Previous Page Next Page 
జీవనకలశం పేజి 23


    "అన్నీ ఆలోచించుకున్నావా? వాడిని గురించి నీకు తెలుసా?" మెల్లగా అన్నాడు.
    "అన్నీ తెలుసు. ఆయన యే విషయము దాచలేదు."
    "ఏం తెలుసు...ఏమని చెప్పాడు?"
    "అన్నీ అలవాటులూ వున్నాయని. వాటి క్రింద చాలా ఖర్చు అవుతుందని కాని వాసు బాబూ ఇలాంటి యెన్ని అలవాట్లు వున్నా మరేం ఫర్వాలేదు. ఎదుటి వాళ్ళని మోసం చేసే గుణం లేదు. అది చాలు నాకు. మిగతా వాటిని నేను చక్కదిద్దుకోగలననే నమ్మకం వుంది. అందుకే రమ్మని రాశాను. మీకు ముందే చెప్తే ఆమోదించరేమో అని భయపడ్డాను. అతను అసలు వస్తాడో రాడో అనే అపనమ్మకం కూడా వుంది. వచ్చాడు. గనుకనే పూర్తిగా నమ్మాను.
    వాసు కళ్ళు తేలేశాడు. ఇన్ని అపలక్షణాలు వున్న పురుషుడిని యే స్త్రీ కావాలనుకుంటుంది. మాల మనస్పూర్తిగా కోరుకుంటోంది.
    ఇప్పుడేం చెయ్యాలి.... ఏం చెయ్యాలి. విశ్వం ఉత్తరాల వల్ల ఇలాంటిదేదో జరుగుతుందనే అనుమానం వుంది. కాని ఇలా మాత్రం వూహించలేదు.
    అసలు మాలని చేసుకోవటానికి విశ్వం యెందుకు ముందుకు వస్తున్నాడూ? అనేది అతన్ని వేధిస్తోంది.
    పురుషుడు యెంత గడ్డి కరిచినా పట్టించు కోని సమాజం స్త్రీ పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. ఇవేవీ మనసులో పెట్టుకో కుండా ముందుకు వచ్చిన మిత్రుడిని అభినందించాల్సినది పోయి ఆలోచిస్తున్నావా? అంటూ అంతరాత్మ పదే పదే హెచ్చరించింది.
    యెన్ని దాంపత్యాలు చూసినా యేవేవో అవకతవకలే. అనుకూలమయిన దాంపత్యాలు యేదో మచ్చుకి కొన్నిమాత్రమే కన్పిస్తూ వుంటాయి. ఇటు విశ్వానికీ జీవితం కొంత పాఠం నేర్పింది.
    ఇంక మాల ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ధీశాలి, ఒకవేళ పరిస్థితులు తప్పి వచ్చినా నిలబడి పరిష్కరించుకో గల ధైర్యం వుంది, అలాంటప్పుడు అడ్డు చెప్పడం యెందుకు?
    నాకు తెలియకుండా రిజిష్టర్ మారేజ్ చేసుకోగల సామర్ధ్యం వుండీ నాకు చెప్పావంటే....అర్ధం తెలుస్తూనే వుంది. నామీద గౌరవం కదూ!
    చల్లని పిల్లగాలులు వీస్తూంటే ఆలోచించీ ఆలోచించీ అలసిపోయిన వాసుకి తెల్లవారబోతూంటే నిద్రపట్టింది.    
    విశ్వం, మాలా పెళ్ళి అయిపోయింది. వెంకటేశ్వర్లూ వాసు సాక్షి సంతకాలు చేశారు. విశ్వం ఆరోజే మాలని తీసుకువెళ్ళిపోతున్నాడు.
    వాసుకొన్న పోచంపల్లి చీర కట్టుకుని, వెళ్ళబోతూ వాసుకి నమస్కరించింది మాల.
    వాత్సల్యంగా లేవనెత్తాడు మిత్రుడికి అప్పగిస్తూ అన్నాడు.
    "విశ్వం మాలని యెలా చూసుకుంటావో. ఎలాంటి స్థితిలోనూ మనస్సు నొప్పించనని మాట ఇవ్వు"
    విశ్వానికి అర్దమైంది.
    యెక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అయాచితంగా కలుసుకుని కష్టాల్లో వున్నదని గుర్తించితన ఆసరా ఇచ్చి ఈ విధి నిర్వహణలో యెందరు యెన్ని విధాల వత్తిడి తెచ్చినా నిశ్చలంగా నిల్చిన తన మిత్రుడిని బిగియారా కౌగలించుకున్నాడు విశ్వం. కించిత్ గర్వించాడు కూడానూ.
    "నువ్వేం దిగులుపడకు. నా నెత్తి న పెట్టుకుని పూజించుకుంటాను. సరేనా' అంటూ చేతిలో చెయ్యి వేశాడు.
    రైలుకి టైమయింది. టాక్సీ వాకిట్లో నిల్చి వుంది.
    ... వాసుబాబూ..... ప్రసన్న మీ కోసం యెదురుచూస్తోంది. త్వరగా ఆమెను మీ ఇంటికి తెచ్చుకోండి. మరోమాట గుర్తు వుంచుకోండి. వైదేహి మీకు రెండు వుత్తరాలు రాసింది. మిమ్మల్ని కలుసుకోవాలని, కాని అవి నేను చించేశాను. ఆమె మంచిది కాదు వాసుబాబూ. నే నెందుకు చెప్పలేదని కోప్పడవద్దు.....సెలవా"
    "అలాగే" అన్నాడు డగ్గుత్తికతో.
    "వాసు మనతో స్టేషనుకి వస్తున్నాడు. అతను అప్పగించటంపోయి నీవే అప్పగింతలు పెడుతున్నావేంటి" నవ్వుతూనే స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు విశ్వం.
    టాక్సీలో యెక్కబోతూ మాల మరొక్కసారి ఆ ఇల్లు అంతా కలయజూసింది. రాలేక రాలేక వచ్చి టాక్సీలో కూర్చుంది.
    విశ్వం పక్కన కూర్చుని డోర్ వేశాడు.
    వాసు ముందుసీట్లో కూర్చున్నాడు. టాక్సీ కదిలి ముందుకు పరుగెత్తింది.
    యెదురుగా అద్దంలోంచి కన్పించే దృశ్యం.
    విశ్వం మాల కళ్ళనించి కారే కన్నీటిని తన చేతి రుమాలుతో తుడుస్తూ దగ్గరికి తీసుకున్నాడు.
    వాసు తృప్తిగా నిట్టూర్చాడు.
    భగవాన్ మాల భారం నీదే. ఈ విశ్వాసం తోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. రోడ్డువైపు దృష్టి సారించి తనలో తను అనుకున్నాడు.
    విడవలేక మిత్రులిద్దరూ విడిపోయారు.
    కదిలిపోయే రైలు యెక్కి కన్పించినంత వరకూ చెయ్యి వూపుతూనే వున్నాడు విశ్వం. మాల కళ్ళు తుడుచుకుంటూనే వుంది. కాస్సేపటికి రైలు కనుమరుగైపోయింది.
    వాసు వంటరిగా నిల్చిపోయాడు.
    
                               *    *    *

    వూరంతా పిచ్చిగా తిరిగినా ఇంటికి వెళ్ళ బుద్ది పుట్టటంలేదు.
    ఆ యింట్లో వంటరిగా యెలా వుండటం. జరిగిపోయినవన్నీ గుర్తు వస్తూ వున్నాయి వాసుకి. వీరభద్రం గుర్తురావటంతో మరీ బాధ కల్గింది. ఎంతసేపని తిరగటం ఇంటివైపు మెల్లగా సాగిపోయాడు వాసు.
    ఇల్లంతా బావురు మంటున్నట్లుంది.
    వాసు ఇంక ఆ పూట భోజనం మానేస్తాడనే భయంతో అన్నం కూరా అన్నీ మధ్యగదిలో టేబుల్ మీద సర్దివుంచింది. మరి రేపటినుంచి ఎవరు గమనిస్తారు నన్ను?
    కళ్ళు మూసుకున్న హాయిగా లేదు. దాహంతో నోరు యెండిపోతోంది. నీళ్ళు తాగుతూంటే తలుపుదగ్గర పడివున్న కవరు కన్పించింది. యెక్కడనించీ: చూశాడు. వైదేహి దస్తూరీ. విసిరి గిరాటు కొట్టాడు చేతిలోని కవరు. దాన్నే కాదు. మంచినీళ్ళ గ్లాసూ విసిరిపారేశాడు.
    అయినా కోపం తగ్గటంలేదు.
    "వైదేహి పళ్ళు కొరుక్కున్నాడు.
    అన్నయ్యని సర్వనాశనం చేసి విడిచింది. ఇంకా ఏం మిగిలిందనీ ఉత్తరం.            ఆ రోజు ఇంట్లోనించి వెళ్ళిన రాఘవరావు తిరిగి రాలేదు. యెక్కడ వున్నదీ తెలియదు. వైదేహి ఇంట్లో కూడా లేడని తెలిసింది.
    ఒక వేళ అన్నయ్య కన్పించాడేమో అందుకే వుత్తరం రాసిందేమో యేమో విషయం చూసి ఆ తర్వాతే చించి పారేస్తాను. కాదు నిప్పు అంటిస్తాను. అనుకుంటూ మంచంమీద పడుకుని చదవటం మొదలు పెట్టాడు.
    "వాసు బాబూ
    ఈ ఉత్తరం పూర్తిగా చదవండి. కోపం వచ్చి మధ్యలోనే చించెయ్యకండి. నన్నుచూస్తే చాలామందికి పరిహాసం. లావుగా వుంటానని చిన్నప్పుడు చాలా సన్నగా వుండేదాన్ని. పదకొండు సంవత్సరాల వయస్సులో టైఫాయిడ్ వచ్చింది. ఆ జ్వరం తగ్గింది గాని నా శరీరం ఇంక లావుగా తయారైంది. యేం చెయ్యను. అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్నగారు రెండేళ్ళ క్రితం పోయారు. లక్ష రూపాయలకి అధికారిణి. కాని యేం ప్రయోజనం. మనస్సుకి శాంతి లేదు. ఈ శరీరానికి తోడు "బోదకాలు" కూడా వచ్చింది. యిది మా వారసత్వం ప్రసాదించింది. ఎలా తప్పించుకోను. మా చిన్నాన్నకి నా ఆస్తి వీలైనంత మింగేసెయ్యాలనే తప్ప నా సుఖంతో పనిలేదు. అందుకే నాన్న పోగానే సర్వస్వతంత్రురాలినై నాను.
    యెందరో పెళ్ళిచూపులంటూ వచ్చిచూసి వెళ్ళిపోయాడు. "టుం. టుం" అని కొందరు ఎదురుగా నవ్వితే. మరికొందరు పక్కకి వెళ్ళి నవ్వారు. నేనేం చెయ్యను? భగవంతుడు మధ్యలో ఇచ్చిన ఈ వికారాన్ని యెలా పోగొట్టుకోను? నన్నుచూసి నవ్విన ప్రతివాళ్ళని నాశనం చెయ్యాలనేంత కోపం వస్తుంది. చిన్న ప్పుడు నన్నుచూసి నవ్వినవాళ్ళని పీకి రక్కే దాన్ని రక్తం కారేదాకా! అయినా నా కచ్చ తగ్గేది కాదు.
    మా అమ్మ నన్ను యెంతో మార్చాలని చూసేది కాని నాలో ప్రతీకారవాంఛ పోలేదు. చేతినిండా డబ్బు. ఇంటి నౌకర్లు. యెక్కడికి వెళ్ళాలన్నా కారు, నాకే కొరతాలేదు. కాని ఇది ఒక్కటే.
    ఈ బాధని మర్చిపోవటానికి పదిమందిని వెంటేసుకుని అస్తమానం సినిమాలూ, షికార్లు, "పిక్ నిక్ లూ" యేర్పాటు చేసేదాన్ని నేను ఇంత ఖర్చు చేస్తున్నా స్నేహితులని నమ్మే వీళ్ళుచాటున పరిహసిస్తూనే వుండేవాళ్ళు. ఈ లాంటివాళ్ళకి ప్రతీకారం చెయ్యాలంటే యేంచెయ్యాలి? చాలా దూరం ఆలోచించి ప్లాను వేసుకున్నాను.
    యెంతో మంచిగా వున్నట్టు నటిస్తూ వాళ్ళల్లో వాళ్ళకి మనస్పర్ధలు కల్పించి ఆనందించటం. ఈ ఆనందంలో నాకేదో వెర్రి సంతృప్తి. నా డబ్బుచూసి వెంటబడ్డ కుర్రాళ్ళు ఒకళ్ళిద్దరు నిజంగానే నన్ను ప్రేమించారనుకుని మోసపోయాను. చేతులు కాలినాయి ఆకుల కోసం వెతికితే ప్రయోజనం! అప్పటినించీ నాలో అందమైన మగాడంటే కసీ కోపం యెక్కువయింది.
    అందరికీ అందుబాటులోలేనివి నాకువున్నాయి. కాని వాటివల్ల నాకు తృప్తిలేదు. పైగా ఎంతో బాధ. అలా సుడిగుండంలో కొట్టుకొంటున్న తరుణంలోనే పెళ్ళిచూపులంటూ మిమ్మల్ని చూశాను. యెలాగైనా సరే మిమ్మల్ని వశపర్చుకోవాలనే వెర్రి ఆశ. డబ్బూ ఆస్తీ అంతా మీ పేరన రాసేస్తానని మీ అన్నయ్యకి రాయబారం పంపాను. అయినా మీరు లొంగలేదు.
    అచ్చంగా మీ పోలికగా వుండే మీ అన్నయ్య అంటే కూడా నాకు ఆకర్షణ కల్గింది. నా ధనంతో మీ అన్నయ్యని త్వరగానే వశపర్చుకున్నాను. పైకి యెంతో గంభీరంగా కన్పించే మీ అన్నయ్య చాలా దుర్భలుడు. చాలా తేలికగా నా కోర్కె నెరవేరింది. అయినా తృప్తిలేదు.
    నన్నుకాదని ప్రసన్నని చేసుకునేందుకు అంగీకారం తెల్సినప్పటినించీ నా మనస్సు భగ్గున మండిపోయింది. ఎంతో ఆలోచించాను. సూటిగా వ్యవహరిస్తే అపజయం తప్పదని తెలుసు. అందుకే ఆ రోజు.....ఆ రోజు ఒంటరిగా వెళ్ళే మిమ్మల్ని కొట్టించి నేనేవచ్చి ఆదుకున్నట్లు నటించి మా ఇంటికి తీసుకువచ్చాను. మిమ్మల్ని యెంతో ఆదరించే నన్ను ఎవరు అనుమానించగలరు?
    ఈ సాకుతో ఒకనెల నా దగ్గర వుంచుకుని పూర్తిగా నా వాడిని చేసుకోవాలనుకున్నాను. ఈ సమయంలో మీ అన్నయ్యని మరో వూరు పంపించాను. గాయం మానకుండానే ఇంటికి వెళ్ళాలని పట్టుపట్టి వెళ్ళిపోయారు.
    ఇంక నా కోరిక తీరదు. అనే వ్యధ నన్ను దహిస్తుంటే మీ అన్నయ్యని అడ్డం పెట్టుకున్నాను. ఇదీ ప్రయోజనం లేకపోయింది. మీ ముందు చిత్తుగా ఓడిపోయాను వాసుబాబూ! ఇంక తల యెత్తుకుని తిరగలేని స్థితిలో దూరంగా పారిపోతున్నాను. కొన్నాళ్ళు నాకోర్కె తీర్చుకోవాలనే వ్యామోహంతో ఎంత  పతన మయ్యానో అర్ధమయింది. ఇంక నాకు నిష్కృతి లేదు.
                ఇదీ నా జీవితం
                     వైదేహి
    వాసు వుత్తరం చించి ముక్కలు చేశాడేగాని అతనిలోని అశాంతి పోవడంలేదు.
    గొంతెమ్మ కోరికలతో జీవితాన్ని చేజేతులా అధ్వాన్నం చేసుకునే వైదేహిలు కోకొల్లలు. తను నాశనం అయింది. అమాయకుడైన అన్నయ్యను నాశనం చేసి లక్ష్మీదేవిలాంటి వదిన జీవితం యెడారి చేసిన కిరాతకి.........
    ఆవేశంతో వూగిపోయినా తిరిగి ఆలోచిస్తూంటే వైదేహి అంటే సానుభూతి కూడా కల్గుతోంది.
    .............పిచ్చి వైదేహి...... తను ఇలా చెయ్యకుండా వుంటే అందరూ యెంత గౌరవంగా ఆప్యాయంగా చూసేవాళ్ళు. అందులో తనకి యెంత తృప్తి దొరికేదో కాస్తకూడా ఆలోచించలేక పోయింది,
    నిట్టూర్చాడు వాసు. ఆలోచనలతో సతమత మవుతూ వుండగానే తెల్లగా తెల్ల వారిపోయింది.

                                                           *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS