12
అనూరాధ అ విచిత్ర వ్యక్తీ గురించే ఆలోచించుతూ కూర్చుండి పోయిందేంతో సేపు. ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అంతలో ఫోన్ మ్రోగింది. వో ప్రఖ్యాత కంపెనీ వారు ఆమెను మరోసారి ఆ మహానగరాన నృత్య ప్రదర్శన ఇమ్మని కోరారు. అనూరాధ కా అభ్యర్ధన అంగీకరించాలో, నిరాకరించాలో తోచకుండా పోయిందో క్షణం.
రెండు రోజులు గడువు పెట్టింది సమాధానం యివ్వడానికై. ఆ లోపల శారదకు చెప్పిందా సంగతి తనకు మనస్సే మాత్రం ఆనందంగా లేదనీ, ప్రదర్శన యిచ్చెంత వోపిక లేదనీ చెప్పింది. కానీ అసలు కారణం హరికృష్ణ జాడ తెలియక పోవటం మూలాన కలిగిన మనో వ్యధే నని గ్రహించింది శారద. ఆ అనురాగమయి హృదయాన , ఆ డాక్టరు అనుక్షణమూ పూజింపబడుతున్నాడని అర్ధమయ్యిందామెకు.
'అనూ! కళను నిర్లక్ష్యం చేయగూడదమ్మా! కళలో లీనమై పోయినపుడే మనసున వున్న వ్యధలు కూడా కరిగి పోతాయి కొంతవరకు. హాయిగా, ఆనందంగా వుండక పోయినా కళ వాటిని అందించుతుంది.' అన్నది శారద.
అనూరాధ కి కూడా అదే వూహ మెదిలింది మనస్సున. అందుకే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి తన అంగీకారాన్ని తెల్పింది. కానీ అజ్ఞాతంగా ఎక్కడో వున్న వో మధురమైన వ్యక్తీ ఆ అనురాగమయి హృదయాన అనుక్షణమూ చిత్రాతి చిత్రమైన ఊహల్ని అల్లుతూనే వున్నాడు.
ఏ మధుర క్షణాన హరికృష్ణ అనూరాధ జీవిత వనంలో అడుగు పెట్టాడో గానీ ఆ క్షణం నుంచీ ఆమె అనురాగ వీణియే అయ్యింది. అందం వున్నా, వయారాల మయూరిలా నృత్యాన పరిణతి నందుకున్నా ఆ డాక్టర్ కోసం ఏమీ లేని నిరుపేదలా నిరీక్షించుతోంది.
ఆ రేయి ఆ రాగమయి కనులు ఎంత ప్రొద్దుబోయినా మూతలు పడనే లేదు. ఎన్నో వూహలు మనస్సును మదింపసాగాయి.
'కృష్ణా! ఎందుకీ నీరీక్షణ నాకు? మీరెవరు? నేనెవర్ని? ఏనాడూ ఈ ఎదలో దాగి వున్న మధుర రహస్యాన్ని విప్పి చెప్పలేదే? మీరే నా ప్రణయ సీమలో ప్రభువు లని విన్నవించలేదే? ఈ మూగ వేదన మాన యిరువురి మధ్యా మమతల వంతెన మలచిందా? చిత్రంగా వుంది!
మీ ఆరాధన పవిత్రమైనదే! అంతరంగాన మల్లెల్ని జల్లుతోందా అనురాగం! మీరు వ్రాసుకున్న ఆ తీయని తేనియ లోలికించే పదాల్ని ఎలా మరిచి పోను?
'రాణి! నిన్ను వదలి దూరంగా పారిపోనా!
కనులు పాలతో స్నానం చేశాయి!
తిరిగి -- కనుపాప తో నలుపు చేయబడ్డాయి.
'ప్రియతమా! హృదయం దగ్గరకు వచ్చాను! తోసి వేయకు!
ప్రియే! నీ పెదవుల మీద నిలిచాను! వదిలి వేయకు!'
ఎందుకంతగా విలవిలలాడి పోయింది మీ హృది? అంత ఆరాధాన మీలో నిలిచి కలలు గంటున్నదని ఒక్కనాడైనా చెప్పకుండా దాచుకొని ఏం మిగుల్చుకున్నారు? ఎలా మరిచి నడిచి పోను? ఆవేదనతో వుడికిపోతున్న యీ ఎదలోని అనురాగ సుధ ఎపుడు చల్లబడుతుంది?
ఈ జీవితాన హాయి విరుస్తుందా? అంధకారం బంధించి వేసింది మిమ్మల్ని. ఏం చేయను? ' నిట్టుర్పులతో నే రేయి జరిగిపోయింది.
ఆ ఉదయాన అనూరాధను చూడగానే శారద ఆమె రాత్రంతా అనంతమైన బాధతో వూగి పోయిందని గ్రహించింది. ఎర్రవారిన ఆమె కనులలో కళాకాంతులే లేవు.
పూర్ణ సౌందర్యంతో దీప్తి వంతంగా వుండే వదనం తెల్లగా పాలిపోయింది. శారద ను చూసి నవ్వింది. ఆ నవ్వులో ఏదో బాధ అంతర్గర్బితంగా సెగలు జిమ్ముతోందన్పించింది.
'అనూ! జీవితాన వెన్నెల కొన్నాళ్ళూ! చీకటి కొన్నాళ్లు రాజ్యమేలుతుంటాయి. మనిషి ఆ రెంటిని భరించవలసిందే!'
'కాదన లేనక్కా! కానీ యీ మనస్సు వుంది చూశావ్? ఇది మహా చిత్రమైనధనుకో! మనిషిని చావనీయదు , బ్రతక నీయదు, నవ్వనీయదు, మనసారా తనివి దీరా ఏడువనీయదు. దేన్నయితే మనం మరిచి పోవాలని అనుకుంటామో దాన్నే అనుక్షణమూ గుర్తుకు తెచ్చి విలవిలా తన్నుకుంటుంటే వినోదం చూస్తుంది.'
'బావ నిన్ను నరకం లో దించి పారిపోయాడు!'
'ఊహు! ఆయనేం చేశారు? ఇదంతా అనురాగం అల్లిన పద్మవ్యూహమే!'
అనూరాధ జీవితాంతం అ డాక్టర్ కోసం అలాగే నీరీక్షించుతుందని గ్రహించింది శారద. ఆ పవిత్ర హృదయాన్ని అనిరాగ జలధి ఆనకట్టే లేకుండా ప్రవహించుతోంది అనుకుంది.
'జీవితాన యీ అనురాగ బంధం మానవుణ్ణి ఆశా కుసుమాలతో బంధించి చిత్రాల్ని స్ప్రుజించింది శారద.
'అక్కా! భగవంతుడు నిజంగా గొప్ప ఇంద్ర జాలికుడు! ఎలాంటి చిత్రాన్ని అల్లాడో చూడు---

కోమలమైన హృదయాన ---ప్రేమను సృష్టించాడు. ప్రతిషించాడు. కానీ తానూ మాత్రం వజ్రం కన్నా కఠినంగా మారిపోతున్నాడు కొన్నిసార్లు. అంతటి కళామయుడు ఎంత నిర్దయ డయ్యాడో చూడు?'
అనూరాధ కనులలో కన్నీటి కెరటం విరుచుకు పడింది. శారద వింటూ కూర్చుండి పోయింది.
* * * *
అనూరాధ 'నృత్యప్రదర్శన యివ్వ బోతున్నదని యీసారి ఆ మహానగర మంతటా పాకిపోయింది. ఇంకా నాలుగు రోజులే వుంది వ్యవధి. రాజు, అన్నపూర్ణమ్మ గారు కూడా ఎంతో సంతోషించారు అనూరాధ పేరు ప్రఖ్యాతుల్ని విని.
కానీ ఆ కీర్తి ప్రతిష్ట లామెకు అణు మాత్రమైనా ఆనందాన్ని అందించ లేక పోతున్నాయి.
ప్రతిరోజూ అభిమానులు వస్తున్నారు. రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. తమ అభిమానాన్ని ప్రదర్శించి ఆనందం నింపుకుంటున్నారు. ఆ అభిమానం కూడా రావ్వంతైనా వుత్సాహాన్ని ఇవ్వలేక పోతోంది. ఏదో పుస్తకాన్ని తిరగావేస్తోందామె ఉబుసు పోక.
అంతలో చంద్రం అపుడే సీమ నుంచి దిగిన దొరలా ప్రత్యక్షమయ్యాడు--
'హల్లో! అనూరాధాదేవీ! ఎలా వున్నారు?' అంటూ.
ఆ వ్యక్తిని చూడగానే ఆమె హృదయాన అమాయికంగా చూసే శ్రీలత గుర్తుకు వచ్చింది. అసహ్యం పైకి దూసుకు రాబోయింది. కానీ నిగ్రహం అడ్డు వచ్చింది వెంటనే.
'రండి! రండి! చంద్రం గారూ! మీకోసం కబురంపించాలని అనుకుంటున్నాను . అంతలో -'
'వచ్చేశానంటారు! అంతేగా! నాకు తెలుసండీ! ఈ చంద్రాన్ని ఒకసారి చూసిన వాళ్ళు తప్పకుండా జీవితాంతం గుర్తుంచు కుంటారు.'
'అవును, నిజమే! కధలో మలుపులే వుండవు. మీరు లేకపోతె! శ్రీలత ఏ గాలికి ఎగిరిపోయింది? ఒక్కరే వచ్చారు!' అన్నది ఏమీ తెలియనట్లు.
'ఎవరూ? శ్రీలతా! నాకు నిజంగా నవ్వొస్తోంది అనూరాధ గారూ! నక్కకీ నాగలోకానికి పొత్తు కుదురుతుందా? అంతే! ఆ సంగతి కూడా!'
'మీరు ప్రేమించారేమో? అ అమ్మాయిని?'
'వో ప్రసిద్ద కవి అంటాడు--
'ఫాల్గుణ మాసపు వాయువు లో వచ్చిన యౌవ్వనం వైశాఖ మాసపు వాయువులో ఎగిరిపోయింది' అని. ఎలా వుంది భావం?'
'అంతేనంటారా మీ పవిత్రమైన , నిశ్చలమైన ప్రేమ కూడా!'
'కాక ఏమిటండీ! అందరూ ప్రేమకు అర్హులు గారు!'
'అహహ! నేను ఒప్పుకోనండోయ్! మీ నిర్వచనాన్ని' అడ్డు వచ్చిందామే.
'ఏం ఎందుకని? కుక్కనీ, నక్కనీ, ఎలుకనీ, ప్రేమించగలరా? అంటే నా ఉద్దేశ్యం - అలాంటి విలువ లేని మనుష్యుల్ని ప్రేమించగలరా? అని' పెద్ద 'లా పాయింటు' తీశానానుకున్నాడా యువకుడు.
'ఆ కుక్కలే నయం మనలో చాలా మందికన్నా! పాపం వాటికి డబ్బు విలువ తెలియదు. ఆకలి తీరిన తరువాత నిశ్చింతగా, నిర్మలంగా నిద్ర పోతాయి. కానీ మనిషి నిద్ర లో కూడా , ఆకలి లేకపోయినా గోతులు త్రవ్వుతూనే వుంటాడు.'
అతని ముఖం తెల్లగా పాలిపోయింది సున్నం వేసిన గోడలా.
'ఇంతకూ శ్రీలత గతి ఏమైందో చెప్పనేలేదు?' తిరిగి ప్రశ్నించిందామె.
'ఎవరికి తెలుసు?'
"మీకే?"
"అని ఎలా అనుకున్నారు?
"ఇంకా పిచ్చి ఎక్కలేదు గనుక! చంద్రం గారూ! స్త్రీని ఆటబొమ్మ గా వూహించు కుంటే ఒరిగే లాభం ఏమీ లేదు. అలా చేయడం మనల్ని మనమే స్వయంగా అవమానించినట్లే! అమ్మ కూడా స్త్రీయే నని మరిచి పోకండి!'
'అనవసరంగా కోప్పడుతున్నారు మీరు! శ్రీలత కు నేనేమీ ఆశలు కల్పించి అకాశాన్నుంచి పాతాళానికి త్రోసి వేయలేదే?'
'మరి యీ వుత్తరాలెమిటో ?' పుస్తకంలో నుంచి శ్రీలత యిచ్చి వెళ్లిన వుత్తరాల కట్టను వెలికి దీసింది.
'వోహో! ఉత్తరాలా!'
"ఏం? ఇవి కూడా వైశాఖ మాసపు వాయువు లోని పొంగు లేనంటారా?'
'ఎలా అంటాను ?! కానీ నా పెళ్లి నిశ్చయమై పోయింది!'
'మరి శ్రీలత నెందుకు ముడి వేసుకున్నారు వో గుడిలో!'
'ఎవరూ?' ఆశ్చర్యం నటించాడతడు.
'అవును! మీరే! ఏం? అబద్దమా?
శ్రీలతని మీరు వో స్నేహితుడి ముందు వివాహమాడలేదా?'
'ఆ స్నేహితుడిపుడు యీ లోకంలో లేడు లెండి!'
'ఆహా! అందుకా మీకింత ధైర్యం.'
'ధైర్యం? ఇందులో ధైర్యం ఎందుకు?! ఆమెను వివాహ మాడాను. నాన్నగారికి తెలియదా సంగతి. అయన తప్పు అన్నారు. అందుకే శ్రీలతను మరిచిపోయాను!'
'ఇది నాటకం గాదండోయ్ చంద్రం గారూ! వింటున్నది శ్రీలత అని వూహించుకోకండి. నాన్నగారేమీ దేవుడు గాదుగా! మీ మనస్సు మీ చేతుల్లోనే వుంటుందేమిటీ? చేసింది వెంటనే మరిచి పోడానికీ, గుర్తుంచు కోడానికీ ఎంతో కష్టం! కానీ మీకది చాలా తేలిగ్గా వుందే!'
అతడు తన ప్రతాపానికి గర్వంగా నవ్వుకున్నాడు.
'మీ పెళ్లి జరగనీయదట శ్రీలత?'
'అది అసంభవం! ఈ చంద్రం రామనాధం గారి చిన్నబ్బాయి.'
'కావచ్చు! శ్రీలత అనూరాధ చెల్లెలని కూడా గూర్చుంచుకోవడం మంచిది!'
'ఈ గాలిలో తేలిపోయే వరసలు నన్నేమీ చేయలేవు లెండి!'
'అనురాగ బంధాన్ని అపహాస్యం చేయకండి! శ్రీలతా! రామ్మా! రామనాధం గారి చిన్నబ్బాయి మన వరసలు నచ్చలేదట!'
ఆమె పిలుపు వినగానే లోపలి నుంచి శ్రీలత వచ్చి అనూరాధ ప్రక్కనే వున్న కుర్చీలో కూర్చుంది మాట్లాడకుండా.
చంద్రం శిలా విగ్రహమే అయ్యాడు. ఇంత నాటకం తెర వెనక నాయికను దాచి వుంచి ప్రదర్శించబడుతుందని ఆ యువకుడు వూహించనే లేదు. అందుకే నిర్విడ్నుడయ్యాడు. కానీ కొంచెం సేపట్లోనే అతడు మళ్లీ మామూలు మనిషిగా మారిపోయాడు. ఎదుట వున్నది శ్రీలత అని తెలిసీ తెలియనట్లు ఆమె వంక చూసీ చూడనట్లుండి పోయాడు.
'బావుంది! అయితే నన్ను జైలు కు పంపించుతరన్నమాట! అక్కా చెల్లెళ్లు ఏకమై-- కానీ పాపం౧ ఏ ఆధారంతో ఖైదు లోకి తోస్తారో?'
