సాయంత్రం వేళ ఉష ఎక్కడికో వెళ్ళింది. గీత ఇంటి పని పూర్తీ చేసుకుని తీరిగ్గా కూర్చుంది. వీధిలో కాయితాలు కొనుక్కునే వాడు వెళ్తుంటే లోపలికి రమ్మని పిలిచింది. అలమారా లో తెలుగు డెయిలీ పేపర్లు ఎత్తుగా పేరుకుని ఉన్నాయి. గీత వాటన్నిటి నీ క్రిందకు దించి వరండా లోకి తెచ్చింది. కాయితాల వాడు గొనె సంచి లో నుంచి త్రాసు బైటికి తీసి ఒక పక్కన పడేశాడు. కాగితాల్ని చేతిలోకి తీసుకుంటూ నలిగిపోయిన వాటిని సవరిస్తున్నాడు.
"ఇంట్లో ఉంటారో, ఉండరో అని అనుమానిస్తూ వచ్చాను సుమండీ!"
గీత తలెత్తి చూసి సంతోషంగా నవ్వింది. మోహన్ నవ్వుతూ నిలబడ్డాడు. గీత కుర్చీ తెచ్చి వేస్తూ "కూర్చోండి! ఎక్కడా కనపడ్డం మానేశారే?' అంది.
"ఊళ్ళో లేను. వైజాగ్ వెళ్ళాను...." అన్నాడు మోహన్ కుర్చీలో కూర్చుంటూ.
గీత కళ్ళు పెద్దవి చేసి చూసింది.
"వైజాగా? నన్ను వెళ్ళవద్దు అని మీరెందుకు వెళ్ళినట్టు?"
మోహన్ గీత చూడకుండా నాలిక కొరుక్కున్నాడు.....
సుధాకర్ ఉత్తరం చూశాక తన గుండె నీరై పోయింది.... కళ సుధాకర్ ను ప్రేమిస్తుందో లేదో? బావనే పెళ్ళి చేసుకోవాలనుకుంటూన్నదేమో? వైజాగ్ వెళ్తే పరిస్థితి ఎలా ఉందొ పసి కట్టొచ్చు. అందుకని పని కట్టుకుని ఉత్తరం అందిన మర్నాడు వైజాగ్ చేరుకున్నాడు. గీతకు అనుమానం కలగకుండా మాటల మధ్యలో బావగాడి ఎడ్రస్ కనుక్కున్నాడు కాబట్టి సునాయాసంగా ఆ ఇంటి గుర్తు పట్టగలిగాడు. సి.ఐ.డి పని చేద్దామని ఇంటి ముందు తచ్చాడుతూ ఉండేటప్పటికీ గీత చెల్లెలు వీధిలోకి వచ్చింది. చిత్రను చూసేసరికి తనకు కొండంత సంతోషం వేసింది. ఆ అమ్మాయిని మచ్చిక చేసుకుని మెల్లిగా పరిస్థితి ఏ విధంగా ఉన్నదీ తెలుసుకోవచ్చు ననుకున్నాడు.... కాని చిత్ర గంబీరంగా ముఖం పెట్టి విసవిసా నడుస్తుంటే తనకు భయమేసి వెనక దీశాడు....
ఆ తర్వాత అనుకోకుండా కళ, శేఖర్ సినిమా హల్లో కనిపించారు. కళ బావ గాడితో సరదాగా కబుర్లు చెబుతున్నది . తన మనస్సు కలుక్కుమన్నది. సుధాకర్ గనుక ఈ దృశ్యం చూస్తె ప్రాణాలతో ఉంటాడా?.... సుధాకర్ ఇంక కళ మీద ఆశలు పెట్టుకోవటం నిష్ప్రయోజనం. వాళ్ళిద్దరికీ తన చేతుల మీదగా పెళ్ళి చేయిస్తానని మాటిచ్చాడు తను. ఇప్పుడు సుధాకర్ కు విషయం ఇలా ఉన్నదని ఏ ముఖం పెట్టుకుని వ్రాస్తాడు? వైజాగ్ ఎందుకోచ్చానా అని తనను తాను తిట్టుకున్నాడు. వైజాగ్ లో ఉండి తనింక చేయగల్గిందేమీ లేదు కూడా. అందుకని వెంటనే రైలెక్కి మద్రాసు చేరుకున్నాడు. పాపం? సుధాకర్! బావగాడి అడ్డం ఎలా తొలగించటం? ఏదో ఆలోచించాలి.....
"మాట్లాడకుండా అలా చూస్తారేం?" అంది గీత తీక్షణంగా చూస్తూ.
"ఆ! .... మా స్నేహితుడు తనతో పాటు వైజాగ్ రమ్మంటే వెళ్ళాను...." అంటూ క్రిందకు వంగి , ఒక పేపరు చేతిలోకి తీసుకున్నాడు.
"పేపర్లు అమ్ముతున్నారా?"
"రెండు నెల్లా క్రితం నుంచి అలా పేరుకుపోయి ఉన్నాయి. వాటిని వదుల్చుకునేంత వరకు చిరాగ్గా ఉంది....." అని జవాబిచ్చింది గీత చేత్తో పేపర్ల మీది దుమ్ము గట్టిగా దులుపుతూ.
మోహన్ ఇందాకటి పేపరు క్రింద పడేసి మరో పేపరు చేతిలోకి తీసుకున్నాడు . పేపరు తిరగేస్తూ చటుక్కున ఆగిపోయాడు.
"ఇది.... చూ...శా....రా?"
అంటూ వణుకుతున్న చేతులతో మోహన్ ఒక ఫోటో కేసి చూపించాడు.
గీత చూసింది.
"కనబడుటలేదు' శీర్షిక క్రింద అస్పష్టంగా ఒక ఫోటో ఉంది. పదిహేను, పదహారేళ్ళ వయస్సు అబ్బాయి ఫోటో అది.
"ఏముందక్కడ? రోజు కిలాంటివి సవాలక్ష చూస్తూనే ఉంటాం. మీరెందుకలా వణుకుతారు?" అంది ఆశ్చర్యంగా చూస్తూ.
మోహన్ నీరసంగా తల పట్టుకుని "అది నా ఫోటో!" అన్నాడు.
గీత మరీ ఆశ్చర్యపోయింది. మరొక మాటు ఫోటో కేసి తేరిపార చూసింది.
"మీకేం మతిపోయిందేమిటి? చిన్న పిల్లాడి ఫోటో పట్టుకుని మీదే నంటారు?' అంది.
మోహన్ తల మీది నుండి చేతిని తీసేశాడు. ఫోటో చుట్టూ చేత్తో గీస్తూ "ఇది నా ఫోటో అని చెప్తున్నాను. నమ్మండి!" అన్నాడు జాలిగా ప్రాధేయపడుతున్నట్టు.
గీత మళ్ళా నవ్వింది.
"సినిమా పత్రికల్లో ఫోటో క్విజ్ లని వేస్తుంటారు చూశారా? అలా మీ చిన్నప్పటి ఫోటో వేయించుకున్నారా?"
మోహన్ నిట్టూర్చాడు.
"అది నేను వేయించుకోలేదండి. మా నాన్న వేయించాడు... మా నాన్నకి చెప్పకుండా నేనీ వూరికి పారి పోయోచ్చాను. చెప్తే అయన పంపించరు అందుకని! ఇప్పుడాయన నా అరా తీయాలని ఫోటో వేయించారు...."
గీత మాట్లాడకుండా ఆ ఒక్క పేపరూ అట్టే బెట్టి మిగతా వన్నీ తొందరగా తూయించి డబ్బులు తీసుకుని వాడిని పంపేసింది.
వాడు వెళ్ళాక "చిన్నప్పటి ఫోటో వేయిస్తే మిమ్మల్నేవరు పోల్చు కుంటారు?" అనడిగింది గీత అయోమయంగా చూస్తూ.
"ఇప్పటి ఫోటో లేవీ అయన దగ్గర లేవు లెండి. ఆన్నీ నాతోనే మూట గట్టుకోచ్చాను. ఇదొక్కటే అయన దగ్గరుంది...." అని వివరించి చెప్పాడు మోహన్.
గీత మోహన్ కు ధైర్యం చెప్పింది.
"ఈ ఫోటో చూసి ఎవరూ మిమ్మల్ని అనుమానించరు. బెంగ పెట్టుకోకండి."
అయినా మోహన్ కు అధైర్యం తగ్గలేదు.
"అది కాదండి నా బెంగ! మా నాన్న సినీ రధం చూస్తె?.... కోరి తద్దినం తెచ్చుకొన్నట్టయింది. నటుడ్ని కావాలనే ఉబలాటం లో ఇంటి నుండి చెప్పకుండా ఉడాయించిన సంగతి మర్చి పోయాను. లేకపోతె ఫోటో వేయించుకునే వాడినే కాదు...." అన్నాడు అతి దైన్యంగా.
గీతకు ఏం చేయటానికి తోచలేదు. ఇంతట్లో మనస్సు కేదో తట్టింది. చటాలున మోహన్ చేతిలోని పేపరు తీసుకుని తేదీ ఎంతో చూసింది. గీత స్థిమిత పడింది.
"ఇది ఏప్రిల్ ఇరవయ్యో తేదీ పేపరు....మీరు కంగారు పడటం అనవసరం...."
మోహన్ అయోమయంగా చూశాడు.
"సినీ రధం ఎప్పుడు విడుదలయిందో చెప్పండి!" అనడిగింది గీత మోహాన్ని మరికొంత తికమక పెడుతూ.
"ఏప్రిల్ ఫస్టున... ఆ మాట కొస్తే ఏప్రిల్ సంచిక మార్చి ఆఖరు లోనే విడుదలైంది...." అన్నాడు.
గీత కళ్ళు వింతగా మెరిశాయి.
"మరి చూశారా? ఇది ఇరవయ్యో తేదీ పేపరు.... మీ నాన్నగారు సినీ రధం చూసైనా ఉండరు. చూస్తె మీ బొమ్మ పోల్చుకునైనా ఉండరు. మీరు వూరికే గాభరా పడకండి...."
మోహన్ కాస్త స్త్తిమితంగా ఆలోచించుకున్నాడు. గుడివాడంటే పేపర్లు, మేగజైన్లు వెళ్ళని అడవి ప్రాంతమేం కాదు. తను ముఖానికి నున్నగా రంగు పూసుకుని, నొక్కు నొక్కుల జుట్టు పట్టించుకుని, బొమ్మల షర్టు వేసుకుని ఫోటో తీయించుకున్నాడయ్యె! నాన్నేం గుర్తు పట్టగలడు? వంకీ ల్లేని సాదా జుట్టు, తెల్లని షర్టు , నిగనిగ లాడని ముఖం ....నాన్నకు తను మరోలా గుర్తుకు రాదు.... సినీ రధం లో ఫోటో వేయించుకున్నందుకు ఇప్పుడు 'అయ్యో!' అనుకోవాల్సిన పని లేదు. అమ్మయ్య!
మోహన్ గీతకు కృతజ్ఞత చెప్పుకున్నాడు.
"నా బెంగ కాస్తా తీర్చారు! మీ ఋణం జన్మ జన్మాలకు తీర్చుకోలేను."
గీత సిగ్గుపడింది.
"వూరుకోండి ! ఇందులో నేను చేసిందేముంది?" అంటూ గీత కాఫీ తయారు చేసి తీసుకు రావటానికి లోపలి కెళ్ళింది. కాస్సేపట్లో కాఫీతో తిరిగొచ్చింది.
