Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 23


    "బాగుంది నాయనా! అమ్మని కూడా తీసుకురాక పోయావా? ఎన్నాళ్ళయిందో చూసి."
    "ముందర ఇల్లు కనుక్కుందామని నేను ఒంటరిగా వచ్చాను. ఈ మారు అమ్మని తీసుకువస్తాను. అమ్మ అస్తమానం మిమ్మల్ని , అమ్మమ్మని తలుచుకుంటూ ఉంటుంది. అన్నట్టు, అమ్మమ్మ ఎక్కడ? అన్నాడు అతను.
    "హయ్యో, ఇంకెక్కడి అమ్మమ్మ? ఈపాటికి బుగ్గైపోయి ఉంటుంది" అంది శాంతమ్మ కళ్ళు తుడుచుకుంటూ.
    తెల్లబోయా డతను. ఏమీ అర్ధం కానట్టున్న అతనిని చూసి చారుమతి చెప్పింది:
    "రెండురోజులనించీ మైకంలో ఉండి ఈరోజే మామ్మ చనిపోయింది. బావలిద్దరూ ఆవిణ్ణి తీసుకుని శ్మశానానికి వెళ్ళారు ఇప్పుడే."
    గోపాల్ ఎంతో బాధపడ్డాడు.
    "అయ్యో, అమ్మమ్మని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. ఆవిడకోసమని బత్తాయి పళ్ళుకూడా తెచ్చాను" అంటూ సంచీ చూపించాడు.
    "దేనికేనా ప్రాప్తం ఉండాలి" అంది శాంతమ్మ.
    గోపాల్ కాస్సేపు మౌనంగా కూర్చుని, లేచి నిలబడ్డాడు.
    "ఇంక వెళతానండీ. నా మనస్సేం బాగులేదు. నిన్ననేనా వచ్చానుకాదు. అమ్మమ్మని చూసేవాణ్ణి" అన్నాడు.
    "మన చేతిలో ఏం లేదు, నాయనా. బాధపడకు. ఈమారు అమ్మను తీసుకురా" అంది శాంతమ్మ.
    చారుమతి వీథిదాకా వచ్చి దిగబెట్టింది అతన్ని. వాళ్ళు వీధిలోకి వచ్చేసరికి గోపాలరావు, రామారావు ఇంటి గుమ్మం ఎక్కుతూ కనిపించారు. అపరిచితుడైన ఈ వ్యక్తిని ఒక్కసారి చూసి, ఇంట్లోకి వెళ్ళిపోయారిద్దరూ.
    "మా బావగార్లు" అంది చారుమతి.
    "వస్తాను, వదినా" అన్నాడు గోపాల్.
    "తరుచు వస్తూ ఉంటావుగా!" అంది చారుమతి.
    గోపాల్ ని చూడగానే ఇష్టం ఏర్పడింది చారుమతికి. తెలివైన మెరిసే కళ్ళూ, మనిషిలో వినయం ఇట్టే ఆకర్షించాయి ఆమెని.
    రాత్రి అందరు పడుకున్నప్పుడు, పక్కన పడుకున్న చారుమతిని అడిగింది శాంతమ్మ:
    "ఈ అబ్బాయి నీకెలా తెలుసునే?"
    "నాకు నాన్నగారు చనిపోకముందే తెలుసునమ్మా. నాన్నగారు ప్రతి నెల గోపాల్ చదువుకోసం పాతిక రూపాయలు పంపేవారు. నాన్నగారు పోయాక నేను డబ్బులేక పది రూపాయలు మాత్రమే పంపేదాన్ని. అదికూడా ఆరు నెలలే పంపాను" అంది చారుమతి.
    "అబ్బాయి చూడు, మీ నాన్న పంపిన డబ్బుతో చక్కగా పైకి వచ్చాడు. రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. మనకే ఏ దిక్కూ కనిపించదు. శంకరానికి ఉద్యోగం దొరికిందో లేదో?"
    "ఎందుకమ్మా అలా మాట్లాడుతావు? అతనికి మంచి ఉద్యోగం వచ్చింది, బాగుపడ్డాడు అని మనం బాధపడితే ఒరిగేది ఏమిటి? దానితో శంకరానికి ఉద్యోగం వచ్చేస్తుందా? అతను కష్టపడి పైకి వచ్చాడని సంతోషించు" అంది చారుమతి.
    చారుమతికి తల్లి అంటే ఎంత ఇష్టమున్నా, ఆవిడలో అప్పుడప్పుడు కనిపించే ఈర్ష్య చూస్తే నచ్చదు.

                                                        25

    మాధవరావు స్నానంచేసి అప్పుడే గదిలోకి వచ్చి అద్దంముందు కూర్చుని తల దువ్వుకుంటున్నాడు. కాంతమ్మ వంటింట్లో పూజ చేసుకుంటూంది. పద్మ చేతిలో ఉత్తరంతో గబుక్కున అతని గదిలో ప్రవేశించి మాధవరావు వెనకాలే నిలబడింది. అతనిది పచ్చని దేహచ్చాయ. తువ్వాలు కట్టుకుని అద్దంముందు కూర్చున్న అతను ఎంతో అందంగా ఉన్నాడు. అనాచ్చాదిత మైన తెల్లటి వీపు అక్కడక్కడ నీటి బిందువులతో మెరిసిపోతూంది. పాలరాయిలా నున్నగా ఉన్న అతని వీపు మీద ఒక్కసారి చెయ్యివేసి రాస్తే ఎలా ఉంటుందో అనుకుంది పద్మ. అతన్ని చూసినప్పుడల్లా ఉద్రేకంతో తన శరీరం, మనస్సు పొంగుతాయ్! తనని చూస్తే అతనిలో అలాంటి ఉద్రిక్తత ఉండదా? పద్మ ఆశ్చర్యపోయింది. అతని పురుషత్వంలో అపనమ్మకం కలిగింది.
    బొమ్మలా వెనకనే నిలుచున్న పద్మని చూసి మాధవరావు తెల్లబోయాడు. వెనక్కి తిరగకుండానే, చేతిలో పౌడరు వేసి రాసుకుంటూ, "ఏం కావాలి?" అన్నాడు.
    పద్మ ఆలోచనా ప్రపంచంలోంచి నిజలోకంలోకి దిగింది.
    "నా ఫ్రెండ్ ఉత్తరం రాసింది. చదువుతారా?"
    "నీ ఫ్రెండ్ ఉత్తరం రాస్తే నేనెందుకు చదవాలి?" మాధవరావు వెనక్కి తిరిగి పద్మని చూస్తూ అడిగాడు. అతని కళ్ళల్లో కనిపించిన అయిష్టత చూసి జంకింది పద్మ.
    "నా స్నేహితులను గురించి మీకు తెలుసుకోవాలని లేదా?"
    "లేదు" అన్నాడు అతను.
    "మా అమ్మ చూస్తుంది. నువ్విక్కడ నించి వెళ్ళిపో" అన్నాడు తిరిగి అతనే.
    "నేను మీతో మాట్లాడడంలో తప్పేమి ఉంది? ఇకనించి నేను మీతో ఇంట్లో మాట్లాడదలుచుకున్నాను." పద్మ తన నిశ్చయం చెప్పింది.
    "నువ్వు మాట్లాడినా నేను మాట్లాడను."
    "ఎందుకు మాట్లాడరు?"
    "మా అమ్మకి ఇష్టం ఉండదని చెప్పానుకదా?"
    "మీరు అమ్మతో అన్ని విపులంగా ఎందుకు మాట్లాడరు? మనిద్దరం మాట్లాడుకోడం ఇష్టంలేక పోతే, అమ్మ పెళ్ళి ఎందుకు చేశారు?"
    అతనేం మాట్లాడలేదు.
    "ఆమె పెద్దావిడ! పరిస్థితులు అర్ధం చేసుకోలేక పోవచ్చును. మీరు చదువుకున్నవారు కదా! ఆవిడికి పరిస్థితి సద్ది చెప్పకూడదూ?"
    "నేనేం ఆవిడికి చెప్పను." ముభావంగా అన్నాడు అతను.
    "ఎందుకు చెప్పరు? నేను చెప్పనా?" పద్మకోపంగా అంది.
    "ఎందుకు చెప్పనో నీకు అనవసరం. నువ్వు ఆవిడతో ఈ సంగతులు మాట్లాడ నవసరంలేదు."
    "నేను మాత్రం ఇక్కడ జీవచ్చవంలా అవసరమా? మీ కది ఇష్టమా?" పద్మ రోషంగా అడిగింది.
    "నీకు ఇక్కడ ఉండటం ఇష్టంలేకపోతే వెళ్ళిపోవచ్చును." మాధవరావులో చలనం లేదు.
    "ఎక్కడికి వెళ్ళను?" పద్మ రెట్టించింది.
    "అది నీ ఇష్టం" అంటూ గది బయటికి నడిచాడతను.
    పద్మకి కోపం, దుఃఖం, రోషం పెల్లుబుకుతున్నాయి. వెనక్కి తిరిగేసరికి గుమ్మానికి ఎదురుగా ఎర్రటి కళ్ళతో అత్తగారు! భయంతో వణికిపోతూ తన గదిలోకి పరిగెత్తి, తలుపు వేసుకుని ఏడ్చింది పద్మ. తనివితీరా ఏడవటంకంటే ఏమీ చెయ్యలేదు తను. తనొక పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఆ వ్యూహంలో బ్రతకలేదు, బయటపడలేదు. ఎంత అందం ఉంటేనేం! ఎన్ని సౌఖ్యాలు ఉంటేనేం! భర్త ప్రేమ లేని స్త్రీ జీవితం వ్యర్ధం. ఏం తప్పు చేసిందని తన కీ శిక్ష విధించాడు భగవంతుడు!
    ఎన్నో అనుకుంది! అత్తగారి ఎడల మంచిగా ఉండి, ఆవిణ్ణి మార్చాలనుకుంది. ఎప్పుడూ అనుమానంతో, తన అందంమీద ఈర్ష్యతో చూసే అత్తగారు తనని దగ్గిరికి చేరనివ్వలేదు.
    భర్తకి దగ్గిరగా వెళ్ళి అతనిని తనవేపు తిప్పుకోవాలనుకుంది. ఒక్కసారి అతనిలోని పురుషత్వాన్ని రెచ్చ గొడితే తనవాడౌతాడనుకుంది. సిగ్గు విడిచి భర్త దగ్గిరికి వెళ్ళింది. అతనిని రెచ్చగొట్ట ప్రయత్నించింది. అన్ని వృథా అయ్యాయి. అతనికి లోకంలో కనిపించే వస్తువు ఒకటే - అమ్మ. అమ్మకోసం తన జీవితాన్ని బలిచేసుకుంటాడు. భార్య జీవితాన్ని బలిచేస్తున్నాడు!
    అత్తగారి కథ తెలుసుకున్న పద్మ ఆవిడమీద ఎంతో జాలిపడింది. కాని ఈ ఆరునెలలలో ఆ జాలి అంతా కోపంగా మారిపోయింది. ఆవిడ ఒక బ్రహ్మరాక్షసిగా కనిపిస్తూంది ఇప్పుడు. ఆవిడికి తన సుఖంతప్ప ఎదటి వారి సుఖం అక్కరలేదు. చిన్నప్పుడు అత్తగారివల్ల తను కష్టాలు పడింది కనక, ఇప్పుడు తన కోడలిమీద ఆ కసి తీర్చుకోవాలి. భర్తతో తను సుఖించలేదు. ఇప్పుడు కోడలు కొడుకుతో సుఖించకూడదు. కోడలు తన అందంతో కొడుకుని ఎక్కడ మార్చేస్తుందో అని ఆవిడ భయం! కోడలి ఎడల ఆవిడ నిత్యశంకితురాలు!
    అష్టకష్టాలు పడి తన ప్రేమ, ప్రాణం ధారపోసి కొడుకుని పెంచింది. ఇప్పుడు కొడుకు ప్రేమంతా తన ఒకర్తికే చెందాలి. తాళిగట్టిన భార్యకి కొడుకు ప్రేమ కొంచెం ఇచ్చినా ఆవిడ సహించలేదు. కొడుక్కి కొన్ని ఇతర సుఖాలు కావాలని ఆవిడ మరిచిపోతూంది. కొడుకు కాపరానికే చిచ్చుపెట్టడానికి ఆవిడ వెనుదీయటం లేదు.
    ఆవిడ కొడుక్కి పెళ్ళి ఎందుకు చేసినట్టూ? - ఇది ఎప్పుడూ విడని సమస్య పద్మకి.
    భర్తకి తలిపై గల గుడ్డి ప్రేమ, భార్య ఎడల చూసే మూర్ఖత్వం తలుచుకుంటే పద్మకి కోపం కట్టలు తెంచుకు వస్తుంది.
    ఏడ్చి ఏడ్చి మనస్సులో బాధంతా కంటినీరులో కలుపుకుని విశ్రాంతి పొందింది పద్మ. కళ్ళు తుడుచుకుని చూస్తే బల్లమీద ఎదురుగా శ్రీదేవి ఉత్తరం కనిపించింది. ఉండచుట్టేసిన ఆ ఉత్తరాన్ని తిరిగి సాపుచేసి ఎదురుగా పెట్టుకుంది.
    "ప్రియమైన పద్మకు,
    నేను హైదరాబాద్ వచ్చి నెల్లాళ్ళు అయింది.
    నీకు చారు రాసే ఉంటుంది, మా ఇంట్లో ఒక చిన్న బాబు నాలుగు నెలల క్రిందట వెలిశాడని. పేరు 'అమర్'. ఎలా ఉందీ పేరు? నువ్వు, చారు నా పెళ్ళి అప్పుడు బావపేరు బాగాలేదని నవ్వారు. పోనీ, మా బాబు పేరు వచ్చిందా?
    పురుడు చాలా కష్టమైంది. పాపని కన్న ప్రతి స్త్రీ 'తన పురుడు చాలా కష్టమైంది' అని అనుకుంటుందేమో! ఒక రోజంతా నొప్పులతో బాధపడ్డాను. తీరా ఆసుపత్రికి తీసుకువెళితే నొప్పులు ఆగిపోయాయి. నొప్పులు రావాలని డాక్టర్లు పాట్లుపడ్డారు. మళ్ళీ ఇంజెక్షన్స్ - గొడవా! అన్నీ రాస్తే నువ్వు ముందే భయపడతావేమో! డాక్టర్లు 'నాచురల్ డెలివరీ' కావాలని ఎంత కష్టపడ్డా, చివరికి 'ఫోర్ సెస్స్' ఉపయోగించడం, కొద్దిగా కుట్లు పడటం తప్పలేదు. తరవాత బావతో అంతా చెబితే, 'అయ్యో, ఇంత కష్టపడ్డావా?' అని చాల బాధపడ్డారు. 'నువ్వింత కష్టపడతావని తెలిస్తే పిల్లలే వద్దందును' అంటారు. బాగుందా?
    ఎంత కష్టపడితేనేం, పద్మా! పక్కన బాబుని చూసుకోగానే పడ్డ కష్టమంతా మరిచిపోతాం. ఎంత ఆనందంగా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? బాబుని దగ్గిరికి తీసుకుని ముద్దుపెట్టుకోవడంకంటే తీయని అనుభవం ఇంకొకటి లేదనిపిస్తుంది. నీకూ ఈ అనుభవం అయ్యాక ఆ తీపి ఎలాంటిదో తెలుస్తుంది. ఈ అనుభవాన్ని మాటలలో చెప్పలేము.
    మా బాబుకి మా ఇద్దరి పోలికలు వచ్చాయి. "నా మొద్దు బుర్రా, బావ అల్లరీ' వచ్చాయిట - బావ ఏడిపిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి తెల్లగానే ఉన్నా, బాబు పెద్దయ్యాక నల్లగా మారిపోవచ్చును. అయినా మగవాడికి ఏ రంగు అయితేనేం? మీ పాపనిమాత్రం తెల్లగా, బొద్దుగా ఉండేటట్టు కను. మీవారి రంగు, నీ రూపం వస్తే పాప అంత అందమైనది ఈ సృష్టిలోనే ఉండదు. మా కోడల్ని గురించి అప్పుడే నేను మంచి కలలు కంటున్నాను.
    ఆలస్యం చెయ్యకు. మా బాబు పెద్దవాడైపోతున్నాడు.
                                                                        ప్రేమతో
                                                                        శ్రీదేవి."
    పద్మ నిట్టూర్చింది. అందమైన కోడలు, మంచి కలలు, తీయని అనుభవం! -అవన్నీ తన కెక్కడ? అన్నీ ఎండమావులు. పెళ్ళి అయి నాలుగేళ్లయినా తను అనాఘ్రాత పుష్పంగానే మిగిలిపోయిందంటే శ్రీదేవి ఏమంటుందో? జీవితంలో ఏ అనుభవంలేకుండా అడివిని కాచిన వెన్నెలలా ఇలా ఈ జీవితం గడిచిపోతూంది.
    పద్మకి తనమీద తనకే జాలివేసింది. తిరిగి కళ్ళల్లో నీళ్ళు  తిరిగాయి.
    పద్మ ఆ రోజంతా భోజనం చెయ్యలేదు. అత్త గారూ బలవంతం చెయ్యలేదు. ఒక్కసారిమాత్రం విసురుగా, "తిండి మానేసి ఎవరిని సాదించాలని?" అంది. పద్మ మాట్లాడకుండా పుస్తకాలు ముందర వేసుకు కూర్చుంది. మర్నాటినించీ పరీక్షలు. బి.ఏ. అయిపోయేక ఏం చెయ్యాలి? ఇలాంటి ఇంటి పరిస్థితులలో పిచ్చి ఎక్కిపోకుండా తనని కాపాడేవి పుస్తకాలు, కాలేజీ! అంతే! ఆ చదువుకూడా ఆగిపోతే ఏది దిక్కు?
    "తలనొప్పిగా ఉంది" అంటూ మాధవరావు మూడు గంటలకే ఆఫీసునించి ఇంటికి వచ్చేశాడు.
    కాంతమ్మ గాభరాపడింది. మంచంవేసి, పక్క పరిచి, కొడుకుని పడుకోమని తను అమృతాంజనం తెచ్చింది. నుదుటిమీద రాయబోతూ చూసి, "బాబూ, జ్వరంగా ఉందేమిటి? ఇలా కాలిపోతూంది ఒళ్ళు" అంది. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    మాధవరావు, "నువ్వేం కంగారుపడకమ్మా" అంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
    కొడుక్కి అమృతాంజనం రాసింది. వేడి వేడి కాఫీతో తలనొప్పి మాత్ర ఇచ్చింది. అయినా ఆవిడ కంగారు తగ్గలేదు. అయిదు నిమిషాలకి ఒకసారి "బాబూ, తల నొప్పి తగ్గిందా? ఇంకా జ్వరం తగ్గలేదేమిటి? డాక్టర్ని తీసుకురానా?" అని అడుగుతూనే ఉంది.
    భర్తకి జ్వరం అని తెలిసి పద్మకూడా ఆత్రపడింది. మంచం దగ్గిరికి వచ్చి, "ఎలా ఉంది తలనొప్పి? జ్వరం ఉందా?" అని అత్తగారిని అడిగింది.
    పద్మని చూస్తూనే అత్తగారు కస్సుమని లేచింది.
    "నా బాబుదగ్గిరికి రాకు. నీవల్లే ఈ జ్వరం వచ్చింది. నువ్వే ప్రొద్దున్న ఏదో చేసి ఉంటావు" అంది.
    పద్మ సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోయింది. తన భర్తకి ఒంట్లో బాగుండకపోతే ఆమాత్రం అడిగే హక్కు తనకి లేదా?
    రాత్రి అంతా మగత నిద్రగానే గడిపారు పద్మా, అత్తగారూ. కాంతమ్మ అస్తమానం కొడుకుని ముట్టుకుని చూస్తూనే ఉంది.
    తెల్లవారింది. మాధవరావు జ్వరం తగ్గలేదు. కొద్దిగా ఎక్కువ అయింది. కాంతమ్మ పనిమనిషిచేత పక్క ఇంట్లో ఉన్న డాక్టరుకి కబురు పంపింది. తొమ్మిదింటికి డాక్టరు వచ్చి మాధవరావుని పరీక్షించాడు.
    "ఏమి జ్వరమండీ? ఎంత ఉంది జ్వరం? ఇవాళ తగ్గిపోతుందా?" అంటూ ఆత్రంగా అడిగింది కాంతమ్మ.
    "మీరేం కంగారుపడకండి. ఫ్లూ జ్వరం. రెండు రోజులలో తగ్గిపోతుంది" అన్నాడు డాక్టరు.
    పద్మ ముఖం వేలవేసుకుని దూరంగా తన గది ద్వార బంధానికి ఆనుకుని నిలుచుంది. డాక్టరు ఏమనుకున్నాడో పద్మవేపు తిరిగి, "మీరు దిగులుపడవలిసింది ఏమీ లేదమ్మా. చదువుకున్నవారు మీరే అలా అయితే ఎలా? ఈ మాత్రలు మూడుపూటలా వేడికాఫీతో కాని, పాలతోగాని ఇవ్వండి. అన్నం పెట్టకండి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వండి" అని మందు ఇస్తూ, ఇంగ్లీషులో చెప్పాడు.
    కాంతమ్మ వెంటనే గబుక్కున మందుపొట్లాలు డాక్టరు చేతిలోనించి లాగేసుకుని, "ఆ అమ్మాయికి ఏమీ తెలియదండీ. నాకు మీరు అంతా తమిళంలో చెప్పండి" అంది.
    డాక్టరు తెల్లబోయాడు. ఒక్కసారి పద్మ ముఖం వంక ఆశ్చర్యంగా చూసి, తరవాత కాంతమ్మ గారితో ఆహారం విషయం, మందు విషయం తమిళంలో చెప్పి వెళ్ళిపోయాడు.
    పద్మ అవమానభారంతో తలవంచుకుని గదిలోకి వెళ్ళిపోయింది.
    ఆ రోజు మొదటి పరీక్ష. కాలేజీకి వెళ్ళాలా? మావాలా? వెళ్ళితే అత్తగారు ఏమంటుందో? అయినా తను ఇంట్లో ఉండి చేస్తే పని ఏమిటి? ఎలాగా భర్త దగ్గిరికి వెళ్ళనీయదు అత్తగారు.
    పద్మ పరీక్షకి వెళ్ళడానికే నిశ్చయించుకుంది.
    పద్మ సాయంత్రం కాలేజీనించి వచ్చేసరికి కాంతమ్మ కొడుకు మంచానికే ఆనుకుని కూర్చుని ఉంది. జ్వరం తగ్గిందో, లేదో తెలియదు. దగ్గిరికి వెళ్ళితే అత్తగారు కోపగిస్తుంది. పద్మవల్లే కొడుకుకి జ్వరం వచ్చిందని ఆవిడ దురభిప్రాయం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS