కాలింగ్ బెల్ మోగటం, జానకి గబుక్కున వెళ్ళి తలుపు తీయటం జరిగింది.
రాజీవ్ గుమ్మంలో నుంచున్న పిల్లవంక కంటిరెప్ప వేయకుండా చూసాడు.
"దా..." అన్నాడు.
కానీ, ఆ కొత్త మనిషి దగ్గరకెళ్ళడానికి జంకుతోంది సుబ్బి.
మాధవరావు దానికేసి చూస్తూ- "నిన్న చెప్పానుగా.... ఇవాళ మనింటికి రాజీవ్ అంకుల్ వస్తారని! వెళ్ళు, ఇలారా, పోని... నా పక్కన కూచో!" అన్నాడు.
సుబ్బి లోపల భయం దాచుకుంటూ నెమ్మదిగా వెళ్ళి రాజీవ్ కి, మాధవరావుకి మధ్య సోఫాలో కూచుంది.
"బడి లేదా..?" అన్నాడు రాజీవ్ సుబ్బి జుట్టు నిమిరి.
"శనివారం వాళ్ళకి బడి వుండదు, ఫైవ్ డే వీక్ వాళ్ళ స్కూలుకి!" అంది జానకి.
చెన్నమ్మ కాఫీ తెచ్చింది. అలా కూచోటం చాలా చిరాగ్గా వుంది సుబ్బికి! లేచి లోపలకెళ్ళింది.
రాజీవ్, మాధవరావు, జానకి కబుర్లు చెప్పుకుంటున్నారు.
"ఎలా వున్నాడు మీవాడూ..?"
"ఆ... బానే వున్నాడు" అన్నాడు కర్టెన్ వైపు చూస్తూ చెన్నమ్మ కర్టెన్ లోంచి రాజీవ్ ను చూస్తోంది. సుబ్బి గుమ్మంలో నిలబడింది.
"ఇదిగో చూడు-నీకోసం ఏం తెచ్చానో!" అంటూ బాగ్ లోంచి బయటికి తీసాడు...పట్టు పరికిణీ బట్ట.
"దీంతోనే జాకెట్ వుందన్నాడు. నాకు తెలియదు అవేమిటో- దీనికి కుట్టించండి!" అంటూ సుబ్బి చేతిలో పెట్టాడు.... ఎర్రని పరికిణీ బట్ట.
నీలం అంచు, ఎంత బాగుందో - ఆ పేకట్టు పట్టుకు లోపలికి పరిగెత్తింది సుబ్బి.
"ఆర్నెల్లయింది" అన్హ్ది జానకి నెమ్మదిగా.
"అనుకున్నాను - మా యింటి మహాలక్ష్మి మీ యింటికొచ్చింది" అన్నాడు నెమ్మదిగా.
అప్పటికే మాధవరావు లోపలకెళ్ళాడు.
"జానకీ.... నీ ఋణం ఎలా తీర్చుకోనూ! పిల్లని బడిలోవేసి చదివిస్తున్నావు... నీ కడుపునా పుట్టిన పిల్లని మాత్రం ఇంతకన్నా ఎంత ప్రేమగా చూస్తావ్! ఇంతకీ... మమత అదృష్టం నీ యింటి కొచ్చింది" -రాజీవ్ మాటలు వింటూ-
"ఒక్క నిముషం..." అని లోపలకెళ్ళింది జానకి.
బెడ్ రూమ్ లోకెళ్ళి నీళ్ళు తిరిగిన కళ్ళు తుడుచుకుంది. గబగబా ముఖానికి మళ్ళీ పౌఅరు రాసుకుంది. కాటుక దిద్దుకుంది.... అద్దంలో కనిపించిన ముఖం ఫక్కున నవ్వింది.
'చాలా అందంగా వున్నావ్' మాధవరావు భార్యని కౌగిలించుకున్నాడు... బెడ్ రూమ్ తలుపేసాడు.
"ఇప్పుడప్పుడే వెళ్ళడా - బోర్!" అన్నాడు.
"సాయంత్రం వెళ్ళిపోతాడు"
"అబ్బ- సాయంత్రం దాకా ఎవడు భరిస్తాడు వాణ్ణీ!" మాధవరావు అహంకారానికి చాలాసార్లు కోపమొస్తుంది జానకికి. కానీ ఏం చేస్తుందీ!
సుబ్బిని ఏం మాట్లాడిస్తాడో అని బెదురుబెదురుగా చూస్తూ అటుఇటూ తిరుగుతూ.
"బోర్నవీటా తాగావా, లోపలికి పోయి తాగు" అంది జానకి.
"తల్లీ, రా రెడీ, చెప్పులేసుకో!" అన్నాడు మాధవరావు.
సుబ్బి చెప్పులేసుకొచ్చింది... "పది నిమిషాల్లో వస్తాను- కూచో కార్లో!" అన్నాడు. సుబ్బికి సంతోషంగానూ వుంది, ఇటు భయంగానూ వుంది.
రాజీవ్ మనసు ఆనందంతో నిండిపోయింది.
చెన్నమ్మకి ఆ రాజీవ్ ఎవరో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా వుంది. అమ్మగారి అన్నగారైతే... కారు, అయ్యగారి అన్నగారూ కారు- మరెవరూ? ఒకవేళ ఆ రాజీవ్ గారి అబ్బాయినీ- ఛీ, ఈ పనిపిల్లనిచ్చి- అదేం కాదు- ఏదో వుంది.
చెన్నమ్మ జానకి గదిలోకొచ్చింది.
"అమ్మా... సుబ్బి చాలా బాగుంది కదమ్మా- మహలక్ష్మిలా వుంది కదూ!" అని. "ఆయనెవరమ్మా..?" అంది.
"అయ్యగారి స్నేహితుడు!" జానకి ముఖం చిట్లించింది.
కాలింగ్ బెల్ మోగింది... గుమ్మంలో సతీష్.
"హాయ్ ఆంటీ!" అంటూ లోపలకొచ్చి గదులన్నీ తిరిగాడు. "లేదా..?" అన్నాడు.
"ఆ మూల పడుకుందిగా!" అంది జానకి.
"బిక్కి కాదు... సుబ్బి! సుబ్బి లేదా అని!"
సతీష్ ఈ మాట అంటుంటే, "సతీష్... లోపలకి రా!" అంది కంగారుగా జానకి.
"ఇవాళ అది బయటకి రదు, పనిలో వుంది. నువ్వెళ్ళిపో! నేను కూడా బయటకెళ్ళిపోతున్నా" అంటూ కంగారుగా సతీష్ ని పంపేసింది జానకి. స్కూటర్ స్టార్ట్ చేస్తూ "బయటికి రాకూడదా... ఓహో!" అనుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు సతీష్.
ఇంట్లోంచి బయటకెళ్ళిన మాధవరావు- కారు ఓ మార్కెట్ దగ్గర ఆపాడు.
"నిన్ను ఆ రాజీవ్ ఒకవేళ తీసుకెడతానంటే నువ్వు రానని చెప్పాలి- నేనొస్తే నా స్కూలు పోతుంది అనాలి" -అన్నాడు.
"ఎవరు రాజీవ్ గారు..?" అంది నెమ్మదిగా గొణుగుతున్నట్టు సుబ్బి.
మాధవరావు మాట్లాడకుండా కారు తలుపేసి మార్కెట్ లోకి నడిచాడు. యాపిల్స్, అరటిపళ్ళు, కమలాలు, కొన్ని స్వీట్లు కొని కారెక్కాడు.
ఒంటిగంట అవుతోంటే ఇంట్లో అడుగుపెట్టిన మాధవరావు- రాజీవ్ సోఫాలో కునికిపాట్లు పడుతూండడం గమనించి, "అదేమిటీ, పాప గదిలో పడుకోండి కాసేపు" అన్నాడు.
భోజనాలయ్యాయి.
రాజీవ్ కి పిల్లతో ఎన్నో మాట్లాడాలనిపించింది- కానీ, ఎందుకో... అనుమానం వచ్చింది-తనెవరో తెలుసా ఈ పిల్లకి!
జానకి ముందు గదిలో టీవీ చూస్తోంది. మాధవరావు నిద్రపోతున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటోంది సుబ్బి ఆరోజు.
"జానకీ, మమతకి నేనెవరో చెప్పావా..?" అన్నాడు నెమ్మదిగా.
జానకి ఉలిక్కిపడింది ఒక్కసారి.
"అదే జానకీ, మీరు దాన్ని పెంచుతున్నారని, నేనే దాని నాన్ననని చెప్పావా అని?! ఎందుకంటే... ఇప్పుడు ఊహ తెలిసింది కనుక మీరు దానికేమవుతారో, నేనేమవుతానో తెలిస్తే, నామీద ప్రేమ కలుగుతుంది కదా! -మీమీద, మీరెంత మంచివారో అనే భావం పెరుగుతుంది కదా...ఏమంటావ్?" అన్నాడు.
జానకి నిట్టూర్చింది... "ఊ చెప్పా, అంకుల్ అని చెప్పా!" అంది నసుగుతూ.
పాము చెవుల చెన్నమ్మ ఆ గదిలోనే సోఫా వెనకే కూచుని టీవీ చూస్తున్న విషయం జానకి కానీ, రాజీవ్ కానీ కనిపెట్టలేదు.
చెన్నమ్మ ముఖం ఒక్కసారి విప్పారింది... వాళ్ళు మాటల సందడిలో వుండగా పక్క తలుపులోంచి లోపాలకి చప్పుడు కాకుండా వెళ్ళిపోయింది చెన్నమ్మ.
సుబ్బి గెస్టు రూమ్ లో, ఆ మెత్తని పరుపుమీద, ఫాను హాయిగా తిరుగుతుంటే ఒళ్ళుమరచి నిద్రపోయింది.
"మీకు టైమవుతోందనుకుంటా!" అన్నాడు బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ మాధవరావు.
రాజీవ్ గడియారం వంక చూసి, లేచాడు. సుబ్బి గాఢనిద్రలో వుంది.
"జానకీ... ఇక్కడనుంచి వెళ్ళబుద్ది కావటంలేదు. మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోనూ?!" అన్నాడు మాధవరావు చేతులు పట్టుకుని.
"పదండి, టైమైపోతుంది!" అంటూ మాధవరావు కారు తాళాలు తీశాడు- రాజీవ్ ని స్టేషన్ లో దించటానికి.
కారు కదిలిపోగానే జానకి కన్నీళ్ళాగలేదు... తనూ - ఆ పిల్ల పక్కన పడుకుంది వెళ్ళి..! మనసు బరువుగా వుంది. పిల్లని దగ్గరగా తీసుకుంది. నిద్రలో వున్న సుబ్బి పక్కకి ఒత్తిగిల్లింది. జానకి కూడా గాఢనిద్రలో మునిగిపోయింది.
రాజీవ్ ని స్టేషన్ లో దింపి క్లబ్బుకెళ్ళిపోయాడు మాధవరావు.
చెన్నమ్మ చెక్కిట చేయి చేర్చి తీవీలోకి చూస్తున్నా మనసెక్కడోవుంది. తన చిన్న కూతురు కళ్ళముందు కదిలింది. ఇరవై ఏళ్ళయింది దూరమైపోయి- తల్లి! తనెలా మరిచిపోతుందీ ఎన్నేళ్ళయినా!-చెన్నమ్మకి ఒక్కసారి అనిపించింది... ఈ సుబ్బికి తల్లెవరో!
తండ్రి ఈ పొద్దుటొచ్చినాయనేనా?! ఏమిటో - చెన్నమ్మ టీవీ ఆర్పేసి లోపలకెళ్ళి నిద్రపోయింది.
రైల్లో కూర్చున్న రాజీవ్ కి చాలా ఆనందంగా వుంది... మమత అంత హాయిగా వున్నందుకు! దాని గౌనే నాలుగొందలు ఖరీదు చేస్తుంది. దాని మెడలో హారం ఎన్నివేలో! ఎంతో చక్కగా తీర్చిదిద్దినట్టున్న దాని కనుముక్కు తీరు, దాని పొడవైన జుట్టు- రాజీవ్ కి ఆనందాన్నే కాదు, మనసుని వేధించినట్టయింది - ఈ పిల్ల తల్లెవరో... ఆరోజు ఎవరో వచ్చారని, తల్లిని నేనే- అందని సుమతి మరోమాట వినకుండా వెళ్ళగొట్టింది. ఆ తల్లే కనిపిస్తే! కనిపిస్తే మాత్రం- పిల్లని ఇంత వైభవంగా పెంచగలదా? ఈ పిల్ల ఏ ధనవంతుని భార్యో అయ్యే యోగ్యత వుంటే... ఏ తల్లి పెంచగలదూ, జానకి తప్ప! రాజీవ్ మనసు చాలా తేలిగ్గా, హాయిగా పరవశించింది తృప్తితో.
ఇంటికొచ్చిన మాధవరావు కళ్ళు భగభగమండిపోయాయి ఆ దృశ్యం చూసి.
జానకి సుబ్బిని కౌగిలించుకుని పడుకుంది- తల్లీ పిల్లల బంధంలా! - ఛీ...ఏమిటిది? జానకికి బుద్దిలేదా?
"లే..!" అయ్యగారి కేకకి సుబ్బి లేస్తూ, ఆ కంగారులో మంచంమీద నుంచి కిందపడింది. తల బొప్పి కట్టింది. జానకి కూడా ఉలిక్కిపడి లేచింది.
