"పన్నెండుసంవత్సరాల తరువాత వెడుతున్నాం. అక్కడి సంగతులేమీ తెలియవు! నువ్వేమో ఇంత అట్టహాసంగా తయారయ్యావు కానుకలతో." అన్నాడు అరుణ్.
"వాళ్ళది అదే ఊరేగా ఊరిడిచి ఎక్కడికి వెళతారు?"
మరునాడు ఉదయం తొమ్మిదిగంటలవుతూంది.
ఎర్రమట్టి దుమ్ములా పైకిలేస్తున్న బాటమీద అరుణ్ వాళ్ల కారు రాజానగరం సమీపిస్తుంది.
చుట్టూ అవే గుట్టలు. కొండలయ్య గుట్ట అన్నిటికన్నా ఎత్తుగా బాటకి ఇరువైపులా పచ్చగా పైరులు. వరిమళ్ళలో గలగలాపారే కాలవనీళ్ళు. బాటమీద వెడుతూంటే అదే పసురుగట్టి వాసన, చల్లటిగాలి. పన్నెండుసంవత్సరాలుగా స్మృతిపటలం మీద ఒకచిత్రంగా నిలిచిపోయినవి ఇవాళ యదార్దంగా అనుభవిస్తూ తృప్తిగా ఫీలవుతున్నాడు అరుణ్. "కొండలయ్య గుట్టకి వెళ్ళి ఆ రాళ్ళ మధ్య గెంతుతూ సీతాఫలాల చెట్టుకి పండిన పండ్లు తినాలనిపిస్తూందమ్మా!"
"దసరా వచ్చిందంటే ఇంటినిండా సీతాఫలాలు తెచ్చి పోసేవాళ్ళు బడిపిల్లలు. అవి పండినవి పండినట్లుగా పిల్లల్ని పిలిచి ఇచ్చేదాన్ని. ఎంత హాయిగా గడిచిపోయాయో ఆ రోజులు!" గతాన్ని నెమరు వేస్తున్నట్టుగా అంది జానకమ్మ.
ఊరు మరింత చేరువ అవుతున్నకొద్దీ ఇద్దరి హృదయాలూ ఉద్విగ్నతతో నిండిపోయాయి.
"సంధ్య బాగా పెద్దదై ఉంటుంది. మనల్ని గుర్తు పడుతుందో లేదో? నన్నసలు గుర్తు పట్టదనుకొంటాను!" అరుణ్ అన్నాడు.
"అప్పుడు పదేళ్ళ పిల్లవాడివి! సన్నగా, రివటలా ఉండేవాడివి చెబితే తప్ప నిన్నసలు ఎవరూ తెలుసుకోలేరు!"
ఊళ్ళోకి వచ్చేసింది కారు.
పెళ్ళి బాజాలు వాళ్ళకి స్వాగతం చెబుతున్నట్టుగా మ్రోగుతున్నాయి!
"వెంకట నర్సమ్మగారింటిముందు పెళ్ళిపందిరి వేశారు! వాళ్ళింట్లో ఎవరి పెళ్ళబ్బా? నర్సమ్మగారికి ఓ మతిలేని కొడుకు తప్ప ఎవరూ లేరే?" ఆలోచనగా అంది జానకమ్మ.
ముందుగా తామున్న ఇంటివైపు చూసింది. ఇల్లు కూలిపోయిన పాత గోడలు మాత్రం మిగిలి ఉన్నాయి. రుక్మిణి వాళ్ళ ఇల్లేమో తాళం పెట్టి ఉంది. జానకమ్మ వాళ్ళ ఆనందమంతా ఎగిరిపోయినట్టుగా అయింది.
చిన్నపిల్లలంతా కారుచుట్టూ మూగారు కుతూహలంగా చూస్తూ.
"ఆ ఇంట్లో మోహన్ రావు అనే ఆయన ఉండాలికదా? వాళ్ళెక్కడికి వెళ్ళారు?" ఓ కుర్రవాడిని ప్రశ్నించింది జానకి.
"అంటే రుక్మిణమ్మగారా?"
"అవును! రుక్మిణీ, వాళ్ళమ్మాయి సంధ్య...."
"ఇవాళ సంధ్యమ్మ పెళ్ళిగా? అదిగో ఆ ఇంట్లో!" నర్సమ్మగారి ఇల్లు చూపాడు.
"సంధ్య పెళ్లి ఆ ఇంట్లో ఎందుకౌతూంది?"
"నర్సమ్మగారి కొడుకునే చేసుకొంటూందిగా?"
"ఎవరు? ఆ తిక్క పిల్లాడా?"
"అవును! ఆ సిమ్మయ్యనే!"
తాము ఇక్కడ ఉన్నప్పుడు ఆ తిక్కపిల్లాడికి పదేళ్ళో పన్నెండేళ్లో! ఒంటిమీద బట్టల్లేకుండా, నాలికెప్పుడూ బయటపెట్టుకొని, తల్లి వెనకాలే తిరిగేవాడు. మాటలు నత్తిగా, అర్ధం కాకుండా మాట్లాడేవాడు! తల్లి తిట్టి కొట్టి బట్టలేస్తే చింపేసుకొనేవాడు. వాళ్ళింట్లో తరానికొకడు చొప్పున అలా పుట్టే ఆనవాయితీ ఉందట. నర్సమ్మగారికి వీడు పుట్టడం, భర్తపోవడం, ఆవిడ తిక్కపిల్లాడిని పట్టుకు బ్రతుకీడ్వడం అందరూ సానుభూతిగా చూసేవాళ్ళు ఆవిణ్ణి.
ఆ వెర్రి వెంగళాయికి పెళ్ళా? అదీ బంగారు బొమ్మలాంటి పిల్లతో!
పిల్లని వాడికిచ్చే బదులు గొంతు పిసికి ఏ బావిలోనైనా పడేస్తే సరిపోదూ? రుక్మిణికి ఏ మొచ్చింది? అంత గతిమాలిన స్థితిలో ఉందా!
ఆ దారిన ఒక ముసలమ్మ వెడుతూ ఆగింది. జానకిని పరిశీలనగా చూసి, "నువ్వు.... నువ్వు జానకమ్మవి కదూ? ఈ అబ్బాయి నీ కొడుకు కదూ?" అనడిగింది సంభ్రమంతో.
"అవును! జానకమ్మనే! బాగున్నావా రంగమణీ?" ఆవిడ గుడిలో సేవకురాలు.
