Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 24

 

    "అలానే అనుకున్నాను. లెక్కల్లో స్టెప్ లుంటాయి. అంటే తెలుగులో ఏమంటారో తెలియదు. ప్రస్తుతానికి స్టెప్పులే అనుకుందాం. వాటిని మీరు కిందనుంచి పైకి రాసేవాళ్ళనుకుంటా- అంటే ఫలితం నుంచి పైకన్న మాట. అర్ధమైందా?" అంటూ పైకి జరిపిన నైటీని తిరిగి కిందకు లాక్కుంది కాంచనమాల.


    అలా ఆమె చేయకుంటే, అతనికి ఆమె మాటలు అర్ధమయ్యేవి కావేమో. కానీ ఇప్పుడు మాత్రం అర్ధమయ్యాయి. అతనికి తన తప్పేంటో తెలిసింది. ఈసారి అతను ఆమె నుదుటిమీద పెదవులు ఆన్చబోయాడు.


    ఆమె ఠక్కున తల త్రిప్పుకుంది.


    "నిద్రొస్తోంది" ఆ మాటకు కాదు, ఆ మాటల్లో ధ్వనించిన విముఖత అతని నరాలను మెలితిప్పింది.


    అతను తనలో తనే ముడుచుకు పోయినట్టు, మూడంకె వేసుకుని ముడుచుకున్నాడు.


    ఆమె తిరిగి కళ్ళు మూసుకుంటూ- "గుడ్ నైట్ ముసలయ్యా...." అంది.


    అతని ముఖం మరింత మాడిపోయింది. వార్ధక్యం వలలా తనమీద పడిపోయినట్టు జడుసుకున్నాడు.


    అతను బాధపడుతున్నట్టు ఆమె వూహించగలదు. ఆమెకి తెలిసే ఆ మాట అంటుంది. అయితే ఆ మాట అని, అతన్ని బాధపెట్టి తను సంతోషం పొందడం వెనకవున్న కారణమేమిటో మాత్రం ఆమెకి తెలియదు.

 

    తను చిన్నపిల్ల. తమిద్దరిమధ్యా దాదాపు పదిహేనేళ్ళ వ్యత్యాసం వుంది. వయసంత ఎక్కువుండీ, తనను రెండో పెళ్ళి చేసుకోవడమన్నది అతను చేసిన తప్పు.

 

    తన కుటుంబ పరిస్థితుల వల్ల, ఈ పెళ్ళి జరగడంలో తనవంతు బాధ్యతా వుందన్న నిజాన్ని ఆమె గుర్తించడంలేదు. తనను పెళ్ళి చేసుకుని, తనను రెండో భార్యగా చేసిన అతనిమీద ఆమెకి లోలోపల ద్వేషం- కోపం- దాన్ని తీర్చుకోవడంలో భాగమే ఇదంతా.


    అయితే దీనివెనక ఇంత కారణముందని ఆమెకు తెలియదు. పోనీ ఎవరయినా దీన్ని విడమర్చి చెప్పినా, ఆమె అంగీకరించదు. ఎందుకంటే ఎవరయినా సరే మనసులోకి తొంగి చూసుకోవడానికి ఇష్టపడరు. తన పొరబాట్లను ఎవరూ ఒప్పుకోరు. తన ప్రవర్తన ఎప్పుడూ కరక్టేనని ప్రతి ఒక్కరూ అనుకుంటూ వుంటారు.


    అందుకే తమను తాము విశ్లేషించుకోవడానికి, తమ పొరబాట్లను గుర్తించడానికి ఎవరూ ఒప్పుకోరు. ఇష్టపడరు. కాంచనమాల కూడా మామూలు సగటు మనిషే.


    తనకంటే చాలా పెద్దవాడైన భర్తను. సాధించటంలో భాగంగా ఆ కుటుంబానికి ఆమేం చేసిందో, ముందుముందు మరింత స్పష్టంగా తెలుస్తుంది.


                                                         *    *    *    *


    చింతామణి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే వున్నాయి. ఆమె రేపటి పనిని ఈరోజే చేస్తుంది. ఏ పనీ వాయిదా వేయదు. అలా పనిని వాయిదా వేయడమంటే, సోమరితనం తప్ప మరేం కాదని వాదిస్తుంది. సాకులు చెప్పడాన్ని ఆమె ఒప్పుకోదు.


    అందుకే మొదట శశిరేఖ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంది. అంతకుముందు ఆమె గురించి పెద్దగా తెలియదు. ఎప్పుడైనా దారిలో ఎదురుపడ్డప్పుడు చిన్నగా నవ్వడం, ఒకటి రెండు మాటలుతప్ప చెప్పుకోదగ్గ సాన్నిహిత్యం లేదు. అనుకున్నదే తడవుగా వెళ్ళలేదు. గంగారత్నం శక్తి సామర్ధ్యాలు ఎలాంటివో ఆమెకు తెలుసు.


    చీరకట్టే వాటం చూసి, ఆ స్త్రీ మనస్తత్త్వం ఏమిటో చెప్పగలదు. ఈ విషయాల్లో పోలీసు కుక్కలాంటి రకం.


    ఎవరు ఎదురొస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, దాని వెనకగల అర్ధాలేమిటో యిట్టే పసిగట్టేయగలదు. అందులోనూ ఇప్పుడు శశిరేఖ ఆమె అధీనంలో వుంది.


    కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని ఎప్పుడో నిర్ణయించుకుంది చింతామణి.


    కాంట్రాక్టు పనిమీద నరేంద్ర అస్సాం. వెళ్ళిపోవడం శుభసూచక మని అనుకుంటున్న  సమయంలో, ఆమె గంగారత్నం సంరక్షణలో ఉందని తెలియగానే అంత చల్లబడిపోయింది.కాని వెనక్కి తగ్గడం, వెన్ను చూపించడంలాంటివి దగ్గిరికి చేరనిచ్చే రకంకాదు. గనుక, మరింత   జాగ్రత్తగా దూసుకెళ్ళాలని అనుకుంది ఆమె.


    నరేంద్ర వెళ్ళిపోయిన మరుసటిరోజు సాయంకాలం చింతామణి ఓ పెద్ద స్టీల్ గిన్నెతో శశిరేఖ ఇంటికి బయలుదేరింది.అప్పుడు టైమ్ ఆరుగంటలవుతోంది.


    ఆటైమ్ లోనే గంగారత్నం ఆంజనేయుల గుడికెళుతుంది. మరో గంటకుగానీ రాదన్న సమాచారం ముందే సేకరించింది. అందుకే గంగారత్నం వీధిమలుపు తిరగ్గానే, తను లోపలికి దూరింది.


    "శశిమ్మ..... శశిమ్మ" ఎంతో అభిమానంతో పిలిచింది.


    అయితే ఆ పిలుపు శశిరేఖకు విన్పించలేదు. ఆమె లోపల ఎక్కడో దొడ్లో వుంది, సాయంకాలమైతే చాలు,  ఆఫ్రికా అత్తర్ని తెల్లటి పేపర్లో  చుట్టి ఇస్తున్నట్లు ఆ చెట్టు  పూలు పూస్తుంది. అవంటే ఆమెకి చాలా ఇష్టం.


    ఆ పూలకన్నా ఆలాంటి సన్నజాజులచెట్టే వాళ్ళమ్మగారింట్లో వుంది.  పూలు కోసుకునే  ఆ పదినిముషాల సమయమూ తను తన పుట్టింట్లో నిలబడి పూలను కోస్తున్నట్లే వుంటుంది ఆమెకు.


    పూలుకోయడం ఆపి ఇంట్లోకి ఒకడుగు వేసిందో లేదో, తననుఎవరో పిల్తున్నారని పసిగట్టింది. వంటిల్లు దాటుకునేప్పటికి చింతామణి కనిపించింది.


    "రండి- రండి" మనస్ఫూర్తిగా ఆహ్వానించింది.


    చింతామణి ఇంటినంతా పరికించి చూస్తూ హాల్లోకి అడుగు పెట్టింది. "నేను తెలుసుగదా...  "అంటూ హాల్లోకి వచ్చాక కూడా చుట్టూ పరికిస్తోంది.


    తెలియకపోవడమేమిటి- బాగా తెలుసు. పనిపాటా చేయడం దగ్గర్నుంచి పదిమందికి సాయం చేయడంలో  మీరూ, మా గంగారత్నం పోటీ పడతారనీ తెలుసు..." అంటూ ఆమె  కూర్చోవడానికి  సోఫాను దులుపుతోంది.


    "చూడు-నువ్వు నాకు మర్యాదలేం చేయక్కర్లేదు. సరేనా -నువ్వు నన్ను మీపుట్టింట్లో ఉన్న ఓ ముసల్దాన్నిలాగే చూడు. మీరు, మీరు అంటూ నన్ను దూరం చేయకు.  లేదూ నువ్వు మీ గంగారత్నాన్ని పిలిచినట్టే పిలువ్- సరేనా.


    "అయ్యయ్యో! గంగారత్నాన్నంటే పేరు పెట్టి పిలుస్తాను. మిమ్మల్నీ అలా  పిలవాలంటే బాగోదు."


    "అలా ఏం కుదరదు-  చింతామణీ అని పిలువ్. అలా పిలిస్తే నే వస్తుంటాను.లేకుంటే ఇవాళ్టితో ఆఖరు."


    "వద్దులే-అలానే పిలుస్తాలే" ఇబ్బందిగా  అన్పించి, దానిని దాచుకోవడానికి. "ఉండు కాఫీ తెస్తాను" అంటూ లోపలికెళ్ళింది శశిరేఖ.


    ఆమె హాలంతా పరిశీలించాక "ఆ ఫోటో మీ అమ్మనాన్నలదా- ఆ మధ్య నున్నది నువ్వేగదూ"   అంటూ చొరవతో వంటగదిలోకి వెళ్ళి పీటొకటి లాక్కుని కిందనే కూర్చుంది.


    "కింద కూర్చుంటారా"  శశిరేఖ నొచ్చుకుంది.


    "చెప్పానుగదా-నేనూ, గంగారత్నం ఒకటేనని" అని కాసేపాగి తిరిగి ఫోటో  విషయమై అడిగింది.


    ఆ ఫోటో గురించి  అడగటంతో ఆమెకి ఉషారొచ్చింది. హాల్లో కెళ్ళి ఆ ఫోటో విషయమై అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS