అతడు నవ్వి "వీరదాసుని ఒక్కడినే మనలో కలుపుకుంటున్నామని ఎందుకు అనుకుంటున్నావ్ పులిరాజు? ఎమ్మెల్యేనీ, హోం మినిష్టర్ నీ కూడా మనవైపు తిప్పుకుందాం" అన్నాడు.
పులిరాజుకి తల తిరుగుతున్నట్టు అనిపించింది. ఇది తన విజయమో, ఎమ్మెల్యే విజయమో అర్ధంకాలేదు. ముందు అప్పుడు ప్రవేశించింది ఆమె ఆమెపట్ల వున్న గౌరవమో అభిమానమో తెలియదుకానీ, పార్టీ ప్రెసిడెంట్ లేచి నిలబడ్డాడు. తనతో మాట్లాడేటప్పుడున్న తేలిక తనం ఇప్పుడు లేకపోవటం పులిరాజు గమనించాడు. ఆమెని చూస్తుంటే అతడి కళ్ళు చెదిరిపోయాయి. ఆమె అందంవల్ల కాదు, హుందాతనం వల్ల ఆ గ్రేస్ వచ్చింది.
ఆమె కామిని!
రాష్ట్ర హోం మినిష్టర్ భార్యని తమ పార్టీ కార్యాలయంలో చూడటం పులిరాజుకి అంతులేని అయోమయాన్ని కలుగజేసింది. కామిని తన సహజసిద్దమైన చిరునవ్వుతో నమస్కారం చేసి "బావున్నారా" అని అడిగింది. బావున్నట్టో -లేదో కానీ పులిరాజు తల వూపాడు.
"ఈ పార్టీ ప్రతినిధిగా మీరు నాతో వస్తే మిగతా విషయాలు నేను చూసుకుంటాను" అన్నదామె.
"ఎక్కడికి రావాలి?" అన్నాడు పులిరాజు.
"ఎమ్మెల్యే నాయుడి దగ్గరికి."
"చచ్చినా రాను. ఇదిగో చూడమ్మాయ్, మా ఇద్దరిమధ్యా వైరం నీ వయసుకన్నా ఎక్కువ కాలంనుంచీ వుంది. నా పక్కనున్న ఈ ముసలోడికి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నేనన్న ఈ మాటలకి వెంటనే కల్పించుకుని 'రాజకీయాల్లో పెర్మనెంట్ గా శత్రుత్వమూ మిత్రత్వమూ అంటూ ఏదీ వుండదు. అది మూడో పాఠం' నై వుండేవాడు నా ఇన్నేళ్ళ అనుభవంతో చెపుతున్నాను. పార్టీ (హై) కమాండ్ ఆజ్ఞ ననుసరించి నేను నాయుడి దగ్గరకెళ్ళి ఆత్మని చంపుకుని బ్రతిమాలినా అతడు చెట్లెక్కి కూర్చుంటాడు."
"అతడికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్నా అలాగే బింకంగా వుంటాడా?"
పులిరాజు వులిక్కిపడి "నాయుడికి మంత్రి పదవా?" అన్నాడు.
కామిని నవ్వింది. "ఇదంతా చేసినందుకు మీకు అమెరికన్ రాయబారి పదవి లభించబోతూంది. ఒకే ఊళ్ళో వుంటూ నాయుడి మొహం రోజూ చూసే అవసరం మీకు వుండదు. పారీ మార్చి మంత్రి అయిన నాయుడి కన్నా, పార్టీలో వుంటూ అమెరికా రాయబారి అయిన మీకే మీ ఊళ్ళో ఎక్కువ పరపతి వుంటుంది. ఆలోచించండి."
ఆలోచించటానికేమీ లేదని పులిరాజుకి తెలుసు. ఈ కామినికి తన అనుభవమంత వయసు లేదని అన్నాడు. కానీ ఆమె ఆలోచించే వేగంలో సగం తనకి లేదు. ఎక్కడో ఆంద్రరాష్ట్రంలో ఒక రౌడీ జైలుకి వెళ్తే, వాడిని విడిపించటం కోసం పడే పోటీలో, రాష్ట్ర అధికార పార్టీని కుర్చీ దింపవచ్చు అన్న ఆలోచన కలిగి నందుకే ఈమె అభినంధనీయురాలు.
"నువ్వేమీ అనుకోకపోతే ఒక చిన్న అనుమానం."
"అడగండి."
"మారబోతూన్న రాజకీయాల కొత్త సెటప్ లో మీ ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడా?"
ఆ ప్రశ్నకి ఆమె మొహంలో ఒక మనోహరమైన రిలాక్సేషన్ కనిపించింది. "ఆ కోరిక మీకే వుంటే, ఆ పదవి మీకే వదిలి మేము అమెరికా వెళ్ళి సెటిలవ్వటానికి అభ్యంతరం ఏమీలేదు" అంటూ ఆమె నవ్వింది.
ఆ నవ్వుతో అతడికి నాలుగో పాఠం అర్ధమైంది. "రాజకీయాల్లో నాకు ఏం వస్తుందని ఆలోచించకు, నీకు వచ్చేది సరిపోతుందో లేదో ఆలోచించుకో."
* * *
"నా భార్య చెప్పింది నాకు బాగానే వున్నట్టు అనిపిస్తోంది. మా పార్టీలో ఎంత కాలమున్నా నాకు భవిష్యత్తు లేదు. పోతే నాకు కేంద్రం నుంచి ఒక వాగ్ధానం కావాలి. వీలైనంత త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. నేను ఈ పార్టీకి రాజీనామా చేసి, మీ పార్టీలో చేరతాను. అంత లోపులో మొత్తం అందర్నీ మీ పార్టీవైపుకి తిప్పేస్తానని వాగ్ధానం చేస్తున్నాను. మధ్యంతర ఎన్నికల్లో మనదే గెలుపు" హోం మినిష్టర్ రెడ్డి అన్నాడు. ఎమ్మెల్యే నాయుడు అతడివైపు అదోలా చూశాడు. ఈ రెడ్డి హోం మినిష్టర్ ఎలా అయ్యాడా అన్నది నాయుడికి ఎప్పుడూ అనుమానమే కేవలం కామినిలాంటి స్త్రీ భార్య అవటమే దానికి కారణం అని అతడి ప్రగాఢ విశ్వాసం. "నా భార్య చెప్పింది నాకు బాగానే వున్నట్టుంది" అనేవాడు ఈ రాష్ట్రానికి హోం మినిష్టర్!! పులిరాజు, నాయుడు, రెడ్డి, వీరదాసు టేబుల్ చుట్టూ కూర్చుని వున్నారు. నాయుడన్నాడు- "ఇంతకాలం ఈ ఊళ్ళో మా రెండు పార్టీల మధ్యాపచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అటువంటిది ఇప్పుడు నేను మా పార్టీని వదిలేసి కేంద్రంలో వున్న పార్టీలో చేరితే మా వాళ్ళు మొహాన ఉమ్మెయ్యరూ."
"రాజకీయాల్లో అవన్నీ మామూలు కదా! అన్నీ తెలిసిన వాడివి నీకు చెప్పేది ఏముంది?" అన్నాడు ఎం.పి. పులిరాజు ఎలాగైనా వాళ్ళిద్దర్నీ తన పార్టీలోకి చేర్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టగలిగితే, తనకు అమెరికన్ రాయబారి పదవి వస్తుందని ఆ ఇంగ్లీషూ హిందీ రాని రాజకీయ నాయకుడి ఆశ!
నాయుడు అన్నాడు "పార్టీ మారితే మా హోం మినిష్టర్ గారు చీఫ్ మినిష్టర్ అవుతారేమోగానీ, నేనేమవుతానూ?" అని అతడి మాటలు ఇంకా పూర్తికాకుండానే- "నేను సి.యం. నవ్వాలేగానీ నువ్వు నా హోం మినిష్టర్ వి దానికి తిరుగులేదు" అన్నాడు రెడ్డి.
బల్లచుట్టూ నలుగురూ కూర్చుని వున్నారు. మధ్యలో పళ్ళేలనిండా స్వీట్లూ, పూలబొకేలూ వున్నాయి. సఫారీ సూట్ల వాళ్ళు బయట హడావుడిగా తిరుగుతున్నారు.
హోం మినిష్టర్ సమావేశంలో అవన్నీ మామూలేగానీ, ఆ సమావేశం పోలీస్ స్టేషన్ లో జరగటం ఒక విశేషమైతే, అందులో నాలుగో మెంబర్ ఆ పట్టణపు లోకల్ గూండా వీరదాసు అవటం మరొక విశేషం.
రాణా మోటార్ సైకిల్ మీద స్టేషన్ కొచ్చేసరికి బయట అరుగుమీద టేబిల్ వేసుకుని కూర్చుని వేరునక్కాయలు తింటూన్న డియస్పీ కనపడ్డాడు. దూరంగా ప్రభుత్వ జీపులూ, కార్లు కనిపించాయి. అతడికో క్షణం పరిస్థితి అర్ధంకాలేదు.
"లోపల హోం మినిష్టర్ గారు వీరదాసుతో మాట్లాడుతున్నారు. ఎవర్నీ రానివ్వద్దన్నారు. ఎం.పీ., ఎమ్మెల్యేలు కూడా లోపలే వున్నారు" అన్నాడు డియస్పీ.
"పోలీస్ స్టేషన్ ని రాజకీయ వ్యభిచార శాలగా మార్చారన్న మాట" కసిగా అన్నాడు రాణా.
"అలా ఎందుకు అనాలి? 'కురుక్షేత్రంలో సంధి ప్రయత్నం' అనుకో ఇద్దరూ వేర్వేరు పార్టీల వాళ్ళు కదా" అన్నాడు డియస్పీ ఇద్దరిమధ్యా ఈ సంభాషణ ఇలా జరుగుతూ వుంటే, లోపల మరొక రకంగా చర్చలు జరుగుతున్నాయి.
"వీలైనంత తొందరగా మధ్యంతర ఎన్నికలు జరిపించమని మీ హైకమాండ్ కి చెప్పండి. ఈ లోపులో వీలైనంత మందిని కూడగట్టుకుని నేను పార్టీ మార్చేస్తాను. ఇక ఈ రాష్ట్ర పార్టీకి మంచి నీళ్ళు కూడా పుట్టవు" అన్నాడు హోం మినిష్టర్.
"ఏ పార్టీ ఎన్నికల్లోనెగ్గాలన్నా మన వీరదాసు జైలునుంచి బయటకు రావటం ముఖ్యం అతడి ద్వారా అరవింద్ చౌరసియాను మనవైపుకు తిప్పుకోవచ్చు. రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి రావాలంటే కనీసం అయిదారు వేలమంది గూండాలు రిగ్గింగ్ చేయవలసి వుంటుంది. కోటిరూపాయలు ఖర్చయినా అంత మందిని సప్లై చేయగలిగేది కేవలం అరవింద్ చౌరసియా ఒక్కడే ఏం వీరదాసూ....నేను చెపుతున్నదాన్లో తప్పేమీ లేదుకదా?"
తప్పేమీ లేదన్నట్టు వీరదాసు తల అడ్డంగా వూపేడు.
ఎమ్మెల్యే కొనసాగించాడు. "ఇదంతా మన మొక ప్రిస్టేజిగా తీసుకుని రెండు మూడు రోజుల్లో వీరదాసుని విడిపించాలి. మనం కలిసిపోయినట్టు ముఖ్యమంత్రికి అనుమానం రాకూడదు. వీరదాసు బయటకు రాగానే అతను రాష్ట్రంలో గొడవలు సృష్టించాలి. పరిస్థితులు భయంకరంగా మారాలి. అప్పుడు కేంద్రం రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించటం, మనమంతా పార్టీకి రాజీనామాలు సమర్పించటం ఒకేసారి జరగాలి. అరవింద్ చౌరసియా అప్పుడు మనకి సాయం చేసి, ఎన్నికల్లో గెలిచేలా చెయ్యాలి."
"ఈ కాంట్రాక్టు వీరదాసు ఒక కోతి లేదా రెండు కోట్లకు చౌరసియాతో సెటిల్ చెయ్యాలి. కొత్త పార్టీ అధికారంలోకి రాగానే మన రెడ్డిగారు చీఫ్ మినిష్టర్ అయ్యేట్టు చూసే బాధ్యత కేంద్రానిది. ఇదీ మన ప్లాను" అన్నాడు నాయుడు.
"కరెక్టుగా చెప్పావ్" అన్నట్టు చూశాడు రెడ్డి.
"దీనికి నేను శాయశక్తులా సాయపడతాను" అన్నాడు రాజు.
"అన్నిటికన్నా ముందు చేయాల్సింది వీరదాసుని విడిపించటం."
"ఆ విషయం నాకు వదిలిపెట్టండి" లేచాడు పులిరాజు.
హోం మినిష్టర్ బయటికి రాగానే మెట్ల దగ్గర నిలబడిన రాణా, డియస్పీలు సెల్యూట్ చేశారు. హోం మినిష్టర్ వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు చెయ్యెత్తి వెళ్ళిపోయాడు. ప్రభుత్వ కారులు పెద్ద శబ్దం చేసుకుంటూ కదిలాయి. ఎం.పీ., ఎమ్మెల్యేలు చూడనట్టే నటించారు.
"ఇక నేను లోపలికి వెళ్ళొచ్చా సార్?" రాణా అడిగాడు. అతడి గొంతులో వెటకారం లేదు. ఓటమి వుంది.
"వెళ్ళి వీరదాసుని సెల్ లో పెట్టు" అన్నాడు డియస్పీ రాణా తలెత్తి చూశాడు. డియస్పీ తల దించుకున్నాడు. సెల్ లో పెట్టటం ఒక్కటే తాత్కాలిక విజయం అన్నట్టు రాణా కదిలాడు.
లోపల వీరదాసు టేబిల్ ముందు కూర్చుని కేక్ తింటున్నాడు. ఇంకా పువ్వులు అలాగే పడివున్నాయి. నౌఖర్లు దండలు తీస్తున్నారు. రాణాని చూసి తినటం ఆపి లేచాడు. "చూశారా సార్ మీ స్టేషన్నే పబ్లిక్ ప్లేస్ చేసి మీటింగ్ పెట్టుకున్నాం. క్షమించండి."
"సెల్ లోకి వెళ్ళు" మొహం అభావంగా పెట్టి అన్నాడు రాణా.
వీరదాసు వినయపూర్వకమైన అవహేళనగా నవ్వేడు. "వెళ్తాను సాబ్ హోం మినిష్టర్ గారే పిల్చి కూర్చోబెట్టారు. అప్పటికీ నేను చెప్పాను సాబ్, నా అడ్డాలో తప్ప ఇలాంటి చర్యలు బయట చెయ్యనని పోలీస్ స్టేషనే నీ అడ్డా అనుకో - అన్నారు. అప్పటికీ నేనన్నాసార్ 'ఇది రాణా ఆఫీసు అతడికి తెలియకుండా అతని స్టేషన్ని మనం వాడుకోవటం బావోదు' అని మా హోం మినిష్టర్ కి అసలు బుద్దిలేదు సాబ్. మర్యాద తెలీదు. 'రాణా అంటే ఎవడు? మా యంత్రాంగంలో బోల్టు లాటివాడు కాసిని వేరుశనక్కాయలిచ్చి బయట అరుగుమీద కూర్చోమంటే కూర్చుంటాడు' అన్నాడు సారీ సార్ ఇంతసేపూ మీ కుర్చీలో కూర్చుని వాళ్ళిద్దర్నీ కలపటానికి సంప్రదింపులు జరిపాను" అంటూ కుర్చీని కాలితో రాణా వైపుకి తోశాడు.
రాణా అతని భుజం పట్టుకున్నాడు...."చూడూ! నీ వెటకారం నా కర్ధమైంది. రెండు పార్టీలే కాదు. దేశంలో వున్న పార్టీలన్నీ ఏకమైనా సరే నిన్ను ఉరికంబం ఎక్కించబోతున్నాను. నా తండ్రి ఎలా వురి తీయబడ్డాడో.... సరిగ్గా అలాగే..."
వీరదాసు మొహంలో నవ్వు మాయమైంది. "నిజమా? చూద్దాం నీ కళ్ళముందే నేనెలా బయటికి వెళ్తానో చూద్దువుగాని, అసలు ఈ కేసు కోర్టువరకూ కూడా వెళ్ళదు. ఛాలెంజి"
రాణా ఏదో అనబోతూ వుంటే ఒక స్త్రీ లోపలికి ప్రవేశించింది. అందరూ విస్మయంగా అటు చూశారు.
ఒక పోలీసుని కాలరు పట్టుకుని లాక్కుని రావటమే దానిక్కారణం!
"ఏమైంది బాలకిషన్?" రాణా అడిగాడు. ఆమె ముందుకు తోస్తే బ్రహ్మానంద బాలకిషన్ వచ్చి రాణా దగ్గర తూలిపడ్డాడు.
"ఏమైంది?" రాణా మళ్ళీ అడిగాడు. లేచి నిలబడుతూ-
