"అవును... అవునవును మమ్మా!" బలవంతంగా నవ్వుతూ చెప్పింది.
"నో! సమ్ థింగ్ రాంగ్! మీరిద్దరూ పోట్లాడుకున్నారు.... అవునా?!" వేలితో బెదిరించింది. "బాడ్! వెరీబాడ్! ఇంత పెద్దయ్యాక ఇలా పోట్లాడుకోవచ్చా? పోట్లాడుకున్నా వెంటనే మర్చిపోవాలి. కమాన్... టిఫిన్ చేద్దాం!" వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుని జాయినయింది.
"వావ్ఁ.... ఆమ్లెట్స్! సూపర్బ్! కోల్డ్ మిల్క్ చాలా బావుంది. వెరీగుడ్...మీరిద్దరూ మంచి కుక్స్! థాంక్యూ.... నాకు మంచి టిఫిన్ అరేంజ్ చేసినందుకు!" అంటూ కాలేజ్ విషయాలు చెబుతూ ఉంటే ఇద్దరూ మామూలు మూడ్ లోకి వచ్చేశారు.
బాల్కనీలో కూర్చున్నారు ముగ్గురూ.
వేసవి కాలం! వేడి కలిసిన గాలి! అయినా ఆహ్లాదంగానే ఉంది. ఎక్కడ్నుంచో వర్షంలో తడిచిన మట్టివాసనను మోసుకొచ్చి చల్లగా వీళ్ళను కమ్ముకుందో గాలి సుడి!
ఆ మట్టివాసనను గుండెల్నిండా పీల్చి, "ఎంతబావుందో కదా మమ్మా ఈ స్మెల్!" అన్నాడు రేవంత్. జ్ఞాపిక కూడా గుండెల్నిండా పీల్చి వదిలింది.
"అందుకే బిట్టూ-
'హౌ బ్యూటిపుల్ ఈజ్ ది రైన్-
ఆఫ్టర్ ద డస్ట్ అండ్ హీట్!
"హౌ బ్యూటి పుల్ ఈజ్ ది రైన్-
ఆప్టర్ ద డస్ట్ అండ్ హీట్!
హౌ ఇట్ క్లాట్స్ ఆన్ ద రూఫ్స్-
"లైకే ట్రైమ్ ఆఫ్ హూప్చ్!' అంటాడో కవి. వర్షాకాలంలో వచ్చే వర్షంకుంటే వేసవిలో వచ్చేవర్షం, అంది తెచ్చే సౌరభం నిజంగా బావుంటుంది బిట్టూ!"
"అవును బొట్టూ!" జ్ఞాపిక కూడా ఒప్పుకుంది.
"మమ్మా 'బిట్టూ...' అంటే నువ్వూ 'బిట్టూ...' అంటావా?"
"చిన్నపిల్లల్ని అలాగే పిలుస్తారు బిట్టూ! కదా మమ్మా?!"
"అంటే...మమ్మాకి చిన్నపిల్లాణ్ణి. నీకేం కాదు."
"చూడు మమ్మా... పెద్ద మగమహారాజులా ఫోజు కొడుతున్నాడు!" కంప్లైంటు చేసింది.
"కానేంటి...?" దబాయించాడు.
ఉన్నట్టుండి "కెవ్వు..." మని అరిచింది బాధగా.
"ఏవయింది జ్ఞాపీ.... ఏవయింది?" ఇద్దరూ చుట్టుముట్టేశారు.
నింపాదిగా లేచి, "మగ మహారాజు భయపడతాడేంటి?" నిమ్మళంగా అడిగింది.
"ఒఫ్ఫ్ఁ...." అని, "చూడు... నేనే ఆడపిల్లకూ భయపడను! ఏదో కంగారుపడ్డానంతే!"
"ఆఁ... ఆఁ... ఆడపులి తనను తినేసేముందు ఆడమ్స్ ఇలానే అన్నాడు కదా మమ్మా!"
కదిలి కదిలి నవ్వింది హాసిని. "అవును బిట్టూ... "ఏ ఆడజాతికీ భయపడను' అనే ఆడమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆడపులికి అయ్యాడు" అని నవ్వింది.
"మమ్మా! యు ఆర్ ఆల్ సో సపోర్టింగ్ హర్! నో.... మిమ్మల్ని ఇద్దర్నీ బాయ్ కాట్ చేసి ఈరోజు సాంబారు చెయ్యడానికి వంటింట్లోకి వెళుతున్నా.... బై!" అని వెళ్లిపోయాడు. పోతూపోతూ జ్ఞాపికకు కన్నుకొట్టి ఏదోసైగ చేశాడు. జ్ఞాపిక "ఓ.కే!" అని బొటనవేలు ఎత్తి పంపింది.
"ఈరోజు మనకు సాంబారు శాపం తప్పదు!" జ్ఞాపిక అంది.
"లేదు. బిట్టూ సాంబారు చాలా బాగా చేస్తాడు. సరేకానీ జ్ఞాపికా.... ఈ సెమిస్టర్ కు ఎలా ప్రిపేరవుతున్నావు?"
"నాట్ బాడ్ మమ్మా! 'బాగా ప్రిపేరవుతున్నాను' అని చెప్పదలుచుకోలేదు. నా మార్క్స్ ను చూపించాలనుకుంటున్నా ప్రాక్టికల్ గా!"
"కంగ్రాట్స్! దెన్... ఏం బుక్ చదివావు?"
"మైదానం!"
"ఓఁ.... చలం! ఆయనొక సముద్రం!" రిలాక్స్ డ్ గా అంది.
"మీ కిష్టమా? అయిష్టమా?"
"సాహిత్యంలో ఏదీ అయిష్టం కాదు జ్ఞాపికా! ప్రతిదీ ఒక ప్రత్యేక సిద్దాంతమే! డేనికదే సాటి! దేన్నీ అలుసు చేయకూడదు. దేన్నీ అందలాలు ఎక్కించకూడదు. మనిషి ఆలాచనా రీతికి ఎన్నిన్నో దారులు..., ఎన్నెన్నో గమ్మాలు! అన్నీ శాంతికీ, సుఖజీవనానికీ ఏర్పరచుకునే సిద్దాంతాలే అయినా- ఒకదానికొకటి పూర్తి విరుద్దం, విశిష్టత కలిగిఉంటాయి. అన్ని రుచులూ సాహిత్యంలో ఉంటాయి! నీ ఇష్టాన్ని చులకన చేయడానికి లేదు. చలం సాహిత్యం ఎంతిష్టమో.... విశ్వనాథ వాదనాపటిమ కూడా అంతే ఇష్టం! నువ్వు చలం 'మైదానం' చదవగానే- విశ్వనాథ 'చెలియలి కట్ట' చదివితీరాలి. లేకపోతే నువ్వు కరెక్ట్ జడ్జ్ మెంట్ చెయ్యలేవు."
"చలం గురించి మీ ఒపీనీయన్ ఏంటి మమ్మా?"
ఈజీచైర్ లో రిలాక్స్ డ్ గా కూర్చుని మెల్లగా మూవ్ అవుతూ కళ్ళు మూసుకుంది.
"చలం! ఆడవాళ్ళకు- తమకూ కొన్ని శరీరావయవాలున్నాయనీ, వాటిని ప్రకృతి తమకోసమే నిర్మించిందనీ తెలియచేసిన మొట్టమొదటి స్త్రీ శారీరకవేత్త, మానవ ధర్మకర్త! స్త్రీకి స్త్రీత్వం గురించి తెలియచేసిన పురుషవేత్త!" ఆమె పెదవులు విచ్చుకున్నాయి.
జ్ఞాపిక కాన్ సన్ ట్రేషన్ పెరిగింది.
"వాంఛలను అణచుకుని వివాహబంధానికి కట్టుబడి ఉండడం కంటే- ప్రణయం తెలిసిన స్త్రీపురుషులు వివాహం చేసుకోకపోయినా కలిసిఉంటే సుఖాన్నీ, ఆనందాన్నీ అనుభవించవచ్చుననే ప్రధాన ఉద్దేశం చలం సిద్దాంతం!"
"ఓహొఁ..." అనుకుంది. మళ్లీ అవే పదాలు మననం చేసుకుంది జ్ఞాపిక.
"వాంఛలు క్షణికం! కుటుంబవ్యవస్థ పట్టిష్టం.., శాశ్వతం! ఈ వ్యవస్థ మానవజాతి మనుగడకు శాంతి సామరస్యాల నేర్పరచి జంతుజాలం నుండి వేరుపరుస్తుంది. సంస్కృథీ పరమైన కుటుంబవ్యవస్థలో వాంఛలకు అతీతమైన ఆనందాన్నీ, సుఖాన్నీ పొందవచ్చనేది విశ్వనాథ సిద్దాంతం!"
రెండింటి తేడాను బేరీజు వేసింది. జ్ఞాపిక మెదడు.
"రెండూ ప్రాపంచిక ఆలోచనారీతులే! వీటి బరువు, తూకం వేసుకుని మెదడు ఇష్టాన్ని బట్టి ఉంటుంది!" ఈజ్ చైర్ లోంచి ముందుకువంగి, "నీకు తెలుసా జ్ఞాపీ! చలం గొప్ప భారతీయ స్త్రీ ధర్మకర్త! అతని శారీరకధర్మాలకు మానసిక పరిపక్వత తోడు కలిసి ఉంటే చలాన్ని మించిన పరిపూర్ణుడు భారతీయ సాహితీవేత్తలలో ఉండేవారు కారు! కృష్ణశాస్త్రి మానసిక ధర్మవేత్త; చలం శారీరక ధర్మవేత్త! ఇద్దరూ కలిసి స్త్రీమూర్తిని నిర్మించి ఉంటే ఆమె జగజ్జేత అయి ప్రపంచ ధర్మకర్త అయ్యేది. నేనెప్పుడూ వీళ్ళిద్దర్నీ కలిపి ఆలోచిస్తుంటాను" ఆమె ముఖం వెలుగుతో ఉత్సాహంతో నిండింది.
"జ్ఞాపికా....తెలుగు సాహిత్యపు సముద్రంలో ఎన్ని ముత్యపుచిప్పలో, ఎన్నెన్ని పెన్నిధులో! మన జీవితం సరిపొదనుకో!" ఉత్సాహంగా, వయసు మరచిపోయి చిన్నపిల్లలా, ఉషారుగా , స్నేహితురాలిలా అనునయంగా, గైడులా, ఆత్మీయంగా చెబుతుంటే ఊకొట్టడం కూడా డిస్టర్బెన్సేమో అనుకుని ఊరుకుంది జ్ఞాపిక.
దగ్గరలో చినుకులు రాలినట్లు మళ్లీ వాసన, చల్లగాలి దగ్గరగా!
గాఢంగా గాలి పీలుస్తూ "ప్రపంచంలోని సిద్దాంతాలన్నీ తెలుసేసుకోవాలని నాకెంత తొందరగా ఉంటుందో తెలుసా జ్ఞాపికా- తప్పటడుగులు వేసే పసిపిల్ల పరుగెత్తాలని చూసినట్టు!" తన జోక్ కు తనే మెత్తగా నవ్వుకుంది.
"మమ్మా....ఇంకా మీరు చదవాల్సినవి ఉన్నాయా?" ఆశ్చర్యంగా అడిగింది. తనకన్నీ తెలుసనే జ్ఞాపిక ఆలోచన!
"చాలా! ఎంత చాలా అంటే... నా జీవితం సరిపోనంత చాలా!" రెండుచేతులూ చాచి చూపించింది.
"నా జీవితం, నా సాహచర్యం పుస్తకాలే తెలుసా?" ఆనందపడిపోయింది.
"మమ్మా.... నేనొకటడగనా?"
"అడుగు జ్ఞాపికా! నా ముందు ఎలాంటి బిడియాలూ వద్దని చెప్పానే!"
"మీరు చదివిన బుక్స్ గురించీ, సిద్దాంతాలూ గురించీ నాతో చెబుతుంటే, లేదా నాతో పంచుకుంటూంటే మీలో మీరు దాచుకున్న దానికన్నా రెట్టింపు ఆనందంగా ఉంది కదూ మీకు!"
"ఎగ్జాట్లీ! నేచురల్! మనం తెలుసుకున్నవి మనలాగే ఆలోచిస్తూ పంచుకునే వాళ్ళుంటే యుగాలు క్షణాలయిపోతాయి. జీవితం తేలికయిపోతుంది. నేనూ, బిట్టూ కూర్చుంటే టైమ్ తెలీదు. నువ్వు కూడా అచ్చం మాలాటిదానివే!"
"అలానే మనలో మనం ఒంటరిగా ఉంటే- క్షణాలు యుగాలవుతాయి కదా మమ్మా!"
"అవును...." టాపిక్ మారినట్టు సాలోచనగా అంది.
"మరి- రేవంత్ స్టేట్స్ కి వెళ్లిపోతే మీ క్షణాలు యుగాలు కాకుండా, యుగాలు క్షణాలయ్యేలా మీకో తోడు కావాలిగా!"
"సో... వాట్?"
"ఇఫ్ యు డోంట్ మైండ్... మీరు పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు మమ్మా!" బిడియంగానే అడిగింది.
చివుక్కున లేచి బాల్కనీ గోడ పట్టుకుని నిలబడింది.
వదిలిన ఆమె వెంట్రుకలను చల్లగాలి వెనక్కితోస్తోంది. సన్నని ఆమె శరీరం శిల్పంలా ఉంది. ఇంత అందమూ, ఇంత సహృదయతా వుండీ జీవితాన్ని మలచుకునేందుకు అవకాశం వచ్చినా... రేవంత్ కై జీవితాన్ని కాలదన్నిన ఆమె- ప్రకృతి లోని అపురూపంలా అనిపించింది జ్ఞాపికకు.
బయటకు రాబోయిన రేవంత్ ఆగిపోయాడు తలుపు దగ్గరే- శ్రద్దగా వింటూ!
"ఎందుకు చేసుకోవాలి పెళ్ళి?"
"పెళ్ళంటే ఏవిటి మమ్మా?"
"ఇద్దరి వ్యక్తుల అవగాహన, ఆలోచనల కలయికతో కూడిన పరిపూర్ణమయిన బ్రతుకు!"
"అందులో ఒకరు తప్పుకుంటే అది అసంపూర్ణమే కదా! దాన్ని మళ్లీ సంపూర్ణం చెయ్యాల్సిన అవసరం లేదా?"
"ఉంది! ఇద్దరి స్థానంలో ఒకరు స్థానభ్రంశం చెందితే ఆ స్థానాన్ని రేవంత్ భర్తీ చేశాడుగా! ఇక ఒంటరితనం ఎక్కడిది?"
"ఇప్పుడు రేవంత్తన జీవితాన్ని వెతుక్కుంటూ మళ్లీ స్థానభ్రంశం చెందబోతున్నాడుగా! మరి, ఇప్పుడు మీ జీవితం అసంపూర్ణం కావడంలా?!"
"వాడు ఎక్కడున్నా నా జీవితంలో భాగమేగా!"
"కాదు! తనదంటూ జీవితం ఏర్పడ్డాక అక్కడ మీ స్థానాన్నీ తన భార్య ఆక్రమించుకుంటుంది. ఇది 20వ శతాబ్దం! కోడలూ, కొడుకు పోషణ లాంటి భావనలు అసంతృప్తినే ఇస్తాయి. మీరు 18 ఏళ్లకే రేవంత్ కు బర్త్ ఇవ్వడాన ఇంకా వయసు మీరిపోలేదు. ఇప్పట్నుంచే మీరు అత్తగారిలా కొనసాగక్కర్లేదు. కొన్నాళ్లు భార్యగా కూడా కొనసాగొచ్చేమో!"
"రేవంత్ నేర్పించాడా?"
"ఏం- నాకు ఆలోచించడం రాదా మమ్మా?"
"రేవంత్ ఎప్పుడూ గొడవ పడుతుంటాడు.... అందుకని!"
"అది గొడవ కాదు మమ్మా.... ఆవేదన! తనెవరో చూడకుండానే పద్దెనిమిదేళ్ల వయసులో కడుపులో పిండంకోసం జీవితాన్ని వదులుకున్న మీకు- తానేవీ చెయ్యలేకపోతున్నానే ఆవేదన!" వింటున్న రేవంత్ తలుపుకు అనుకున్నాడు.
హాసిని వెనక్కి తిరిగారు.
"మాతృత్వం ముందు ప్రతిదీ అల్పమే జ్ఞాపికా! అందుకే చలం విఫలమయ్యాడు."
"సంతానత్వం ముందు కూడా ప్రతిదీ అల్పమే మమ్మా! కడుపులోని కనబడని బిడ్డకై మీరే అంత తపిస్తే.., కళ్ళముందు కనిపించే తల్లికోసం సంతానం మాత్రం తపించకుండా ఉంటుందా- అది ఉత్తమమైనదైతే!" మెత్తగా కన్విన్స్ మొదలయ్యింది.
"వయసు మీరి మాట్లాడుతున్నావేమో జ్ఞాపికా..!" వారించబోయింది.
"శరీరానికి వయసుంటుంది కానీ,. ఆలోచనలకు వయసుండందని మీరే చెప్పారు మమ్మా! ఒక్కోసారి ఆలోచనల్లో పిల్లలు తల్లిదండ్రులకన్నా పెద్దవాళ్ళవుతారేమో! మెత్తగా గుర్తుచేసింది.
"ఇంతకీ .... మీ ఇద్దరి ఆలోచన ఏవిటీ?" విషయానికొచ్చింది డైరెక్ట్ గా.
"రేవంత్ స్టేట్స్ వెళ్లేముందు మీకు పెళ్ళి చెయ్యాలి!"
"మీరు చేస్తారు?" నవ్వింది గలగలా.
"ఎలా చేస్తారు?" అడిగింది చేతులు కట్టుకుని!
"గభాల్న బయటకొచ్చాడు రేవంత్.
"సింపుల్ మమ్మా... పేపర్ లో ప్రకటన ఇస్తాం! 'సో అండ్ సో వ్యక్తికి- సో అండ్ సో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కావలెను' అని!" అన్నాడు గబగబా.
"బిట్టూ! ఇదంతా నీ ప్లానన్నమాట!"
"ఛ... నాకేం తెలుసు! నేను సంబారు చేసి వచ్చాను. మీ టాపిక్ విని ఎంటరయ్యాను!" అని జ్ఞాపికకు కన్ను కొట్టాడు.
"అవును! నేనే ఆలోచించాను ఇలా! రేవంత్ ప్రసక్తి లేదు. ఉన్నా తెప్పేవిటో నా రేవంత్.
"బ్లాక్ మెయిలింగా....?" తలమీద కొట్టి వీల్ చైర్ లో కూర్చుంది.
"కాదు! నిన్నోక్కదాన్నీ వదిలి వెళ్లడం ఇష్టంలా!" అమ్మ కాళ్ల దగ్గర కూర్చుని తన మోకాళ్ల మీద తలపెట్టి "మమ్మా... నాకు నాన్న ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది!" ఎంతో ఆపేక్షగా అడిగాడు.
ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
"ఏరా బిట్టూ....నీకేవయినా లోటు చేశానా?" గొంతు బొంగురుబోయింది.
"లోటు ఒక్కటే అమ్మా... నువు చేసింది! నా కళ్ళముందు నీ ప్రక్కన ఖాళీ ప్రదేశం ఉంచడం! అది నింపి నీ నిండుజీవిత చిత్రాన్ని చూడాలని నా కెన్నేళ్లగానో ఆశగా ఉంది మమ్మా! నాకు 'నాన్న' అని పిలవడానికీ, నీ భుజాల చుట్టూ చేతులేసి నాకు వీడ్కోలు చెప్పడానికీ ఒక వ్యక్తి కావాలి మమ్మా!" మోకాళ్ల మీద తలపెట్టుకున్నాడు.
జుట్టులోకి వేళ్లు కదిలిస్తూ, "ఎందుకురా బిట్టూ... అంత తపన నామీద?!" అంది.
"నువ్వు నాకోసం పడ్డ దాంట్లో నేను నీకోసం పడే తపన చాలాతక్కువ మమ్మా! నుక్వొక మంచి తల్లిస్థానాన్ని పొందినట్టే నన్నూ మంచి బిడ్డస్థానాన్ని పొందనీయమ్మా నా అంతరంగంలో!" ఇంక మాటలు రాలా రేవంత్ కు. అలాగే ఒళ్ళో తలపెట్టుకుని ఉండిపోయాడు. కుచ్చెళ్ళు మొహానికి కప్పుకున్నాడు పసిపిల్లాడిలా= కళ్ళనీళ్లు కనిపించకుండా!
జ్ఞాపిక కూడా చలించింది ఆ స్పందనకు.
"రేవంత్ మాటల్లో చాలాఅర్థం ఉంది మమ్మా! మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది"
"సరే....మీరు భావికర్తలు! రేపటి సిద్డంతీకులు! మీ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను! కానీ, ఆ వ్యక్తి ఎవరన్నది నేనే నిర్ణయించుకుని నిర్మించుకుంటాను. ఈ విషయంలో మీ జోక్యం, మీ చదువుకు డిస్టర్బెన్స్ ఉండకూడదు" మెత్తగా అంది.
"య్యాహూఁ..!" అని అరిచి, మమ్మాని అమాంతం రెండుచేతుల్తో ఎత్తుకుని వెళ్లి పదిలంగా సోఫాలో కూర్చోబెట్టి "అయాం ది గ్రేట్ అలెగ్జాండర్!" అని అదిచాడు.
