Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 24


    ఆ పరిస్థితుల్లో ఇంక తర్కించి లాభం లేదని వకీలు ని సంప్రదించి , షాపు యాజమానిని సంప్రదించి ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బు కట్టేసే ఏర్పాటుకు వచ్చాము. నా హామీ మీదా, రామారావు గారి హామీ మీదా వార్ని వదిలి పెట్టారు. తరువాత ఇల్లు తాకట్టు మీద రెండు వేల అయిదు వందలు తెచ్చారు. వడ్డీ రెండు రూపాయలు. రెండు వెల ఎనభై రూపాయలు కట్టేసి కేసు రద్దు చేయించాము. కాకినాడ లో ఇంకొకరికి నాలుగు వందలు బాకీ ఉంటె ఆ బాకీ తీర్చారు. ఇంక బావగారయిన ఆనందరావు గారి బాకీ ఒక్కటే తీర్చాలి.
    ఈ పరిస్థితుల్లో ఆ ఉద్యోగమూ పోయింది. ఇల్లు తాకట్టు లోనూ ఉన్నది. వారం రోజులు ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే వున్నారు.
    ఈ సంఘటన తో వారి మీద నా మనస్సు సగమై పోయింది. ఈ మనిషికి జీవితం లో జ్ఞానోదయం కలుగతుందా భగవాన్ అని వాపోయేదాన్ని. వారితో మనస్పూర్తిగా మాట్లాడాలని అనిపించేది కాదు. తాళి కట్టిన భర్తగా ఆ పవిత్ర బంధాన్ని గురించే వారి మీద ఆదరాభిమానాలు చూపటం జరుగుతున్నది. కాని వ్యక్తిగతంగా శ్రావణ కుమార్ గా వారి మీద సగం గౌరవం పోయింది. భార్య పిల్లల్ని పోషించే ఇంటి యజమాని గా . ప్రేమానురాగాల్ని చూపే భర్తగా వారు గౌరవ ప్రదంగా మనగలుగు తారనే నమ్మకం లేకపోయినా, ఇల్లు తాకట్టు పెట్టి మిమ్మల్ని నడి వీధిలోకి ఈడ్చే వాతావరణం కల్పిస్తారని కల్లో నైనా ఆశించలేదు. ఎక్కడి కక్కడ సర్దుకు పోతుంటే మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నరేమా అని బాధపడేదాన్ని.
    అత్తయ్య సహించలేక పోయింది. ఎన్నో మాటలంది. బాగా తప్పుచేసి నప్పుడు తలవంచి ఏం సమాధానం చెప్పక పోవటం ఇటీవల వారు బాగా నేర్చుకొన్నారు.
    ఇదంతా చూస్తున్న రాధ ఒకసారి నన్ను వాళ్ళింటికి పిల్చి మాట్లాడింది. అడపిల్లయినా ఏ చెడ్డ పేరూ తెచ్చుకోకుండా ఎంతో గౌరవ ప్రదంగా ఉద్యోగం చేస్తున్నది రాధ.
    "సుభా. అస్తవ్యస్తమైన బావ జీవితాన్ని గురించి నీ ఉద్దేశ్యం" అన్నది రాధ.
    "వారి జీవితానికి కాదు. మా జీవితాలకు గ్రహణం పట్టింది. వారు బాగుపడతారనే నమ్మకం పూర్తిగా పోయింది రాదా. తెలిసి ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. ఒకవేళ ఉద్యోగం దొరికినా వారు నిలబెట్టు కోలేరు."
    "రెండు వేల అయిదు వందలకు వడ్డీ సంవత్సరానికి అరొందలవుతుంది. అంటే  నాలుగేళ్ళ లో మొత్తం దాదాపు అసలూ వడ్డీ కలిసి అయిదు వేలవుతాయి. నువ్వు తీర్చగలవనే నమ్మకం నీకున్నదా?"
    "లేదు, ఈ సంసారమనే విష వలయంలో చిక్కుకున్న ఈ జీవితాలకు మనశ్శాంతే లేదు, అప్పూ తీరదు."
    రాధ నావైపు నిశితంగా చూసింది.
    "సుభా . దూరదృష్టి తో మీ కుటుంబ క్షేమం కోరి చెప్తున్నాను. నా ప్రశ్నలకు సరయిన సమాధానం చెప్పు. నీ కన్న వయస్సులో అనుభవాల్లో చిన్నదాన్ని. పెళ్లి కూడా కాలేదు. కాని అడుగుతున్నాను."
    కొంచెం బాధగా అన్నది. అడగమన్నట్లు చూశాను.
    "ఈ స్థితిలో నీకు కావలసింది సంసార సుఖమా, ముత్తైదువతనమా , లేక రెండూ కావాలా."
    "రెండూ కావాలనే ప్రతి వివాహిత స్త్రీ కోరుకుంటుంది."
    "ప్రతి వివాహిత స్త్రీ సంగతీ కాదు. నీ సంగతే నే నడుగుతున్నది."
    "సంసార సుఖమందు ఇచ్చ తగ్గింది. ఈ ఇద్దరూ పిల్లలు పెరిగి పెద్ద వారై మంచిపేరు తెచ్చుకుంటే చాలు?"
    "బావ యందు ప్రేమానురాగాలు"
    "ఇల్లాలుగా భర్త ను ప్రేమించకుండా ఉండలేను. వ్యక్తిగతంగా వారి యందు గౌరవం సన్నగిల్లినా భర్తగా వార్ని దూరం చేసుకోలేను."
    "అంటే నీ భావాలు సంఘర్షణ లో పడి కొట్టు మిట్టు లాడుతున్నాయి. ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు."
    "నీ అభిప్రాయం అర్ధమైంది రాదా అక్కయ్యను భార్ర వదిలి పెట్టాడు. నేను భర్తను వదిలించు కోవాలి. అంతే కదూ?"
    "అవును సుభాషిణి . ఏదో ఒక నిర్ణయానికి నువ్వు రాకపోతే ,మరో విధంగా కొన్ని కొత్త అప్పుడు నీ మెడకు చుడతాడు. క్రమేపీ ఇల్లు, వాకిలీ పోయి అద్దె ఇంట్లో ఉంటున్నా, బావ చేసే అప్పులు నీ జీతం లో నుంచి తీర్చక తప్పదు. ముందు ముందు ఇంకా బాధపడతావు సుభాషిణి."
    దూరదృష్టో దివ్య దృష్టో ఉన్నట్లుగా మాట్లాడింది రాధ ఆ మాట నిజమే అయినా భర్తను నా ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మని ఏ భార్య ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లోనూ అనలేదు. అనదు. భర్త ఎటువంటి వాడయినా  ఆడదానికి భర్త సాన్నిధ్యం కావాలి. మర్రిచెట్టు వల్ల ఏ ఉపయోగమూ లేకపోయినా ఆ చెట్టు నీడన అందరూ సేద తీర్చుకుంటారు. ఆ చల్లదనాన్ని అందరూ కాంక్షిస్తారు. గులాబి మొక్కా, గులాబి పూలూ సర్వ జనాదరణ పొందినా ఆ మొక్క నీడన కూర్చుని ఎవ్వరూ సేద తీర్చుకోరు. మన సాంఘిక వ్యవస్థ లో భర్త వదిలి పెట్టిన ఆడదాన్ని సానుభూతి తో చూస్తారు కాని నీచంగా చూడరు. అదే భర్తను వదిలి వేసిన ఆడదాన్ని ఎంతయినా నీచంగా చూస్తారు. మొగుణ్ణి వదిలేసి రంకు మొగుడు తో ఉన్నదని తెలిసీ తెలియని పరిస్థితిలో కూడా ఎన్నో అభాండాలు వేస్తారు.
    రాధ అభిప్రాయాలతో ఏకీభవించలేక పోయాను.
    "వార్ని వెళ్ళిపొమ్మని చెప్పమంటావా రాధా" అన్నాను. నిర్లిప్తంగా నావైపు చూసింది రాధ.
    "మాటలతో చెప్పక్కర్లేదు. చేతలతో ఆ భావం వ్యక్తం చెయ్యి. తనకీ ఇంట్లో స్థానం లేదనే వాతావరణాన్ని సృష్టించు. ఆ యధార్ధాన్ని బావ గుర్తించేటట్లు చేస్తే ప్రయోజనం ఉందేమో" అన్నది రాధ.
    రాధ అభిప్రాయంతో ఏకీభవించలేక పోయాను. నా వల్ల కాదని చెప్పెను.
    "నీ కర్మ " అన్నది రాధ.
    
                                      14
    మళ్ళీ ఎక్కడైనా ఉద్యోగం సంపాదించాలని వారు నాలుగు మాసాలు ప్రయత్నం చేశారు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. నాజీతం తో సంసారం గడపటమే కష్టంగా ఉన్నది. అన్నయ్య వంద రూపాయలు ఇస్తూనే ఉన్నాడు. బావకు మరో ఉత్తరం రాసింది అక్కయ్య. అయన సమాధానం రాయలేదు. అక్కయ్య సెకండ్ ఫారం పుస్తకాలు చదువుతున్నది. అక్కయ్య మెట్రిక్ పాసయితేనే కాని బావకు కనువిప్పు కలగదేమో!
    ఈ నాలుగు నెలల్లో వారు నన్నోక్క రూపాయి అడగలేదు. పది రోజులకొక సారి ఇంటికి వచ్చేవారు కాదు. ఎక్కడికి వెళ్ళారంటే ఉద్యోగ ప్రయత్నం కోసం ఎవరితోనో మాట్లాట్టానికి ఫలాని ఊరు వెళ్ళేనని చెప్పేవారు. కాని అది కాదు. వారి వ్యసనాలు మునుపటి కన్న తగ్గాయి కాని, పూర్తిగా మానలేదు. ఎన్నో చెప్పేదాన్ని. "అట్లాగే మానేస్తాను సుభా. ఇక తాగను. పెకాడను." అనేవారు. కాని నమ్మకం లేదు. నమ్మించలేక పోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS