Previous Page Next Page 
అపస్వరం పేజి 23


    తల నెరసిన బీరమ్మ, చెంపసరాల రామక్క, దుద్దులకు మారుగా, చుట్టిన తాటాకు చెవులకు పెట్టుకున్న, నల్లగా గారపట్టిన వెంకటమ్మ, క్రొత్తగా పెళ్ళయిన కెంపక్క, వీరంతా నోటి నిండా ఆకు పక్క నములుతూ, మీరా ఏం చెబుతుందోనని ఎదురు చూస్తున్నారు. బీరమ్మ.
    "ఏంటమ్మగోరు, కబురెట్టారట" అంది.
    "పొలాల్లో కష్టపడి పనిచేయటంవల్లా, వాళ శరీరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. ఎంత కష్టాన్నయినా, తట్టుకోగలమన్న ధీమా కనిపిస్తోంది వాళ్ళ మొహాల్లో ఎండలో పనిచేయటం వలన ఒంటి రంగు నల్లగా మెరుస్తోంది.
    "బీరమ్మా, మీ కంతా చదువు నేర్చుకోవటానికి ఇష్టమేనా?"
    "అయ్యో నా తల్లీ, సదుగులు గిడుగులు మా కెందుకమ్మా. ఏంటి సేసుకుంటాం సదివి?"
    "అలా కాదు బీరమ్మా-చదువు నేర్చుకుంటే, తీరికవేళల్లో మంచి మంచి పుస్తకాలు చదువుకో వచ్చు. అజ్ఞానం, మూఢ భావాలు పోతాయి."        "మాకు తీరికేది తఃల్లీ. ఒక్క చవం నడుం శాలుద్దామంటే తీరికనేదు గందా."
    "బీరమ్మా, మీరంతా ఒప్పుకుంటే, మీకు మా ఇంట్లోనే చదువు చెపుదా మనుకుంటున్నా."
    వెంటనే వాళ్ళల్లో గుసగుసలు బయలుదేరాయ్. ఇన్నేళ్ళొచ్చాక ఇప్పుడేం చదువన్నారు కొందరు. తీరికుండదని గొణిగారు కొందరు.
    "సదూకోవాలంటే, బోల్డు డబ్బు గావాల్నటగా" శామక్క అడిగింది.
    "డబ్బు విషయం, మీరేం బెంగపెట్టుకోకండి. నేను చూసుకుంటాను."
    ఒక్క నిముషం అందరూ మౌనంగా ఉన్నారు.
    "మీరంతా ఆలోచించుకొని, రేపు చెప్పండి" అంది మీర.
    "అలాగే" అని అందరూ వెళ్ళిపోయారు. మీర ఉత్సాహమంతా దిగజారిపోయింది. తనంతట తఃను పిలచి, ఉచితంగా విద్య నేర్పుతావన్నా, సందేహిస్తున్నవారిని చూచి, ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఎవరూ రారనే అనుకుంది.
    కాని మీరా అనుకున్నట్టు కాక, మరునాడు సాయంత్రం వాళ్ళంతా వచ్చి, "అమ్మగోరూ" అని పిలచేసరికి, ఆశ్చర్యపోయింది. మీర. ఉత్సాహంతో బయటికి వచ్చింది.
    "మేమంతా సదుగు సెప్పించుగుంటాం తల్లీ" అంది బీరమ్మ. ఆమె కంఠంలో, చదువు నేర్చుకోవాలన్న ఆసక్తికన్నా, అమ్మగారి మాటకు గౌరవ మివ్వాలన్న భావమే వ్యక్తమయింది.
    "సరే, చాలా సంతోషం బీరమ్మా. శుక్రవారం, సరస్వతిపూజ చేసి, పాఠాలు ప్రారంభిస్తాను, నీకు తెలిసినవాళ్ళనంతా తీసుకరా."    
    "అట్టాగే తల్లీ."    
    "నేను పలకా పుస్తకాలు తెప్పించి పెడతాను."
    "అట్టాగే తల్లీ" అని వాళ్ళంతా వెళ్ళిపోయారు.
    ఈ సంగతి భర్తతో ఎప్పుడు చెపుతానో నన్న ఆత్రం మీరకు. సాయంత్రం శాము ఇంట్లో అడుగు పెడుతూండగానే,
    "ఏమండీ, వాళ్ళంతా చదవుకోటానికి ఒప్పుకున్నారు. శుక్రవారం సరస్వతిపూజ చేసి, పాఠాలు మొదలు పెట్టేస్తాను. అప్పటికి పలక, పెద్దబాల శిక్ష తెప్పించి పెట్టేయండి" అంది.
    ఏమో చెపుదామనుకున్న శాము, ఆమె ఉత్సాహాన్ని భంగపరచటానికి ఇష్టంలేక వూరుకున్నాడు. మీర తన వూహాగానాలనంత వివరించింది. ఒక సంవత్సరంలోనే తన విద్యార్ధిణుల కంతా ఏవిధంగా తర్ఫీదు ఇచ్చి తయారుచేయ దలచుకుందో ఏకరువు పెట్టింది.
    శుక్రవారం రానే వచ్చింది. మీర ఉత్శాహానికి అంతులేదు. తోటలోని పూలు కోసి, రెండు పెద్ద దండలు గుచ్చింది. బోరడితో చెప్పి, తోటలోని ఓ అరటిగెల తెప్పించింది. గోడకు వేలాడగట్టిన సరస్వతి దిగి, అలంకరించిన మేజా బల్లమీద ఆసీనురాలయింది.
    సాయంత్రం కొత్తచీర కట్టుకొని తన శిష్యుల కోసం ఎదురుచూడ సాగింది, మీర, ఐదు దాటాక ఒక్కొక్కరే రావటం మొదలెట్టారు. ఓపది మంది వచ్చాక మీర, అగరువత్తుల వెలిగించి, సరస్వతి పూజ చేసి, రెండు దండలతో నిండుగా అలంకరించింది. వెంకమ్మగారు, రసాయనం, వడపప్పు తెచ్చి, దేవి ముందు పెట్టారు. మీర నీళ్ళు చిలకరించి, నైవేద్యం పెట్టింది. తరువాత దొప్పలలో అందరికీ ప్రసాదం పంచిపెట్టింది. ఒక పూలదండ తీసి, ముక్కలుచేసి అందరికీ ఇచ్చింది.
    రామక్క సరస్వతి పటంవేపు చూస్తూ.
    "ఇదే అమ్మోరు, తల్లీ. కాళికామ్మా?" ఆవరించింది.
    "కాదు రామక్కా. ఈమె సృష్టికర్త బ్రహ్మ భార్య, సరస్వతి. విద్యాధిదేవత. ఈమె....."
    "తల్లీ...." అంది వెంకటమ్మ.
    మీర మరో స్వారస్యమయిన ప్రశ్నకోసం అటు జరిగింది.
    "మీరు కట్టుకున్న కోక రంగు వెలవదా?"
    మీర ఉత్సాహమంతా దిగజారింది.
    "నే నింకా తడిపి చూడలేదు."
    కెంపమ్మ దొప్పలోని రసాయనాన్ని చూపుతూ,
    "ఇదెట్టా సేసారమ్మగోరూ" అంది.
    మీరకు కోపమొచ్చినా కనబడనీయకుండా ఓర్పుతో, రసాయనం తయారుచేసే విధానం తెలిసింది. తరువాత అందరికీ ఒక్కో పలకా బలపం ఇచ్చి, అక్షరాభ్యాసం మొదలుపెట్టింది. అందరి పలకల్లోనూ 'అ ఆ' రాసి దిద్దటం నేర్పింది. పావు గంట దిద్దాక ఆ అక్షరాలను చూస్తూ క్రింద రాయమని చెప్పింది.
    "ఆ అంత బిరాన రావటానికి ఇదేం కలుపుతీసే పనా?" అంది కెంపమ్మ.
    రామక్క 'అ ఆ'లు రెండింటినీ తలక్రిందులుగా దిద్ద్గుతోంది.
    "అలా కాదు రామక్కా" అని మీర పలక పుల్లసరీగా పట్టుకొని, దిద్దటం నేర్పింది. అటే చూస్తున్న కెంపమ్మ.
    "ఎట్టా దిద్దితే ఏటమ్మగోరూ దానిలా ఉంటే కాదా?" అంది,
    "ముందు మజ్జిగన్నం తిని, తరువాత, చారు అన్నం తినం గదా? ఆకలి తీరటమే ముఖ్య మయినప్పుడు, అదెందుకు కూడదో చెప్పు?" మీర నవ్వుతూ అడిగింది కెంపమ్మను. ఏం బదులు చెప్పాలో తెలియక బిత్తరిచూపులు చూసింది కెంపమ్మ.
    "ప్రతి పనికి ఓ మొదలు, చివర ఉంటాయి. దేనికైనా ఓ పద్ధతంటూ ఉండాలి.
    చీకటి పడుతూండగా, బోరడు, లాంతర్లు వెలిగించి తెచ్చిపెట్టాడు.
    "మీరమ్మగోరూ, మే మింక ఇంటికెళ్తాం" అంది బీరమ్మ.
    "అప్పుడేనా?"
    "అవును తల్లీ. మొగోళ్ళు వచ్చేయాళికి సంకటి తయారుగా ఉంచాలిగందా మరి."
    అందరూ లేచి ఇళ్ళవేపు వెళ్ళిపోయారు.
    రాత్రి మీర భర్తతో ఆరోజు జరిగిందంతా వివరంగా చెప్పుకొచ్చింది. శాము ఎగతాళిగా నవ్వాడు మీర చిరుకోపంతో,
    "అదే వద్దంటున్నా, మరి. నాకు కోపం వస్తుందంతే." అంది.
    "లేదండి రాణీగారూ. తప్పయింది. లెంపలేసుకుంటున్నాను."
    "ఇక రెండేళ్ళలో వాళ్ళనంతా, లోయర్ సెకండరీ పరీక్షకు, కట్టేలా తయారు చేస్తాను. చూడండి."
    శాముకు నిద్ర వచ్చేదాకా, మీర కబుర్లు చెప్పుతూనే ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS