అంతకముందు ధైర్యంగా ఎదురు నిల్చి తన చెంపకాయ పేలగొట్టే రాధ ఇప్పుడు బెదురుగొడ్డులా ఎందుకు పరుగుతీస్తోందో అర్థంకాక రాయుడు బిత్తరపోయాడు.
అంతలోనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది అతనికి.
"ఒరేయ్ గోపీ... నన్నే కొడ్తావ్ కదూ? ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఏం చేస్తానో చూడు." అనుకుంటూ పళ్ళునూరి రాధ వెంటపడ్డాడు.
20
గోపీ తన రిక్షాని ఒక పాత బట్టతో శుభ్రంగా తుడుచుకుని తర్వాత దేవుళ్ళ పటాలముందు కళ్ళు మూస్కుని చేతులూ జోడించి శ్రద్ధగా ప్రార్ధించాడు.
"స్వామీ... నా ఈ ఒక్క రిక్షా రెండు రిక్షాలై, ఆ రెండు రిక్షాలు నాలుగు రిక్షాలై, ఆ నాలుగూ ఎనిమిదీ, ఎనిమిదీ పదహారై ఆ రిక్షాలు ఒక ఆటో అయి ... ఆ ఆటో కొన్ని ఆటోలై, ఆ కొన్ని ఆటోలు ఓ టాక్సీ కావాలి స్వామీ."
గుక్క తిప్పుకోనంత అంత పెద్ద కోరిక కోరేసరికి గోపికి ఆయాసం వచ్చింది.
ఓసారి దేవుడి పటాలిలన్నింటివంకా పరవశంగా చూసి మరోసారి దణ్నం పెట్టుకున్నాడు.
అంతలో ఠపీమని దేవుడు ముందు వెలిగించిన దీపం ఆరిపోయింది.
"అపచారం... అపచారం..." గోపి లెంపలు వేస్కుని దీపాన్ని మళ్ళీ వెలిగించాడు.
ఇంతలో సరస్వతి అక్కడికి పరుగున వచ్చింది.
"ఏంట్నాయన ఇక్కడినుంచి ఛడీల్ అని పటాకులు పేలిన శబ్దం వచ్చింది?" అడిగింది సరస్వతి.
"పటాకులు కాదమ్మా. నేను లెంపలేస్కున్నానమ్మా... లెంప లేస్కున్నా" భారంగా పలికాడు గోపి.
"ఎందుకు బాబూ అంత చేటున లెంపలేస్కున్నావ్?" గోపివంక జాలిగా చూస్తూ అడిగింది.
"ఘోరం జరిగిపోయిందమ్మా... భయంకరమైన ఘోరం జరిగిపోయింది" జుట్టు పీకేసుకుంటూ అన్నాడు గోపి.
"ఏమైంది బాబూ... నీ రిక్షా టైరు పంక్చర్ అయ్యిందా?" హృదయం ద్రవించి పోతూండగా అడిగింది సరస్వతి.
"అంతకంటే ఘోరమే జరగిందమ్మా.... ఘోరమైన అపచారం జరిగిపోయిందమ్మా. దేవుడి దగ్గర దీపం ఆరిపోయిందమ్మా."
సరస్వతి దేవుడి పటాలవంక చూసింది.
"అదేంటి? దీపం వెలుగుతుందిగా?" అంటూ అడిగింది.
"అది నేను మళ్ళీ వెలిగించానమ్మా.... నా మనసెందుకో కీడును శంకిస్తుందమ్మా" చొక్కా నలిపేస్కుంటూ అన్నాడు గోపి.
"బాధపడకు బాబూ... దీపం గాలికి ఆరిపోయి వుంటుందిలే."
గోపికి సర్దిచెప్పి సరస్వతి కూడా దేవుడికి దణ్నం పెట్టింది.
"స్వామీ .... మా గోపి దగ్గర ప్రస్తుతం ఉన్న ఒకరిక్షా రెండు రిక్షాలై, ఆ రెండు రిక్షాలూ నాలుగు రిక్షాలై, ఆ నాలుగు ఎనిమిది, ఎనిమదీ పదారై, ఆ పదారు రిక్షాలూ ఒక ఆటో అయి... ఆ ఆటో కొన్ని ఆటోలై, ఆ కొన్ని ఆటోలు ఒక టాక్సీ కావాలి స్వామీ" అంది అర్ధనిమీలిత నేత్రాలతో దేవుడి పటాలవంక చూస్తూ.
"హర్రె!- నేనూ అచ్చం ఇలానే మెక్కుకున్నానమ్మా. నా మనసులోని కోరిక నీకెలా తెల్సు?" ఆశ్చర్యంగా, ఆనందంగా తల్లివంక చూస్తూ అడిగాడు గోపి.
"కన్నా కొడుకు మనసులోని మాట ఏ తల్లికి తెలీదు బాబూ... ఆ తల్లికి తెలీదు" ఆర్ద్రంగా పలికింది సరస్వతి.
"హమ్మా!"
ఆనందంగా లపక్కున తల్లిని వాటేసుకున్నాడు
సరస్వతి ఎముకలు కరకర శబ్దం చేశాయ్.
"అబ్బా-" బాధగా మూలిగింది సరస్వతి.
"హమ్మా ఏమైందమ్మా? ఎందుకమ్మా మూలిగావ్? డాక్టర్ని తీసుకురానా అమ్మా?" ఆందోళనగా అడిగాడు గోపి.
"సారీ అమ్మా."
గోపి తల్లిని వదిలిపెట్టాడు.
"అమ్మా నేనింక రిక్షా తోక్కుకోడానికి వెళతానమ్మా."
"ఆగు బాబూ దేవుడికి హారతిస్తా... హారతిని కళ్ళకు అద్దుకుని వెళ్దువుగాని" అని హారతి వెలిగించి దేవుడి పటలచుట్టూ తిప్పింది సరస్వతి. అలా తిప్పతుండగా హారతి హఠాత్తుగా ఆరిపోయింది. సరస్వతి చేతిలోంచి హారతి పళ్ళెం నేలమీదికి జారి పడిపోయి ఠణేల్ మని శబ్దం చేసింది.
"హయ్యో... అపచారం అపచారం" అంటూ చెంపలమీద పటాళ్ పటాళ్ మని వాయించుకుంది సరస్వతి.
"ఇందాక నేను చెప్తే విన్నావా?దేవుడిముందు దీపం ఆరిపోయిందే అమ్మా అంటే గాలికి ఆరిపోయిందని తేలికగా కొట్టిపారేశావ్. ఇప్పుడేమో నాకంటే గట్టిగా చెంపలు వాయించుకున్నావ్" అన్నాడు గోపి.
"నిజమేరా గోపీ. ఇదేదో అపశకునమే. నా కుడికన్ను అదుర్తూంది కూడా." అంది సరస్వతి ఆందోళనగా.
"అవునే అమ్మా... నాక్కూడా కుడికన్ను అదుర్తూంది" అన్నాడు గోపి.
"నీ మొహం - మగాళ్ళకి కుడికన్ను అదుర్తే అదృష్టం క్రింద లెక్క - అపశకునం అయితే నీకు ఎడమకన్ను అదరాలి. ఆలోచించి కరెక్టుగా చెప్పు."
గోపి రెండు క్షణాలు ఆలోచించి మరో నాలుగు క్షణాలు కళ్ళు మిటకరించి తర్వాత అన్నాడు "నువ్వు చెప్పింది నిజమేనమ్మా - నా ఎడమ కన్ను అదుర్తూంది" అన్నాడు.
సరిగ్గా అదే సమయంలో గాడి తలుపులు ధడేలుమని శబ్దం చేశాయ్.
గోపి, సరస్వతి ఉలిక్కిపడి తలలు తిప్పి చూశారు.
రాధ, తూలుతూ తూలుతూ గది మధ్యదాకా వచ్చి ధనేల్ మని నేలమీద బోర్లా పడిపోయింది.
"రాధా!"
బాధగా గావుకేక పెట్టాడు గోపి.
అ కేకకి సరస్వతి కొప్పు దడదడ అదిరింది. తర్వాత తమాయించుకుని సరస్వతికూడా గట్టిగా అరిచింది.
"అమ్మా రాధా."
తర్వాత ఇద్దరూ రాధ దగ్గరకు ఒక్క గెంతులో వెళ్ళి మోకాళ్ళ మీద ఆమె దగ్గర కూర్చున్నారు.
రాధ ఒంటిమీద చీరలేదు.
జాకెట్ వీపుమీద మొత్తం చిరిగిపోయింది. వీపుమీద గోటి రక్కులు వున్నాయి.
రాధ లంగా కూడా పీలికలు పీలికలుగా ఉంది. ఆమె లంగా రక్తంతో తడిచి వుంది.
రాధ మొహం మీదా చేతులమీదా, జబ్బలమీద కూడా గాట్లు ఉన్నాయ్.
రాధ నీర్సంగా మూలగసాగింది.
"రాధా! ఏమైంది రాధా...?" రాధ భుజాలు పట్టి కుదుపుతూ కంగారుగా అడిగాడు గోపి.
గోపి వంక ఓసారి తలెత్తి చూసి "హేవండీ అంతా అయిపోయిందండీ. అంతా అయిపోయింది!" అంటూ ఘొల్లుమంది రాధ.
"ఏంటి రాధా - సరిగ్గా చెప్పు రాధా. నీచీర ఏది రాధా? ఒంటిమీద ఈ రక్కులు ఏంటి రాధా? నీ లంగా ఇంత ఘోరంగా ఎలా చిరిగింది రాధా? ఈ రక్తం ఏంటి రాధా?" అన్నాడు ఆందోళనగా.
"హి... వం... డీ" వెక్కుతూ అని భోర్ ర్ మంది రాధా.
" చెప్పు రాధా! ఏమైంది రాధా" గోపి తల్లడిల్లిపోతున్నాడు.
"హోరి సన్నాసి వెధవా! నువ్వు మరీ ఇంత తెలివితక్కువ వాడివేంట్రా? దీన్ని ఎవడో రేప్ చేసుంటాడు. ఒంటిమీద అ రక్కులూ, చిరిగిపోయిన అ బట్టలూ కనిపించడం లేదూ?" అంటూ గోపి టెంకిమీద ఒక్కటిచ్చింది సరస్వతి.
"అబ్బా? అసలే నేను టెన్షన్ టో చస్తుంటే మధ్యలో ఈ టెంకిమీద కొట్టడాలు ఏంటమ్మా?" అసహనంగా తల్లితో అన్నాడు గోపి. మళ్ళీ రాధవంక తిరిగి "చెప్పు రాధా చెప్పు ఏం జరిగింది? నీ పరిస్థితి ఇలా ఎందుకుంది? కొంపదీసి నీళ్ళకోసం చెరువుకి వెళ్ళకుండా మునిసిపల్ పంపు దగ్గరికి వెళ్ళావా? అక్కడ నీళ్ళు పట్టుకోవడం గురించి మీ ఆడాళ్ళ మధ్య తగువొచ్చి కొటుకున్నారా? చెప్పురాధా" అన్నాడు.
"కాదండీ" బావురుమంది రాధ.
"మరేంటి?నీకీ పరిస్థితి ఎందుకు కలిగింది?"
"హేవండీ రా... యు... డు.... బేర్ ర్" వెక్కుతూ వెక్కూతూ రాయుడు పేరు చెప్పి ఘొల్లుమంది రాధ.
