"యేంలేదు......బట్టలు మార్చుకోండి.....టీ, టిఫినూ తెస్తాను" అంటూ పుస్తకంలో తలపెట్టి.
"వారిని ఆహ్వానించటానికి పురప్రముఖులు, పెద్దలు, చాలామంది, పళ్ళు కటకట లాడించే చలిలో..."
వాసు ప్రసన్న చేతిలో పుస్తకం లాగేసు కున్నాడు.
"అసలు టైము యెంతయిందో తెలుసా! టీ, టిఫెనూ చేసే ప్రయత్నం, యేం లేకుండా, ఈ పుస్తకం పట్టుకుని ఈ ప్రపంచం మర్చిపోతే యెలా! అవతల నౌకరు యెదిరింట్లో కబుర్లు చెప్తున్నాడు. నువ్వేమో ఇంట్లో దొంగలు పడి దోచుకు పోయినా తెలియకుండా..."
వాసుకి కోపం వచ్చేసింది. ప్రసన్న కాస్త భయపడింది.
ఒక్కక్షణంలో తెస్తాను. బట్టలు మార్చుకోండి....అయ్యో మార్చేసుకున్నాడూ, నే చూడనేలేదు, ఆ పుస్తకం ఇలా ఇవ్వండీ...నేను..."
"ఎందుకూ ఈ పుస్తకం! టీ నీళ్ళు మరిగి పోకున్నా చూడకుండా.
"ఆ చలిని లక్ష్యపెట్టకుండా, చేతులో అందంగా, చెమ్కీ చుట్టిన పెద్దపెద్ద గులాబీ ఉండలు పట్టుకుని" అంటూ చదివి నా ప్రాణం తీసేందుకా!
"అబ్బ...కాదు ఇచ్చెయ్యండీ..." బ్రతిమిలాడింది ప్రసన్న.
"వు....హూ.....ఇవ్వనుగాక ఇవ్వను. వెళ్ళు ముందు టీ..."
"అబ్బ....ఈ మగాళ్ళు....మహా కఠినులు."
తప్పనిసరై వంటగదిలోకి వెళ్ళింది ప్రసన్న
"వూ....యేం పుస్తకాలో" అంటూ పేజీలు తిప్పుతూన్న వాసు వెనక్కి వచ్చి చదువుతోంది ప్రసన్న.
సీరియస్ గా ముఖంపెట్టి చప్పున మూసేశాడు. ఆ ముఖం చూస్తేనే భయం ప్రసన్నకి. నాలిక కొరుక్కుంటూ పరుగుతీసింది వంట ఇంట్లోకి.
అలా పరుగులెత్తే ప్రసన్నని చూడాలంటే బలే సరదా వాసుకి. లేనికోపం నటిస్తూ తన కోర్కె తీర్చుకుంటూ వుంటాడు.
ఆమె వెనకే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర వున్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ ప్రసన్న అందించిన ప్లేటు అందుకుని.
నిమ్మకాయ పులిహోర అంటూ.
"విశ్వం దగ్గరనించి వుత్తరం వచ్చింది" అంటూ కవరు అందించాడు. ఇదేమిటీ ఇంత పెద్ద వుత్తరం "భారతం" అంత రాశాడు. దీంట్లో పద్దెనిమిది సర్వాలూ వున్నాయా!" అంది నవ్వుతూ.
"ముందు టీ ఇవ్వు" ఆపైన అది చదవటం." వూ..అలా డాబాపైన కూర్చుందాం..." అంటూ యెందుకైనా మంచిదని ఆ నవలకూడా తీసుకుని పైకివెళ్ళాడు వాసు.
భర్తని క్రీ గంట కనిపెడుతూనే వుంది ప్రసన్న. వచ్చేనవ్వుని ఆపుకుంటూ "టీ" తాగేసి "నే చదువుతాను విను" అంటూ మొదలు పెట్టాడు.
"ప్రియ మిత్రమా
నీ వుత్తరం అందింది.
షరా మామూలే! ఓ కొత్త విషయం....సరికొత్త విషయం తెలియజేస్తాను. యేమిస్తావ్...త్వరగా చెప్పు అంటున్నావా! తర్వాత చెప్తాను ఆఖరున.....ముందుగా మాలని గురించి చెప్తాను విను.
వాసు ఆగి ప్రసన్న ముఖంలోకి చూశాడు.
"త్వరగా చదవండి. విషయం చెప్తానంటూ దాటేసి యేమిటా సస్పెన్సు. పోనీ మీరు చదివారుగా చెప్పయ్యండి త్వరగా!" ఆతురతని అణుచుకోలేక అన్నది ప్రసన్న.
"వూహూఁ... వరపగానే చదువుతాను. అంతే... అంటూ.
"మాల వుంది చూశావూ! మహా గట్టిదై పోతోందోయ్. ఇక్కడికి వచ్చింతర్వాత ఒక్క నెల నా మాటవింటూ తల ఆడించేది గొర్రెపొటేలు లాగా? ఆ చాపర్ అయిపోయి ఇంక ఆవిడమాట నేను వినవల్సిన స్థితి వచ్చేసింది. మన ఆటలు బొత్తిగా సాగనీయంటం లేదు.
ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చావా! ఇంక ఆరోజు గోవింద నా అవస్థ ఆ పరమాత్ముడికే యెరుక! మనలో మనమాట మా చెల్లాయి ప్రసన్నలక్ష్మీ అలాగే చేస్తోందా? మాలతో చెప్పనులే. ఈసారి జవాబులో రాయి.
నేను యెక్కడెక్కడ వుంటానో యెక్కడికి వెడితే ఆలస్యంగా వస్తానో తెలిసిపోయింది. సైతానులాంటి ఓ నౌకర్ని పెట్టింది. ఆమె పెట్టడం యేమిటీ నా ముఖం. ఆవిడకంటే ముందే వాడు గృహప్రవేశం చేశాడు.
వాడు మాత్రం నన్ను వదలడు. కారు హారన్ కొడుతూనే వుంటాడు.
ఈ మధ్య పన్నెండేళ్ళ కుర్రాడు బీదవిద్యార్ధి నంటూ వచ్చాడు. అతనికి తెలుగు తెలియదు. మాలకి మహారాష్ట్ర తెలియదు ఆ ఇద్దరి సౌంజ్ఞలూ చూసి నవ్వలేక చచ్చాననుకో. సరే తర్వాత ఏమయిందంటే నమ్మకంగా వున్నాడు గా అని తిండీ అదీ పెట్టి ఇంట్లో వుంచింది వాడు వుండీ వుండీ బాగా తినేసి యాభై రూపాయలు పట్టుకు పారిపోయాడు.
ప్రసన్న కిసుక్కున నవ్వటం విని వాసు తలయెత్తిచూసి "మళ్ళీ వాడు పారిపోయినందుకు మహా బాధపడిందనుకో! యెందుకో మాలకి అలాంటి వాళ్ళని చూస్తే మహాజాలి. నాలుగు రోజులు కారు తీసుకొని వూరంతా వెతికింది వాడి కోసం.
డబ్బు పోయిందని కాద సుమా. పాపం వాడి పరీక్షలు దగ్గరికి వచ్చాయి. చదువు పాడై పోతుందని, స్కూలుకి వెళ్ళి కనుక్కుంది.
అసలు ఆ పేరున్న విద్యార్ధి ఆ స్కూల్లో చదవటమే లేదని చెప్పిం తర్వాత ఇంటికి వచ్చి యెలా యేడ్చిందనీ, నేను యెంతనిచెప్పీ ఆమెని ఓదార్చలేక పోయాను.
తాళం చెవులు ఆవిడ కొంగుకి యెప్పుడో కట్టేసుకుంది. దానం ధర్మం ఇల్లు. పత్రం అవుతుందేమోనని నా భయం. తను అంటుంది. "మరేం భయపడద్దు. మనకి సరిపడ్డంత వుంచే మిగతాది దానం చేస్తున్నాను. నేను అంత నిస్వార్ధపరురాలను కాను" అంది.
ఏం జవాబివ్వను. ఇన్ని అవస్థలూ పాట్లూ అని తెలిస్తే ఈ గృహస్థ జీవితాన్ని కోరితెచ్చుకోను.
ఇందాకటినుంచీ ఇప్పటికి యెన్నిసార్లు తిట్టి వుంటావో. విషయం చెప్పలేదని. నేను...నేను తండ్రిని కాబోతున్నాను. వాసూ యెంత తియ్యటి అనుభూతి ఇదీ. ఒహ్ మాటలతోచెప్పలేను.
కాని మాల కడుపులో యే హిడింవాసురుడి తమ్ముడు పెరుగుతున్నాడో (కాకపోతే చెల్లెలనుకో) యెప్పుడూ తిండి.... తిండి. టిఫిన్లు పిండివంటలూ.....రకరకాలూ....అబ్బబ్బ నాతో ఒక్కక్షణం మాట్లాడటంలేదు. యెప్పుడూ యే కొత్తరకం ఫలహారాలు తిందామా అనే గొడవ.
కందిపచ్చడి దగ్గరనించి కాకరకాయకూర వరకూ మనసే! పెరుగుపచ్చడి దగ్గరనించి పెసరట్ల వరకూ ఒకటే చెయ్యటం. ఆ పేర్లూ అవీ నేను ఆంద్ర వదిలిన తర్వాత మర్చిపోయాను. ఆ గుర్తు వచ్చింది. కొరివిఖారం కావాలిట. యెక్కడో వున్న తెలుగు న్సేహితుల ఇంటికి అయిదుగేలన్ల పెట్రోల్ తగలపెట్టి వెళ్ళి చిన్న గిన్నెలో అస్తారపడంగా తెచ్చుకుని దాచుకుంది. కాస్త కాస్త నోటికి రాచుకుంటూ ఒకటే వూరించటం నన్ను. భలే కోపం వస్తోంది నాకు. మొన్నటికి మొన్న వైష్ణవ స్నేహితుడి భార్య మాల వ్యవహారం పసికట్టి కాబోలు చక్రపొంగలి, పులిహోర వగైరా పంపించింది. వాసనే భలే వుందిలే. తీరా నేను తినటానికి కూర్చుంటే యేం వుంది గిన్నె ఖాళీ.
తెల్లవారి లేస్తూనే తేనె కలిపినా నిమ్మకాయ నీళ్ళు, మరో పది నిముషాలకి హార్లిక్సు, మరో అరగంటకి ఇడ్లీ కాఫీ ఆ పైన పండ్లరసం తర్వాత పన్నెండింటికి భోజనం, వెరైటీలు దాదాపు పదికి తక్కువ వుండవు.
ఇది యేం విపరీతం, జబ్బు కాదు కదా అని డాక్టర్ కి చూపించాను. ఆవిడ నవ్వీ నవ్వీ చచ్చిందనుకో. నా గాభరా చూసి యేమిటో అంతా అయోమయంగా కన్పిస్తోంది.
రాత్రి యెనిమిదింటికి సుష్టిగా భోజనం చేసి ఒక్క నిద్ర పోయి "ఆకలి" అంటూ లేచి కూర్చుని నన్ను నిద్రపోనీయదు. ఇల్లంతా వెతుక్కుని యే వడియాలో తెచ్చుకుని తిని ఇన్ని నీళ్ళు తాగి 'స్టౌ' వెలిగించుకొని హార్లిక్సు తాగేస్తుంది. నిజంగా చాలా భయంగా వుంది వాసూ.....
కొంపతీసి దెయ్యమో భూతమో లేదుకదా అని.
ఏం నవ్వు వస్తోందా ... నా అవస్థ చూస్తుంటే.?
నవ్వు! యేం చేస్తాను. ఒకసారి యేమయిందను కున్నావ్.
కొత్తగా పరిచయం అయిన స్నేహితులు మమ్మల్నిద్ధరినీ డిన్నర్ కి పిల్చారు. మర్చిపోయి "సరే వస్తాం" అన్నాను.
ఇద్దరం వెళ్ళాం, అక్కడ వంటలు.
గుత్తివంకాయ కూర! కొబ్బరి పెరుగు పచ్చడి, పెరుగు వడలు, పూర్ణంబూరెలు.......చాలా రకాలు చేశారులే.
నలుగురం భోజనాలు మొదలుపెట్టాం.
ఇంకా మేం కలుపుకోకముందే మాల రుచి చూడటం ప్రారంభించింది.
వరసగా గిన్నెలు ఖాళీ అవుతున్నాయేగాని "చాలు" అనదు, అక్కడికీ నేను వాళ్ళిద్దరూ చూడకుండా సౌంజ్ఞ చేశాను, అబ్బే గ్రహిస్తేనా.
ఆ భార్యా భర్తలిద్దరూ మాల తిండి చూసి కళ్ళు మిటకరించేస్తున్నారు.
నా అవస్థ భగవంతుకైనా తెలుసా. అని.
వళ్ళుమంది పెరుగుపచ్చడి అన్నంతిని పళ్ళెం వేలుతో తీసుకుని నాకుతున్న మాలని గట్టిగా "గిల్లా" లని పించింది. కాని అందుబాటులో లేదు.
మర్యాదని చూస్తుంటే వాళ్ళ దగ్గర మర్యాద దక్కేట్లు లేదు. వెంటనే మంచినీళ్ళు పోస్తున్నట్లు నటించి నీళ్ళు మాల పళ్ళెంలో దిమ్మరించాను.
వాళ్ళు బిత్తర పోయారు.
మాల బిక్కముఖం వేసుకుని చూస్తూంటే. ఆ ఇల్లాలు "అయ్యో నీళ్ళు పారబోసిపెట్టనా అంటూంటే నా ప్రాణం పైనే పోయింది.
మాల ఎక్కడ సరే అంటూ తల వూగిస్తుందో అని.
ఎలాగైతేనేం ఇంటికి లాక్కువచ్చాను. నా మీద చాలా కోపం వచ్చింది. యేడుస్తూ పడుకుంది. అసలు మొట్టమొదట ఈ తిండిగొడవ లేదు. నెలతప్పిన దగ్గరనించే..... అందుకే అన్నాను. పుట్టబోయేది హిడింబాసురుడు తమ్ముడో.....చెల్లెలో అని.
భాయ్. ఈసారికి చాల్లే.... అసలే కోపంతో మంచాన్ని కరుచుకు పడుకుని మాట్లాడని మాలని బ్రతిమలాడాలి. వుంటాను.
విశేషాలతో జవాబు రాస్తావు కదూ! ఆ మార్చాను. మా చెల్లాయి, ప్రసన్నలక్ష్మి కూడా ఈలాంటి దేమన్నా.... చేసి నీ భరతం పడుతోందా! అయితే వెంటనే రాయి. నాకు నువ్వు తోడువున్నానని కాస్త "రిలీఫ్" పొందుతాను.
ఇంతే.
విశ్వం.
ప్రసన్న అప్పటికే నవ్వీ నవ్వీ పొట్ట చేత్తో పట్టుకుంది.
వాసు కూడా ఆ నవ్వులో శ్రుతి కలిపాడు. ప్రసన్న నవ్వు ఆపుకోలేక చీరేకొంగు నోట్లో కుక్కుకుంది.
ఇంతలో వంట ఇంట్లోనించి "ఢాం" మని శబ్దం కావటంతో "ప్రసన్న అయ్యో.... పిల్లిలా వుంది... పాలు పారపోసిందేమో" అంటూ పరుగుతో మెట్లని దిగబోతుంటే.
వాసు సీరియస్ గా ముఖంపెట్టి "స్టాఫ్" అన్నాడు దగ్గరికి వస్తూ.
ప్రసన్న ఆగిపోయింది.
సీరియస్ గా ద్గాగారకి వచ్చిన వాసు అమాంతంగా పట్టుకున్నాడు.
"ఏయ్... డాక్టర్ యేం చెప్పిందీ....నీకు?"
"ఏం చెప్పిందీ....?"
"లేడీ డాక్టర్.... ఇంక అమ్మాయిగారు అలా పరుగులు పెట్టకూడదు అని చెప్పలా" అంటూంటే.
"అబ్బ... పొండి" అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది ప్రసన్న.
"యెక్కడికి పొమ్మంటారండీ...ఈ లక్ష్మిని వదిలీ" అంటూ వాసు దగ్గరగా లాక్కున్నాడు. అతని గుండెలో ముఖం దాచేసుకుంది ప్రసన్న.
పక్క డాబా మీద పిల్లలెవరో "స్టాఫ్" అంటూ పారిపోయారు.
:-సమాప్తం:-
