మొగ్గరేకులు విప్పుకొని పువ్వుగా మారినప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా కనిపిస్తూంది సంధ్య. చిన్నప్పుడు ఆడి పాడి పోట్లాడింది ఈ సంధ్యతోటేనా అనిపిస్తూంది అరుణ్ కు. పసుపుబట్టల్లో, నుదుట కళ్యాణతిలకంతో ఎంతో బాగుంది సంధ్య. ఏ కృత్రిమత్వంలేని సౌందర్యం! ఇలాంటి సహజ సౌందర్యం తన ఇన్నేళ్ళ నగరజీవితంలో ఒకసారి కూడా కనిపించలేదు.
ఎవరో ఓ ముత్తయిదువు గాబరాగా వచ్చింది. "అయ్యో! గౌరీపూజ మీదినుండి లేచావేం? బ్రాహ్మడు పిలిచేవరకు గౌరమ్మమీద పూలు, కుంకుమ వేసి గౌరీ మంత్రం చదువుతూ కూర్చోవాలి!.... అయ్యో! గౌరమ్మ మీద ఒక పువ్వుగాని, కుంకుమగాని వేసినట్టులేదేం? ఏదో ఒక పెళ్ళంటూ చేసుకొంటున్నప్పుడు ఆ తాళికట్టినవాడి యోగక్షేమాల గురించి దేవిని ప్రార్ధించవద్దా ఏం?" అని ఓ దీర్ఘం తీసింది.
అరుణ్ కుతూహలంగా చూస్తున్నాడు సంధ్యను. ఆవిడ మాటలకు సంధ్య ముఖంలో ఏ భావం కనిపించడంలేదు. నిర్వికారంగా జానకమ్మ దగ్గర కూర్చొంది.
"ఎవరైనా నిన్నిలాచూస్తే బాగుండదు! వెళ్ళి గౌరీపూజలో కూర్చో! ముహూర్తం దగ్గరికి వచ్చేస్తూంది!"
"మీరెందుకు అంత హైరానా పడతారు? గౌరీపూజలుచేసినా, శంకరుడి పూజలు చేసినా ఈ ఇల్లు మెట్టిన ఆడదెవరూ ముత్తయిదువుగా గిట్టదట! ఈ ఇంట్లో పుట్టేది అర్దాయుష్యం మగాళ్ళూ, వెర్రివెంకయ్యలూ" సంధ్య ఉదాశీనంగా అంది.
"మరి అన్నీ తెలిసి ఎందుకు చేసుకొంటున్నావు సింహాన్ని?"
"ఎక్కడా గతిలేక!"
"కోడలుకాదు, కొరివిని కట్టుకొంటూంది మా నర్సమ్మ పిన్ని!" ఆవిడ ముక్కుమీద చోద్యంగా వేలుంచుకొని. ఆ సంగతి అందరికీ చెప్పాలన్నట్టుగా వడివడిగా వెళ్లిపోయింది.
"చెప్పండి అత్తా, ఏమేం విశేషాలు? అమ్మ నిన్నెప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ ఉండేది! 'పట్నం వెళ్ళి తన బంధువుల్లో పడిందిగా? ఇక మనం ఎందుకు జ్ఞాపకముంటాం?' అనేది. అన్నట్టుగానే మీరు ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా రాలేదు!"
"ఏం, అరుణ్? ఎప్పుడూ సంధ్య సంధ్య అంటూ కలవరించేవాడివి, వచ్చాక ఒక్క మాట కూడా మాట్లాడవేం?" చేతులు కట్టుకు నిశ్శబ్దంగా నిలబడిన కొడుకుతో అంది జానకమ్మ.
"తను మాట్లాడుతూందా? బాగున్నావా అని ఒక్కమాట అడిగితే ఏం?"
"ఆడపిల్ల కదరా? సిగ్గు పడుతూండాలి! ముందు నువ్వే మాట్లాడు!"
"నాకుండదా సిగ్గు?"
"సిగ్గుపడి బిగుసుకు పోవడానికేనా వచ్చింది? మగపిల్లాడివి! నువ్వే ముందు మాట్లాడించు! ఆనక అంతదూరం వెళ్ళి సంధ్యతో ఒక్క మాట మాట్లాడకుంటా వచ్చేశానే అని బాధపడతావు!"
"మీరు ఈ ఊరినుండి వెళ్లిపోయిన క్రొత్తలో మీకోసం ఎంత బెంగపెట్టుకొన్నానో! నిద్రలోకూడా అరుణ్ తో ఆడుకొంటున్నట్టుగా, పోట్లాడుతున్నట్టుగా కలవరించేదాన్నట." అంది సంధ్య.
"అమ్మయ్య! నా పేరు జ్ఞాపకముందన్నమాట. నన్నూ, నాపేరునూ మరిచిపోయావేమో అనుకొన్నాను." అరుణ్ ఒక నిట్టూర్పు విడిచాడు.
"నేనేం మరిచిపోలేదు. నువ్వు మరిచిపోయావేమోగాని." అరుణ్ ని తలెత్తి చూస్తూ అంది సంధ్య. అరుణ్ తను ఊహించుకొన్నట్టుగానే ఉన్నాడు. బాగా పొడుగయ్యాడు. ఖరీదైన బట్టల్లో హుందాగా ఉన్నాడు.
"మరిచిపోతే ఎందుకొస్తామూ?"
"ఇన్నేళ్ళ తరువాత రావడం కూడా ఒక రావడమేనా?"
"రావడం కాక మరేమిటి?"
ఇంతలో గున్నేనుగులా ఒకతడు గదిలోకి పరిగెత్తుకు వచ్చాడు. నుదుట నామం, బుగ్గన చుక్కా, ఊడిపోయిన గోచీ.
అతడి వెనకాలే నర్సమ్మగారు పరిగెత్తుకు వచ్చింది. "ఒరే! పంచె ఊడిపోతుందిరా. సరిగా కట్టనీ!" అంటూ దగ్గరికి వచ్చింది.
