ఆ రోజు ఉదయం కొంతమంది ఆ పాటపాడుతూ వీధి వెంటవెళ్ళారు. స్కూలుకుపోతూ సుందరం చాలాదూరం వాళ్ళ వెంటేవెళ్ళాడు_ ఆ పాట వింటూ. ఒక రోడ్డు కలయికలో నిలబడి వాళ్ళు "వందేమాతరం" అని కూడా కేక పెట్టారు. రెండో రోడ్డు కలయికలో సుందరంకూడా "వందే_ మాతరం" అని కేకపెట్టి చాలా గొప్పపని చేసినవాడల్లే తృప్తి చెంది వాడు నేరుగా స్కూలుకు వెళ్ళాడు. ఆ తరువాత ఆ పాటపాడేవాళ్ళు ఎటు వెళ్ళారో వాడికి తెలియదు.
సుందరానికి ఏ పాటలైనా ఆసక్తే. వాళ్ళమ్మపాడే పాటలన్నీ వాడికివచ్చు. ఎప్పుడైనా భజనలు జరిగితే వెళ్ళి అక్కడవాళ్ళు పాడే తరంగాల్లో ముక్కలు విని పట్టుకునేవాడు.
సుందరంతోపాటు చదివే కుర్రాళ్ళల్లో ఒకడు రోజూ ప్రార్దన చదివేవాడు. వాడు "ఒక సూర్యుడు" "శ్రీమద్బాను." "ఎవ్వనిచే జనించు" అనే మూడుపద్యాల్లో కనీసం ఏరెండో రోజూ పాడేవాడు, క్లాసుమేష్టరు ఒక్కొక్కరోజున వాడిచేత ఇంకా ఒకటి రెండు పద్యాలు కూడా పాడించుకుని వినేవాడు. ఈ కుర్రాడిపేరు ప్రకాశం. వాడు ఇతరాత్రా పెద్ద తెలివిగలవాడు కాడుగాని సుందరం ప్రాణానికి వాడి సంగీతంలో చెప్పరాని ఆకర్షణ ఉండేది. ఈ ఆకర్షణ కొద్దీ సుందరం ప్రకాశంతో మంచి సావాసం చేశాడు. ప్రకాశానికి ఏమీ గర్వం లేకపోవటం చూసి సుందరానికి మరింత ఆనందంగా ఉండేది. వాడిసంగీతం చూసి మిగిలినవాళ్ళంతా ఎందుకు ముగ్దులుకారో సుందరానికి అర్ధమయ్యేదికాదు.
సుందరం క్లాసులో శివయ్య అని మేదరవాళ్ళబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి చాలా బీదవాడనీ, జీతం కట్టడనీ తెలిసినప్పుడు సుందరానికి వాడి మీద చాలా జాలి కలిగింది. అయినా శివయ్య ఎటువంటి ఇంటోఉంటాడో, వాళ్ళనాన్న, అమ్మా ఎట్లా ఉంటారో సుందరం కలలోకూడా ఊహించకలగి ఉండేవాడుకాడు.
ఒక శనివారంనాడు సీతమ్మగారు సుందరాన్ని ఆదినారాయణగారివెంట పంపింది. ఆదినారాయణగారు మార్కెటుకు పోతున్నాడు. దారిలో మేదరవాళ్ళిళ్ళదగ్గర చాటకొని ఇప్పించమని సీతమ్మగారు సుందరాన్ని ఆదినారాయణగారివెంట పంపింది. మేదర ఇళ్ళ మాట వచ్చినప్పుడు సుందరానికి శివయ్యజ్ఞాపకమే రాలేదు.
మేదర ఇళ్ళన్నీ పూరిగుడిసెలు. అందులోనూ చాలా చిన్నవి. పిల్లలు ఫరవాలేదుగాని, ఆదినారాయణగారంటి పెద్దవాళ్ళు లోపలికిపోవాలంటే బాగా వొంగిపోవాలి. ఈ గుడిసెల బయట మేదరవాళ్ళు_ఎక్కువగా ఆడవాళ్లు_కూచుని మేదర పని చేస్తున్నారు. ఆడవాళ్ళే గడలు చీలుస్తున్నారు, బద్దలు తీస్తున్నారు. వాళ్ళు అవలీలగా గడలను చీల్చటమూ, పలచగా బద్దలు తీయటమూ చూస్తే సుందరానికి ఎంతసేపైనా చూడ బుద్ధి అయింది. ఒక ముసలాడు పళ్ళిక అల్లుతున్నాడు. చిన్నచిన్న పిల్లలు కూడా విసనకర్రలూ, గంపలూ అల్లుతున్నారు. అక్కడక్కడా తడికలు పేర్చి ఉన్నాయి. కొత్తతడికలవాసన అంతటా చుట్టేసింది.
ఆదినారాయణ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్ళి, "చాట ఒకటి కావాలే," అన్నాడు ఆ ఆడమనిషి ఎవర్నో కేకేసింది. "చిన్నోడో" అని. శివయ్య ఇంటోనుంచి బయటకివచ్చాడు.
శివయ్యను చూసి సుందరం ఎక్కువ తెల్లబోయినాడో, సుందరాన్ని చూసి శివయ్య ఎక్కువ తెల్లబోయినాడోగురించి తెలియ గూడని రహస్యం సుందరానికి తెలిసిపోయినట్టు ఇద్దరూ బాధపడ్డారు. ఈ బాధ నుంచి శివయ్య త్వరగా కోలుకున్నా సుందరం ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేడు.
"చాటలు పట్టుకురారా," అన్నది శివయ్య తల్లి.
అంతదాకా రెప్పవాల్చకుండా సుందరాన్ని చూస్తూ నోటంట ఏమీ అనలేకుండాఉన్న శివాయ్య లోపలికెళ్ళి నాలుగుచాటలు, ఒకదాన్లో ఒకటిపెట్టి, తెచ్చాడు.
ఆదినారాయణ కాస్తబేరంచేసి. నాలుగు చాటలనూ జామున్నరసేపు పరీక్షించి, అయిదో చాట లేదని రూఢిచేసుకుని ఒకటికొని సుందరంచేత డబ్బులు ఇప్పించి, "ఏంరా, అబ్బాయ? నువింటికి పోతావా? నావెంట వస్తావా?" అని సుందరాన్ని అడిగాడు.
"నే నింటికిపోతా," అన్నాడు సుందరం చాటతీసుకుని.
ఆదినారాయణ వీపుతిప్పగానే శివయ్య ముందుకువచ్చి సుందరంచేతిలో చాట తీసుకోవటానికి ప్రయత్నిస్తూ, "నేను మీ యింటికి తెచ్చి పెడతా," అన్నాడు.
"వద్దోయ్." అన్నాడు సుందరం.
"కొంచెం దూరం తెచ్చి పెడతా" అన్నాడు శివయ్య దాదాపు చాట లాక్కుంటూ.
ఎందుకో సుందరానికి శివయ్యమీద అదివరకుగల జాలి గౌరవంగా మారింది. అటువంటి ఇంటో ఉంటున్నవాడు తనతో చదువుకుంటున్నందుకు జాలిచాలదు. శివయ్య క్లాసులో ఇపుడు పదోవాడు.
ఇద్దరూ కొంతదూరం మౌనంగా నడిచారు.
"ఆవిడ మీ అమ్మా?" అన్నాడు సుందరం.
"ఔను" అన్నాడు శివయ్య.
మరికొంతదూరం నడిచారు. సుందరం ఆగాడు.
"ఏం చేస్తునావు? చదువుతున్నావా?"
"ఔను"
"హోంవర్కు చేశావా?"
"నిన్న సాయంత్రమే చేశా"
కాస్సేపు మౌనం.
"రాత్రి చాలాసేపు చదువుతావా?"
"రాత్రిళ్ళు దీపాలు పెట్టుకోవడంలేదు. కిరసనాయిలు మండిపోతున్నది. ఒక సీసా ఇస్తారు."
"నే పోతానోయ్"
"పదండి"
"నన్ను ఏమండీ అనొద్దు. నాకు బాగుండదు" అన్నాడు సుందరం. తరువాత ఇంకోటి జ్ఞాపకం వచ్చింది వాడికి. "చాటా ఇచ్చెయ్యి."
"నేనుకూడా మీ ఇంటి దాకా వస్తాగా?"
"ఎందుకూ?"
"రాగూడదా?" శివయ్య పిరికిగా నవ్వాడు.
