Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 23

    "అక్కర్లేదు-"

    "తీసుకుంటేనేం -మరి నా జత ఉండవా?" గంగి జాలిగా అడిగింది.

    "మరి - మరి మీ బాబుతో ఇదంతా సెప్పకేం?"

    "సెప్పను"

    "ఒట్టెయ్యి"

    "ఉఁ ఒట్టు."

    గంగి యిచ్చిన సంగీతపు పెట్టెని పెదవుల మధ్యకి పోనిచ్చి ఉత్సాహంగా మ్రోగించాడు బాబు. చుట్టూ పొడుగ్గా పెరిగిన సర్వీచెట్లు కూడా ఉత్సాహంగా ఆ ధ్వనికి యిటూ అటూ ఊగాయి.
       
                                      3

    కార్ఖానాలో పని తీవ్రంగా సాగిపోతోంది. ఎండగాడ్పు వేడిగా మొహానికి కొట్టుతోంది. అక్కడికి కొద్దిగా దూరంగా తాపీవాళ్లూ కూలీలు పదాలు పాడుకుంటూ పనిచేస్తున్నారు. గౌరీనాధం చెమటలు కక్కుతూ బల్లల్ని సాపుగా చెక్కుతున్నాడు. బొగ్గునలుసులు పడి వీరన్న కళ్లు ఎర్రగా వున్నాయి. నిద్రలో వున్నా తాత చెయ్యి చక్రాన్ని గిరగిర తిప్పేస్తోంది. "ఒరేయి జాగ్రత్త. అక్కడ బందులు సరీగ్గా బిగించు. అక్కడ వంపు సరీగ్గా చెక్కాలి" అంటూ గౌరీనాధం మధ్య మధ్య హెచ్చరిస్తున్నాడు. బాబు పెద్ద పెద్ద మేకుల్ని కర్రలోకి దిగగొట్టుతున్నాడు.

    రంపపు పనివాడు పరాకుగా లైను తప్పించి కోశాడు. గౌరీనాధం ఛర్రున అక్కడికి వెళ్ళాడు. "ఏరా యెదవకొడక - యిదేం పనిరా. వంద రూపాల దూలం తగలేశావ్" అంటూ అతని గొంతుక పట్టుకున్నాడు. ఆ పిడికిలిలో మృత్యువు యొక్క బలం వుంది. రంపపు పనివాడు గొంతుక నరాలు లావుగా పగులుతోన్నట్టుగా వుబికాయి. అంత నల్లని మొహమూ యెర్రగా అయిపోయింది. చివరికి కొనవూపిరితో వాణ్ణి వదిలేసి గౌరీనాథం తన పనిలోనికి వచ్చి కూచున్నాడు.

    బాబుకి భయం వేసింది. ఈ పని కొత్తగా, అసహ్యంగా, బాధగా వుంది. ఆ ఎండగాడ్పుకి మరికాస్త దాహం ఎక్కువయింది. పైకి తేలికగా కనపడుతుంది యీ పని. కాని మనిషి బలం అంతా చేతివేళలలో ఆనుకుని ఉంటుంది. ఇంతకన్న ధాన్యం బస్తా మొయ్యడం సులభం అనిపించింది. పెద్ద బరువైన సుత్తిని పైకెత్తి గురితప్పకుండా ఆ మేకుల్ని కొట్టాలి. అతనికి చేతికండలు పీకుతూన్నట్టు అనిపించాయి. గౌరీనాధం మెల్లగా వచ్చి బాబు జుట్టుపట్టుకుని పైకి లేవదీశాడు.  "ఏరా కునుకుపాట్లు పడుతున్నావ్! ఆ మేకు అలా వంకరగా దిగిందేమిటి?" అన్నాడు.

    "గాడిద కొడుకు! ఎంత పొగరు యీడికి" అని వీరన్న తన అభిప్రాయం వెల్లడించాడు.

    "చేతులు పీకుతున్నాయి" అన్నాడు బాబు భయంతో.

    "కంచెడు వణ్ణం తినగలవా? ఈ పని లాభంలేదు నీకు. పోయి ఆ దూలం చెక్క లిటు మోసుకునిరా. వేషాలేస్తే చితకకొడతాను" అన్నాడు గౌరీనాధం.

    దూలపు చెక్కలు రోడ్డుకి అటుప్రక్కన పడివున్నాయి. ఎండ అతి తీవ్రంగా ఉంది. అసలే అలసటగావున్న బాబుకి ేడుపువచ్చింది. చెక్కలు మరీ బరువుగా వున్నాయి. దూరంగా కూలీలు సున్నం దంపుతున్నారు. ఆ పని అయితే తేలికగా ఉంటుందేమో అనుకున్నాడు. ఆ సున్నం దంపులోంచి ఒక మనిషి కార్ఖానా వైపు వచ్చాడు "ఏం యిలా వచ్చావ్ యెంకడూ?" అన్నాడు గౌరీనాథం.

    "ఓ సుట్టముక్క యిప్పించండి మేత్త్రీబాబుగారూ" అన్నాడు వెంకడు గౌరీనాధం వెంకడితో మాట్లాడుతూ ఉండటం గమనించాడు బాబు. ఆ దూలపు చెక్కని అతని భుజం భరించలేకపోతోంది. ఎందుకో తెలియని ఉక్రోషం అతని గొంతుకలో వుండలా చుట్టుకుని వుంది. సగంవరకూ మోసుకువచ్చిన ఆ చెక్కని దభీలున కిందపడేశాడు. గౌరీనాధం, కొలిమితిత్తి వీరన్న పరుగెత్తుకు వచ్చారు.

    "ఏంటదీ-" అన్నాడు వీరన్న.

    "బరువెక్కువయింది" అన్నాడు బాబు.

    గౌరీనాధం ఒళ్ళుమండింది. బాబు జుట్టు పట్టుకుని యీడ్చి గిరవాటెయ్యాలన్నంత కోపం వచ్చింది. బలమైన నల్లని చెయ్యని ముందుకు పోనిచ్చాడు. ఇంతలో వెంకడు పెద్ద కేక వేశాడు.  "ఓరి బాబు ఇక్కడున్నాయేంటి నీ పిన్నమ్మ యిక్కడే వుంది"

    అంటూ "ఓసీ మాలచ్చీ యిడిగిడుగో నీ కొడుకు!" అని సున్నం దంపువైపు చూసి పిలిచాడు. గౌరీనాథం తమాయించుకొని  "కుర్రగుంటడివని ఈసారికి వూరుకున్నాను. ఎత్తు ఆ చెక్కని" అని గర్జించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS