Previous Page Next Page 
ఆరాధన పేజి 24

 

    'లతా! ఏదీ?' ఆ డైరీ ని యిలా యివ్వు! చూశారా! ఇది ఎవరిదో తెలుసా? ఏ స్నేహితుణ్ణి మీరు, శ్రీలత మెడలో పూల హారం వేసినపుడు ఆహ్వానించారో , ఆ స్నేహితుడే యీ డైరీ లో ఫలానా గుడిలో , సాయంత్రం అయిదు గంటలకు శ్రీలతా, చంద్రం లా వివాహం జరిగింది, అని డైరీ లో వ్రాసి వుంచాడు! పాపం! పిచ్చివాడు! ఆ డైరీ ని సంపాదించడానికి లతకి చాలా రోజులు పట్టాయి. కానీ నిరాశ చెందకుండా సాధించి తెచ్చింది చూస్తారా? లేక చదివి విన్పించమంటారా?'
    అతని మెదడు వేడెక్కి పోయింది. తన కనుల ముందర విచిత్ర దృశ్యం జరిగిపోయినట్లు, అది తనని నిలువునా చీల్చి చెండాడుతున్నట్లు; నీరుకారి పోయాడు. అంతదూరంగా అలోచించి బంధించి అవమానంతో పరిహసించుతారనీ ,అదీ అనూరాధ వలనే జరుగుతుందని అతడు కలలో కూడా ఊహించనే లేదు.
    పద్మ వ్యూహాన చిక్కుకున్నట్లు విలవిలలాడి పోతోందాతని హృదయం.
    వోటమిని అంగీకారించాలని అన్పించడం లేదతనికి . కానీ అంతకన్నా మరో మార్గం గోచరించడం లేదేంతగా ఆలోచించినా.
    'రామనాధం గారికి కబురు చేయమంటారా? మీ చిన్న కోడలు వస్తున్నదని! లేక దానికీ యింకా నాటకం ఆడవాలసిందేనా?' అనూరాధ ప్రతి మాటా అతణ్ణి శూలంలా గ్రుచ్చుకుంటోంది.
    'అంత బాధ అనవసరం తల్లీ! మా కోడలు మాకు బరువా? ఏదో చిన్నవాడు వయసు పొంగులో తప్పే చేశాడు. కానీ కన్న తండ్రి క్షమించకుండా ఎలా వుండగలడమ్మా! అమ్మాయ్ శ్రీలతా! నేనంతా విన్నాను. నీకేం భయం లేదు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ పెళ్లి ఆగిపోయిందని అందరికీ జాబులు వ్రాయించరా చంద్రం! ఆ! అమ్మా!రాధా! వచ్చినపని చెప్పనే లేదు!
    ఇక చంద్రం , శ్రీలతా యిక్కడే వుంటారు. మేమందరమూ వో పది రోజుల్లో వస్తామనుకో! అంతవరకూ కాస్త చూస్తుండు. అమ్మా వాళ్ళకి వేరే ఎక్కడైనా ఇల్లు చూడు. కొంచెం తొందరగా చూడమ్మా! ఆ! ఇదిగో! చూడు! ఈ మేడ కట్టినందుకు అయిన డబ్బంతా నేనే యిచ్చాను. మేనల్లుడే అని యిన్నాళ్ళూ వూరుకున్నానమ్మా! మా సంసారానికి పెద్ద యిల్లు కావలసి వచ్చిందిపుడు. మరి హరి వచ్చేవరకూ -- ఏమో? వస్తాడో, రాడో ఎవరికి తెలుసు? ఇక ఇల్లు ఖాళీ చేయవలసిందే!'
    ఆ పెద్ద మనిషి ఎపుడు వచ్చి, అంతా విని, చక్కని పధకం అల్లుకుని వచ్చాడో ఎవరూ ఎరుగరు. ఎంత నేర్పుగా , వాత్సల్యం గా మాట్లాడాడో, అంత క్రూరం దాగి వుందని గ్రహించింది అనూరాధ. ఆ నోటు నిజమన్పించడం లేదామెకు. కానీ క్రింద హరికృష్ణ సంతకం వుంది. ఏదో ఎత్తు వేయబడిందని తెలుసుకుంది.
    ఆ శకుని వేసిన పధకానికి యెదురు లేదు. అందుకే అనూరాధ మౌనం వహించింది. చంద్రం ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.
    శారద కు వెంటనే ఫోన్ ద్వారా ఆ సంగతి తెలియజేసింది. ఆమె ఆశ్చర్యంతో మాట్లాడలేకపోయింది చాలాసేపటి వరకు. తరువాత తేరుకుని అన్నది.
    'సరే! అనూ! కారు పంపుతున్నాను. అమ్మా, నువ్వూ , రాజూ యిపుడే వచ్చేయండి. ఒక్క క్షణం కూడా ఆ మూర్కుడి ముందు వుండవద్దు. ఆ కీచకుణ్ణి యెలా బంధించాలో తరువాత ఆలోచించుదాం!'
    అనూరాధ ఆ సంగతి చెప్పగానే, అన్నపూర్ణమ్మ గారెంతో విచారించారు. కన్న బిడ్డలకి తల దాచుకోడానికి వో ఇల్లు కూడా మిగల్చలేనందుకు బాధ పడిందా మాతృహృదయం.
    కానీ హాలాహలాన్ని గొంతులోనే దాచుకుంది. పది నిమిషాల్లో కారు వచ్చింది. వెంటనే కదిలి వెళ్లి పోయారందరూ.
    రామనాధం గారు తృప్తిగా విశ్వసించారు. సగర్వంగా నవ్వి మీసాల్నీ దువ్వుకున్నారు.
    చంద్రం, శ్రీలత తో ఎంతో ఆప్యాయంగా, అపరాధం చేయని పసిబిడ్డలా మాట్లాడుతున్నాడు.
    అనూరాధ అవసరమను కొన్న వస్తువులన్నింటినీ తీసికొంది. అలమారు లన్నింటికీ తాళాలు వేసింది.
    ఆ రాత్రంతా శారదా, అనూరాధ లు క్షణమైనా కన్ను మూయకుండా దీర్ఘాలోచనలో మునిగిపోయారు.

                                 *    *    *    *
    మరలా దినపత్రిక లన్నింటి లోనూ హరికృష్ణ ని గురించి ప్రకటన చేయించింది అనూరాధ. ఆకాశవాణి ద్వారా కూడా ప్రసారం చేయించింది, అతని రూపు రేఖల్ని వర్ణించి.
    కానీ ఏ మూల నుంచీ అలాంటి మనిషి ఉన్న జాడే రాకుండా పోయింది. శారద గుండెలో అపుడపుడు హరికృష్ణ గురించి వింతైన భయం చెలరేగుతోంది. భరించలేని వేదన పడగ విప్పి భయపడుతోంది? "ఆ డాక్టర్ ఏ లోకాన వున్నాడా?' అన్న అనుమానం ఆమెలో మరింత బలపడుతోంది ----నిరీక్షణ పెరుగుతున్న కొలదీ. ఆ వూహ చెవిన బడితే అనూరాధ హృదయం అగ్ని గుండమే అయిపోతుందని తనలో తానే బాధ పడుతోంది.
    కానీ అనురాధకీ మనస్సున వ్యధ కొండలా పెరిగిపోతోంది. భయాత్మకమైన భావాలెన్నో హృదయాన్ని తుత్తునియలు జేస్తున్నాయి. ఏ భావనా క్షణం నిలువదు. ఏ క్షణమూ శాంతిని కోలువదు. అశాంతి తప్ప మరో స్థితి కన్పించడం లేదామేకు.
    ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకే లేకుండా పోయింది. కలత నిదురలో పిచ్చి పిచ్చి వూహలు రాక్షసాకారంలో సాక్షాత్కరించుతున్నాయి . హరికృష్ణ ఏదో లోయలో పడి 'అనూరాధా!' అని అరుస్తున్నట్లు కలగంటోంది . ఉలిక్కిపడి లేచింది.
    శారద అపుడే కనులు తెరిచి చూసింది. అనూరధకిటికీ చువ్వుల నానుకుని చీకటిలో ఏం చూస్తుందో గానీ, అది ఎవరి కంటా బడడం లేదు. ఎవరికి తన ఆవేదన విన్పించుతుందో వారు ఆమె కన్నా మూగగా మారిపోయారు. నిట్టూర్పులు మాత్రం వినవస్తున్నాయి వుండి వుండి.
    'అనూరాధా!' మధురంగా నినదించిందామె స్వరం.
    అశ్రుసిక్త నయనాల్ని వత్తుకుని వెనుదిరిగి చూసిందామె. ఆ అశోపహతురాలు నిశ్శబ్దంగా దుఃఖించుతోందని గ్రహించింది శారద.
    లేచివెళ్ళి ఆమె ప్రక్కనే నిల్చుందామె కూడా.
    'నీ బాధ నాకు తెలుసు అనూ! కానీ నిరాశకు మాత్రం చోటీయకు పొరబాటున కూడా---నీ వేదన నిన్ను మింగివేయాగూడదు. నీకోసం, తమ్ముడున్నాడు , నిన్నే నమ్ముకున్న అమ్మ వుంది.'
    'నాకు శారదక్కయ్య వుంది అందుకే యింత ధైర్యం. అక్కా! చెదరిపోతున్న యీ మనస్సు నిక బంధించి వుంచలేను. రాజు చదువుకి సరిపడినంత డబ్బు వుంది. తరువాత అమ్మను పువ్వుల్లో పెట్టి పూజించగలడు . నాకా బెంగ లేదు.
    ఈ బందిఖానా నుంచి నాకు విముక్తి ని ప్రసాదించమనే వేడుకుంటున్నాను. భగవంతుణ్ణి , ఇక ఈ స్మృతులతో పగిలిపోతూన్న యీ హృదయాన్ని అటుకలేనక్కా! ఈ ప్రదర్శన పూర్తీ కాగానే 'శాంతి నికేతన్' వెళ్లి పోతాను. అగు అక్కా, నువ్వు అడ్డు చెప్పవద్దు! నా మనసు నీకు తెలుసు. ఈ వేదనతో బ్రతకలే నిక్కడ. అమ్మ ఇప్పటికే నా గురించి చిక్కి శల్యమై , ఎముకల ప్రోవై పోయింది.
    అమ్మతో 'కొన్నాళ్ళు,' మనశ్శాంతి కోసం శాంతిని కేతన్ లో వుంటానని చెబుతాను. నువ్వు పెదవి విప్పకు. ఈ రహస్యాన్ని అమ్మకు చెప్పకు. ఈ సంధ్యా సమయాన అమ్మకిది పెద్ద దెబ్బే! కానీ ఏం చేయను?'
    శారద పై వాలిపోయి రోదించసాగిందా అనురాగమయి. శారద లో కూడా దుఃఖం కట్టలు త్రెంచుకుంది. ఆప్యాయంగా ఆ త్యాగమయి వీపుని మురుతూ నిశ్శబ్దంగా వుండి పోయింది.
    ఆ దుస్సహనీయ వేదన నుంచి ఎప్పటికో తెరుకున్నారా ప్రేమమూర్తులు.
    'అక్కా! జీవితాన యిదే చివరి సారేమో! నా నృత్యం! ఆయనకు నచ్చిన 'రాధా' పాత్రలో విలీనమై పోయి, అనంతం లో కలిసిపోతే ఎంత బావుంటుంది? ప్చ్! కానీ .....ఉహూ! అంత అదృష్టం నాకు లేదు! లేదు.'
    తన శోకం మ్రోతలు వెడుతోంది. విరిసిన మందారం లా యౌవ్వన శోభతో మెరిసి పోవలసిన ఆమె జీవితం చిత్రమైన మలుపు తిరిగి ఆనందానికి దూరంగా విసిరి వేయబడింది. అందుకే శారద మనస్సు తరుక్కు పోతోంది తలచుకొన్న కొలదీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS