"అప్పుడే వెళ్ళిపోతావా గోపీ?" దీనంగా మొహంపెట్టి అడిగింది ఆమె.
"మళ్లీ రేపొస్తాగా!" ఆమెను దగ్గరకు తీస్కుని తలనిమురుతూ అన్నాడు గోపి.
"గోపీ...."
గోపీ ఛాతికి బల్లిలా అతుక్కుపోతూ అంది సీతాలు.
"సీతాలూ..."
గోపీయేమో సీతాలును తొండలా పట్టుకుంటూ అన్నాడు.
"నేనంటే నీ కిష్టమేనా గోపీ?...." మెల్లగా అడిగింది సీతాలు.
"ఎందుకు లేదు సీతాలూ... నువ్వంట నాకు చాలా ఇష్టం...." అన్నాడు గోపీ సీతాలు చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కుని ఆ రెండు చేతుల్తో సీతాలు వీపుని అదేపనిగా ప్రేమగా రుద్దేస్తూ (నిముర్తూ).
"చాలు గోపీ... నాకీ జన్మకి చాలు..." తృప్తిగా అంది సీతాలు.
"అయితే నన్నింకా నీ వీపు రుద్దొద్దని అంటావా సీతాలూ?" బాధగా అన్నాడు గోపీ సీతాలు వీపు రుద్దడం ఆపి.
సీతాలు కిలకిలా నవ్వింది.
"ఎబ్బే... నేను ఈ జన్మకి చాలు అని అన్నది నా వీపు రుద్దడం గురించి కాదు గోపీ...."
"మరి?....."వెర్రి మొహం వేస్కుని అడిగాడు గోపి.
"నీకు నేనంటే చాలా ఇష్టం అని అన్నావుగా... అది ఈ జన్మకి చాలు అని అంటున్నా..."
"సీతాలూ.... నువ్వెంత మంచిదానివి సీతాలూ..." మళ్లీ సీతాలు వీపు రుద్దుతూ అన్నాడు గోపి.
"నువ్వు కూడా గోపీ...."
"సిహ్హీతాలూ-" ఆవేశంగా అన్నాడు గోపి.
సీతాలు ఒక్క మూలుగు మూలిగి తర్వాత అడిగింది.
"గోపీ - ఈ బంధం ఇలానే కలకాలం నిలుస్తుందా?"
"జన్మజన్మలకూ మన బంధం నిలుస్తుంది సీతాలూ-" అన్నాడు గోపీ సీతాలు బుర్రకాయ్ ని రెండు చేతుల్తో అప్యాయంగా నిముర్తూ.
"చాలు గోపీ చాలు - ఈ జన్మకిది చాలు-" పరవశంగా అంది సీతాలు.
"ఏంటీ?- నేను ఈ జన్మజన్మలకూ మన బంధం నిలుస్తుందని అన్నానని అలా అమున్నావా?-" ఇంకా పరవశంగా అడిగాడు గోపి.
సీతాలు పకపకా నవ్వింది.
"చూశావా - నువ్వు పప్పులో కాలేసేలా ఎలాచేశావో - ఈ జన్మకిది చాలు అని ఈసారన్నది అందుక్కాదు-" మళ్ళీ ఫక్కుమంది.
"మరి?" తెల్లబోతూ అడిగాడు గోపి.
"నువ్వు నా బుర్రకాయ్ రుద్దుతున్నావ్ కదా- అలా రుద్దుతుంటే చాలా హాయిగా ఉంది గోపీ - ఎందుకంటే తలంతా పేలు కొరికి దురదగా ఉంది కదా..." అంది సీతాలు కిలకిలా నవ్వుతూ.
"ఓ - అదా?-" అంటూ గోపి కూడా నవ్వుతో శృతి కలిపి సీతాలుని వదిలిపెట్టాడు.
ఆ తర్వాత సీతాలువంక చూసి డంగైపోయాడు గోపి.
"ఏంటి సీతాలు - నీ బుర్రకాయ్ అలా ఉందేమిటి ఉడత పీకిన తాటి టెంకలాగా" హశ్చర్యంగా అడిగాడు.
"మరి ఉండదా ఏంటీ? నా బుర్రకాయ్ మీద నీ రెండు చేతులూ పెట్టి తెగ నిమిరేశావ్ గా?" చిరునవ్వు నవ్వుతూ అంది సీతాలు.
"ఓ - అదా?" గోపీ నవ్వాడు. "సరే సీట్లూ ఇంక నేనొస్తానేం?" అన్నాడు.
"రేపు మళ్ళీ తప్పకుండా రావాలి!" అంది సీతాలు.
"ఓ.... తప్పకుండా వస్తా."
గోపి సీతాలుకి టాటా చెప్పి వెళ్ళిపోయాడు.
గోపి అలా వెళ్ళాడో లేదో ఇహ సంతోషం పట్టలేక గిలగిల్లాడిపోయింది సీతాలు.
"హంతే!.... చీర మోకాలు పైకిలాగి ఒక్కసారిగా చెంగున గాల్లోకి దూకి"హెయ్ య్ ..." అని అరిచింది సీతాలు.
తర్వాత దిక్కుతోచని దాన్లా అటూ ఇటూ పరుగులు పెట్టి.... సడ్డెన్ గా బయటికి బులెట్ దూసుకువచ్చింది.
అలా గుడిసెలోంచి బయటికి దూసుకురాంగానే సీతాలు కళ్ళకి ఆవు గంగ కనిపించింది.
సీతాలు ఆ ఫళాన గంగ పీకుచ్చుకుని గట్టిగా కావలించేస్కుని ఆనందం పట్టలేక పటెత్తుకుంది.
"నేనంటే ఇష్టమంట ఓయమ్మా...
నా ఒళ్లంత జిల్లంది ఓయమ్మా...
నన్ను కావలించుకున్నాడు
నా ఒళ్ళంతా తడిమాడు
ఆడి జిమ్మడ - ఆడి సోకుమాడ
ఆడే నా జతకాడు ఓయమ్మా
నా ఒళ్ళంత జిల్లంది ఓయమ్మా..."
సీతాలు పీకుచ్చుకుని పాడ్డంచేత పాటంతా అయ్యేసరికి ఆవుకి ఊపిరాడక -
"అంభే -అంభే-అంభే-" అంటూ దగ్గీ దగ్గీ సొమ్మసిల్లి పడిపోయింది.
* * *
రాధ మూలకున్న ఇత్తడి బిందెను చంకకెత్తుకుంది.
అది చూసి గోపి కంగారుగా అరిచాడు.
"ఏంటి రాధా-ఏంటి?- ఆ బిందెని అక్కడ పెట్టెయ్-"
రాధ కంగారుగా బిందెను కిందపెట్టేసి, బిందెవంక బెదురు బెదురుగా చూసింది.
"ఏంటండీ?- ఎందుకలా అరిచారు?? బిందె మీద ఏ బొద్దింకో ఉందేమో అని హడలి చచ్చాను-" అంది రాధ చివరికి.
"నేను అందుకని కాదు రాధా అరిచింది - ఇప్పుడు నువ్వు అంతంత బరువులు మొయ్యొచ్చా అని?-" అన్నాడు గోపి.
"అబ్బే - ఇది ఖాళీ బిందేనండీ?" అమాయకంగా అంది రాధ.
"ఆ బిందె ఇప్పుడు ఖాళీగానే ఉందిలే - కానీ నువ్విప్పుడు చెర్లో నీళ్ళు ముంచుకురావడానికేగా వెళ్తుంది - అప్పుడు బరువుగానే ఉంటుందిగా-?"
"ఏం పర్లేదులెండి - నాకిప్పుడు మూడు నెల్లేగా?" అంది రాధ క్రిందనున్న బిందెని మళ్ళీ చంకనెత్తుకుంటూ.
"అంతేనంటావా?-" అన్నాడు గోపి.
రాధ తల ఊపింది.
"సరే వెళ్ళు-"
రాధ అడుగులు వెయ్యగానే గోపి గావుకేక పెట్టాడు.
రాధ ఉలిక్కిపడింది.
"మళ్ళీ ఏమొచ్చిందండీ?" అడిగింది రాధ.
"ఏంలేదు - ఓ సారిలా రా-
రాధ గోపి దగ్గరకు వెళ్ళింది.
గోపి ఓసారి రాధ పొట్టని ప్రేమగా నిమిరాడు. ఆ తర్వాత పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు-
ఆ తరవాత రాధ పొట్టవంక ప్రేమగా చూసి "హిహిహి-" అని నవ్వాడు.
"ఇంక వెళ్ళనా?" ముసిముసిగా నవ్వుతూ అడిగింది రాధ.
"అలాగే-" అన్నాడు గోపి.
రాధ రెండడుగులు ముందుకు వెయ్యగానే ఓ పెద్ద ఘోరం జరిగిపోయింది.
రాధ చేతిలో బిందె జారి 'ఠనాళ్' మని నేలమీద పడింది
బిందె అలా చెయ్యి జారి పడటంతో రాధ మనసు కీడును శంకించింది.
బాధపడ్తూ క్రిందికి వంగి బిందెను చేతిలోకి తీస్కుంది.
బిందెకి పెద్ద సొట్టపడింది.
రాధ కుడికన్ను అదిరింది.
ఏంటీ విపరీతం? - అనుకుంది.
"ఏంటి రాధా అంతగా బాధపడ్తున్నావ్? - బిందె పొట్ట పడితే పడిందిలే నీకు వేరే బిందెని నేను కొనిపెడ్తాగా?...." అన్నాడు గోపి.
రాధ ఓసారి భారంగా నవ్వి అంతకంటే భారంగా ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టింది.
చెరువు దాకా ఏవేవో ఆలోచనలతో బాధపడ్తూ నడిచింది.
చెరువులో బిందెను ముంచిన రాధకు ఒక బొంగురు గొంతు వినిపించింది.
"నా దాహం తీరుస్తావా?"
చటుక్కున తలెత్తి చూసింది రాధ.
ఎదురుగా రాయుడు.... క్రూరంగా నవ్వుతూ.
అంతే... రాధ బిందెని వదిలిపెట్టి ఒక్కసారిగా పరుగు తీసింది.
