అతను మరొక్క క్షణంకూడా ఆమెవంక చూడలేకపోయాడు. నాడి చూడాలన్న విషయం కూడా అతనికి తట్టలేదు. "చనిపోయింది. షి ఈజ్ డెడ్" అన్నాడు పిచ్చివాడిలా చేతులు జుట్టులోకి దూర్చుకుంటూ. గభాలున లేచి నుంచున్నాడు! చేతిలోంచి స్టెతస్కోపు జారిపడింది. మరి పరిసరాలు గమనించకుండా, తను చేస్తున్నదేమిటో తెలుసుకోకుండా గదిలోంచి బయటకు పోయాడు, గబగబా అడుగులు వేస్తూ, తన విధ్యుక్తధర్మంనుండి, దాటలేని తన బలహీనతనుండి.
ఒక రోగి చివరి దశలో చెయ్యవలసిన వైద్యాన్ని, నెరవేర్చవలిసిన విధిని అన్నిటిని పక్కకుతోసి దాటిపోయాడు! మరొక్కసారి ఓడిపోయాడు!...వంచించబడ్డాడు. సాధ్యంకానిదని తెలిసి, సాధించదలిచి, ఒకరి కోర్కె తీర్చడానికి తన ఆశయాన్ని చంపుకున్న శ్రీనివాస్ ఓడిపోయాడు మరొకసారి!....ఆ హాస్పిటల్ ఆవరణనుండి దాటిపోయాడు.
ఇంజక్షన్ తో అడుగుపెట్టిన నర్సు గదిలో శ్రీనివాస్ లేకపోవడంతో, ఒక్క క్షణం నివ్వెరపోయి, కర్తవ్య మూఢురాలైంది! "డాక్టర్ శ్రీనివాస్!... డాక్టర్ శ్రీనివాస్! ..." అన్న ఆమె పిలుపు నిశ్శబ్ధాన్ని చీల్చుకుని, హాస్పిటల్ ఆవరణలో అంతట ఖంగున మోగింది!
నిమిషంలో హాస్పిటల్ అంతా మోగిపోయింది. క్షణాల మీద చిన్న డాక్టర్లు ఆ గదిముందు వాలారు! నర్సులు పక్కగా నుంచుని గుసగుసలాడుతున్నారు. ఆ క్షణంలో ఎవరి నోటంట విన్నా ఇదే విషయం!
ఆ ఉదయం పెద్ద ఆపరేషన్ చేసిన ఒక రోగికి ఆశించని లక్షణాలు కనిపించడంతో, ఆ సమయంలో అప్పుడే కారు దిగారు డాక్టర్ కృష్ణమూర్తి. అక్కడ జరుగుతున్నది విని క్షణకాలం కొయ్యబారిపోయారు! నిరాశ వేసిన నీలితెరలు ఆయన ముఖాన్ని కప్పి వేశాయి. ఉత్సాహం అంతా చచ్చిపోయింది! వెంటనే విషయాన్ని అవగాహనం చేసుకుని హడావిడిగా ఆమె గదిలోకి వెళ్ళారు వచ్చిన పని మరిచిపోయి.
28
కటికచీకటిని చీల్చుకుంటూ ఆకాశం ఉరుములతో మెరిసింది. ఇంటి తలుపులు దఢాలున తెరుచుకున్నాయి. వాలుకుర్చీలో నిద్ర పట్టక, పట్టక పట్టిన అనూరాధ ఉలిక్కిపడి లేచింది, ఉరిమిన ఉరుముకో, తెరుచుకున్న తలుపు చప్పుడుకో.
నిద్రకళ్ళతో మత్తుగా అటూ ఇటూ చూచి, శ్రీనివాస్ ను చూచేసరికి మత్తు క్షణంలో వదిలింది. ఆశ్చర్యం అవధులు దాటింది.
నిద్రతో మందమయిన గొంతును సవరించుకుంటూ, "ఇదేమిటి, ఈ సమయంలో వచ్చారు? ఒంట్లో బాగాలేదా?" అని అడిగింది కంపిస్తున్న కంఠంతో.
ఆ మాటలు విని చటుక్కున అటు తిరిగి ఆమెవంక దృష్టి సారించాడు. ఆ చూపులో ఎన్నో అర్ధాలు గోచరించాయి. అసలు అనూరాధ అన్న మనిషి ఆ ఇంట్లో ఉంటుందన్న ఆలోచనే లేనట్లు, అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లు బాధ, భయం గోచరిస్తున్న అతని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. బడలికతో కళ్ళు కెంపులయ్యాయి. హృదయంలో బాధ, నిరాశ కోపంగా మారి పెల్లుబుకుతూంది. ఆ తీక్షణతకు తాను నిలవలేననుకుంది. కోపానికే ఎదటివారిని భస్మీపటలం చెయ్యగలిగే శక్తి ఉంటే తానక్కడ ఉండననుకుంది!
మరో మాట మాట్లాడకుండా పక్కగా టేబుల్ దగ్గిర కూజాలోంచి మంచినీళ్ళు వంచి అతనికి అందించబోయింది. క్షణంలో ఆమె చేతిలోని గ్లాసు ఎదటిగోడకు కొట్టుకుని ముక్కలయింది! కిందపడ్డ నీళ్ళు చిమ్మి ముఖం మీద పడ్డాయి. పమిటచెంగుతో ముఖం తుడుచుకుంది. అతన్ని మాట్లాడించాలా? లేదా? అన్నంత భయం ఆమెను మూగదాన్ని చేసింది.
అతనిలోని దౌర్భల్యం, హృదయంలోని ఆవేదన, తను చేసిన పనికి పశ్చాత్తాపం, నివారించలేకపోయానన్న తపన, రకరకాల భావాలు కోపంగా మారి మాటల ప్రవాహంలో కొట్టుకుపోసాగాయి. ఎన్నేళ్ళుగానో అణిగిఉన్న బాధతో ఇంతవరకు తనకీ స్థితి కలిగినందుకు నిందించేందుకు అవకాశం కలగని శ్రీనివాస్ ఆ రోజు దాదాపు విచక్షణ కోల్పోయాడు. ఆవేశం ఆలోచనాశక్తిని నశింప చేస్తూంది. అర్ధరహితమయిన కోపం అనర్దానికే దారితీస్తుంది. దానితో యుక్తాయుక్త జ్ఞానం నశించింది. ఆ ఆవేశంలో ఎన్నో అడిగేయాలని, దులిపి వేయాలి అన్న ఆత్రతలో మాటలు తడబడసాగాయి.
"ఈ సమయంలో నీ మూలంగా .... నీ సలహామూలంగా ఈనాడు దోషిగా నిలబడవలసివచ్చింది!" అతని కంఠంలోని కరుకుదనానికి క్షణకాలం మనస్సు మొద్దుబారిపోయింది రాధకు. మార్దవమేగాని, మరో భావం ఎరగని అతని కంఠం గరళం మింగినట్లుగా అయింది.
"మీరనేది ఏమిటో నా కర్ధం కావడంలేదు. ముందు లోపలికి పదండి, కొంచం విశ్రాంతి తీసుకుందురుగాని."
"ఎలా అర్ధమవుతుంది? అసలు నన్ను అర్ధం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించావు? నీ కోర్కెలు నీవేగాని, ఎదటివారి ఉద్దేశాలు అర్ధం చేసుకోవడానికి నువ్వెప్పుడు ప్రయత్నించావు?"
"ఇవాళ మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ముందు కొంచం విశ్రాంతి తీసుకోండి."
"విశ్రాంతి .... ఈ క్షణంలో నీలాంటివాళ్ళకు కలుగుతుందేమోగాని నాకు కాదు. నీకోసం మొదలుపెట్టిన నా ఉద్యోగంమూలంగా, నా చేతకానితనం మూలంగా ఈనాడు ఒక ప్రాణి జీవితం అఖరయింది. నీ ప్రాణస్నేహితురాలి తల్లి జీవితం నా చేతిలో ఆఖరయింది. అదే, మరొక..."
ఆమెకు ఇంక మిగిలినది వినిపించలేదు. "ఆఁ, లలితతల్లి చనిపోయిందా! ఏమిటీ మీరనేది?..." అంది అనాలోచితంగా.
క్షణకాలం ఆమె మనస్సు దిమ్మెరపోయింది. ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించే లలిత తల్లి పోయిందా? ...పోయిందా?" మనసులో అనుకుంటున్న మాటలు బయటికే వెలువడిపోయాయి.
ఆమె మాటలు అతన్ని మరింత రెచ్చగొట్టాయి. "ఆఁ! నా చేతుల్లో....ఆఖరి వరకు ఉండి సరిఅయిన వైద్యం జరిగిందో లేదో చూచేందుకైనా ఇష్టపడని నా చేతులలో...ఇదంతా నీమూలంగా, ఇదంతా నీమూలంగా." అతను పూర్తిగా విచక్షణజ్ఞానం కోల్పోయాడు.
అర్ద్రరాత్రి అనుకోకుండా జరిగిన ఈ సంఘటన ఆమెను చైతన్యరహితంగా చేసింది. ఒక్కపక్క ఆప్తమిత్రురాలి తల్లి మరణం! మరోపక్క నిందిస్తున్న భర్త! ఆమెకు ఏమిటి మాట్లాడాలో, ఏం చెప్పాలో పాలుపోలేదు.
"నాలో లేనిదాన్ని నమ్మించాలని చూచావు! నేను కాదనుకున్నది నాచేత చేయించావు! .... ఏనాడో నాకు సరిపడదనుకున్నదాన్ని నాలో ఇమడ్చాలని చూచావు!... నా నమ్మకాన్ని కూల్చేశావు! నువ్వు కావాలనుకునే వ్యక్తిని నేను కాలేను నీకు కావలిసిన డాక్టర్ శ్రీనివాస్ ను నేను కాదు. నాలో లేనివి పొందాలనుకున్న నీకు ఇంత నిరుత్సాహం కలిగించాక ఇక నా అవసరం లేదు. ఇక నీకు, నాకు ఎటువంటి సంబంధము లేదు."
అదిరిపడింది. తన చెవులను తనే నమ్మలేకపోయింది. "ఏమిటి, మీరనేది?" అంది వణుకుతున్న కంఠంతో.
"ఏమిటనేది?" అనుకరించాడు కోపంతోకూడిన వ్యంగ్యంతో. "ఏమిటి, నే ననేది? ఏం అర్ధం కావడంలేదా! అర్ధంకానంతగా మాట్లాడుతున్నావా? ఈ రోజు నా మనోవ్యథకు కారకురాలివి నువ్వు! పొంగిపొరలిన నా బాధల్ని మనఃక్లేశాల్ని అదుపులోకి తెచ్చుకుని, నీ స్నేహంతో మరిచిపోవాలనుకున్న నాకు సరియిన ఆనందాన్ని రుచి చూపించావు. నిర్మలంగా సాగిపోతున్న నా జీవితంలో తిరిగి రాళ్ళు విసిరావు! ఇదంతా నీకోసమే కాకపోతే, నీమూలంగా కాకపోతే తిరిగి నేను మెడిసిన్ ముఖం చూచి ఉండేవాణ్ణి కాదు. తిరిగి ఇలాటి పరిస్థితి ఎదురు కావలసిన అవసరమే కలిగేది కాదు! నాకు సాధ్యంకానిదని తెలిసి నా అంతట నేను దూరమయినదానికి నన్ను దగ్గిరికి చేర్చ ప్రయత్నించావు! ఎంతసేపు నాకు అవసరంలేనివాటికి వేటికోసమో ఆరాటపడ్డావుగాని నాకు కావలసినవి గ్రహించుకోలేకపోయావు. నేను కోరుకున్న జీవితానికి దగ్గిరయిన నేను, నా కోరికకు విరుద్ధంగా దూరమయ్యాను. నీకు నీ కోరికలు తీర్చుకోవడంతప్ప ఎదుటివారి కోరికలు తీర్చడం చేతకాదు. నీకు కావలసిన వ్యక్తిత్వం, వృత్తి నాలో లేవు. ఉన్నవాటిని ఉన్నట్లు అంగీకరించడం నీకు చేతకాదు."
"ఏమిటి, మీ మాటలు! నాకు కావలసింది మీరుకాని, మీలో ఏదో అని ఎలా అనుకుంటున్నారు? మీరు నన్ను తప్పు అర్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు కాదు, ఎక్కుడైనా నాకు కావలసింది మీరుకాని, మీ వృత్తి, ఐశ్వర్యం గౌరవ ప్రతిష్టలు నా కక్కరలేదు. కేవలం మీమీద అభిమానంతోనే, మీకు మంచి జరుగుతున్నందన్న ఉద్దేశంతోనే మీ జీవితంలో అభివృద్దికి భాగం పంచుకోవాలన్న లక్ష్యంతప్ప నాకు మరొకటి లేదు. మీరిలా పొరపాటుగా అర్ధం చేసుకుని ఈ విధంగా మాట్లాడటం భావ్యంకాదు."
"భావ్యమో కాదో, ఉచితమో కాదో నువ్వు చెప్పవలసిన రోజులు పోయాయి. నువ్వు చెప్పక్కరలేదు. ఇంక నేనంతకన్నా విననవసరం లేదు."
"మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. ఇప్పుడేకదా మీరు, నేను మీలో ఏదో లేనిదానికోసం ఆరాటపడ్డానన్నారు! మీమీద అభిమానంతో కాకపోతే, మీరంటే ఇష్టం కాకపోతే మీకోసం ఆరాటపడవలసిన అవసరం నాకేమిటి? కొంచెం శాంతంగా ఆలోచించండి."
"అవును నాకోసం ఆరాటపడ్డావు. కాదు, అది నాకోసం కాదు. నా అబివృద్ది కోసం కాదు. నీకోసం, నీ స్వంత ప్రయోజనంకోసం! ఒక రోజు నేను అభివృద్ధి లోకి వస్తే, ఫలానా వాడు డాక్టరవడానికి కారణం నువ్వని అందరూ అంటూంటే, విని పొంగిపోవడానికి. ఒక డాక్టరుభార్య ననిపించుకోవడంకోసం! అంతేగాని నీకు నా అవసరం లేదు. నీకు కావలసింది ఒక డాక్టర్. నేను కాదు."
"మరీ ఇంత ఆవేశపడకండి. కేవలం మీ భార్యననబట్టి, మీరు ముందుగానే మెడిసిన్ చదివి ఉండబట్టి మీలో అణగారిపోయిన భావాలను పైకి తీసుకురావాలన్న కోరికేతప్ప మరో ఉద్దేశం లేదు. నాకు కావలసింది మీరు. దయచేసి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది కొంచం వినిపించుకోండి."
"నువ్వు చెప్పేందుకు, నేను వినేందుకు మనమధ్య ఆ రోజులు పోయాయి! అనవసరమయిన వాటికి, అందనివాటికి ఈ తాపత్రయం అనవసరం!"
"మీరు ఇంత ఆవేశానికి లోనై ఆలోచించలేనప్పుడు నేను చెప్పడానికైనా, మీరు వినడానికైనా అవకాశం లేదు. దయచేసి కాసేపు పడుకోండి. మిగిలినవి తరవాత చూద్దాం. మీకు విశ్రాంతి అవసరం.
"ఇంక ఇక్కడున్నంతసేపు ఒకటే విశ్రాంతి. నీ సమక్షంలో నాకు కలిగేది విశ్రాంతి కాదు, విసుగు. ఒకపక్క నామూలంగా ఒక స్త్రీ మరణించిందంటే, ఒక అమ్మాయి అనాథ అయిందంటే ఎలా విశ్రాంతి కలుగుతుంది? అది నీలాంటి కఠినులకుగాని, నాలాంటివాళ్ళకు కాదు. నీ కోర్కెలు తీర్చలేని నేను నీకు భర్తగా ఉండ తగను, నీకు, నాకు ఎలాంటి సంబంధమూ లేదు!"
"సంబంధం ఉందనుకుంటే ఉండేందుకు, లేదనుకుంటే పోయేందుకు ఇదేం బొమ్మలపెళ్ళా? ఇందుక మనం చేసుకున్న వివాహం? ఇదేనా ఇన్ని నెలల దాంపత్యానికి ఫలితం?.... నన్ను క్షమించండి. మీ అభివృద్ధి తప్ప మరొకటి ఆశించలేదు నేను. భర్త భవిష్యత్తులో భాగం పంచుకోవాలని, మీ ఉన్నతిని ఆశించటమే నేను చేసిన తప్పయితే, అది నా తప్పని ఒప్పుకుంటున్నాను. మీ అశాంతికి కారకురాలినైనందుకు నన్ను క్షమించండి" అంది అతని చేతులు పట్టుకుని.
ఆమె చేతులు విదుల్చుకుని, "ఇక మనమధ్య ఏ సంబంధము లేదు. నువ్వు, నేను ఒక ఇంట్లో ఉండటమనేది జరగని విషయం! ఇంక ఇక్కడ నేనుండలేను!"
"శ్రీనివాస్! ఏమిటీ అన్యాయం! ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారు? దయచేసి నా మాటలు వినిపించుకోండి. ఇలా వెళ్ళిపో....."ఆమె మాటలు పూర్తికాలేదు. దఢాలున తెరుచుకున్న తలుపులు, తెరుచుకున్నట్లే మూసుకున్నాయి. అనునయ పూర్వకమయిన మాటలు మూసిన తలుపులతో చేరి వెనక్కి తిరిగి వచ్చాయి. అనూరాధా శ్రీనివాసుల ప్రణయగాథకుమధ్య బంధాలు పడ్డాయి. వారి వివాహబంధానికి మధ్య తలుపులు మూసుకున్నాయి. మూసినా తలుపులకు పడిన తాళాన్ని తెరవడానికి అవసరమయిన 'కీ' లేని అనూరాధ నిశ్చేష్టిత అయి, నిస్పృహతో కుర్చీలో కూలబడిపోయింది. ఆలోచనారహిత అయిన అనూరాధ ఈ హఠాత్పరిణామానికి హతాశురాలయింది. తల దిమ్మెరపోయినట్లయి ఏ ఆలోచన లేక మెదడు మొద్దుబారింది. మెల్లిమెల్లిగా వాస్తవంలోకి వచ్చిన అనూరాధకు దుఃఖం వెల్లువై పారింది. ఒంటరిగా, నిశీధిరాత్రిలో హృదయావేదనతో వలవలా ఏడ్వసాగింది.
* * *
