"ఆ?రాయుడు? చెప్పు రాధా రాయుడేం చేశాడు" అరుస్తున్నట్టుగా కంగారుగా అన్నాడు గోపీ.
"నేనిందాకే చెప్పానా? వాడెవడో దన్ని రేప్ చేశాడనీ? ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేస్కోలేని నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా సన్నాసీ" అంటూ మళ్ళీ గోపి టెంకిమీద ఒక్కటిచ్చింది సరస్వతి.
"హబ్బా!" గట్టిగా అరిచాడు గోపి. "ఏంటమ్మా అసలే నేను టెన్షన్ టో చస్తూ ఉంటే?"
"హేవండీ మరేమో రాయుడేమో-"
సగంలో ఆపేసి కుళ్ళికుళ్ళి ఏడవసాగింది రాధ.
"ఆ? రాయుడు? చెప్పు రాధా ప్లీజ్! నన్నిట్టా చంపకు రాధా" గోపి జుట్టు పీక్కున్నాడు.
"నేను చెప్పలేనండి చెప్పలేను." కేర్ ర్ మంది రాధ.
గోపి మొహం సడెన్ గా గంభీరంగా మారిపోయింది.
"అక్కర్లేదు రాధా నువ్వేమీ చెప్పనక్కర్లేదు. నాకు అర్ధం అయిపోయింది. ఆ రాయుడు నిన్ను పాడుచేశాడు రాధా... పాడు చేశాడు" గంభీరంగా అన్నాడు గోపీ.
"హేవండీ" బాధగా అరిచింది రాధ.
"బాధపడకు రాధా బాధపడకు. ఇందులో నీ తప్పేం లేదు రాధా"
"హేవండీ."
"తప్పంతా ఆ రాయుడిది రాధా. నీ శరీరం అపవిత్రం అయ్యింది గానీ."
"ఎహ్హేవండీ."
"నీ మనస్సు మాత్రం గుడిలోని దేవతావిగ్రహం కంటే పవిత్రమైనది రాధా."
"ఏవండీ! కాస్త నన్ను కూడా మాట్లాడనివ్వండీ" వేడుకుంటూ అంది రాధ.
"ఏంటి రాధా? ఏంటి చెప్పు!" అడిగాడు గోపి.
"రాయుడు నన్ను రేప్ చేయలేదండీ." వెక్కుతూ చెప్పింది రాధ.
"మరి ఈ అవతారం ఏంటి రాధా?"
"రాయుడు నన్ను రేప్ చేయలేదుగానీ నన్ను రేప్ చెయ్యాలన ప్రయత్నించాడు.నేను చాలా ప్రతిఘటించి పెనుగులాడి వాడిమొహం మీద ఒక్క తాపుతన్ని పారిపోయి వచ్చేశానండీ. కానీ అంతా అయిపోయిందండీ." ఘొల్లుమంది రాధ.
"వాడు రేప్ చెయ్యలేదని అంటున్నావ్ మళ్ళీ అంతా అయిపోయిందని అంటున్నావ్. అసలు దీనికి మీనింగ్ ఏంటి? నాకు అర్థం అయిచావడంలేదు. త్వరగా చెప్పు."
చొక్కా చింపేసుకుంటూ, పళ్ళు నూర్తూ అన్నాడు గోపీ.
"ఆ పెనుగులాటలో నాకు అబార్షన్ అయిపోయిందండీ." ఘొల్లుమంది రాధ.
"కెవ్వ్" అని అరుస్తూ సరస్వతి మూర్చపోయింది.
21
కొన్ని క్షణాలపాటు గోపి దిమ్మెరపోయాడు.
అతని నోటివెంట మాట రాలేదు. అచేతనంగా అలా నిలబడిపోయాడు.
కాస్సేపయ్యాక తేరుకున్న గోపికి తన పొరపాటు గుర్తుకు వచ్చింది.
తల్లి తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి కెవ్వుమని అరచి మూర్ఛపోయింది. మరి తనో?
గోపి క్షణంపాటు సిగ్గుతో చితికిపోయి తర్వాత తను కూడా 'కెవ్ వ్' మని అరిచాడు.
ఆ వెనువెంటనే మూర్చపోబోయాడు. కానీ తన రియాక్షన్ అసలు అలా వుండకూడదని గ్రహించి నాలుక కరుచుకున్నాడు.
రాధ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
గోపీలో సంచలనం మొదలయింది. ఇప్పుడసలు తను ఎలా ప్రతి స్పందించాలో అలానే ప్రతిస్పందిస్తున్నాడు. అతని కళ్ళు క్రమక్రమంగా ఎర్రబారసాగాయి.
అతని పిడికిళ్ళు బిగుసున్నాయ
అతని పళ్ళు పటపట శబ్దం చేసాయ్...
ఆ కేకకి రాధ ఉలిక్కిపడి ఏడుపాపేసింది.
సరస్వతి మూర్ఛలోంచి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది.
"ఒరేయ్ రాయుడూ. నీ అంతు చూస్తాన్రా. నీ రక్తం కళ్ళచూడందే నిద్రపోనురా." గట్టిగా అరచి ఆ తర్వాత ఆవుళించాడు గోపి.
రాధ మళ్ళీ కుళ్ళికుళ్ళి ఏడవడం మొదలుపెట్టింది.
గోపి దృష్టి రాధమీద పడింది.
రాధ దైన్యస్థితికి అతని మనసు కరిగిపోయింది.
"రాధా..." బాధగా అంటూ రాధని దగ్గరకు తీసుకున్నాడు గోపి.
"ఈ బాధను ఎలా భరిస్తున్నావు రాధా. ఎలా భరిస్తున్నావు?"
"నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్ధలు అవుతున్నాయండీ. నా హృదయంలోంచి కణకణలాడే బుస్సున ఎగచిమ్ముతూ ఉందండీ. ఎగజిమ్ముతూ వుంది." అంది రాధ ఆవేశంగా.
గోపీ చటుక్కున రాధని వదిలిపెట్టి దూరంగా జరిగాడు. అసలే అగ్ని పర్వతాలూ, లావాలూ అంటుంది. తన ఒళ్ళు ఎక్కడ కల్తుందోనని అతనికి భయం వేసింది.
"హేవండీ. నన్ను ముట్టుకున్న ఆ పాపిష్టి చేతుల్ని మీరు నరికి పోగులు పెట్టాలండీ." ఆవేశంగా అంది రాధ.
"అంతేకాదు నాయనా. రాధ చీరా, లంగా చింపేసాడుగా. ఆ డబ్బులు కూడా వాడి దగ్గర్నుండి వసూలు చెయ్." అంది సరస్వతికూడా యమ ఆవేశంగా.
"నువ్వు మరో విషయం మర్చిపోయావమ్మా." గోపి కూడా ఆవేశంగా అన్నాడు.
"ఏంటి బాబూ?"
"వాడు చీరా లంగాలతోపాటు జాకెట్టు కూడా చింపేసాడమ్మా." జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపీ.
"హేవండీ..." బేర్ ర్ మంది రాధ బాధగా.
"ఆ జాకెట్టు డబ్బులు కూడా వసూలు చేస్తానమ్మా వాడి దగ్గర్నుండి."
"శభాష్. గోపి" గోపి భుజం తట్టింది సరస్వతి.
"జాకెట్టు లంగాల సంగతి సరేనండీ. ఎలాగైనా వసూలు చేయ్యొచ్చు. కానీ.... నీ పోయిన నా గర్భం ఎలా వస్తుందండీ?
బావురుమంటూ అంది రాధ.
"ఎందుకు రాదూ? నీ లంగా జాకెట్లలాగానే అది కూడా. నీ గర్భం పోగొట్టినందుకు మళ్ళీ ఆ రాయుడినే నీకు గర్భం తెప్పించమంటా..." పళ్ళు నూర్తూ అన్నాడు గోపి.
"ఓరి సన్నాసెదవా? ఏం మాట్లాడ్తున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?" అంది సరస్వతి బుగ్గలు నొక్కుకుంటూ.
తన పొరబాటు గ్రహించిన గోపి "హర్రె" అని నాలుక కరుచుకున్నాడు.
"హేవండీ! మనకి అబ్బాయి పుడ్తాడనీ, వాడచ్చు మీలాగే ఉంటాడనీ ఎన్ని కలలు కన్నానండీ" జడ పీచులు పీచులుగా పీకేసుకుంటూ అంది రాధ.
గోపి వెంటనే ముక్కు పొంగించాడు. తర్వాత బుస్సున నిట్టూర్పు వదిలి కిటికీ దగ్గరకు భారంగా నడిచాడు.
ఆ తర్వాత కిటికీలోంచి ఎక్కడికో దూరంగా శూన్యంలోకి చూస్తూ మరోసారి బుస్సున నిట్టూర్చాడు.
ఆ తర్వాత మెడపైకెత్తి చొక్కా కాలరు నలిపేస్కుంటూ బాధగా అన్నాడు.
"నువ్వే కాదు రాధా. నేను కూడా ఎన్నో కలలు కన్నాను. నీకు అందమైన పాప పుడ్తుందనీ, దానికి అద్దాలు కుట్టిన బుల్లిబుల్లి లంగా జాకెట్టులు రోజూ నేనే తొడిగి దానికి స్వయంగా నేనే స్నానం చేయించి పౌడరు పూసి తయారు చేయాలనీ, మన పాపను అల్లారుముద్దుగా పెంచి దానికి సంగీతం, డాన్సూ నేర్పించి స్టేజిమీద థైమని డాన్సు చేయించాలనీ చాలా చాలా కలలు కన్నాను"
"ఎహ్హేవండీ" గోపీ మాటలకు కుమిలిపోతూ అంది రాధ.
"ఒకవేళ కొడుకు పుడ్తే వాడిని పెంచి పెద్దచేసి నాలాగే ఓ చక్కని రిక్షావాడిగా తీర్చిదిద్దాలని ఎన్ని ఆశలు పట్టుకున్నానో? అప్పుడు సాయంత్రం మనం షికారు వెళ్ళాలని అనుకుంటే వాడే మనల్ని తన రిక్షాలో కూర్చోబెట్టుకుని ఊరిచివరికి తొక్కుకెళ్తాడనీ" చెప్పుకుపోతున్నాడు గోపి.
"హేవండీ! ఇంక చాలండీ. మీరు చెప్పే సోదంతా విని భరించే శక్తి ఈ చిన్ని గుండెకు లేదండీ. లేదు. బేర్ ర్ ర్..."
హృదయవిచారకంగా ఏడవసాగింది రాధ.
* * *
వరండాలో కూర్చుని రాయుడు తాపీగా పొగాకు కాడ చుట్టుకోసాగాడు. సంతానం ప్రక్కనే నిలబడ్డాడు.
"ఒరేయ్ సంతానం" మెల్లగా పిలిచాడు రాయుడు.
"అయ్" పలికాడు సంతానం.
"పొగాకు ఎలా ఉందోయ్"
"ముక్కు బద్దలయి పోతూందండీ"
