Previous Page Next Page 
ఆరాధన పేజి 25

 

                                      13
    మరునాడే నృత్య ప్రదర్శన . కానీ ఆ రాత్రి అనూరాధ నిశ్శబ్దం లో లీనమై పోయింది! ఎప్పటిలా అభినయించి చూసుకోనూ లేదు. గొంతు విప్పి సరిగమలతో పోటీ పడనూ లేదు.
    ఆశ్చర్యంతో విచలిత అయ్యింది శారద ఆమె మౌనానికి. అనూరాధ కనులు మూసి కొని పడుకుంది చీకటి తెరలు కమ్మినప్పటి నుంచి. ఆ మధురానురాగమయి నిదురలో తూలి పోవడం లేదని గ్రహించింది. ఆలోచనలతో, అశాంతి తో వేగి పోతోందని నీలినీడలు పోరాడుతున్న ఆమె వదనమే చెబుతోంది.
    అణు మాత్రమైనా కదలికే లేకుండా బొమ్మలా పరున్నదామె కదిపి, ఆవేదనను మరింత రగిలించడమే అవుతుందని ఆమెను పలుకరించ లేదు శారద.
    అమెకు తెలుసు . 'అనూరాధ 'నాట్యమయూరి' అని. కానీ వోసారి మననం చేసుకోవచ్చు గదా! ప్రేక్షకులు వింతవింత మనస్తత్వాలతో విమర్శలను విసురుతుంటారు.' అనుకున్నది శారద.
    అనూరాధ చేసికున్న నిర్ణయాన్ని పెదవి విప్పి బయట పెట్టలేడామే ఆ మాతృమూర్తి కేమని ఆ విషాద వార్తను విన్పించాలో తెలియకుండా పోయింది శారదకు.
    హరికృష్ణ జాడ తెలియక సంవత్సరం పూర్తీ కావచ్చింది. రాజు యింటరులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. అన్నపూర్ణమ్మ గారి కదొక సంతృప్తి. కానీ కన్నకూతురి జీవితాన మల్లెలు విరిసినా, మధువులు కురియలేదని అహర్నిశలూ బాధతో విలవిల లాడిపోతోందా మాతృహృదయం.
    కానీ అసలు జీవితాంతం ఎక్కడో, శాంతినికేతన్ లో అందరినీ వదిలి ఒంటరిగా, ఏ బంధాలనీ ఆహ్వానించ కుండా యోగిని లా గడుపుదామనుకున్న నిర్ణయాన్ని వింటే ఆ మమతామాయి గుండెలు బ్రద్దలై పోతాయి.
    శారద సాయంతో శాంతినికేతన్ వెళ్లడానికి కావలసిన ప్రయత్నాలన్నింటినీ చేసుకుందామె.
    ఆ మధ్యాహ్నం తల్లితో అన్నది.
    'అమ్మా! రేపు శాంతినికేతన్ కు వెళ్తున్నాను! అక్కడ నా స్నేహితురాలుంది. ఎంతో ప్రశాంతంగా వుంటుందట అక్క్జడి వాతావరణం . వోసారి రమ్మని మరీ మరీ వ్రాసింది.'
    'ఇపుడెందుకమ్మా! సెలవుల్లో వెళ్ళ కూడదా? పోనీలే!  నీవంతగా సరదా పడుతున్నావు; వెళ్లి త్వరగా రా?'
    'లేదమ్మా! ఇక యీ నీ అనురాధ మళ్లా నిన్ను చూడలేదు. అది నీకు నచ్చదు. కానీ యీ నరకం నీ బిడ్డని రంపపు కోత కోస్తోంది. నన్ను క్షమించమ్మా? ఎన్నో అపరాధాలు చేశానేమో! కాని యిది అన్నింటి కంటే మించిన అపరాధం! అయినా నువ్వు నన్ను క్షమించుతావమ్మా! క్షమించుతావు!.........'ఆమె హృదయాన ఆవేదన, దుఃఖం అలలై విజ్రుంభించాయి.
    కన్న బిడ్డ కనులలో తొంగి చూసిన దుఃఖాశ్రువుల్ని చూడలేదా మాతృమూర్తి. 'శారద కన్నీటి నాపుకోలేక పోయింది. వెంటనే లేచి లోనికి వెళ్ళిపోయింది.
    ప్రదర్శన ప్రారంభమైందా రాత్రి. ప్రేక్షకు లెందరో వచ్చారు. అనూరాధ నృత్య మంటే మనస్సుపడి ఇద్దరు మంత్రులు కూడా విచ్చేశారు.

                               
    ఆమె ఎంచుకున్న అంశం కూడా మనః స్థితి కి తగినదే అయ్యింది. విరహిణి రాధగా ప్రేక్షకుల కనుల ముందు సాక్షాత్కరించింది.
    'పువ్వుల దర్భారులో విరిసిన మందారం లా మెరిసిపోతోంది.' అన్నదో కంఠం పరవశంతో మైమరిచి.
    'ఆ కనులలో నిలిచిన నీలి నీడలలో వేల భావాలు తళుక్కుమంటున్నాయి?'
    'వెన్నెల రేఖలా , అనిరాగంబరాన అందాల తారకలా మెరిసిపోతోంది!'
    'ఎంత భావగర్భితంగా వుందీ!! ఆ కనుబొమల కదలిక!'
    'అంత పరవశత నటనతో ఎలా పరువు లెత్తుతుందో?'
    'అందెలు కావు! అవి! మనసున దాగిన మమతల విన్యాసాలు!'
    'అణు వణువునా అనురాగంతో నిండి తూలి పోతోంది!'
    ప్రశంసలు రువ్వబడుతున్నాయి అందంగా. ఆనందంతో తూలి పోతోంది ప్రేక్షక లోకం.
    విరహిణిగా మరోసారి రాధ బృందావని నుంచి భువికి దిగి వచ్చినట్టు అన్పించుతోందామె అభినయ కౌశలం.
    నృత్యం పూర్తి కావస్తోంది . ఆమె నుదుట స్వేద బిందువులు తళుకు లీనుతున్నాయి.
    మయూరం లా, వంపులతో సొంపులతో, ఆరాధనాజ్యోతి అయ్యిందామె అందరి హృదయాల లోనూ. మరో గీతాన్ని అభినయించ వలసిందిగా మంత్రి గారే స్వయంగా వేదిక మీద నిలబడి అర్ధించారు. ప్రేక్షకులు కూడా ఆనందోత్సాహాలతో మరోసారి ప్రదర్శించవలసిందేనని అభ్యర్ధించారు.
    అలసిన ఆ అనురాగమయి వోపిక లేక పోయినా నిరాకరించలేక పోయింది. కానీ వో పది నిమిషాలు మాత్రం వ్యవధి యిమ్మని కోరింది. ఆమె కోరిక అంగీకరించబడింది.
    వేషాన్ని మార్చుకుని, తలలో మల్లెల్నితురుముకుంటోంది లోన గ్రీన్ రూములో! శారద 'త్వరగా కానీ! అనూ! ఆవతల వాళ్ళు ఆలస్యాన్ని భరించ లేనంటున్నారు. వేదిక మీది నుంచి నువ్వు దిగనే వద్దని వాళ్ళు కోరిక! ఎన్ని గంటలు నృత్యం చేసినా అభిమానుల కళాతృష్ణ తీరేట్లు లేదు! ఊ! పద!' అంటూ త్వర పెడుతోంది.
    'ఉండక్కా! అలసటగా వుంది! ఎందుకనో మరి! ఈనాడు హరికృష్ణ గారే వుంటే....'
    'ఆ! ఇపుడు ఆ సంగతి ఎత్తకు అనూ! మనసు వికలమై పోతుంది!' అదృష్టం పరిహసించింది బావని!' అని అనుకో!' అంటూ శారద అతని స్మృతుల్ని రానీయకుండా ఆపివేసింది కావాలనే.
    అనూరాధ కూడా మౌనం వహించింది ఆ మాటతో, అలంకరణ పూర్తి కాగానే మేనేజరు తో తేర తొలగించమని తెలియజేసింది. శారద అలంకరణ మరోసారి సరిజేసింది.
    అంతలో ఏదో కోలాహలం బయలుదేరింది. శారద ఇవలికి వచ్చింది . వెంటనే అనూరాధ కూడా రెండడుగులు వేసింది. కేకలు పెద్దగా విన్పించుతున్నాయి. ఎవరో భయంతో ఏదో అంటున్నారు వణుకు తూన్న కంఠంతో.
    'అమ్మో! ఎంత భయం వేసిందనీ! చూడు! ఎలా వున్నాడో!' అంటోందో స్త్రీ కంఠం.
    'అయ్యో! అరే! మళ్ళీ వచ్చాడు! అమ్మయ్యో! పాప! పాపను లాక్కు పోతున్నాడండీ!
    'పట్టుకోండి! రాముడూ, సుబ్బారావుగారూ! ఏదీ ఆ కర్ర యిలా యివ్వండి! దొరికాడా? పాపనేం చేయలేదు గదా? అచ్చు బూచివాడి;లా వున్నాడు.'
    దొంగేమో అనుకుంది అనూరాధ.
    'ఏమిటీ?! పాపను యివ్వనంటున్నాడా?! ఎంత ధైర్యం? పెద్ద దొంగే నన్నమాట! ఇంతమంది కళ్ళు గప్పి ఎలా పోతాడో చూద్దాం'! వూ! పదండి! భడవా! ఏమిటోయ్ ! ఈ అఘాయిత్యం! పసిపిల్లల్ని కూడా ఎత్తుకు పోతావుట్రా! చూస్తారేమిటండీ! నాలుగు అంటించక!'
    'పాపం! కొడుతున్నారనుకుంటాను!' అనూరాధ నిట్టూర్చింది.
    'అయ్యో! పడిపోయాడండీ! ఆ! ఆ! కొట్టకండి! అరే! రక్తం కాలవ గడుతోందే౧ తల పగిలి పోయిందనుకుంటానె!'
    అనూరాధ వణికి పోయింది భయంతో. ఆ మాటలు వినగానే. శారద లోనికి వస్తోంది. అంతలో జోగులు వచ్చాడు హడావిడిగా-------
    'రాధమ్మగారూ! అయన...ఆయన....మన డాకటరు గోరే నమ్మా! దొంగని బాదేశారు తల్లీ!'
    'ఆ! హరిక్రుష్ణా? నిజమేనా?'
    'బావా! అనూ! రా!' ఆ యిరువురూ ఒక్క అంగలో అక్కడకు వెళ్ళిపోయారు.
    అనూరాధ గుండెలలో భయం పడగ విప్పిన పాములా బుసలు కొడుతోంది. జనం చుట్టూరా దడి గట్టునట్టు కమ్మి వేశారు. శారద ఎలాగో తోసుకుని లోపలికి వెళ్ళింది అనూరధతో పాటు.
    అంతే! ఆ దృశ్యాన్ని చూడగానే ఇరువురూ స్తంభించిపోయారు. అనూరాధ తల పైన పిడుగు పడినట్లు అదిరిపోయింది.
    దొంగ అని అందరూ పైనబడి హింసించిన ఆ వ్యక్తీ డాక్టరు హరికృష్ణ! తల పగిలి రక్తం స్రవించు తోంది. గడ్డం, పెరిగిపోయింది. ముఖాన నీరసం తప్ప మరోటి కన్పించడం లేదు.
    ఆ స్థితిలో వున్న అతడిని చూడగానే అనూరాధ దుఃఖంతో కదిలిపోయింది.
    శారద వెంటనే సతీశునికి ఫోను చేసి, కారులో ఎక్కించి హాస్పిటలుకి తీసుకొని పోయినట్లు అవిరామంగా కన్నీరు కారుస్తోంది.
    'తలకు బాగా దెబ్బలు తగిలాయి! రక్తం కూడా చాలా పోయింది. అనూ! భయపడకు! ఆ కరుణా విభువుడైన, కృష్ణుడు నీపైన కృపా మయి వీక్షనాల్ని లరువుతున్నాడు!' అంటూ హరికృష్ణ వున్న రూములో అడుగు పెట్టింది.
    'అక్కా! నిన్నేదీ కోరను! ఆయనకు తిరిగి నాకు కన్పించనివ్వు! అందుకు ప్రతిగా నన్ను బలిగోరినా ఆ భగవానుణ్ణి నిందించను.' అనూరాధ కంఠం జీరపోయింది. కనులు ఎర్రబారాయి దుఃఖంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS