Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 23


    "అమ్మా! తను వొద్ధంటాడే....." అన్నది వసంత.
    "ఏం...... ఎందుకనీ......"
    "నీకు నచ్చదనీ" వసంత నవ్వింది.
    "బాగుంది వరస.......నేను నీకూ, మీ అన్నయ్యకూ అంత గయ్యాలి అత్తగారిలా అగుపిస్తున్నావా?" ఆమె సరదాగా నొచ్చుకుంది.
    "ఉహూఁ ..... నాకు తెలీదు; అన్నయ్య నీమాట వింటాడూ అన్నా నంతే" నంది వసంత-తల్లి అల్లిన జడ ఒకటి ముందుకు వేసుకుని చూసుకుంటూ.
    "కాని ఆ సురేఖ అనే అమ్మాయి గురించి వాడికేమీ పూర్తిగా యిష్టముందాని? అనుమానంగా ఉంది?" జానికమ్మగా రాలోచించుకుంటున్నది.
    వసంత మాట్లాడలేదు. సురేఖ అంటే అన్నయ్యకు ఎందుకు నచ్చలేదో తనకే తెలియదు. పైగా అమ్మతో ఏమాట అన్నా ప్రమాదమేనని వూరుకుంది.
    "తప్పకుండా వాడికి పై యేటికి పెళ్ళి చేసి తీరుతా" నన్నది భాస్కరం గురించే ఆలోచిస్తున్న జానికమ్మగారు కూడా. "అదీగాక యీ సురేఖ లాంటి పిల్ల మనకు ఎలా దొరుకుతుందీ" అన్న దామె. అప్పుడు ఆమె సంప్రదించగల పెద్ద ముత్తయిదువ లెవరూ లేరు. అందుచేత వసంతతోనే ఆమె ఉద్దేశాలు చెప్పి బలపర్చుకోవాలి.
    "ఈ సురేఖ ఒక్కగా నొక్క పిల్ల ...... పైగా ధనమ్మగారు మంచి సంప్రదాయం, హుందాతనం రెండూ గల ఫక్కీలో దీనిని పెంచి పెద్ద చేసింది. -కాని భాసడు కట్నం వొద్దు అనడంలోని అర్ధమేమిటో నాకు తెలీలే దమ్మాయ్!" ఆమె 'జెడలు' పూర్తిచేసి లాగిచూసి సర్దుబాటుచేస్తూ అన్నది.
    "నువ్వు వొదినెకు బంగారం పెడ్తానన్నా వొప్పుకోడేమోనే......"
    "వా డెవడే? వొప్పుకుందికీ?! నిన్నగాక మొన్నటివరకూ తిండి తినిపిస్తే గాని తినలేనివాడు" ఆమె మండిపడ్డది. "నా యిష్టం-నా కోడలికి బంగారమే పెడతానో, చవులు నులిపి చేతులోనే పెడ్తానో....." ఆమె అంతలో నవ్వి "కావాలంటే వాళ్ళ చెల్లివి నువ్వున్నావుగా నీకు మానేస్తానం"ది.
    "నీ యిష్టం! ఎప్పటికైనా నేను పరాయి దాన్నేగా" అనుకోకుండా వచ్చేశాయి వసంత నోటి వెంట ఆ మాటలు.
    జానికమ్మగారు చలించిపోయింది. పిల్లను చేరదీసింది. కన్నీ రోత్తుకుని "నీకంతా మగపిల్లలే పుట్టాలని ఆ పార్వతీదేవిని ప్రార్ధిస్తున్నాను" అన్నది.
    జానికమ్మగారికి వసంత పెళ్ళి పనులమీద ఎంత ధ్యాస మున్నదో భాస్కరం మొండితనం మీదా అంత ధ్యాస ఉంది. "ఒప్పుకున్నాడే గాని వాడికి యిష్టంలేదు" అన్న మాటలు ఆమె హృదాంత రాళంలో ధ్వనిస్తున్నాయి.
    "వీడు ఒకవేళ ఏ పిల్లదాని వలలోనేనా పడలేదుగదా......?"
    కాని ఎవరితోనూ ఆమాట అనడం ఆమెకు యిష్టం లేదు. ఆఖరికి భర్తతో కూడా అనడం యిష్టంలేదు.

                                     33

    అందరికీ అన్ని బాధలూ, అన్ని బాధ్యతలూ వదిలిపోయినట్లుంది, ఒక్క సముద్రపొడ్డున మాత్రమే ..... పైగా ఎండలు ఇంకా పూర్త్గి తిరుగు ముఖం పట్టలేదు. సముద్రం అందరిదీను. దాని హోరు, దాని కెరటాలు, దాని ఒడ్డునున్న యిసికా ఎవ్వరూ ఎత్తుకుపోలేరు గాని అందరి బాధలూ, బాధ్యతలు, అలసటా, ఆశా, నిరాశా అన్నీ అది అక్కడ ఉన్న కాసేపూ ఎత్తుకు పోతుంది!
    చిన్నపిల్లలకు నత్తగుల్లలు సృష్టిలోకెల్లా విచిత్రంగా అగుపిస్తే, పడుచువాళ్ళకు కన్నె పిల్లలు సృష్టిలోకెల్లా తియ్యనిదిగా అగుపిస్తారు-చదువు కుంటున్న నాగరికమైన అమ్మాయిలు సన్నంగా నాజూగ్గా,బొద్దుగా నిండుగా, అక్కడా, అక్కడా, అక్కడక్కడా, మన్మధుడి జయపతాకల్లా పయ్యెదలు గాలి కెగురుతుంటే - అగుపించ్తం ద్వారా అబ్బాయి లకు ఆహ్లాదం యిస్తున్నవేళ, శైలజ, సురేఖ, పద్మావతీ, ముగ్గురూ బీచ్ కి వచ్చారు.
    శైలజ సిల్కుచీర ఎర్రంచు పచ్చని పైట నిజంగా అందంగానే ఎగురుతోంది. ఆ అమ్మాయి మనసులో సంద్రపు కెరటాలలాగ ఉల్లాస మున్నది. సురేఖ రెండు జెడలూ ఒకటి వెనక్కు ఒకటి ముందుకి ఉన్నా సరే, ఆ రెండూ, మన్మధుడు "సవ్యసాచి" యే ననిపిస్తున్నాయి! ఈమధ్య "వాడు" అమ్మాయిల కనుబొమలలోను, చిరుహాసపు పెదాలలోనూ గాదు, నల్లని, మెత్తని వాళ్ళ జెడల్లో దాక్కుంటున్నాడు!
    పద్మావతి కూడా ఆపూట రెండు జెడలు వేసుకుంది. ఆ అమ్మాయి కురులు చాలా పొడుగేమో, జెదలు రెండూ బుసలు కొడుతున్న తాచుల్లా, ఆమె అడుగుల 'లయ' కనుగుణంగా పిరుదులమీద నృత్యం చేస్తున్నాయి!
    ఈ దృశ్యం సాయంకాలపు సంధ్యకాంతులకు సైతం బహు రంజుగా ఉందేమో ..... సురేఖ బుగ్గలమీద, పద్మావతి పెదాలమీద, శైలజ చెవి నున్న ఒంటిపొడి 'దుద్దు' ల మీద పల్చని కాంతులను పొదిగింది.
    అట్నుంచి మూర్తీ, భాస్కరం వస్తున్నారు.    
    మూర్తి "హుర్రే" మన్నాడు. శైలజ పయిటంచు చూస్తేనే చాలు ఈమధ్య ఆ అబ్బాయికీ 'హుర్రే' 'హుర్రే' మంటోంది గుండెల్లో.
    ప్రక్కనే ఉన్న భాస్కరం గతుక్కుమన్నాడు. పద్మావతీ, సురేఖా ఇద్దరూ మళ్ళీ తారసపడ్డారు!
    "ఆ యిద్దరూ నన్ను ఉత్త స్కౌండ్రల్ ననుకుంటారు బ్రదర్" అన్నాడు.
    "వో, వో, శైలజ మంచి అమ్మాయిరా" అన్నాడు మూర్తి.
    భాస్కరం పీక పిసుక్కున్నట్లు ఇదై "అది కాదురా నేనూ ......."
    "నువ్వూ....... శైలజను పిక్ నిక్ అడగ మన్నా వుగా ....." నన్నాడు మూర్తి దూరాన ఉన్న అందాలత్రయాన్ని ఆదుర్దాగా అందుకునే ఉబలాటంతో.
    "నీ "జలజ" గారూ ఆ "మంచి గీత" గారూ కూడా గలరు రారా! మిత్రమా!" అంటూ లాగాడు.
    "హల్లో" అన్నాడు. పైగా శైలజను రెండడుగుల దూరంలో అందుకున్నంత హడావుడిగా పలకరించాడు.
    "అరె! ....."
    "ఓఫ్!"
    "ఆఁ !? ఉఁ ..... మీరా?......."
    అంతా పలకరించుకోడమైంది.
    "హాయిగా వో శేరున్నర వేరుశనక్కాయలు తెస్తాను ...... మనం కాలక్షేపంగా" అంటున్నాడు మూర్తి.
    పద్మావతి కోపంగా భాస్కరం భయంగా సురేఖ జాలిగా- భాస్కరం భయం భయంగా - శైలజ చనువుగా, మూర్తి ఆనందంగా-చూసుకోడంతో వెంటనే ఎవరూ ఎవరికీ సమాధానం యివ్వలేదు.
    "అక్కర్లేదులెండి-శేరున్నర వేరుశనక్కాయలు తింటే వీశ రూపాయిన్నర బెల్లం తినాలి ..... అది మా దొడ్డమ్మగారి అటకమీద తప్ప మరో చోట దొరకదు" అన్నది సురేఖ కిలకిలా నవ్వేసి మరీ ......
    "దొరుకును, దొరుకును ....." అంటూ పరుగెత్తాడు మూర్తి.
    "మూర్తీ యీజే వెరీగుడ్ బోయ్!" అన్నాడు భాస్కరం నిస్సహాయంగా నిలబడటం యిష్టంలేక శైలజను చూసి.
    "మీరు మాత్రం 'శాడ్ బోయ్' లా ఉన్నారేమ్?" సురేఖ మళ్ళీ నవ్వింది.
    "వో ....... వో ....... ఎవరు చెప్పారు? ..... మా పద్మావతి చెప్పిందా?" నవ్వాడు భాస్కరం. పద్మావతి ఉచ్చ్వాస నిశ్వాసాల వడి నదుముకుంది కా అన్నట్లు పమిటను రొమ్ము నదుముకునేట్లు లాక్కొని, "మధ్యను నేనెందుకు చెప్పాలీ?" అంది.
    "అది మీ ఫండమెటల్ రైట్ గనుకా ......." అన్నాడు అప్రయత్నంగా. బహువచన ప్రయోగం చేసి, సురేఖ, పద్మావతుల నిద్దర్నీ చూశాడు భాస్కరం.
    "మనం ...... అదో అక్కడ, ఆ పాపాయి లిద్దరూ ఆడుకుంటున్నారే అక్కడ కూచుందాం ..... పాపం మూర్తిగారు మనకోసం ....." అంటూ శైలజ పమిటను గాలి కెగరకుండా తీసి పట్టుకుని రెండడుగులు వేసింది.
    "ఓ. కే."
    నడిచారు ముగ్గురూ.
    భాస్కరం సురేఖతో అన్నాడు.
    "ఎలా ఉందండీ? వాల్తేర్ వాతావరణం?"
    "ఇంచక్కా ఉంది. బీచ్ కూడా ఇరుకుగానే ఉంది....... కాని సముద్రం బాగుంది- రెండోది...."
    అంతలో మూర్తి వేరుశనక్కాయల పాకాట్ రుమాలు మూటతో రాగా అతణ్ణి చూసి,
    "వేరుశనక్కాయలు కూడా బాగుంటాయ్ ..." అని అక్కడే చతికిలబడ్డది సురేఖ.
    "నీకు పైత్యం చేస్తుందే." అన్నది పద్మావతి తానుకూడా సాధ్యమైనంతవరకు ఉక్రోషం దాచుకుందికే ప్రయత్నం చేస్తో ....
    శైలజా, భాస్కరం కూచున్నారు.
    "దయచేసి నీ చేతి రుమాలు?" చెయ్యిజాపి అడిగాడు మూర్తి.
    "ఎందుకూ?" భాస్కరం తీసియిస్తూ అడిగాడు.
    పద్మావతి సురేఖను భాస్కరాన్ని గమనించడం మానుకుందామన్నా అనడంలేదు. ఇద్దర్నీ చూస్తోంది అదోలాగ.......
    మూర్తి అన్నాడు "ముగ్గు రమ్మాయిగార్లు న్నారు! రెండబ్బాయిలున్నారు! ఒక వీశేడు .....సారీ! ..... శేరుడు కాయిలున్నారు ...... సారీ ఉన్నై! అని పంచుటకై ......"
    అతని మాటలకు అందరూ కిలకిలా నవ్వేశారు. అబ్బాయిలు క్రాపు సర్దుకుంటే అమ్మాయిలు పయిటలు ....... సరిగ్గా తీసుకున్నారు.
    ఒక రుమాల్లో కొన్ని కాయలు పోసి "ఇవి మీ ముగ్గురికీ ......" అన్నాడు మూర్తి. రెండో రుమాలు తనకీ భాస్కరానికీ మధ్య పెట్టుకుని "ఇవి పురుషులకు ప్రత్యేకం" అన్నాడు.
    పద్మావతి 'నా కొద్ధంది.'
    సురేఖ గబుక్కున మొహం కందిపోగా నొచ్చుకుంది. ఏం? ఎందుకొద్దు. అన్నది కోపంగా.    
    శైలజ "ప్లీజ్!" అంటూ కాయ చితక్కొట్టి పద్మావతికి పలుకు అందించింది.
    భాస్కరం ఏదో అనబోయి "ఒరే మూర్తీ! నీకు బుద్దిలేదురా" అన్నాడు మిత్రుణ్ణి చనువుగా చూసి.
    "లేదూ! ...... సరే! కాని నా బుద్దికీ పద్మావతిగారి టేస్టుకీ ముడి ఎక్కడా?" సాగదీశాడు మూర్తి.
    పద్మావతి గ్రహించింది. నలుగురి మధ్య సభ్యతకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా ననుకుంది.
    "సరే ....... తింటాలెండర్రా! ...... నన్నెందుకు చంపుతారూ? కావాలంటే రేపు క్లాసులోనే దగ్గుతనూ" అంది గబగబా నలుగు కాయలు చేతిలోకి తీసుకుని.
    సురేఖ నవ్వాలనే ప్రయత్నం భాస్కరం నవ్వడానికి చేసిన ప్రయత్నం శైలజా మూర్తీ గమనించనేలేదు. వాళ్ళు ఒకర్నొకరు దొంగచూపులు చూసుకుంటున్నారు.
    "అది సరేగాని, మీరు పద్మావతీ; మా చెల్లాయి పెళ్ళికి తప్పక రావాలి" అన్నాడు భాస్కరం. అని అంతలోనే మరో యిద్దరు వ్యక్తులుండటం గమనించి "ఒరే మూర్తీ! నువ్వూ మిసీ శైలజగారూ కూడా రావాలి ...... సర్దాగా గడిచిపోతాయి ఆ నాల్రోజులూ" ...... అన్నాడు మూర్తిని చేత్తోపొడిచి.
    ఉలిక్కిపడ్డాడు మూర్తి "ఎప్పుడూ, ఎక్కడికీ?" అన్నాడు.
    శైలజ కూడా ఇంచుమించు అదే ప్రశ్నార్ధకాన్ని ఆశ్చర్యార్ధకాపు భంగిమలో బలపరచింది.
    "బాగుందిరా ...... వరసా ...... పైత్యం చేస్తుందీ అంటే నిజంగానే చేసిందా? మా చెల్లాయి పెళ్ళి శ్రావణంలోనని చెబితినిగా

                                 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS