Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 23


    సత్యే వచ్చింది. పరిచయం ఈ సారి మాల చేసింది.
    "నేను అనుకున్నాను - మీరే అయి ఉంటారని."
    "ఎల్లా?"
    "రాజు మిమ్మల్ని వర్ణించేవాడు. దానితో."
    నవ్వింది రుక్మిణి.
    మాల అక్కడ జరిగిన విషయాల్ని మళ్ళీ చెప్పింది. "ఏం చెయ్యాలో పాలుపోక వచ్చేను' అన్నది విశదంగానే ఉంది.
    "ఇల్లా ఉందమ్మా. కనపడుతాడు. మళ్ళీ మాయమైపోతాడు" అనేసింది సత్య.
    "పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అన్నది ఓ మంచి సూచనేమో?"
    "అవవచ్చు. అయినా తనవాళ్ళకు, తన క్షేమం కోరేవాళ్ళకు దూరం అయిపోవాలన్న దృష్టి ఎందుకు కలిగిందో అర్ధం కావటంలేదు. పైగా ఎన్నాళ్ళు ఇల్లా దేశాలు పడుతాడు?"
    యథాలాపంగానే "మా అత్తయ్య మరణం ఇంకా పచ్చిగా ఉంది. అది మానడానికి కాలం కావాలి. అలాంటి స్థానం సంపాదించింది" అని రుక్మిణి అన్నా, సత్యకు అదంతా టెంకాయ పిచ్చికొండలా తట్టింది.
    "అయి ఉండవచ్చు. ఎంతైనా ఆ వయస్సు మళ్ళిన తండ్రిమీద గౌరవం?"
    "ఎప్పుడూ ఎడాపెడాగానే వాళ్ళు ఉండే వారు. అందువల్ల అది ఊహించడానికి తగినంత బలం కన్పించదు."
    ఇక ఉండబట్టలేనట్లు "మరి మీరంటేనో?" అంది సత్య.
    "మా సంసారపు పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్న నా స్థానం మీకు రాజు చెప్పి ఉండవచ్చు. అందువల్ల గ్రాహ్యం అననూవచ్చు. ఇక నేను పరిస్థితులకు బలి అయి ..." పూర్తి చెయ్యలేదు. బాధ ద్యోతకం అయ్యింది.
    "మీకు కష్టం కలిగిస్తున్నా."
    "లేదు. సత్యం ప్రాబల్యం కష్టంగానే ఉంటుంది. ఇక జరిగినవి జరిగేయి. ప్రస్తుతంలో వాడినో ఇంటివాడిగా చేయడం మంచిదనిపిస్తోంది. అది ముఖ్యంకూడాను."    
    వెనువెనుక సత్య మనస్సు గుబగుబమంది. ఈ ఎదుటి వ్యక్తి కొన్నాళ్ళు రాజును ఆరాధించింది. ఉద్వాహం ఆడాలనే ఆశించింది. కాని విధి బలీయంగా వ్యతిరేకం కావడంతో ఇప్పుడు ఆక్రమించిన స్థానంలో ఉండే మాట్లాడుతూంది. ఒక్కటే బెరుకు కలిగింది. ఈ పైన కన్పించే వ్యక్తి లోపల ఏ విధమైన గంభీర ఆఖాతాలు దాగి ఉన్నాయి? అని ఎప్పుడో చెలరేగి గాలివానల్ని లేవకుండా ఉంటాయా? ఈ కప్పు కున్న శాంతం, క్షమ, ఓర్మి కూడా దాని ముందు నిలుస్తాయా?
    స్త్రీ హృదయంలో ప్రేమ మొలకెత్తడం అనేదేమిటో తనకు తెలుసు. అది బీజాంకురం అయితే ఎంత ఉన్మత్తతలో పెరుగుతుందో తన హృదయం సాక్షి. అటువంటిది ఉత్పన్న మైనపుడు, ఆ స్త్రీ మారిపోయి, త్యాగ బుద్ధితో ప్రవర్తించగలదా అన్నదే తను ఇదమిత్ధంగా తేల్చుకోలేని విషయం అయ్యింది. రుక్మిణిని తను ఎంతవరకూ నమ్మగలదు?    
    బాహికశక్తులు ఎంత ఉన్మత్తతగా పని చేస్తాయో తను దశరథంగారి వద్ద రుక్మిణి చరిత్ర విని తెలుసుకొంది. ఇక తిరుగుబాటు చెయ్యలేక దాసోహం అందా, వేరు గత్యంతరం లేక? దీనికి జాలి కలిగినా హృదయం ఒప్పటం లేదు.
    "అతను రావాలి కదా?"
    "వస్తాడు. ఓనాటికైనా రాకమానడు. ఆ ధైర్యం నాకు ఉంది."
    "తిరుపతి వెళ్ళడంలో ..." ఆగింది.
    "మీకు అభ్యంతరం లేకపోతే ఆ రాజు స్నేహితుల్ని నేను కలుసుకోవచ్చా?"
    "దానికేం? తప్పకుండా."
    అందరూ లేచేరు. మధు గదికి వెళ్ళేసరికి చర్చించి చర్చించి అలిసిపోయేం అన్నట్లు ఉన్నారు. మాల, సత్యలు రావడంలో క్రొత్త లేదు. కాని ఇంకొకరు, అందులో రుక్మిణి రావడమే ఆశ్చర్యం కలిగించింది.
    "ఏ అభ్యంతరం లేకపోతే నేను తిరుపతి రావడానికి తయారుగానే ఉన్నాను." రుక్మిణే అంది.
    "శాస్త్రిని గుర్తుపట్టడం?" రావు సంశయం.
    "వెళ్ళడంవల్ల ప్రయోజనం లేదండీ." మధు అన్నాడు.
    "అదే నీకూ, నాకూ పొసగదు. శాస్త్రికి పేపర్లో ప్రకటించిన విషయం తెలుసు. రాజుని అనుకోకుండా వాడు కలుసుకున్నా, ఎంతవరకూ సహాయకారి అవగలడు అన్న అపనమ్మకం నీలో ఉంది. అది లేదనుకుంటే?"
    "అయితే నువ్వు వెళ్ళిరా."
    "నేనూ రావాలనే ఉంది." సంశయంగా మాల అంది.
    "రా, అమ్మా. నాకు తోడుగా ఉందువు గాని."
    పెద్ద సమస్య పరిష్కారం అయినట్లయ్యింది. అది సమస్యే కాకుండా చేసిన రుక్మిణిని అభినందించాలనుకున్నారు. అయినా క్రొత్త.
    సత్య చూచాయగా రుక్మిణమ్మగారి రాకలో ఆంతర్యం చెపుతుంటేనే లక్ష్మయ్య వచ్చి, "నమస్కారాలు" అన్నాడు. బొడ్డున దోసిన ఉత్తరం తీసి మధు చేతుల్లో పెట్టేడు. దశరథం గారు అన్నమాట నిలబెట్టుకున్నారన్న మాట అనుకునే యథాలాపంగానే దాన్ని అందరూ తీసుకున్నారు. రుక్మిణికి అర్ధం కాలేదు.
    "రాజు తిరుపతిలో ఉన్నాడుట." ఆగేడు మధు, ఉక్కిరిబిక్కిరి అయ్యే మిరపపొడి ఘాటులా తగిలింది. "మాకంటే దశరథంగారే ముందడుగులో వున్నారు."
    'అవధానులుగారి మిత్రులు శంకరయ్యతో ప్రయాణంచేసి వెళ్ళేడుట. అనిశ్చలతతో వూగు లాడినా, వ్యక్తిలో మార్పు ద్యోతకం అని మాటల్లో తేలిందట. మళ్ళీ కనపడకుండానే ఆయన్నీ వదిలివేసేడు.
    'ఇక నే వచ్చిన పనిలో జరిగింది నాకే తెలియటం లేదు. శాంతని చూచేను. మాట్లాడేను. అవధాని, పార్వతమ్మ కూడా సుమంగళీతనంలోనే శాంతను వుంచేరు. అది వాళ్ళు స్వీకరించేరు.
    'శాంత దృక్పథంలో త్యాగం ఏవిధంగా ఉన్నా దృఢ నమ్మకం సడలడం లేదు. ఎంత విపరీతంగా నైనా పరిస్థితులు మీదపడనీ, దాన్ని స్వీకరించ డానికి తయారై వుంది. ఆ అచంచల దృఢత్వానికే నాకు ఆశ్చర్యం కలిగింది.
    'అవధాని, పార్వతమ్మ, ఆఖరుకు శాంత కూడా లోకంకోసం, ఆఖరుకు స్వార్ధాలు బలిపెట్టి నట్లున్నా, రాజును దత్తత చేసుకోవాలనే వ్యక్తీకరించేరు. దానికి ప్రాధేయపడ్డారు.'
    "ఆ!" రుక్మిణమ్మే కంగారుపడింది. సత్య తెల్లబోయింది.
    'ఇదే రూపొందితే తను పూజాపీఠంమీద అతనికి పెళ్ళిచేసి, ఆనందిస్తా అని శాంత బాస. దానికి వృద్ధ దంపతులు బాసట ఇచ్చేరు.
    'శాంత కొక్కదానికే కాదు. ఆ ఇంట్లో ప్రతివాళ్ళకూ రాజు వచ్చితీరుతాడన్న గాఢనమ్మ కమే. అదే నాకు అర్ధం కాలేదు.
    'రేపు బయల్దేరి ఇంటికి వెళ్ళిపోతా.....'
    "తిరుపతి మనం వెళ్ళడంలో ప్రయోజనం లేదనే అనిపిస్తోంది."
    ఉత్తరం మడిచి మధు అందరివైపూ ఓసారి చూచేడు.
    "అదెప్పటికీ జరగడానికి వీల్లేదు." గట్టిగా రుక్మిణే అంది. దానికి జవాబు ఎవరూ చెప్పలేరు. అది పూర్తిగా సంసార విషయం. ఆ కుటుంబపు నిర్ణయం.
    అయినా మధు "శాంత విషయం మీకు తెలుసుననుకుంటా" అన్నాడు.
    "తెలుసు. అంతా తెలుసు." విసురుగానే అంది రుక్మిణి.
    తెల్లబోయింది సత్య. మాల అనుసరించింది.
    "మీరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు."
    "మీ దృష్టిలో అల్లాగే కన్పిస్తుంది. కాని ఒక్క విషయం ఎందుకు గుర్తు వుంచుకోరు? భార్యనవుతానని నాకు పెంపకం ఇవ్వబడింది. కాని విధి మారుటి తల్లిని చేసి, ఇనప్పెట్టి తాళాలు చేతుల్లో పెట్టింది. దాన్ని కడుపు తరుక్కుపోతుంటే నే స్వీకరించేను. భీరువునైపోలేదు.
    "ఇక నాకైనా, ఆయనకైనా వాడు ఒక్కడే కొడుకు. మా వంశాలకు వారసుడు. వీణ్ణి దత్తత ఇస్తానని, దశరథంగారు ఒప్పుకోవడంలో ఔచిత్యం స్వార్ధం ఏమిటో ఎందుకు గుర్తించరూ?
    "నా భావాలన్నీ కుచ్చితపూరితాలని ఎందుకనుకుంటారు, మీరంతా?
    "ఆ శాంత త్యాగం చేస్తోందంటారు. ఆ మాత్రం త్యాగం నేనూ చెయ్యగలను. కన్న కొడుక్కు పిల్లను వెతికి, పెండ్లిచేసి, కాపురం కుదుట బరచడం తల్లితండ్రులకు బరువు అవుతుందా? అదో బ్రహ్మాండం పగిలే మహత్తు వుంటేనే కాని చెయ్యలేరంటారా? అతను కోరుకున్న, ఏరుకున్న పిల్లనే పెండ్లి చేస్తానని నేనూ వాగ్ధానం ఇప్పుడు చేస్తాను. అది సత్య అవనివ్వండి; మాల కానీండి; ఇంకోపిల్ల అయినా నేను వెనుతియ్యను.
    "ఎందుకంటే తరగని ఆస్తి నావెనుక వుంది. వాళ్ళ శ్రేయ్సస్సుకోసమే నా దృష్టి వుంది."
    గతుక్కుమన్నారు అందరూ. లోపల హృదయాలు సత్యకు, మాలకుకూడా ఎగిరి గంతేసేయి క్షణికం. ఎంతటి మధుర దివస స్వప్నాన్ని రేపెట్టింది!    
    "మేమంతా బలంగా నమ్మిన ఆ అనుభూతి?" ఊరుకోలేకనే మధు అన్నాడు.
    "నమ్మకం అన్నది వ్యక్తిగత లక్షణం. దాన్ని నేను విమర్శించను. గత జన్మల జ్ఞాపకాలు కలిగినా, అవి మనస్సులో ఇముడ్చుకోగలిగిన విషయాలే అవుతాయి. వ్యక్తీకరించి నమ్మించడం, నమ్మడంలో ఔచిత్యం లేదు. అది లోకం మీద రుద్ది నమ్మూ అనడం ఉట్టి దౌర్భాగ్యం అవుతుంది.
    "శాంతకుకాని, రాజుకుకాని ఇదే కలిగినా దాన్ని నమ్మశక్తి కాని కాలం, మానవాతీతవిషయం మధ్య అడ్డు నించున్నాయి. అందుకు వాళ్ళు కుమిలి పోవలసిందే. ఇది విధివిలాసమే అయి వుండవచ్చు.
    "ఒక్కటి ఇప్పుడు చెప్పగలను. వాటిల్లో నాకు నమ్మకం లేదు. ఇక మిగిలింది-నా రాజుని నేను కంచుకోట ప్రహరీలా వుండి కళ్ళల్లో పెట్టుకుని కాపాడ్డమే. ఈ నిర్ణయంలో అటు శాంతకాని, రాజు ఆధ్యాత్మిక అవకతవక నమ్మకం కాని నిలవ్వు. వాట్లకి నేను విలువనియ్యను.
    "నాకున్న దృక్పథం ఒక్కటే. మా అత్తయ్య ఊహల్లో రాజుని ఎల్లా తయారుచెయ్యాలో నిర్ణయం చేసింది. దాన్ని పొంది, ఆచరణలో పెట్టి సాధించడంవల్ల ఆవిడ ఆత్మశాంతి పొందుతుందన్న నా నమ్మకం. అది చేసి తీరుతాను.
    "ఇక లోకం నా స్వార్ధం అన్నా, మెచ్చక పోయినా నాకు లెక్కలేదు.
    "ఎందుచేతనంటే లోకాన్ని దేహీ అనవలసిన అవసరం నాకు లేదు. ఆఖరుకు ఆ దశరథంగారు, సుభద్రమ్మ నైనా నేను ఖాతరు చెయ్యను."
    కుండ బద్దలు కొట్టినట్లు ఉంది. రుక్మిణి అన్న మాటల్లో అనౌచిత్యం తట్టలేదు.
    ఇంకా అవలేదన్నట్లే- "సత్య, మాలలు రాజుకు స్నేహితురాండ్రని నాకు తెలియదు. అతనిలో వీళ్ళ స్థానంకూడా మృగ్యం నాకు. అది నాకు సంబంధించిన విషయం కాదు.
    "అయినా రేపు రాజు వచ్చి మీలో ఎవర్ని ఎన్నుకున్నా, నేను అభ్యంతరం చెప్పను. అందులో జోక్యం చేసుకోను. ఇది నామాటగా నమ్మండి.
    "ఇక మధు, రావు వున్నారు. మీరు ఓ అన్వేషణ ప్రారంభించేరు. దాన్నిమాత్రం కనీసం ఈ తల్లి ప్రాణం కొరకైనా సాధించే వరకూ వదలకండి. దానికి ఎన్నివేలైనా నేను భరిస్తా. వెనక్కు తియ్యవద్దనే చేతులు జోడించి ప్రార్ధిస్తున్నా.
    "ఆఖరుగా నే తేల్చుకోవలసింది నా కుటుంబ విషయం. దానికి మీరు బాధ్యులు కారు. దీన్ని ఆ దశరథం దంపతులే తీర్చాలి.
    "నే వెళ్ళిన తర్వాత దశరథం రావచ్చు. వస్తే మాత్రం ఒక్కటి చెప్పండి. 'దత్తత అసంభవం; అదెప్పటికి రుక్మిణి జీవించి ఉన్నంతకాలంలో జరగదని. మరి సెలవిప్పిస్తారా" అని లేచింది రుక్మిణి.
    అచేతనంగా దేవాలయపు శిల్పాల్లా అందరూ నించున్నారు. సత్యను, మాలను ఆపేక్షలో కౌగలించుకుంది. ప్రీతి నెరపుకుంది. మధు, రావులకు గౌరవంగా నమస్కరించింది. అంతే. పెట్టె పుచ్చుకుని బయటకు వచ్చింది.
    అందరూ కదలికలేని చిత్తరువులే అయ్యేరు.
    ఒక్క లక్ష్మయ్య మాత్రం, చుట్టతీసి వెలిగించి, ఘాటైన పొగ గదినిండా నింపేడు.
    ఉక్కిరిబిక్కిరే అయ్యేరు.
    
                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS