"నువ్వు, రుక్మిణమ్మా స్నేహితురాళ్ళు కదా? ఇవాళ నీ స్నేహితురాలి కూతురి పెళ్ళి! సరిగా పెళ్ళికి వచ్చారన్నమాట!"
"ఆ తిక్క పిల్లాడికిచ్చి చేస్తోందటగా? ఎలా మనస్సొప్పింది రుక్మిణికి?"
"రుక్మిణమ్మ పోవడం మీకు తెలియదన్నమాట! భర్త, భర్త పోయిన ఏడాదికే రుక్మిణమ్మా పోయారు! పోయి కూడా రెండేళ్ళు కావస్తూంది!"
"అరె రుక్మిణిపోయిందా?" జానకమ్మ మ్రాన్పడిపోయింది "మరి సంధ్య ఎవరిదగ్గరుంటూంది?"
"నర్సమ్మగారే చేరదీశారు. ఇంకెవరున్నారు పాపం ఆ పిల్లకు? ఇప్పుడు తన ఖర్చుతోటే కొడుక్కి చేసుకొంటూంది! తిక్కోడో వెర్రోడో? ఎవరో ఒక మగడు. కడుపున ఓకాయ కాస్తే ఆడజన్మ ఎత్తినందుకు సార్ధకమౌతుంది!"
'మైగాడ్! ఎలా ఆలోచిస్తారు ఈ ఆడవాళ్ళు!' వింటూంటే కంపరమెత్తి పోతుంది అరుణ్ కు.
"అరూ! మనం రావలసిన సమయంకాదు! వెళ్ళిపోదాం పద!" జానకమ్మ అంది.
"సంధ్యని చూడకుండానే?"
"నాకు చూడడానికి ధైర్యం చాలడం లేదురా! పెళ్ళి అయిపోయాకన్నా వచ్చాంకాదు!"
"రుక్మిణత్తకివ్వాలని పూలూ, పళ్ళూ, పట్టుచీర తెచ్చావు కదా? పెళ్ళికూతురికి ఇవ్వకుండానే వెడతావా?"
"అది పెళ్ళా? గొంతుకి ఉరివేయడం కాకపోతే? ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని ఎంతమాత్రం అనుకోలేదు. రుక్మిణితో ఆనాటి సంగతులు కబుర్లు కబుర్లుగా చెప్పుకోవాలని, మనసువిప్పి ఎన్నెన్నో మాట్లాడుకోవాలని వచ్చాను! చివరికి ఎలా జరిగింది!" జానకమ్మ కళ్ళు తడి అయ్యాయి. "ఇంకెప్పుడైనా వచ్చి సంధ్యని చూసి వెడదాం! ఇప్పుడు మాత్రం చూడలేను!"
"ఇంతదూరం వచ్చి చూడకుండా వెడితే ఏం బాగుంటుందమ్మా? వచ్చినవాళ్ళం వచ్చాం! చూసే వెడదాం!"
"పద, అయితే!"
నర్సమ్మగారు గుండుమీద కొంగు సవరించుకోడానికి కూడా తీరిక లేనట్టుగా హడావిడి పడిపోతూ, జానకమ్మని చూసి, ఒక నిమిషం తరువాత పోల్చుకొన్నట్టుగా అయింది. "బాగున్నావా, జానకమ్మా? ఈ అబ్బాయి నీ కొడుకా? మంచి సమయానికి వచ్చావు! సంధ్య పెళ్ళికి సరిగా!" అంది మహాసంబరపడిపోతూ. "సంధ్య గౌరీ పూజలో ఉంది! వెళ్లి చూడండి!" ప్రక్కగది చూపించి, క్రొత్త పంచ ఒకటి తీసుకొని ఆవిడ హడావిడిగా వెళ్ళిపోయింది అప్పటికే ఆ పని ఆలస్యమైపోయినట్టుగా.
తల మోకాటిమీద ఆన్చి కూర్చొని ఉంది సంధ్య. ముందు పసుపుతో చేసిన గౌరమ్మ!
"సంధ్యా!"
క్రొత్తగొంతు విన్నట్టుగా సంధ్య కొంచెం ఉలికిపాటుతో తలెత్తింది. అపరిచితులను చూస్తున్న భావం ఆ పిల్ల కళ్ళలో కదలాడడం చూసి "నేను సంధ్యా, జానకి అత్తను! వీడు అరుణ్! గుర్తొచ్చిందా?" అంది జానకమ్మ నవ్వుతూ.
సంధ్య కళ్ళలో ఆత్మబంధువుని చూసిన ఆనందం క్షణకాలం కదిలిందో లేదో, కన్నీటితెర క్రమ్ముకువచ్చేసింది ఆ కళ్ళని.
"బాగున్నావా, అత్తా?" అడిగింది డగ్గుత్తికతో.
"ఆఁ ఇప్పుడొద్దాం, అప్పుడొద్దాం అనుకొంటూనే పధ్నాలుగు, పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. రుక్మిణితో ఈ పధ్నాలుగు సంవత్సరాల కబుర్లు చెప్పుకోవాలని, ఇక్కడున్న ఆరోజులు జ్ఞాపకం చేసుకోవాలని ఎంత తహతహలాడుతూ వచ్చానో! మీ అమ్మా నాన్నా ఇద్దరూ పోయారు నాకస్సలు తెలియదు. ఇలా జరిగి ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు."
"నాన్న పోయారు! అమ్మకూడా పోయింది! ఎవరూ దిక్కులేని ఆ స్థితిలో జానకి అత్తే ఉంటేనా అని ఎన్నిసార్లు అనుకొన్నానో?"
"మీ అమ్మ తరపునకాని, నాన్న తరపునకాని ఎవరూ రాలేదా నిన్ను తీసికెళ్లడానికి?"
"అమ్మ పెళ్ళి పెళ్ళేకాదు బంధువుల దృష్టిలో! నేను వాళ్ళకి ఏమౌతానని నన్ను తీసికెడతారు? ఈ నర్సమ్మత్తే లేకపోతే నేనేమైపోదునో?" సంధ్య లేచి వెళ్ళి ఓ చాప పట్టుకువచ్చి వేసి, "కూర్చోండత్తా!" అంది.
అరుణ్ సంధ్యమీదినుండి చూపు త్రిప్పుకోలేక పోతున్నాడు. సంధ్యని ఎప్పుడు గుర్తు తెచ్చుకొన్నా ఫ్రాకుల్లో కనిపించేది! ఆ అయిదారేళ్ళ పిల్లే మనసులో మెదిలేది! ఇప్పుడు ఆ సంధ్యని చూద్దామని వస్తే ఆ సంధ్య ఎక్కడుంది? పరిపూర్ణ యవ్వనవతి తనముందు సాక్షాత్కరించింది! అమాయకంగా చూసే ఆ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు అనుభవం పండినట్టుగా చూస్తున్నాయి! ఈ ప్రపంచంలో సుఖాలేవీ తనకి అందుబాటులో లేకపోతే మనిషి కళ్లలో ప్రతిఫలించే నిర్వేదం ఆ పిల్ల కళ్ళలోనూ కనిపిస్తూంది.
