Previous Page Next Page 
జీవనకలశం పేజి 24

 

    ప్రసన్న లక్ష్మికి మరో సంబంధం ఖాయ మైంది.
    పెళ్ళి రెండురోజులే వుంది. పెళ్ళి పనులు జోరుగా సాగిపోతున్నాయి. అప్పటికే కొందరు చుట్టాలు వచ్చేశారు. ఇల్లంతా సందడి సందడిగా వుంది.
    "నాకీ పెళ్ళి వద్దు వద్దు అని మొత్తుకునే ప్రసన్నమాట యెవ్వరూ విన్పించుకోలేదు ఇంక వాసు పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు రెండే రోజులు గడుపు అనుకుంటూ
    "వాసు బాబూ."    
    మీకోసం యెదురు చూస్తున్నాను.
                    ప్రసన్న.
    చిన్న చీటీ వాసు చేతిలో పెట్టి పన్నెండేళ్ళ కుర్రాడు పరుగుతీశాడు.
    శుక్రవారం రాత్రికి వివాహం.
    ఎలా కలుసుకోవటం!
    ఒకే ఒక్కరోజు వ్యవధి అంటే. ఇరవై నాలుగ్గంటలు మాత్రమే ఈ లోపల.... నీవు త్వరపడకపోతే ప్రసన్న పరాయిదై పోతుంది...ఆ తర్వాత జీవితాంతం నువ్వు దుఃఖించినా ప్రయోజనం లేదు.
    ఒకే రోజు.
    ఈ ఆరాటంలో అసలు వుపాయమే అలోచించటం లేదు.
    వెంకటేశ్వర్లు దగ్గరికి పరుగుతీశాడు.
    మిత్రులిద్దరూ ఆలోచనల మీద ఆలోచనలు చేశారు. చేస్తున్నారు సరాసరివెళ్ళి ప్రసన్న తండ్రిని అడిగితే జవాబు యెలా వస్తుందో వాసుకి బాగా తెలుసు.
    "భాయ్ అడ్డుదార్లు వెతుక్కోవలసిందే"    
    పదే పదే హెచ్చరించాడువెంకటేశ్వర్లు. మిత్రుడి అభిప్రాయానికి వాసు ఆమోదించ లేకుండా వున్నాడు. స్నేహితుడిని వప్పించటానికి సతమత మవుతున్నాడు వెంకటేశ్వర్లు.
    ఆలోచిస్తే యెలా! అలనాడు శ్రీకృష్ణుడే రుక్మిణిని యెలా చేపట్టాడు? పోనీ పురాణాలు వదిలేయ్ సంయుక్తని పృథ్వీరాజు యెత్తుకుపోలేదు గనుకా ఆ అమ్మాయి ఆమోదం వుందిగనుక..." ఆగిపోయాడు వెంకటేశ్వర్లు తన ప్లాను వాసు చెవిలో వూది.
    సరే అంటూ తల వూపక తప్పలేదు వాసుకి.

                               *    *    *

    మంచిరోజని తిధీ నక్షత్రం చూసి బుధవారమే పెళ్ళికూతుర్ని చేశారు ప్రసన్నలక్ష్మిని. నుదుట కళ్యాణం బొట్టూ. బుగ్గన చుక్కా, చేతి నిండుగా రంగురంగు గాజులూ, కాళ్ళకి పసుపు పారాణీ, చేతులకి గోరింటాకు సాక్షాత్తూ లక్ష్మీ దేవిలాగా వెలిగిపోతోంది ముఖం.
    సాయంత్రం అయిదు దాటింది.
    అందరూ యెవరి పనుల్లో వారు వున్నారు. గాడి పొయ్యి దగ్గర వంటవాళ్లు, లడ్లూ మరికొన్ని పిండివంటలూ తయారుచేస్తున్నారు.
    తాసీల్దారుగారి కారుపెట్టుకునే తడి తల షెడ్డు అంటుకుంది.

 

                     


    "మంటలు మంటలు" అంటూ అందరూ. పరుగుతీశారు ఖంగారుగా. అంతా  గందరగోళం. పావుగంట గడిచిపోయింది.
    పారిపోతున్న వెంకటేశ్వర్లుని పట్టుకున్నాడు ఓ కుర్రాడు. ఇంతలో ఒక కుర్రాడు వచ్చి నాలుగు తగల్నిచ్చాడు.
    ఇంతలో ఫైరింజన్ లు గణగణ మంటూ వచ్చి నాయి.
    "అరే.... ఫైరింజన్ కి ఫోను చేసి వెడుతున్నాను లేవయ్యా," అంటూ గుంజుకుని పారిపోయాడు వెంకటేశ్వర్లు.    
    మరే అపాయమూ జరక్కుండానే మంటలని చల్లార్చారు.
    అర్ధగంట తర్వాత హడావుడి తగ్గి గుండె కుదుట పడింతర్వాత తాసీల్దారు గారి చిన్న కొడుక్కి ఓ అనుమానం వచ్చింది.
    "ఇంత హడావిడిలో అసలు పోను యెవరు చేశారూ! ఒకవేళ చేసినా ఇంత త్వరగా వాళ్ళు యెలా రాగలిగారు" అని.
    "అవును నిజమే.... యెలా వచ్చారూ?" అంటూ ఒకర్ని ఒకరు ప్రశ్నించుకున్నారు. వాళ్ళనే అడిగారు.
    "మాకు ఐదుగంటలకే ఫోను వచ్చింది. తాసీల్దారుగారి కారుషెడ్డు తగలబడిపోతోంది." అంటూ అడ్రస్ చెప్పారు."
    "ఏమిటీ.... అయిదింటికి అసలు నిప్పే అంటుకోందే. చాలా విచిత్రంగా వుందే" అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
    ఇంతలో ఇంట్లోనించి గోలగా యేడుపులు విన్పిస్తూంటే అందరూ ఏమిటేమిటి అంటూ ఇంట్లో జొరబడ్డారు.
    "పెళ్ళి కూతురు.... పెళ్ళి కూతురు కన్పించటంలేదు." అంటూ అగ్ని ప్రమాదం తప్పి పోయిందన్న ఆనందం ఆ క్షణంలో ఆవిరై పోయింది.
    "ఎక్కడికి వెళ్ళింది? ఏమయింది" అనే కేక యీ యేడుపులో ఆ ఇల్లు మార్మోగి పోయింది.
    "ప్రసన్నతల్లి అయ్యో నా తల్లీ ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని ప్రాణం తీసుకున్నావా అమ్మా" అంటూ గుండెలు బాదుకుంది.
    వూరంతా గాలించేశారు. కాని ప్రసన్నజాడ తెలియలేదు.

                                 *    *    *

    శనివారం ఉదయం తాసీల్దారుగార్కి ఎక్సు ప్రెస్ డెలివరీలో ఓ కవరు అందింది.
    పూజ్యులైన మామగార్కి,
                    నమస్కారములు.
    మీరూ పెద్దలూ నిర్ణయించిన సుముహూర్తానికి ప్రసన్నకీ. నాకూ వెంకటేశ్వరుడి సమక్షంలో వివాహం జరిగిపోయింది.
    మా యింటికి వచ్చేస్తున్నాం....
    నమస్కారాలతో
    అల్లుడు వాసుదేవరావు.
    వుత్తరం చూస్తూనే ఆవేశాలూ కావేషాలతో వూగిపోయారు ప్రతి ఒక్కరూ. చిన్నన్న మురళి మాత్రం తేలుకుట్టిన దొంగలా వూరుకున్నాడు.
    తల్లి మాత్రం "సలక్షణంగా జరగవలసిన వివాహం దిక్కులేని దానిలా అయింది న తల్లికి" అంటూ మరోసారి యేడ్చి రాగాలు పెట్టింది.
    తలవంపులు తెచ్చిన చెల్లెలిని సవాలక్ష తిట్టి పోస్తూ పెద్దన్న చిందులుతొక్కాడు.
    తాసీల్దారుగారు బాధని భరించలేక వుక్కిరి బిక్కిరి అవుతూ.
    "ఇంక నా గుమ్మం తొక్కేందుకు వీలులేదు, పాతకి" అంటూ.
    "లేచిపోయిన ప్రసన్న ఆ ఇంటి పరువూ ప్రతిష్టా గంగలో కల్పేసింది" అనుకున్నారు అందరూ.
    "పిదపకాలం పిదపబుద్దులూ కాకపోతే తల్లీ తండ్రీ కుదిర్చిన సంబంధం కాలదన్నుకుని ఆ వెధవతో యేం సుఖపడుతుందో?" అంటూ అమ్మలక్కలు గుసగుసలాడారు.
    యెవరు యెన్ని విధాల అనుకున్నా పెళ్ళి మాత్రం జరిగిపోయి ప్రసన్నలక్ష్మి వాసుకి భార్య అయింది.
    
                                 *    *    *

    పెళ్ళి అయి ప్రసన్న ఆ ఇంట్లో కాలుపెట్టిన వేళావిశేషం వల్లగానీ, కృష్ణమూర్తిగారి ప్రయత్నం వల్లగానీ వాసుకి ఓ కంపెనీలో నుంచి వుద్యోగం వచ్చింది. అయితే విశాఖపట్నంలో వుద్యోగం. ఇంక దూరం వెళ్ళిపోతున్నాము ఒక్కసారి అమ్మనీ, నాన్ననీ చూసివస్తాను అంటూన్న ప్రసన్నని వారించాడు వాసు. "వద్దు వెళ్ళవద్దు....వాళ్ళు నీవు కావాలని వచ్చినప్పుడు పంపటానికి యెన్నడూ కాదనను."
    కాని ప్రసన్న పట్టుపట్టింది.
    "ఒక్కసారి చూసివస్తా" నంటూ.
    వెళ్ళిన రిక్షాలోనే తిరిగి వచ్చేసి భర్తగుండెలో తల దాచుకుని కుమిలిపోయింది.    
    మిమ్మల్ని వాళ్ళు దూషిస్తూంటే వినలేక పోయాను. నన్ను క్షమించండి. మీ మాట కాదని వెళ్ళినందుకు.....వెళ్ళినందుకు" అంటూ వెక్కి వెక్కి ఏడ్చే ప్రసన్నని వోదార్చాడు వాసు.
    ఇలా దూరం వెళ్ళటం కూడా ఒకందుకు మంచిదే. కొన్నాళ్ళు పోయింతర్వాత ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తాను. అంటూ ప్రయాణమై వదిన దగ్గరకు వెళ్ళారు భార్యాభర్త లిద్దరూ.
    నమస్కరిస్తున్న ప్రసన్నని శ్రీలక్ష్మి లేవనెత్తి ఆశీర్వదించింది.
    "అదృష్టవంతురాలివమ్మా.... వాసు లాంటి భర్త లభించటం చాలా అదృష్టం. ఈ అదృష్టాన్ని పదిలంగా నిలుపుకో."
    "వ్యాపరం యెలా వుంది వదినా" అడిగాడు వాసు.
    వీణ చిన్నాన్న వళ్ళో కూర్చుంది. బాబ్జీ నేనూ అంటూ తగూకి దిగాడు.
    ఆ ఇద్ధరినీ వళ్ళో కూర్చోపెట్టుకుని తగూ తీర్చేశాడు వాసు.
    అన్నయ్య  తిరిగి యెప్పుడు వస్తాడో యేమో? పత్రికల్లో వేయించాను. యెన్నో చోట్ల వెతికించాను. జాడ తెలియలేదు వదినా! ఎన్నాళ్ళని ఇలా వంటరిగా వుండగలవు. ఈ పరిసరాలు వదిలి దూరంగా కొన్ని రోజులన్నా వుందువుగాని నాతో రా వదినా" అంటూన్న వాసుని ఆప్యాయంగా చూస్తూ అంది శ్రీలక్ష్మి.
    "వద్దు వాసూ....నే నెక్కడికీ రాలేను. పిల్లలని పెంచి పెద్దచేసే బాధ్యత నా నిధి. అదీ కాక ఈ జీవితమంతా ఓ చిత్రాతి చిత్రమైన మలుపులతో నిండివుంటుంది. యెప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో యెవరికెరుక. ఈ మలుపుల్లో అదృష్టదేవతా దర్శనం ఇవ్వవచ్చు? దురదృష్ట దేవతా తిష్టవెయ్యవచ్చు. మనం కేవలం నిమిత్తమాత్రులం, అంతా భగవదిచ్చ."
    "వదిన వేదాంతిలా మారిపోతుంది. మారి పోయింది. అలా మారకుంటే ఆమె బ్రతకటం కష్టం."
    ఇంటికి వచ్చేస్తూ రెండు వందల రూపాయలు వీణకి, బాజీకి వుంచమని ఇచ్చాడు వాసు,
    శ్రీలక్ష్మి నిరాకరించింది.
    స్వయం శక్తితో బ్రతకటానికి అలవాటు పడ్డ నేను ఇలాంటివి తీసుకోవాలంటే చాలా బాధ కల్గుతుంది వాసూ, ఆ డబ్బు ఇచ్చే సుఖం నాకు శాంతినియ్యదు. మరోలా భావించవద్దు. నీ "ఆసరా" కావల్సినప్పుడు నీ దగ్గరికి రావటానికి యే మాత్రం సంకోచించను, ఆ నోట్లు తీసుకోప్రసన్నా..." అంటూంటే వీణ ఆ కాగితాలని పిసతల్లి చేతిలో పెట్టేసింది.
    భారంగా అడుగులు వేస్తూ సాగిపోయారు దంపతులిద్దరూ?
    
                                *    *    *

    విశాఖలో కాపరంపెట్టాడు వాసు, ఓ చిన్న బంగళా చుట్టూ చిన్న తోటా యెంతో అందంగా సర్దివుంచుతుంది ఇల్లు ప్రసన్నలక్ష్మి, వాసు ఆఫీసునించి ఇంకా రాలేదు. ప్రసన్న పుస్తకం పట్టుకు కూర్చుంది.
    "శీతాకాలం.
    ఉదయం 8 - 9 గంటల, మధ్య దట్టంగా పట్టిన మంచుతెరలు అప్పుడే వీడిపోతున్నాయి.
    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.
    దూరంనించి వస్తున్న రైలేదో త్వరలో ఫ్లాట్ ఫారమ్ చేరుకోబోతున్నట్లు సూచనగా సిగ్నల్ చెక్క వంగి వుంది.
    నగరంలో ఇండో-రష్యన్ సాంసృతిక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో వాటిలో పాల్గొనటానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైలులో వస్తూంది. వారిని ఆహ్వానించటానికి."
    "జీవన తరంగాలు" చదువుతున్న ప్రసన్న కళ్ళు గట్టిగా మూసేశాడు వాసు,
    ప్రసన్న వులిక్కిపడి మూసిన చేతులని పరీక్షిస్తూ.
    "అబ్బ....అప్పుడే వచ్చేశారా! నాకు టైమే తెలియలేదు,"
    "చేతులు తియ్యండి" వాసుచేతులు మెల్లగా తప్పించుకుంటూ అంది ప్రసన్న. వాసు యెదురుగా కుర్చీలో కూర్చుంటూ.
    "జాబ్.....రోజూకన్నా గంటన్నర లేటుగా వస్తే...."అప్పుడే వచ్చావా" యేమిటీ విపరీతం" అంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS