ఎప్పుడూ వుంటాయి" అన్నాడు సర్వోత్తమరావు.
"ఇక జయంతి పెళ్ళి విషయం ఆలోచించాలి మనం" రామశేషు ఆరిపోయిన చుట్టని మళ్ళి వెలిగించుకుంటు అన్నాడు.
"ఈ ఏడాదితో జయంతి పదవతరగతి పూర్తవుతుంది. పై చదువులకు పట్నం వెళతానంటోంది. తెలివిగలపిల్ల చదివిద్దామనే అనుకుంటున్నాను" అన్నాడు సర్వోత్తమరావు.
"ఎందుకురా తమ్ముడూ! మన కుటుంబాల్లో ఇంతవరకూ పట్నం వెళ్ళి చదివినవాళ్ళులేరు. ఏదో సంబంధం చూసి, ఓ అయ్యచేతిలో పెడితే బావుంటుంది కదా?' అన్నాడు రామశేషు.
"నిజమే అనుకో! తల్లీకూతుళ్ళు ఇద్దరూ ఇప్పుడే పెళ్ళి వద్దు అంటున్నారు. కస్తురయితే వచ్చే ఏడాది చేద్దాం అంటుందిగానీ , అమ్మాయేమో నేను చదువుకుంటాను నాన్నగారూ అంటుంది" అన్నాడు సర్వోత్తమరావు.
"మనకున్న ఆస్తిపాస్తులు చాలు. నువ్వు సంపాదిస్తున్నావు, తిండిగింజలకు పొలం ఉంది. చదివి ఏ ఉద్యోగాలు చేయాలంటా?" అన్నాడు రామశేషు.
"చూద్దాం....పైవాడు ఎలా అజ్ఞాపిస్తే అలాచేద్దాం....." అన్నాడు సర్వోత్తమరావు.
"అవునురా తమ్ముడూ! ఏంటి ఊరిజనమంతా ఈసారి ప్రెసిడెంటుగా నువ్వు పోటీ చేయబోతున్నావని అంటున్నారు, పోటీ చేస్తున్నావా?" అడిగాడు రామశేషు.
"లేదన్నయ్యా! ఆ కరణం ఒకటేపనిగా పోరుతున్నాడు. పోటీ చేయమని, నాకెందుకు ఈ రాజకీయాలని అంటున్నాను. నా కాంట్రాక్టు పనులు నేను చూసుకుంటే చాలుకదా" అన్నాడు సర్వోత్తమరావు.
"మంచిమాట చెప్పావు.....పొరపాటున కూడా ఆ గోపాలరావుతో శతృత్వం పెంచుకోకు. వాడు దుర్మార్గుడు. ఈ రాజకీయాలు మనకొద్దు. ఏదో ఉన్నంతలో మనందరం కలిసి మెలిసి, పిల్లాపాపలతో చల్లగా ఉన్నాం" అన్నాడు రామశేషు హెచ్చరిస్తున్నట్లు.
