మరుసటి ఉదయం స్నానాదులు ముగిసిన తర్వాత ఆలయాన్ని చేరుకున్నారు.
పాత పద్ధతుల్లో ఉంది ఆలయం. ఉత్సవాల్లో మినహాయించి, ఉత్తరోజుల్లో యాత్రికులు రద్దీగా ఉండరు. ఇలాటప్పుడు దైవదర్శనం చేసుకోవడం చాలా తేలికైన పని.
ఆలయంలోకి అడుగు పెట్టారు. గుడిగంట మ్రోగింది. శోభనాద్రిగారు గొంతెత్తి, శ్రీరామ చంద్రుని స్తుతించేరు.
'శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతా
మనో నాయకం
వాల్మీకోద్భవ వాక్పయోధి శశీనం స్మేరానసం
చిన్మయం
నిత్సం నీరదనీల కాయమమలం నిర్మాణ
సంధాయినం,
శాంతం మనామయం శివకరం శ్రీరామ
చంద్రం భజే!
పౌరోహితులు నీలమేఘ ఘనశ్యాముని పూలతో,
అడలతలతో పూజిస్తున్నారు. మంత్రాలు పఠిస్తూన్నారు.
ఆ దివ్య రూపదర్శనం, అన్ని క్లేశాలనీ హరించే విధంగా ఉంది. అక్కడ నిలబడి ఉన్నంత సేపూ మనసు నిర్మలంగా, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
మధ్యలో శంకరం శారదవైపు చూశాడు. సరిగ్గా అదే సమయానికి శారద కూడా అతని వైపు చూస్తోంది. ఇద్దరూ క్షణం సేపు ఒక ర్నొకరు చూచుకొన్నారు.
గభాలున నవ్వేరు మెల్లిగా. అంతలోనే తలలు తిప్పుకున్నారు. మళ్ళా రామచంద్రమూర్తి పై చూపు నిలిపేరు.
కామాక్షమ్మగారూ, శోభనాద్రిగారూ- ఇద్దరూ మరెవ్వరి ప్రమేయమూ లేకుండా, రామనామస్మరణలో పూర్తిగా మునిగి తన్మయత్వం చెందుతున్నారు.
పూజారి హారతి అందించేడు. కళ్ళ కద్దుకున్నారు. మరొక్కమాటు కళ్యాణ రామున్ని తృప్తిగా చూచి పరవశులై, మంటపం మీది కొచ్చేరు.
మంటపంమీద కూర్చుంటూ-
"మహానుభావుడు" అన్నారు కామాక్షమ్మ.
"ఈ యుగంలో ఇంకా ధర్మమూ, న్యాయమూ సురక్షితంగా ఉండి, ప్రళయం రాలేదంటే కారణం ఇలాటి పుణ్యక్షేత్రాలూ వాటినే నమ్ముకున్న మహా భక్తులూను." అన్నారు శోభనాద్రి.
"చల్లటి తండ్రి" అని మరో ముక్క అందించే రావిడ.
"ఆ పరమాత్ముని నమ్ముకున్నవాడికి కొదువేమిటి?"
"కాదుమరీ! నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారమని వూరికే అన్నారా?"
"మనిషి అజ్ఞానంలో మునిగి, అహంకారానికి లొంగి, ఇంత సృష్టిలో ఇన్ని విచిత్రాలకీ తనే కారణమని గర్విస్తుంటారు. ఇది తప్పు అంతెందుకూ- బెజవాడలో బస్సెక్కి ఇంతదూరమూ వచ్చిన వాళ్ళం, నదిని దాటుతూండగా భయమేసిందా లేదా.' రామయ్య తండ్రీ క్షేమంగా చేర్చు బాబో అని అనుకున్నామా కాదా. గోదావరి వడ్డున వెలిసి మనల్ని రప్పిస్తున్న రాముడు పిచ్చివాడు కాదు. ఓరి సన్నాసులూ- కనీసం ఈ నదిని దాటేప్పుడైనా మీరుత్తి అనామకులని అర్ధం చేసుకోండర్రా అని హెచ్చరిస్తున్నాడు. అలాగే ఏడుకొండల వాడూను. ఆ పవిత్ర నామాన్ని స్మరిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆయన్ని చేరుకుంటున్నాం. అక్కడున్న మెట్లన్నీ ఎక్కేలోగా మనలో ఉన్న 'అహం' పూర్తిగా చచ్చి వూరుకుంటుంది." అన్నారాయన భార్యనుద్దేశించి. ఆవిడ నిజమేనంటూ తలూపింది.
"నా చిన్నతనంలో అనుకుండేవారు. సింగరేణి లోనో మరెక్కడో బొగ్గుగని తవ్వుతూంటే బాగా భూమిలోపల ఒక పెద్ద రాయి అడ్డు తగిలిందట. పది మంది మనుషులు ఆ రాయిని తొలగించి చూస్తే, అక్కడో చిన్న సొరంగం కనిపించింది. దాన్లో ఒక మహానుభావుడు పద్మాసనంలో కూర్చున్నాట్ట. మనిషి ఎముకల గూడుల పెద్ద గడ్డంతో మహా భయంకరంగా ఉన్నారుటలే. అలికిడి విని కళ్ళు విప్పి అందర్నీ విచిత్రంగా చూచారుట. 'రాముడు అరణ్యవాసం పూర్తి చేశాడా?' అని సంస్కృతంలో అడిగేరుట. ఆలోచించు ఎప్పటి రాముడు?, ఎప్పటి అరణ్య వాసమూ?... తర్వాత ఆయన కోరిక మీదే ఆ రాయిని యధాప్రకారంగా అమర్చివేశారు. ఇంతా చెప్పేదెందుకోసమంటే, మన క్కనిపించని తపోధనులు ఇంకా ఈ కలి యుగంలో ఉన్నారు కాబట్టే, కలియుగం ఆగిఉంది. హిమాలయాల్లో, ఆ పరిసరాల్లో, మానవుడు వెళ్ళలేని ఆ ప్రదేశాల్లో ఇంకా ఎంత మంది పుణ్యాత్ములు తపస్సులో ఉన్నారో గదా? మరి, వాళ్ళకోసమైనా ఈ కలియుగం తప్పని సరిగా నిలవాల్సిందేగదా!" అని ముగించేరు శోభనాద్రి.
కామాక్షమ్మగారూ తనకు తెలిసిన కథ నొకదానిని చెప్పబోయేంతలో శంకరం అక్కడ్నుంచి లేచి గర్భగుడి వైపు నడిచేడు. అతని వెనకాలే శారద కూడా వచ్చేసింది. వాళ్ళిద్ధర్నీ పట్టించుకునే స్థితిలో లేరు ఆ దంపతులు. తపో విధులూ వాళ్ళ తపస్సులూ విషయాలలో పూర్తిగా మునిగి పోయేరు.
"వాళ్ళు మాటాడే విషయాల మీద మీకు నమ్మకం లేదా?" అని అడిగింది శారద.
"అని నే నెవర్తోనూ చెప్పలేదే?" అన్నాడు శంకరం.
"అక్కడ్నుంచి లేచి వచ్చేస్తే-అలా అనుకున్నాను"
"పొరపాటు." అన్నాడతను గోదావరి వైపు చూస్తో.
"నేను మిమ్మల్నొకటి అడగాలనుకుంటున్నాను' శారద గోడకి జేరగిలబడుతూ అన్నది.
"నిరభ్యంతరంగా"
"దేవుడున్నారంటారా లేదంటారా?"
అతను ఆమెవైపు ఓ క్షణం నిదానించిచూచి.
"లేడని అనుకుంటే, మీతోపాటు భద్రాచలం రాకపోదునేమో."
శారద నవ్వింది. నవ్వి అన్నదీ-
"అయితే దేవుడున్నారనే అంటారు."
"అనేగా మరి."
"అబ్బ ఎలాగైతేనేం సమాధానం రాబట్టుకున్నాను."
"సరే..... మీరు నన్నో ప్రశ్నవేసి సమాధానం చెప్పమంటే, చెప్పాను. ఇప్పుడు నేనొకటి అడుగుతాను. మీరు చెప్పాలి."
"తప్పకుండా."
"చూడండి..... దేవుడి దగ్గరికొచ్చిన ప్రతిభక్తుడూ, తమ కష్ట సుఖాలను ఆయనకు విన్న వించుకుని, తమకోదారి చూపించే భారం ఆయనదేనంటూ మొక్కుకుంటారు. అలాగే కొన్నివరాలు అడగడం కద్దు. అవునంటారా?"
"అవును."
"అయితే రాముణ్ణి మీరే వరం అడిగారు?"
ఆ మాటలో శారద సిగ్గుపడిపోయింది.
"మీరే వూహించ చెప్పరాదూ?" అన్నది.
"అడిగింది నేను గనక చెప్పడం మీరైతే బావుంటుంది."
"ఊహు......."
"అంత రహస్యమా?"
"........."
"పోనీలెండి, చెప్పడానికి అభ్యంతరమైతే దాచుకోండి."
"అభ్యంతర మనికాదు."
"మరి...."
"ఒక ఆడపిల్ల ఏమి కోరుకుంటుందో మీరు రచయితలు కాబట్టి చక్కగా ఊహించి చెప్పగలరు. కాదూ."
"రచయిత రచయితా అని నన్ను దెప్పి పొడవక పోతే మీకేం తోచదులా వుంది." అన్నాడు చిరుకోపంతో.
"మీరు రచయితలు కాదా.......ఊహించలేరా?"
"రచయితన్న తర్వాత అన్నీ సరిగ్గా ఊహిస్తాడని ఎక్కడుంది. కొన్ని కొన్ని పొరపాట్లు కూడా ఊహించవచ్చు.
"నే నమ్మను."
"అయితే నన్నే ఊహించి చెప్పమంటారు. అంతేగా."
"ఆహఁ..."
"అయితే వినండి. చెప్పే ముందు ఒక మనవి. ఇది ఒక రచయిత ఊహ. పొరపాటూ ఉండచ్చు. ఇది కేవలం కథనుకోండి సుమా. ఈ కథలో- ఒక యువకుడూ యువతీ దైవదర్శనం కోసం వస్తారు. సరే..... దేవుడ్ని చూస్తూ మధ్య మధ్య ఒకళ్ళ నొకళ్ళు చూచుకొంటూ, చిన్నగా నవ్వుతూ, కళ్ళతో హెచ్చరిస్తూ భలే ఇదై పోతారు. ఆ సమయంలో గంట మోగుతుంది. యువతి కళ్ళు మూసుకుంటుంది. మనసు దైవం పైన లగ్నం చేసి ఆయన్ను అడుగుతూందీ' 'నువ్వు అనన్య సామాన్యుడవనీ, దయార్ద్ర హృదయుడవనీ, భక్తజన బాంధవుడవనీ విన్నాను. అలా అని నమ్మేను. స్త్రీ జీవితానికి ముఖ్యమైన ఘట్టం వివాహం కదా. పుణ్యం కొద్దీ పురుషుడని అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు నా ప్రక్క నున్న యువకుడ్ని అమితంగా ప్రేమించాను. నాకు నచ్చిన, నేను మెచ్చిన వ్యక్తీ ఇతనే. కాబట్టి నా ఎన్నిక జయప్రదమూ, సుఖ దాయకమూ చేసి మా దాంపత్య జీవితంలో వెలుగు చిందించే భారమూ, బాధ్యతా నీదే ప్రభూ!' అని వేడుకుంటుంది." అన్నాడు శంకరం.
"ఇది కథకాదు. వాస్తవం కూడాను." అన్నది శారద.
"అయితే మీ గురించి నే ననుకున్నదీ కరెక్టే నన్నమాట"
శారద సిగ్గుతో కుంచించుకు పోయింది.
"నేను చాలా అదృష్టవంతుడ్ని శారదా!" అన్నాడతను.
అతని సంబోధన ఆమెకి చక్కలిగింతలు పెట్టింది. ఒకసారి అతని కళ్ళ వైపు సూటిగా చూచి తల దించేసుకున్నది వెంటనే.
శోభనాద్రిగారి పిలుపుతో మళ్ళా ఈ లోకం లోకి వచ్చి పడ్డారిద్దరూ.
12
అక్కడికి దగ్గరలో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మంటపం చూడటానికి వెళ్ళేరు అందరూ. మంటపం సుందరంగా తయారవుతోంది. చాలా మంది నేర్పుగల పనివాళ్ళు నియమింపబడ్డారు. వాళ్ళల్లో చాలామంది దక్షిణాది నుంచి వచ్చినవారినట. మంటపానికి ఉపయోగించే రాయి గూడా అక్కడ్నుంచే తీసుకొచ్చేరట.
వాళ్ళు రాళ్ళల్లో రామాయణం మలిచేందుకు గొప్ప కృషి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పరికరాలు చాలా ఉన్నాయి. నోటినిండా కిళ్ళీలు నింపుకుని పక్కవాళ్ళతో పరిహాసాలాడుతూ రాళ్ళు చెక్కుతున్నారు. ఒక రాతిపైన దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగము, ఒక రాతిపైన రామపాదుకా పట్టాభిషేకమూ, మరొక రాతిపైన సీత వనవాసమూ, వేరొక రాతిపైన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమూ-యిలా అందమైన శిల్పాలూ కళ్ళు చెదిరేలా చెక్కుతున్నారు వాళ్ళు అని శ్రద్దగా చూచారు వాళ్ళు.
ఆ చుట్టపక్కల విశేషాలన్నీ చూచి, హోటల్లో భోజనం చేసి సత్రానికి వచ్చారు.
ఆ తర్వాత దగ్గర్లో ఉన్న పర్ణశాలా, తదితర తీర్ధాలూ చూడటానికి బస్సుమీద వెళ్ళేరు.
అటుపక్క ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి, అక్కడ మద్యపానం ఇంకా నిషేధింపబడలేదు. బస్సులో సగానికిపైగా తాగి కూర్చున్నారు. ఆ మైకంలో వాళ్ళిష్టం వచ్చినట్టు చెడామడా వాగేస్తున్నారు. సభ్యతని మరచిపోయారు.
ఇప్పుడు తాను 'సభ్యత' గురించి మాటాడితే, వాళ్ళు శ్రద్దగా వినేమాట అటుంచి మీదపడి నోరు నొక్కేయగలరనీ, అక్కడికీ ఊరుకో పోతే కలపడి కొట్టేయగలరనీ చెప్పింది శారద.
ముక్కులు మూసుకుని కూర్చోడం వాళ్ళ వంతయ్యింది. కండక్టరు సైతం టిక్కట్లు సవ్యంగా యివ్వలేకపోతున్నాడు. బస్సునిండా జనాన్ని ఎక్కించాడు. అందరి కాళ్ళూ తోసుకుంటూ, వాళ్ళు హూనంచేస్తూ ఎవరికే టిక్కట్టు కావాలో పదిమాట్లు అడిగి 'అర్ధం చేసుకుని' టిక్కెట్టు యివ్వడం అతనికి బ్రహ్మప్రళయం లాగుంది.
తాగినవాళ్ళ తంతూ అలా ఉంది. తాగని బహు కొద్దిమందీ కొత్త మనుషులైన తమని నఖ శిఖ పర్యంతం బహు శ్రద్దగా పరిశీలించి 'తమరిదె ఊరు?' 'తమరు మల్లా ఎప్పు డెళ్ళిపోతారూ' 'దౌరా! నిప్పులుపెట్టి ఒకసారియ్యి' యిలా ప్రాణాలు తీసేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభా ఇంకా అనాగరికులేనని ఆ బస్సు సాక్ష్యమిస్తోంది.
-పర్ణశాలా వగైరా చూచిన తర్వాత, ఆ చుట్టుపక్కల నున్న అడవులూ, కోయగూడెంలూ చూచి వచ్చారు. మునుపు భద్రాచలం అడవులు చాలా భయంకరంగా ఉండేవనీ, రానురాను అక్కడ ఊళ్ళు చోటుచేసుకోడంతో పల్చబడిపోతూన్నా యనీ శోభనాద్రిగారు అన్నారు.
కోయగూడెంలో కోయవాళ్ళ జీవిత విధానామూ చిత్రంగా ఉంది. వాళ్ళు ఇంకా 'బార్టర్' సిస్టమ్ లోనే ఉన్నారు. వాళ్ళకు కావలసిన చింత పండూ, మెరపకాయలూ వగైరాలకు వెదురూ, కలపా యిస్తున్నారు. అంతేగాని, డబ్బులిచ్చి కొనుక్కోడం వాళ్ళకి తెలీదుట! ఇక్కడున్న షావుకార్లు ఆ కోయవాళ్ళిచ్చిన వెదురూ, కలపా రాజమండ్రిలాటి పట్టణాల్లో అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నట్టూ తెలిసింది.
ఇప్పుడిప్పుడు కోయవాళ్ళలో గూడా మార్పు కలుగుతున్నదిట. చదువుకోడం, ఉద్యోగాలు చెయ్యడం లాంటిది వాళ్ళల్లో మొదలైందిట.
భద్రాచలం యాత్రలో శంకరం మనసు కుదుటపడింది. అతను బెజవాడ ఆఫీసు, మిత్రులూ చాలావరకు మరచిపోయేడు.
గుమ్మూరులో 3 గంటలకి బెజవాడ బస్సెక్కారు. రాత్రి ఎనిమిది గంటలకి బెజవాడలో దిగేరు. శంకరం శోభనాద్రిగారి కుటుంబం దగ్గర సెలవు తీసుకుని రూమ్ కొచ్చేశాడు.
* * *
తనొచ్చేవేళకి పతీ, వాస్తూ భోజనాలకు వెళ్ళబోతున్నారు. శంకరం స్నానం ముగించి వాళ్ళతో పాటు హోటలు కెళ్ళేడు. భోజనమైన తరువాత యింటికి వస్తూ దార్లో తన యాత్రానుభవాలు చెప్పేడు శంకరం.
నిద్రపోయేముందు శంకరానికి ఒక ఉత్తరం యిచ్చేడు పతి. అది సుశీల రాసిన ఉత్తరం. నాన్నకి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందనీ నాలుగు రోజుల క్రితం ఆయనకి విపరీతమైన జబ్బు చేసిందనీ, నిన్ననే కాస్త నయమైందనీ, మంచి మందులే వాడుతున్నామనీ రాసింది.
"క్షమించు బ్రదర్! ఆ ఉత్తరం నే చదివాను." అన్నాడు పతి.
"ఫర్వాలేదు." అని నవ్వేశాడు శంకరం.
"ఒకళ్ళ ఉత్తరాలు మరొకళ్ళు చదువరాదనే యింగితం నాకుంది. కానీ, నువ్వులేని సమయాలలో యీ ఉత్తరం వచ్చింది. ముద్ర చూస్తే మీఊరు ముద్ర బహుశా నీతో మీయింట్లో వాళ్ళ వాళ్ళకి ఏదైనా అవసరం కలిగిందేమోనని చదివాను. అంతే."
శంకరం ఏమీ మాటాడలేదు..
"మీ నాన్నగార్ని చూచి రారాదూ."
"అదే అనిపిస్తోంది. ఆయన బాగా పెద్దవాడైపోయారు. ఆయన కిప్పుడు కావలసింది మనశ్శాంతి. వర్రీస్ ఎక్కువైతే-అసలే ఆయనకి నెత్తురుపోటుంది."
"ఇప్పుడాయన కున్న దిగులేమిటి?"
"ఏముంటుంది. అందరి తండ్రుల లాగానే మా నాన్నకీ చెల్లి పెళ్ళి కాలేదేమాని దిగులు. ఏవో సంబంధాలు వస్తున్నాయే గాని ఒక్కటీ ఆయనకు నచ్చడంలేదు. మా యింటికి చెల్లె లొకర్తె ఆడపిల్ల."
పతి ఏమీ మాటాడలేదు.
శంకరం వాళ్ళ చెల్లాయి గురించీ, ఆపిల్ల అమాయికత్వం గురించీ, ఆమెకు తనమీద గల ప్రేమ గురించీ చాలా చెప్పేడు. చివర్ని అన్నాడు.
"అల్లారు ముద్దుగా పెరిగిన చెల్లెలదృష్టం ఎలా ఉంటుందో పతీ!"
"మంచివాళ్ళకి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఇప్పుడు చెప్పు .... మీ చెల్లాయికి వరుడెలాటివాడు కావాలో?"
"నువ్వూ అన్వేషణలో పాల్గొంటా వేమిటీ" అన్నాడు. శంకరం నవ్వుతో.
"ఆహా ..... ఒక మిత్రుడి కుటుంబానికీ, అతని సమస్యలకీ సాయపడటం నా ధర్మం."
"థాంక్స్. నీకు యోగ్యుడైనవాడు ఎవడైనా కనిపిస్తే చెప్పు. నాన్నకి ఉత్తరం రాస్తాను."
