Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 24

                                *    *    *    *

    సమయం రాత్రి ఎనిమిది గంటలు.

    ఆ ఇంటిముందు ఉన్న దాదాపు అర ఎకరం స్థలం పైన పందిరి నిండుగా పరుచుకుని వుంది.  ఆ పందిరి కింద తెల్లని పంచె కట్టటం తెల్లని ఆకాశం కింద కూర్చున్నట్టుంది. పందిరికి నాలుగు వైపులా పచ్చని తోరణాలు, అరటిబాదులు, కొబ్బరిమట్టలు పచ్చగా ఆ  ఉమ్మడి కుటుంబానికి నిదర్శనంగా వున్నాయి.
    పందిరి మధ్యలో రెండడుగుల ఎత్తులో పెళ్ళి మంటపం కట్టబడి వుంది. మంటపం చుట్టూ, పైనా కొబ్బరిమట్టలతో చక్కగా అల్లిన స్థంబం కొత్త శోభను తెస్తున్నాయి. మంటపం పైన రెళ్ళు గడ్డితో చక్కగా గోపురంలా అలంకరించారు.

    "మంటపం లోపల రెండు పెళ్ళిపీటలు, ఒకదానిపై సురేంద్ర తెల్ల పట్టుపంచెతో ధగధగ మెరిసిపోతున్నాడు. నుదుటికి కట్టిన బాసికం, పసుపు బట్టలు పచ్చని అతని శరీరంతో పోటిపడుతున్నాయి.

    అ పెళ్ళి పందిరిలో పిల్లలకేకలు, ఆడవారి ముచ్చట్లను అధికమించి పురోహితుని మంత్రాలు మైకులో ప్రతిధ్వనిస్తూ ఊరంతా వినిపిస్తున్నాయి.

    డాబాపైన ఆడవాళ్ళకు , పిల్లలకు భోజనాలు వడ్డిస్తున్నారు.

    ఆ ఇంటిపక్కనే ఉన్న స్థలంలో మగవారికి భోజన ఏర్పాటు చేశారు. భోంచేసినవారు వచ్చి పెల్లిపందిరిలో కుర్చుంటున్నారు.

    "ఈ కార్యక్రమం అంతటిని మాధవరావు, సోమసుందరం సర్వోత్తమరావు పర్యవేక్షిస్తూన్నారు.

    ఆడవాళ్ళు మాత్రం పెళ్ళి కూతురిని అలంకరించటంలో నిమగ్నమైవున్నారు.

    పొరుగు ఊరునుంచి దాదాపు రెండు వందలమంది వరకూ బంధుమిత్రులు తరలివచ్చారు.

    వారం రోజుల నుంచి వారికీ భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.

    చివరికి పెళ్ళి ఘడియలు రానే రావటంతో అందరి ముఖాల్లో అనందం తాండవిస్తుంది. ఆ రోజంతా అ ఊరిలో ఎవరూ అసలు వంట కార్యక్రమమే చేయలేదు. పొద్దుటే స్నానాలు చేసి పెళ్ళి ఇంటికి వచ్చేశారు. అక్కడే టిఫిన్ లు, మధ్యాహ్న భోజనం రాత్రి భోజనాలు వారికీ ఏర్పాట్లు చేశారు. ఇంతవరకూ ఇంత ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు ఎవరూ చేయకపోవటం వల్ల అంతా ఆ ఇంటి గొప్పతనం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే, రామశేషు పొంగిపోతున్నాడు.

    గ్యాస్ లైట్ల కాంతిలో ఆడవాళ్ళు పట్టుచీరెతో ధగధగ మెరిసిపోతూ అటూ ఇటూ తిరిగితున్నారు.

    ఒకవేపు పురోహితుని మంత్రాలు.

    మరోవేపు మంగళవాయిద్యాలు, పిల్లల ఆటలు, పెద్దవాళ్ళ మందలింపులు ఆడవాళ్ళ ముచ్చట్లతో సిసలైన తెలుగింటి పెళ్ళి పందిరిలా వుంది.

    ఆ ఇంటిలోపల భ్రమరాంబగారి నేతృత్వంలో కస్తూరి, దాక్షాయణి, శివపార్వతి, జయంతి అందరూ కలిసి నవ్వులతో, కేకలతో గిరిజను పెళ్ళి కూతురిని చేస్తున్నారు.

    "ఏయ్ గిరిజక్కా! అబ్బ నిజంగా నువ్వు ఇప్పుడెంత అందంగా వున్నవే, నా దిష్టే తగిలేట్టు వుంది, పెద్దపిన్ని ఆ కాటుక ఇటివ్వవా, బుగ్గమీద మచ్చపెడతాను" అంది జయంతి.

    దాక్షాయణి నవ్వుకుంటూ "ఇందా జాగ్రత్తగా, గుండ్రంగా పెట్టాలి గిరిజ కళ్ళలాగానే" అంది.

    "ఓ అలాగే! ఈ అలంకరణ చూసి బావ మూర్చపోవాలి" అంది జయంతి ఆనందంగా.

    "ఏంటే అలంకరణ ఇంకా కాలేదా? ఈరోజు పూర్తవుతుందా లేదా?" నవ్వుతూ ప్రవేశించాడు అప్పుడే అక్కడికొచ్చిన సర్వోత్తమరావు.

    "అయిపోయిందండి.....పది నిమిషాలు" అంది కస్తూరి కంగారుగా.

    "త్వరగా కానియండి, పురోహితుడు పెళ్ళికూతురిని తెమ్మని ఇప్పటికి మూడుసార్లు కేకవేశాడు." అంటూ వెళ్ళిపోయాడు.

    "అయన కేకలకేంలే! ముందు అక్కను ముచ్చటగా అలంకరించవద్దూ" అంది జయంతి గిరిజ తలలో మల్లెపూల దండలు తురుముతూ.

    "త్వరగా కానియవే, మీ నాన్నగారు కోపపడుతున్నారు" అంది కస్తూరి.

    "తరువాత మనింట్లో పెళ్ళికుతురయ్యేది జయంతేకదా అక్కా అంది శివపార్వతి.

    "అవునమ్మా! భగవంతుడు చల్లగాచుస్తే, వచ్చే ఏడాదే దీని పెళ్ళి కూడా జరిపించేద్దాం" అంది కస్తూరి నవ్వుతూ.

    "వచ్చే ఏడాదా? అదేం కుదరదు. ఇంకా మూడేళ్ళ తరువాతే నా పెళ్ళి. అప్పటికి నా డిగ్రి కూడా పూర్తయిపోతుంది" అంది జయంతి.

    "ఆ అప్పుడుగానీ నాలాగా తయారవ్వవు. ఏ ముసలాడో వచ్చి నిన్ను చేసుకుంటాడు" అంది భ్రమరాంబ నవ్వుతూ.

    "మూడేళ్ళకే ముసలిదాన్నవుతానా ఎంటత్తా?" అంది జయంతి.

    "అక్కా, కొబ్బరిబొండాం ఏది?" అడిగింది శివపార్వతి.

    "నా దగ్గిర వుందిలే పార్వతి" అంది దాక్షాయణి.

    "ఆ ఇక అలంకరణ పూర్తయినట్లేనా అమ్మా. పెళ్ళికూతుర్ని తీసుకెళ్ళచ్చు" చెప్పింది జయంతి.

    "ఆగమ్మా అగు, దిష్టి తీయని, అంది కామేశ్వరమ్మ.

    "త్వరగా కానియమ్మా, మళ్ళి ఆయనవచ్చి కేకలేస్తారు" అంది కస్తూరి.

    "ఇదిగో ఎంతసేపు" అంటూ ఎండుమిరపకాయలు, ఇంకా ఏవో దినుసులు చేత్తో పట్టుకుని. "ఇరుగుదిష్టి, పొరుగుదిష్టి, పెళ్ళి జనమందరి దిష్టి, మా దిష్టి, నా దిష్టి  తూతూ" అంటూ గిరిజ చుట్టూ మూడుసార్లు గుండ్రంగా తిప్పి, జయంతి వీటిని బయట నిప్పుల్లో వేసిరాతల్లీ" అంది కామేశ్వరమ్మ.

    "అబ్బా అమ్మమ్మా నిదంతా చాదస్తం" అంటూ వాటిని తీసుకుని బయటికెళ్ళింది.

    "గిరిజా ఇకపదమ్మా! ఇదిగో ఈ కొబ్బరిబొండాం రెండు చేతుల్తో పట్టుకొని" అని అందించింది దాక్షాయణి.

    దానిని పదిలంగా పట్టుకుని నెమ్మదిగా పెళ్ళి మంటపం వేపు నడుస్తోంది గిరిజ.

    పక్కనే అందరూ అమెవెంట నడుస్తూ పెళ్ళిమంటపం దగ్గరకు వచ్చారు.

    "బావా! నీ పెళ్ళాం వచ్చేసింది, చూడు ఎంత అందంగా వుందో" అంది జయంతి సురేంద్ర చెవిలో మెల్లగా.

    సురేంద్ర నెమ్మదిగా నవ్వుతూ చూశాడు.

    గిరిజను పదిలంగా సురేంద్ర పక్కనే వున్న పెళ్ళి పిటపైన కుర్చోపెట్టారు.

    ఆమె పక్కనే కస్తూరి, దాక్షాయణి, శివపార్వతి, జయంతి నలుగురూ కూర్చున్నారు.

    పురోహితుని మంత్రాల వేగం, శబ్దం పెరిగాయి.

    సమయం రాత్రి పదిగంటలు.

    ఇంకా ముహూర్తానికి గంట సమయం ఉంది.

    ఆ ఊరి ప్రెసిడెంటు గోపాలరావుతో సహా అందరూ ఆ పెళ్ళి పందిరిలో ఆశీనులై వున్నారు. గోపాలరావు, కరణం ఇంకా పెళ్ళి పెద్దలకు మాత్రం కుర్చీలు వేశారు. మిగిలినవారంతా కిందే చాపలపైన జంపకానాల పైన కూర్చున్నారు.

    ఇంతలో బయట ఏదో గొడవ ప్రారంభమైంది.

    పెద్ద పెద్దగా కేకలు, అరుపులు....పెల్లిపందిరిలో వున్న జనం అంతా ఆశ్చర్యంగా బయటవేపుకు చూస్తున్నారు.

    సర్వోత్తమరావు, మాధవరావు, సోమసుందరంలతో పాటు మిగతా పెళ్ళి పెద్దలు పరుగున వీధి గుమ్మం వేపుకు వెళ్ళారు. బయట వీధిలో వెంకటేశం తాగి ఒకడి చొక్కా పట్టుకుని కేకలేస్తున్నాడు.

    "చంపేస్తా సురేయ్....మా అయ్యగార్ని అంతమాట అంటావా? నీకెన్ని గుండెల్రా?' అంటూ వాడ్ని కొడుతున్నాడు. వాడు కూడా తాగి వుండటంతో ఇద్దరూ కలపడుతున్నారు.

    "అరేయ్ వెంకటేశం! ఏంట్రా గొడవా? వెధవ అవతల పెళ్ళి జరుగుతుంటే ఇక్కడ రభస చేస్తున్నావా?" అంటూ వాడిచెంప మీద కొట్టాడు మాధవరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS