Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 25


    సైకిల్ అమ్మేశారు. రిస్టువాచీ , ఉంగరం కూడా అమ్ముకు తిన్నారు. ఇంక అమ్మటానికి వారివద్ద ఏం లేదు-- ఒక్క కళ్ళజోడు మినహా.
    "ఇన్ని విధాలా భ్రష్టులై పోయారు. అసలు మీకు నీతి, నీజాయితీ , బాధ్యతా పరువు మర్యాదలూ ఏమీ లేవా" కటువుగా అడుగుతున్నానని తెలిసే అడిగాను.
    "లేవు. అన్నీ వదిలేశాను. ఈ పరిస్థితిలో నీతిగా బ్రతుకుదామను కున్నా ఎవ్వరూ నన్ను నమ్మరు. నమ్మి ఎవరయినా ఉద్యోగం ఇచ్చినా గౌరవం దక్కించు కుంటాననే నమ్మాకం నాకూ లేదు. ఈ మానసిక సంఘర్షణ లో నుంచి బయట పడి అవతలి వడ్డుకే వెళ్ళాను" అన్నారు.
    "మీరు అన్నీ వదులుకున్నా నేను వేటినీ వదులుకోలేదు. నా పరువు మర్యాదల్నీ, పిల్లల భవిష్యత్తు నీ కాపాడవలసిన బాధ్యత గల భర్తగా , కన్నా తండ్రిగా మీకు లేదా"
    "ఆ బాధ్యత నుంచీ తప్పుకోవలసిన పరిస్థితి రావచ్చు. నామీదే నాకు గౌరవమూ, బాధ్యతా లేనప్పుడు భార్యా పిల్లల భవిష్యత్తును గురించి నేను ఆలోచించినా ప్రయోజనం శూన్యం."
    "ఇంత మొండిగా . అజ్ఞానంగా మాట్లాడుతారని అనుకోలేదు. ఆడదాన్ని గౌరవంగా ఉద్యోగం చేసి ఇంత సంసారాన్ని పోషిస్తున్నాను. చెప్పుకో తగిన ఒక్క మంచి చీరే లేదు. అన్ని కోరికలను చంపుకుని అన్ని అవమానాల్ని భరించి కెరటాలకు తల వంచినట్లుగా ఈ సంసారాన్ని ఈదుకువస్తున్నాను. నా మీద మీకు ప్రేమానురాగాలు లేవు. ఆదరణా ఆప్యాయతా లేదు. గౌరవం లేదు. కోరి చేసుకున్న ఇల్లాలి ననే మక్కువా. మమకారమూ లేదు. అడవి జంతువుల్లా కాపురం చేస్తున్నాం.' నా కళ్ళల్లో ఆర్ద్రత లేదు. మనసు ఎండి హృదయం బండ బారిపోయింది. ఆఫీసులో ఉన్న ఆ కాసేపు మినహా రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన. ఈ అప్పు ఎట్లా తీరుతుంది. ఈ ఇల్లు ఎట్లా నిలబడుతుంది. ఇదే ఆలోచన.
    "నన్ను గురించి ఏ ఆలోచనలూ పెట్టుకోవద్దు. ఇలాంటి అఘాయిత్యాలు నేను మళ్ళీ చేసినా నువ్వేమీ పట్టించుకోకు సుభా" అన్నారు. ఈ మనిషితో మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నాను.
    రోజులు గడుస్తున్నయ్యి వారొక బ్రాకెట్ కంపెనీ లో కమీషన్ ఏజెంట్ గా చేరారు. ఈ బ్రాకెట్ కంపెనీల సంగతి ఆడే వారి సంగతీ వేరే చెప్పక్కర్లేదు. కూలి చేసుకునే వారి నుంచి ఉద్యోగస్తుల వరకూ చాలామందికి ఈ కాటన్ మార్కెట్ యందు మక్కువ ఎక్కువే. చదువుకున్నవారిని ప్రోత్సహించి వాళ్ళ చేత డబ్బు కట్టించే ఏర్పాటు తో ఆ కంపెనీ తరపున ఏజెంట్ గ చేరారు. ఈ సంపాదన వద్దని ఎంతో చెప్పాను. వారు వినలేదు. మూడు మాసాలు నిర్విరామంగా కృషి చేసి పనిచేశారు. నెలకు మూడు వందలకు పైగా కమీషన్ వచ్చేది. కాని ఎట్లా వచ్చింది అట్లాగే పోయేది . తెల్లవారు ఝామున మూడు గంటలు దాటాక ఇంటికి చేరేవారు . రెండు మూడు రోజుల కొకమారైనా బ్రాందీ వాసన కొట్టేది. ఉదయం పది గంటలు దాటాక నిద్రలేచే వారు. అన్ని విషయాల్లో నూ వారు మొండి కేత్తారు. నేను గుండె రాయి చేసుకున్నాను. తాగి వచ్చిన రోజున పలుకరించే దాన్నే కాదు. పెళ్ళి కాని ఆడదానికి ఒకటే దిగులు. నాబోటి దానికి లేన్నలేనన్ని దిగుళ్ళు.
    ఒక్కోసారి ప్రాణం తీసుకుందా మనిపించేది ధనవంతుడూ. ఆరోగ్యవంతుడూ ఒక్కసారే చస్తాడు. పిరికివాడు రోజూ చస్తూనే ఉంటాడు. నాబోటి ఆడది చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే. ఎవరు సంతోషించను? తల్లో పూలు పెట్టుకొని మూడేళ్ళయింది. నా బ్రతుక్కి సార్ధకత ఏమిటి? నేనెందుకు బ్రతుకుతున్నాను?'
    చావటానికి అనేక మార్గాలు. గోదావరి, రైలుపట్టాలు . విషం , ఎండ్రిన్, ఓహ్ చావటానికి బాధ పడక్కర్లేదు. కాని తెంపు కోవాలి. చావు క్కూడా మనస్సు పరిపక్వం చెందాలి. కాని నేను చావాలనుకున్న చావలేకపోయాను. కాన్వెంట్ డ్రస్ లో వున్న పెద్దవాడు. నా కొంగు పుచ్చుకుని తిరిగే చిన్నవాడూ నాకు ప్రతి బంధకాలు . ఈ పసి వాళ్ళను విడిచి నేను పోలేను . నేను చావలెను. వాళ్ళు తల్లి లేని పిల్లలు కాకూడదు. తండ్రి వుండి కూడా లేనివాళ్ళ తో జతే. ఉన్న తల్లి చావటం ఎందుకు? చచ్చి ఎవర్ని సాధించాలి? చచ్చి సాధిస్తారు కొంతమంది , వాళ్ళ పరిస్థితి ఏమిటో?
    మరో నెల గడిచింది. ఒకసారి అన్నయ్యతో చెప్పాను. వాడూ నవ్వి "ఆ ఉద్యోగం నేనే ఇప్పించాను సుభా" అన్నాడు. ఆశ్చర్యపోయాను.
    "ఇంతవరకూ నా కెప్పుడూ చెప్పలేదేం?"
    "నాకేం తెలుసు బావ చెప్పాడేమో అనుకున్నాను."
    "వారు నీ కూటమి లో చేరారా. జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుందా" ఆవేదనతో అడిగాను.
    "మేం చేసేవి ఉద్యోగాలు కావు సుభా. జీవితాలతో పందాలు కడతాం. ఆదుకుంటాం. అవసరం వస్తే జైలే కాదు, ఆ లోకానికే వెళ్ళాలి. ఇంక అడక్కు, వెళ్లొస్తాను" అన్నయ్య వెళ్ళిపోయాడు.
    వారి మీద ఏవగింపు కలిగింది. అవసరం వస్తే ఆ లోకానికే వెళ్ళాలి. ఆ లోకం ఆ లోకం.
    "భగవంతుడా వార్ని కాపాడు. నాకా సంసార సుఖం అక్కర్లేదు. భర్త ఆదరణ అనురాగమూ అక్కర్లేదు. పసుపు కుంకుమ కావాలి. అంతే. అంతే " మనస్సు విలవిల్లాడింది.
    పదిరోజులు గడిచాయి. వారు ఇంటికి రావటం మానేసి వారం రోజులైంది. ఎక్కడున్నదీ తెలీదు. ఏ ఊరు వెళ్లిందీ తెలీదు. అప్పటికి తారీఖు ఇరవై ఒకటో. ఇరవై రెండో. అన్నయ్య ను అడుగుదామంటే వాడి అడ్రసూ తెలీదు. ఎన్నిసార్లడిగినా వాడు చెప్పనే లేదు. ప్రతినెలా అయిదారు తారీఖులలో వచ్చి డబ్బిచ్చి వెళతాడు. అంతే, వాడు మళ్ళీ కనుపించాలంటే అయిదారు తారీఖు లు రావాలి. ఈలోగా వాడి ఆచూకీ తెలీదు.
    మరొక మూడు రోజులు గడిచాయి. అత్తయ్య, నేనూ, అమ్మ అందరం ఖంగారు పడుతున్నాం. అన్నయ్య ఆ రోజున అన్నమాటలు గుర్తొచ్చాయి. 'అవసరం వస్తే జైలు కే కాదు. ఆ లోకానికే వెళ్ళాలి" వారు...వారు ....ఆ లోకానికి వెళ్ళారా?
    రాత్రి ఒంటి గంటకు తలుపు చప్పుడైంది. వారే ననుకుని ఆదుర్దాగా తలుపు తీశాను. వారు కాదు. అన్నయ్య. లోపలికి వచ్చి తలుపు వేశాడు. నెమ్మదిగా చెప్పాడు.
    "సుభా. బ్రాకెట్ కంపెనీ కలెక్షన్ల తాలుకూ డబ్బు మూడు వేలు తీసుకుని బావ పరారీ అయినాడు. కాకినాడ చేరి వారం రోజులైంది. పాత ఖాతాలన్నీ అనుభవిస్తూ కాకినాడ లో మకాం వేశాడు. నిన్ననే పట్టుకున్నాం. మూడు వేలూ ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు బావ మా రహస్య స్థావరం లో ఉన్నాడు. మరొకడయితే నేను చెప్పినట్లు ఆ లోకానికి పంపించే వారే. నా బావమరిది అని తెల్సు కనుక అంత పనీ వాళ్ళు చెయ్యలేదు. ఆ మూడు వేలూ ఇచ్చేస్తే బావను వదిలి పెడతారు. లేకపోతె అంతే, ఏ మంటావు సుభా."
    ఇంత దారుణం జరిగినా మనిషి యందు కోపం ఉంటుంది కాని చంపివెయ్యమని ఎవరు మాత్రం చెప్తారు. పది నిమిషాలు ఆలోచించాక అత్తయ్య అన్నది.
    "ఇంటి మీద అప్పు ఎట్లాగూ తీరేది కాదు. పాపం పెరిగినట్లు వడ్డీ పెరుగుతున్నది. ఇల్లు అమ్మేసి ఆ డబ్బు కట్టేసి ఈసారికి వాడి పుచ్చే కొద్దాం. అంతకన్న మార్గం లేదు" ఏడుస్తూ చెప్పింది. నాకూ అంత కన్న గత్యంతరం కనబడలేదు.
    "ఇల్లు అమ్మి డబ్బు కట్టటానికయినా వారుండాలి కదా? మనిషిని వదిలి పెడితే వారం పది రోజుల్లో ఇల్లమ్మి డబ్బు కట్టేస్తాం. వార్ని వదిలి పెట్టమను. "జీవచ్చవం లా కూర్చుని చెప్పాను.
    "వాళ్ళకు నేనూ అదే హామీ ఇచ్చాను. విడుదలయాక డబ్బు కట్టకపోతే ఎట్లా రాబట్టుకోవాలో వాళ్ళకూ తెల్సు. సరేరేపే బావ వచ్చేస్తాడు . ఇల్లు అమ్మకం ఏర్పాటు చూడండి" అని చెప్పి అన్నయ్య వెళ్ళిపోయాడు.
    అన్నయ్య వెళ్ళాక అత్తయ్య నెత్తి నోరు బాదుకుని ఏడ్చింది. "వాడు కాకినాడ లోనే చచ్చిపోతే బాగుండేది. ఈ పసివాళ్ళ కు తలదాచు కోటానికి ఇల్లయినా మిగిలేది. ఇంక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే మన సంగతి తెల్సి ఎవరు మటుకు ఇల్లు అద్దె కిస్తారు. చివరకు దిక్కులేని వాళ్ళ మాదిరి చెట్టు కింద కాపురం పెట్టాలేమో" అని వాపోయింది. నాకు ఏడుపు రాలేదు. నిండా మునిగిన వాళ్ళకు చలి వుండదు.
    ఉదయానే వారు వచ్చారు. ఇంట్లోకి రాగానే అత్తయ్య గోడు గోడున ఏడుస్తూ ఎన్నో మాటలని ఎన్నో చివాట్లు వేశారు. బెల్లం కొట్టిన రాయిలా ఏ సమాధానం లేదు.
    "ఇంతటితో ఈ ఇంటికీ మనకూ ఋణం తీరిపోయింది. ముందు ముందు మీరు చెయ్యబోయే ఘనకార్యాలకు ఎవరిల్లు అమ్ముతారు" అన్నాను. "ఆరోజు వస్తే ఏదో ఉపాయం తట్టక పోదు" అన్నారు. అంతేకాని తమ తప్పు ఒప్పుకోలేదు.
    ఆ మర్నాడే మేం అప్పు తెచ్చుకున్న షావుకారు వద్దకు వెళ్ళి అడిగాం. అరువేలకూ ఇల్లు తీసుకుంటానని చెప్పి వడ్డీతో సహా ఆ బాకీ మూడు వేల యిందని లెక్క కట్టి, మిగతా మూడు వేలూ దస్తావేజు రాయించి రిజిష్టరు చేయించే రోజున ఇస్తానన్నాడు.
    మరో వారం రోజుల్లో ఆ పనీ పూర్తయి బ్రాకెట్ కంపెనీ మూడు వేలూ కట్టేశారు. ఇల్లు పోయింది. మేం మిగిలాం. నెల రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యాలి. అత్తయ్య మూడు రోజులూ కటిక ఉపవాసం చేసి ఏడుస్తూ పడుకున్నారు. నా కళ్ళు ఏ మాత్రం చేమర్చలేదు.
    వారం రోజుల్లోనే అద్దెకు ఇల్లు దొరికింది. ఖాళీ చేసే రోజున అత్తయ్య మనిషి చచ్చి పోయినంత గా విచార పడ్డది. ఆ ఇంట్లో ఆవిడ పాతికేళ్ళ కు పైగానే ఉంటున్నది. ఆ కాస్త చిన్న పెంకు టింటిని ఆవిడ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నది. దేవుడు మందిరాన్ని ఆవిడ స్వయంగా కట్టుకుని రంగులు, ముగ్గులూ వేసి అలంకరించింది. వంట ఇంటికి దగ్గరగా నీళ్ళకు సిమెంటు తొట్టె కట్టించింది. పెరట్లో వంట యింటి గుమ్మానికి ఎదురుగా ఎంతో అందంగా తులసి కోట కట్టించింది. వీధి గుమ్మంలో నుంచుని చూసినా పెరట్లో ఆ తులసి కోట కన్నుల పండువుగా కనిపించేది. తులసి మొక్క కూడా గుబురుగా పెరిగి చూడ ముచ్చటగా ఉంది. అద్దె ఇళ్ళల్లో ఇట్లాంటి తులసి కోట నా కోసం ఎవరు కట్టిస్తారని కన్నీరు నింపుకుని మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఆ తులసి కోట కేసి తల బాడుకున్నది. టెంకాయ నీళ్ళలా ఎంతో తేటగా తియ్యగా వుండే ఆ బావి నీళ్ళు పాతిక చేదలకు పైగా తోడి పోసుకున్నది. ప్రతి గుమ్మం దగ్గరా నిల్చొని చేతితో తాకి చూసి ఇంక ఈ గుమ్మాలకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించే యోగ్యత లేదు కదా అని వాపోయింది. ఇంటి చొట్టూ తిరిగి వచ్చి వచ్చే వెక్కుని ఆపుకోలేక బావురుమని ఏడ్చి కళ్ళు తుడ్చుకుని అద్దె యింటికి బయల్దేరింది.
    ఇన్ని నెల్ల నుంచీ ఉంటాం తో ఆ ఇంటి మీద మమత ఏర్పడ్డ అమ్మ. అక్కయ్య కూడా ఎంతో బాధపడ్డారు. అద్దె యింటికి ఆఫీసు దగ్గర. రాధ వాళ్ళ ఇల్లు కాస్త దూరం.
    జీవితాలు శాశ్వతం కావని తెల్సినా మనిషి పొతే బాధ పడటం సహజం . స్వంత యిల్లు అప్పులు తీర్చుకోటానికి అమ్ముకున్నా అలాంటి బాదే కలుగుతుంది.
    ఈ అద్దె ఇల్లు వరసగా మూడు గదులు. గదులు కాస్త పెద్దవే అయినా యిల్లు చాలా పాతది. దుమ్ము జాస్తి . పంపు లేదు. బావి ఉన్నది. కరెంటు ఉన్నది. అద్దె ఏభై రూపాయలు. ప్రతి నేలా నాకు వచ్చే జీతంలో ఏభై రూపాయలు ఇంటద్దె చెల్లించాలంటే ఏ ఖర్చులు తగ్గించుకోవాలో అర్ధం కాలేదు. ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం పూట కాఫీ కూడా మానేశారు. నేను టిఫిన్ మానేసి కాఫీ మాత్రం తాగేదాన్ని. లేకపోతె టైప్ మిషన్ మీద వెళ్ళు త్వరగా జరిగేవి కాదు. నీరసం చేత చేతులు పీక్కుపోయేవి, పట్టుమని పాతిక రూపాయలు ఖరీదుకు మించిన చీరె కట్టుకోలేదు. సర్వ సాధారణంగా ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఏంతో చక్కగా ముస్తాబై ఖరీదయిన అన్ని రకాల చీరెలు కడుతూ ఉంటారు. నాకు అయిదు నేత చీరెలకు మించి లేవు. చేతికి రిస్టు వాచీ అయినా లేదు. ఒక జత బంగారు గాజులు, మూడు కాసుల గొలుసు ఇవే నా ఆభరణాలు. పెనుకున్న మంగళ సూత్రల తాడు, నల్లపూసలు, ఇన్నేళ్ళ నుంచీ ఉద్యోగం చేస్తున్నా బంగారపు పుస్తెల తాడు చేయించుకోలేక పోయాను. అలోచించి చూస్తె నాది దురదృష్ట జాతకం కావటం చేతనే వారి జీవితం ఇంత తారుమారయిందా అని అనుకుని బాధపడేదాన్ని.
    అద్దె ఇంట్లో చేరిన వారం రోజుల వరకూ వారి చరిత్ర ఇంటి వారికి తెలీలేదు. నా ఉద్యోగం సంగతే చెప్పాను కాని వారికి ఉద్యోగం లేదనే చెప్పాను. పరిస్థితులన్నీ విని ఇంటావిడ చాలా బాధపడ్డది. ఇంటి యజమాని ఒకసారి వార్ని పలకరించాడు. వారి మీద ఆయనకు సదభిప్రాయం కలగలేదు. ఇల్లు ఖాళీ చెయ్యమని అంటాడేమో నని భయపడ్డాను. కాని ఆ ముక్క అనలేదు. ఆ ఇంట్లో రెండే భాగాలు. ఒక భాగం మేం ఉండేది. రెండో భాగం లో ఇంటి వారుంటారు. పెరట్లో కాంపౌండ్ గోడ మీది నుంచీ వాలుగా బంగళా పెంకుతో రెండు గదులు చిన్నవి వేశారు. ఆ చిన్న భాగం అద్దె పాతిక రూపాయలు. అందులో భార్యాభర్తలూ ఒక పసివాడూ. చిన్న కుటుంబం. ఇంటాయనకు పొగాకు కంపెనీ లో పని. అయన మంచి వ్యవహార వేత్త. మాటకారి. పెరట్లో ఇంట్లో అద్దె కున్నాయనకు ఒక రైస్ మిల్లు లో ఉద్యోగం. ఇంటి వాతావరణం బాగున్నా ఈ ఉద్యోగం లేని వీర్ని చూస్తె వాళ్ళకు చిన్న చూపు గానే ఉన్నది. అన్నయ్య కూడా ఒకసారి వచ్చి ఇల్లు చూసి వెళ్ళాడు.
    ఈ ఇంట్లో చేరిన వారం పది రోజుల వరకూ ఎక్కడికి వెళ్ళేవారు కారు, ఏదో ఆలోచిస్తూ ఇంట్లోనే కూర్చునే వారు. అమ్మ, అక్కయ్య తో మాట్లాట్టం ఎప్పుడూ లేదు. ఇప్పుడు అత్తయ్య తోనూ  ఎక్కువగా మాట్లాట్టం లేదు.
    భార్యగా నా ధర్మాన్ని నెరవేర్చు కోవటమే కాక ఇంటి యజమాని గా కూడా అందరూ నన్ను గుర్తించే వారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS