"ఏంటి?" చికాకుగా చూస్తూ అడిగాడు రెండోవాడు.
మొదటివాడు రెండువేళ్ళు చూపించాడు.
"అర్జంటా?" ఇందాకటికంటే ఎక్కువగా విసుక్కుంటూ అడిగాడు రెండోవాడు.
మొదటివాడు అవునన్నట్టు తలూపాడు.
"అయితే వెళ్ళు" అన్నాడు రెండోవాడు.
"అమ్మో....ఒంటరిగా ఈ ఆసుపత్రిలో నేనెక్కడికీ వెళ్ళను. అయినా ఎక్కడుందో ఏంటో? నువ్వు కూడా రా...." అన్నాడు మొదటి వాడు.
రెండోవాడు తలపట్టుకున్నాడు. "సరే పద" అన్నాడు.
ఇద్దరూ అలా ప్రక్కకి లేచి వెళ్ళారోలేదో అక్కడికి డేవిడ్, జాకబ్ లు వచ్చారు. గది గుమ్మం ప్రక్కనవున్న డాక్టర్ సింగినాధం అనే బోర్డు చూశారు.
"ఇదేం రూం" అన్నాడు డేవిడ్.
అంతలో వార్డ్ బోయ్ గది తలుపు తీస్కుని బయటికి వచ్చాడు.
"డాక్టర్ సింగినాధంగారు.... హి హి హి.... ఉన్నారా?" వచ్చే నవ్వుని ఆపుకుంటూ అడిగాడు జాకబ్.
డేవిడ్ మళ్ళీ జాకబ్ పిర్రమీద గట్టిగా గిల్లేశాడు.
"సార్ లోపల బిజీగా వున్నారు. కాస్సేపయ్యాక పిలుస్తారు....కూర్చోండి" అని చెప్పి వెళ్ళిపోయాడు వార్డ్ బోయ్.
డేవిడ్, జాకబ్ లు బెంచీమీద కూలబడ్డారు.
లోపల....డాక్టర్ సింగినాధం గదిలో.
"ఓక్కేసార్....నేను వస్తాను" అంటూ లేచాడు మెడికల్ రిప్రజెంటేటివ్.
అతనిచ్చిన వాళ్ళ మందుల కంపెనీ శాంపిల్స్, బ్రోచర్స్ అన్నీ డ్రాయర్లో వేస్తూ "ఓక్కే...." అన్నాడు డాక్టర్ సింగినాధం.
మెడికల్ రిప్రజెంటేటివ్ బయటికి వెళ్ళిపోయాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
రిసీవర్ ఎత్తి "హలో!" అన్నాడు డాక్టర్ సింగినాధం.
అవతల గొంతు విని "గుడ్ మార్నింగ్ సార్! హౌ ఆర్ యూ?
ఓక్కే....ఓక్కే....అలాగే....ఇప్పుడే వచ్చేస్తా...." అని రిసీవర్ పెట్టేశాడు డాక్టర్ సింగినాధం.
అదే టైంలో జూనియర్ డాక్టర్ శ్రీనివాస్ క్యాబిన్ లోకి వచ్చాడు.
"సార్! మెడికల్ కౌన్సిల్ మీటింగేదో వుండట. మిమ్మల్ని...." డాక్టర్ శ్రీనివాస్ ఏదో చెప్పబోయాడు.
"అదే....ఇప్పుడు ఫోన్ వచ్చింది. నేనా మీటింగ్ కి అర్జంట్ గా వెళ్ళాలి. అన్నట్టు బయట బెంచిమీద యిద్దరు సోదిగాళ్ళున్నారు. ఇందాకంతా నా మెదడుని తినేశారు. వాళ్ళకి ఫ్యామిలీ ఫ్లానింగ్ ఆపరేషన్ చెయ్యాలి. నువ్వాపని అటెండ్ అవ్వు" అన్నాడు డాక్టర్ సింగినాధం.
"అలాగే సార్" అంటూ బయటికి వచ్చాడు డాక్టర్ శ్రీనివాస్.
"మీరు నాతో రండి" అన్నాడు డేవిడ్ తో డాక్టర్ శ్రీనివాస్.
"మీరేనా డాక్టర్ సింగినాధం?" నవ్వును ఆపుకుంటూ అడిగారు జాకబ్.
"నేను కాదు గానీ....డాక్టర్ సింగినాధంగారు నాకు మీ గురుంచి చెప్పారు. నా పేరు శ్రీనివాస్.
ఇద్దరూ శ్రీనివాస్ ని ఫాలో అయ్యారు.
"డాక్టర్ సింగినాధాన్ని మనం కలవనేలేదు. మరి ఆయన మన గురుంచి ఇతనికెలా చెప్పాడు?" సందేహంగా జాకబ్ అడిగాడు డేవిడ్ ని.
"నీకు ప్రతీదీ అనుమానమే! రిసెప్షనిస్టు డాక్టర్ సింగినాధానికి ఫోన్ చేసి మన గురుంచి చెప్పివుంటాడు" విసుక్కున్నాడు డేవిడ్.
"అంతే అయ్యుంటుందిలే...." తలకాయ్ ఊగించాడు జాకబ్.
డాక్టర్ శ్రీనివాస్ ఇద్దర్నీ ఆపరేషన్ థియేటర్లోకి తీస్కెళ్ళాడు.
* * * *
"ఇద్దరూ టేబుల్స్ మీద పడుకోండి" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
ఇద్దరూ ప్రక్క ప్రక్కనే వున్న రెండు టేబుల్స్ మీద పడుకున్నారు.
"ఇప్పుడు టెస్టులన్నీ చెయ్యాలా?" అడిగాడు డేవిడ్.
"టెస్టులెందుకూ? ఏ టెస్టూ అక్కర్లేదు...." అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
"ఏ టెస్టూ చేయకుండానే మమ్మల్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్కుంటారా?" అడిగాడు జాకబ్.
"అడ్మిషనా? నిమిషాల్లో అయిపోయేదానికి అడ్మిట్ అవడం ఎందుకూ?" ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.
డేవిడ్, జాకబ్ ఇద్దరూ కంగారుపడ్డారు. తాము నర్సింగ్ హోంలో అడ్మిట్ కాకపోతే రాంబాబు, చిన్నారావ్ లను చంపడం కష్టం.
"అది కాదండీ డాక్టర్ గారూ! మరేమో...." డేవిడ్ ఏదో చెప్పేంతలోనే డాక్టర్ శ్రీనివాస్ అతన్ని ప్రశ్నించాడు, "మీకు పిల్లలెంతమంది?"
"ఒక్కళ్ళుకూడా లేరు" చెప్పాడు డేవిడ్, మధ్యలో ఈ అనవసరమైన ప్రశ్నలెందుకా అని అనుకుంటూ.
"మరి మీకు?" జాకబ్ ని అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.
"నాకసలు పెళ్ళేకాలేదు" కులాసాగా చెప్పాడు జాకబ్.
"వెరీగుడ్! మీరు దేశ సంక్షేమం చాలా చాలా కోరే మనుషులన్న మాట! అంటే దేశభక్తులన్నమాట!" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
డేవిడ్, జాకబ్ లకి ఏం అర్ధంకాలేదు. ఇద్దరూ మొహమొహాలు చూస్కున్నారు అయోమయంగా.
"అదేనయ్యా బాబూ! మీరు జనాభా పెరక్కుండా చూస్తున్నారు కదా....అందుకని అలా అన్నాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
"అవును! నేను ఇప్పటికి ముప్పయ్ మందిని ఖతం చేశా!" గర్వంగా అన్నాడు జాకబ్.
"వాడి మొహం....వాడలానే పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. మీరేం పట్టించుకోకండి డాక్టర్ గారూ...." కంగారుపడుతూ అన్నాడు డేవిడ్.
డాక్టర్ శ్రీనివాస్ జాకబ్ వంక అయోమయంగా చూశాడు.
"అవును డాక్టర్.... నేనప్పుడప్పుడూ అలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడ్తాను....హిహిహి...." నవ్వాడు జాకబ్.
