అసలు కేసు ఏమిటని గాని, లంచాలు ఎందుకు తీసుకున్నారని గాని పట్టించింది ఎవరని గాని ఏ వివరాలు నేను వార్ని అడగలేదు. అడిగినందువల్ల ప్రయోజనం లేకపోయినా వారి భావాల్లో మనసులో నేనేదో కించ పరుస్తున్నానేమోననే ఉద్దేశ్యం వారిలో కలుగుతుందేమోనని ఆ ప్రస్తావనే తీసుకు రాలేదు.
ఒకరోజున వారి మనస్తత్వాన్ని మరో రీతిగా తెల్సుకుందామని అడిగాను.
"ఏదయినా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా?"
"లేదు" ముభావకంగా అని ఊరు కున్నారు.
ఈ సమాధానం వల్ల నేను మళ్ళీ ప్రశ్నించే అవకాశం లేకపోయింది.
"నీ సంపాదన తినే హక్కు నాకు లేకపోతె ఏదయినా ఉద్యోగం చూసుకుంటాను" అన్నారు మళ్ళీ.
"మీకు హక్కు లేదని గాని మరే ఉద్దేశం తో గాని నేను అడగటం లేదు. పగలల్లా ఎక్కడికో వెళుతుంటేను అడిగాను. ఇక అడగను." అన్నాను.
పరిస్థితులు మారినా మనస్సు మారినా మాటలు మాత్రం మారలేదు.
పదిహేను రోజులు గడిచాక ఒకరోజున కాస్త సంతోషంతో చెప్పారు.
"సుభా . ఒక మిషినరీ కంపెనీ లో లెక్కలు రాయటానికి చేరాలని, నెలకు వంద రూపాయలు జీతం ఇస్తామన్నారు. చేరమన్నావా?'
నెలకు రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకునే వారు జీవితం తల క్రిందులై ఈ జీతానికి వప్పుకున్నారంటే పరిస్థితుల ప్రభావం మనిషిని ఎంత తల క్రిందులు చేస్తయ్యో ఊహించుకున్నాను.
"చేరండి. జీతం తక్కువయినా ఏదో ఒక వ్యాపకం లో పడితే మీకు కాస్త మనశ్శాంతయినా ఉంటుంది.' అన్నాను.
"నా మనశ్శాంతి కేం గాని, నీకు మనశ్శాంతి ఉండదేమో."
"ఎందుకని?"
"నీ జీతం కన్నా నా జీతం తక్కువ కద"
"మీరు ఎక్కువ సంపాదించినప్పుడు నేను విరగబడిపోయిన సంఘటన లేమయినా ఉన్నయ్యా" నవ్వుతూ అన్నాను.
"భార్య కన్న భర్త జీతం ఎక్కువ వటం లేక రోవాజే. తనకన్న తక్కువ సంపాదన పరుడైతేనే ఆ భార్య బాధపడేది."
"ఆ అధిక్యత నా మనస్సులో ఎప్పుడూ ఉండదు. నేనేమయినా అనుకుంటానేమో నని మీరు బాధపడకుండా ఉంటె చాలు."
ఏం మాట్లాడకుండా సిగిరెట్ వెలిగించారు. రెండు రోజులు గడిచాక ఆ మెషినరీ షాపులో చేరారు. జరిగిపోయిన సంఘటనలన్నీ ఒక పీడకలగా భావించాను.
ఒక నెల గడిచింది. జీతం తెచ్చుకున్నారు.
"సుభా."
"ఏమండీ"
"వంద రూపాయలు జీతం వచ్చింది. నా ఖర్చులకు కొంత తీసుకుని మిగతాది నీకిస్తాను."
"అక్కర్లేదు. మీ జీతం మీరే వాడుకోండి. ఇంటి కింద ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు."
"కాదు సుభా. నే చెప్పేది వినమని శాసించటం లేదు. నెలకు ఓ యాభై రూపాయలిస్తాను. మిగతా యాభై రూపాయలూ నా ఖర్చులకు తీసుకుంటాను. భార్య బిడ్డల్ని పోషించలేకపోయినా నన్ను నేనైనా పోషించుకుంటున్నాననే సంతృప్తి ఉంటుంది. అదైనా నాకు మిగలనివ్వు" అన్నారు.
"మీఇష్టం" అన్నాను.
ఏభై రూపాయలు ఇచ్చారు. రోజులు గడుస్తున్నాయి అక్కయ్య సెకండ్ ఫారం పుస్తకాలు చదువుతోంది. తెలివి తేటల్లోనూ కాస్త మార్పు వచ్చింది. మరో రెండేళ్ళు కష్టపడి దాన్ని మెట్రిక్ పరీక్షకు చదివించాలని నా పట్టుదల. అదే చదువు కుంటానన్నది. వార్ని చూస్తె తప్పుకు తిరిగినా మునుపటి బెరుకూ , భయమూ లేవు. రాధ రోజూ వచ్చి బాతాఖానీ కబుర్లే చెప్పేది కాని వారి వ్యవహారాలేమీ అడిగేది కాదు. అట్లా అడగవద్దని నేనే చెప్పాను. మళ్ళీ వార్ని మామూలు మనిషిని చెయ్యాలనేదే నా తాపత్రయం.
ఒక నెల మొదటి వారంలో వంద రూపాయలు ఇవ్వటానికి అన్నయ్య వచ్చినప్పుడు వారి కంట పడ్డాడు. అంతకు క్రితం మూడు సార్లు వచ్చినా ఆ సమయంలో వారు లేరు. అన్నయ్య ఈ విధంగా అమ్మ, అక్కయ్య ల పోషణకు నెలకు వంద రూపాయలు ఇస్తున్నాడని వారికి చెప్పాను... విని ఊరుకున్నారు. ఈసారి ఇద్దరూ మాట్లాడుకునే సావకాశం కలిగింది.
"ఏమోయ్ వాణీ నాధం . కులాసా వ్యాపారం బాగా సాగుతోందా" అని పలకరించారు వారు.
అన్నయ్య ఐదు నిమిషాల కన్న ఎక్కువ సేపు కూర్చోలేదు. వాడు చేసే పనేమిటో తెల్సుకోవాలని వారెంతో ప్రయత్నించారు కాని అన్నయ్య బయటపడలేదు.
"ఒకవేళ నేనూ మీలో చేరాలనుకుంటే చేర్చుకుంటారా" అని అడిగారు.
"దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి." అని వెళ్ళిపోయాడు అన్నయ్య. నైరాశ్యం మానవుణ్ణి కృంగ దీసినా జీవించడానికి మరో పంధాను నిర్ణయించు కోవటం లో తప్పటడుగులు వేస్తుంది.
నా జీతం నూట ఎనభై ఆరు రూపాయలతో , అన్నయ్య అంద జేసే వంద రూపాయలతో ఇంతమంది మీ బ్రతుకుతున్నాం. అన్నయ్య జైలులో ఉన్న సంవత్సరకాలంలో నా జీతం ఇల్లు గడవడానికి చాల్లేదు. కాకినాడ వెళ్ళాక వారు పైసా పంపలేదు. ఆ పరిస్థితుల్లో ఆరు వందలు అప్పు చేశాను. అందులో మూడు వందలు మాత్రమే తీర్చగలిగాను. మా మామగారు సంపాదించి యిచ్చిన ఆస్తి ఈ చిన్న పెంకు టిల్లు ఒక్కటే. అదీ చాలా చిన్న ఇల్లు కావటంతో ఒక్క గది మినహా ఎక్కువ భాగం అద్దె కిచ్చేందుకు వీల్లేదు. మా పెళ్లి కాకమునుపు తల్లీ, కొడుకే కావటంతో ఒక్క గది మాత్రం అద్దె కిచ్చేవారు. మా వివాహమయ్యాక ఆగది కూడా ఖాళీ చేయించి మేమే తీసుకున్నాం. నాన్నగారు పోవటం తో అమ్మ, అక్కయ్య ఇక్కడే ఉంటాం చేత ఇంక అద్దె కిచ్చే ప్రస్తావనే లేకపోయింది. ఈ ఉన్న పెంకు టిల్లు తండ్రి పోవటంతో వారసుడు కనుక వారికే వచ్చింది. ఈ ఇల్లు మినహా మరే అస్త్రీ లేదు. తిన్నా తినక పోయినా ఈ బాధలన్నీ అనుభవిస్తున్నా చిన్న ఇల్లయినా స్వగృహం ఉండడంతో ఇంటద్దె పోరు లేకుండా బ్రతుకుతున్నాం.
ఆశ మానవుణ్ణి బ్రతికిస్తుంది. జరిగి పోయిన కష్టాల్నీ మరిపింపచేస్తుంది. కష్టాలు అనుభవించిన కొద్దీ హృదయమూ మనస్సూ రాటు దేలి నిరాశా తరంగాల్లో తల మున్కలుగా కొట్టుకు పోయినా ఏనాటి కయినా మంచి రోజులనే వడ్డుకు కొట్టుకు రాగాలమేమోననే ఆశా కిరణం ఆ కరుడు కట్టిన మనస్సులో లీలగా నైనా పొడసూపక మానదు. అలాంటి ఆశతోనే జీవిస్తున్నాను. మరో మూడేళ్ళు వారు చక్కగా కుదురుగా ఉద్యోగం చేసుకుంటే డిప్యూటీ తహసీల్దార్ ప్రమోషన్ వచ్చేది, కాని ఆ ఉద్యోగ వృక్షం మొదట్లో కే నరికి వేయబడింది.
ఆ మెషినరీ షాపులో వారు మూడు మాసాలు పనిచేశారు. ఒకరోజున ఆఫీసుకు పిడుగు లాంటి వార్తా వచ్చింది. ఆ షాపులో అమ్మకం తాలుకూ డబ్బు రెండు వేలకు పైగా వీరు కాజేశారని , షాపు వాళ్ళు పోలీస్ రిపోర్టు ఇవ్వగా అరెస్టు చేసి తీసుకు వెళ్ళారని కబురొచ్చింది. టైప్ మిషన్ లో ఉన్న కాగితాన్నీ అట్లాగే ఉంచి రామారావు గార్ని పిలిచి ఆయనతో చెప్పాను. ఆయనా బాధపడి కాగితాలు సర్దుకుని వచ్చారు. నేను రిక్షాలో, అయన సైకిల్ మీదా ఆ మెషినరీ షాపుకు చేరాం.
షాపు యజమాని సంగతంతా చెప్పాడు. అది చాలా పెద్ద షాపు కావటం తో రోజూ పెద్ద మొత్తం లో అమ్మకా లుండేవి. క్యాషియర్ వేరే ఉన్నాడు. అతను పెళ్ళి కని వారం రోజులు సెలవు పెట్టడంతో ఆ ఆపని వీరిని చూడమన్నారుట. ఒకరోజు వెయ్యి రూపాయలూ. ఒక రోజు ఆరు వందలు , ఒక రోజు నాలుగు వంద;ల ఎనభై ఇట్లా కాజేసి బ్యాంక్ ఖాతా లో మిగతా డబ్బు జమ కట్టేవారుట. ఇదంతా మూడో రోజు సాయంత్రం బయటపడింది. వెంటనే లెక్కలు చూసుకుంటే మొత్తం రెండు వేల ఎనబై రూపాయలు తేలిందట. వెంటనే పోలీసు రిపోర్టు ఇచ్చారు. కష్టడీ లోకి తీసుకున్నారు. ఆ షాపు యజమాని, ఇతర గుమస్తా లూ నన్నూ, నా పరిస్థితి ని చూసి ఎంతో సానుభూతి కనబర్చారు.
"మీ భర్త యందు మీకు గౌరవం వుంటం సహజమే నమ్మా, గవర్నమెంటు లో డిస్మిస్ అయినారని మాకూ తెల్సు. కాని మాకు తెల్సిన వారి చేత వారిని ఎట్లా ఎరుక చేసుకున్నారో తెలీదు. సిఫార్సు చేయించారు. మనిషి చాలా తెలివి కలవాడు. ఇంకో గుమస్తా రెండు రోజుల్లో చేసే లేక్కపని అయన ఒక్క రోజులోనే పూర్తీ చేసేవారు. సంవత్సరం కాగానే జీతం నూట యాభై చేద్దామను కున్నాం. ఎంత తెలివి కల వాడయినా ఆ బుద్ది అటువంటిది. నోటి దగ్గర కూడు రెండు సార్లు బోర్ల దోసుకున్నారు. పోలీస్ కస్టడీ లో వున్నారు. వెళ్ళి చూసిరండి. మా డబ్బు మాకు కట్టేస్తే కేసు లేకుండా చేస్తాం. " అన్నాడాయన.
నేనూ, రామారావు గారు పోలీసుస్టేషన్ కు వెళ్లాం. లాకప్ లో వున్నారు. తల వంచుకుని కూర్చున్నారు. రామారావు గారు సబిన్ స్పెక్టరు తో మాట్లాడారు. వారితో మాట్లాడ్డానికి పర్మిషన్ యిచ్చారు. ఆ రోజున వారు డిస్మిస్ అయిన వార్త తెలిసినపుడు కూడా నేనింత అవమానంతో బాధపడలేదు. వారి జీవితం లంచ గొండితనం నుంచి దొంగ తనం లోకి వచ్చింది. కటకటాల వెనక వున్న వారి ముఖం చూడలేకపోయాను. మనస్సూ, శరీరమూ అణువణువు అవమానంతో కృంగి పోవడంతో మనస్సులో చీకట్లు వ్యాపించినా కన్నీరు రాలేదు.
"ఏమిటండీ ఇదంతా" అన్నాను.
"నీలో మార్పు వచ్చిందను కున్నానురా కుమార్. కానీ ఈ మార్పు ఇట్లా పరిణమిస్తుందను కోలేదు. నీకు వచ్చిన కళంకం ఎట్లాగూ పోదు. మధ్య సుభాషిణి తలెత్తుకు తిరగాలేకుండా వున్నది." అన్నారు రామారావు గారు. వారు వంచిన తల ఎత్తలేదు.

"పుష్కలంగా డబ్బు సంపాదించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం నేర్చుకున్న ఈ చేతులకు అంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మనస్సు పాత భావాలూ, అలవాట్ల వైపు పరుగెత్తింది. అంతేకాదు కాకినాడ లోదాదాపు రెండువేల వరకూ అప్పులు చేశాను. ఉత్తరాలూ, కబుర్లూ వచ్చాయి షాపులో డబ్బు చేతికి చిక్కింది. మనస్సు కట్టు తప్పింది. అంతే డబ్బు చేజిక్కించుకున్నాను" అన్నారు.
"ఆ డబ్బంతా ఏం చేశారు" అడిగాను.
"పది హీను వందలు కాకినాడ పంపించాను. నాలుగు వందలు ఈ ఊళ్ళో చేసిన అప్పులు తీర్చాను. వంద రూపాయలు పైగా నేను ఖర్చు పెట్టుకున్నాను."
"నీ అప్పులు తీర్చు కోటానికి యిదిరా మార్గం కుమార్. ఉన్న అవకాశాలూ, వచ్చిన అవకాశాలూ అన్నీ ఇట్లా సర్వనాశనం చేసుకుంటుంటే ఇంక నిన్ను ఎవ్వరూ ఏ పరిస్థితుల్లో నూ నమ్మరు. సరే ఆ డబ్బు కట్టే మార్గం ' అన్నారు రామారావు గారు.
'డబ్బా, ఆ అవకాశం లేదు. జైల్లోనే వుంటాను. నాకీ ప్రాయశ్చిత్తం కావాల్సిందే" అన్నారు.
