Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 23


    ఆనంద్ బాధగా కల్యాణి నోరు మూశాడు. "ఛా, అలా మాట్లాడకు. పసిపిల్లలు వాళ్ళని వదిలి నీవు రాలేవన్న సంగతి నా కర్ధం అవుతూంది కల్యాణి. వాళ్ళని వదలి నాతో రమ్మనేటంత కఠినుడిని కాలేను. నిన్ను వదిలి, నిన్ను మరిచి దూరంగా బ్రతికేతనత నిబ్బరమూ లేదు కల్యాణి. ప్చ్! ఎంత అనుకున్నా, ఎన్ని అనుకున్నా ఈ సమస్య తెగేదీ కాదు, ఈ బాధ తీరేదీ కాదు. ప్రతీసారీ వున్న రెండు రోజులు యిలా బాధ పడడమే మనకు మిగులుతూంది. లే కళ్ళు తుడుచుకో కల్యాణీ, రా! దగ్గరికి రా, ఈ రెండురోజులన్నా సంతోషంగా బ్రతుకుదాం రా....."
    ఆనంద్ చాచిన రెండుచేతుల్లో పసిపాపలా వ్రాలి అతన్ని హత్తుకుపోయింది కల్యాణి. అదే సమయంలో గుమ్మం దగ్గిరికి వచ్చి, లోపలికి అడుగువేయబోయిన సుజాత ఆ దృశ్యం చూసింది. ఒక్కక్షణం దిగ్భ్రమతో యేం చెయ్యాలో తోచనట్టు అలా నిలబడిపోయింది. అతని గుండెల్లో మొహం దాచుకొన్న కల్యాణి, సుజాత రాకని గమనించలేదు కానీ, అలికిడికి కళ్ళు విప్పి చూశాడు ఆనంద్. నిశ్చేష్టిత అయి నించున్న సుజాతని చూసి, అతను కాస్త తొట్రుపడి కల్యాణిని వదిలి నెమ్మదిగా, "కళ్యాణీ" అన్నాడు ఆమెని కదుపుతూ. ఈ లోపల సుజాత తేరుకుని గదిలోంచి పరిగెత్తింది. సుజాత నిలువెల్లా సిగ్గుతో వణికి పోయింది. మొహంలో నెత్తురు పొంగి, ఎర్రబడిపోయింది. గదిలోంచి బయటికి వచ్చి క్రిందకి వెళ్ళే మేడమెట్లదగ్గిర నిలబడిపోయింది. తను ఆదర్శమూర్తిగా, ఎంతో సంస్కారిగా, ఎంతో మంచిదానిలా భావించే ఆమె యింత నీచంగా ప్రవర్తించడం.....సుజాతకి ఆ చూసిన నిజం నమ్మశక్యం కాలేదు. ఒక్కసారిగా కల్యాణిమీద సదభిప్రాయం మంచులా కరిగి పోసాగింది. తనే ఏదో లజ్జాకరమైన పనిచేసినట్టు సిగ్గుతో, అవమానంతో పెదవి కొరుక్కుంటూ అలా అచేతనంగా మెట్లమీదే నిలబడిపోయింది సుజాత. తన వెనకాల కల్యాణి రావడం గమనించనే లేదు.
    "ఏం కావాలి?" కల్యాణి గొంతు విని తృళ్ళిపడి వెనక్కి తిరిగింది సుజాత. కల్యాణి గొంతు అదోలా వుంది. ఆమె మొహం సిగ్గుతోనో, అవమానంతోనోగానీ అదో రకంగా వుంది. జవాబు చెప్పడానికి తడబడి పోయి, "ఏం లేదు-ఏంలేదు వంటయిపోయింది భోంచేస్తారేమోనని అడగడానికి...." కళ్ళు వాల్చుతూ, ఎలాగో నోరు పెగల్చుకొని అంది సుజాత.
    "ఊఁ సరే, ఆకలేస్తే మేమే వచ్చి భోజనం చేస్తాంలే వెళ్ళు" అంది కల్యాణి ఆమెవేపు చూడకుండానే. ఆమె గొంతు ఆమెకే క్రొత్తగా విన్పించింది.
    సుజాత సిగ్గ్తో, అవమానంతో చితికిపోతూ తలవాల్చుకుని క్రిందకి వెళ్ళింది. గదిలోకి వచ్చిన కల్యాణిని చూస్తూ "ఆ అమ్మాయి చూసింది మనల్ని, ఏమనుకుందో యేమిటో" అన్నాడు ఆనంద్.
    కల్యాణి నిర్లక్ష్యంగా, "చూడనీ, చూడకూడని మనిషే చూసి నపుడు ఇంక వీళ్ళందరకి భయపడడంలో అర్ధంలేదు. చూస్తే చూసింది. చూసిన మావారే యేం చెయ్యలేకపోయాక వీళ్ళందరూ యింకేం చేస్తారు! మహా అయితే ఆ అమ్మాయికి నామీద వున్నా సదభిప్రాయం పోతుంది. బావా, ఈ లోకం అంతా కలిసి నన్ను 'పతిత, చెడిపోయింది, కులట' అంటూ వేలెట్టి చూపించినా నేనేం బాధపడను. నాక్కావలసింది నీవు! నీకోసం నేనెన్నిఅవమానాలన్నా సహిస్తాను. నేను మొండిదేరి పోయాను బావా, నా పరిస్థితిలో వున్న మరో ఆడది యీసరికి ఎప్పుడో పిచ్చెత్తిపోయి ఉండేది యీ పరిస్థితుల తాకిడికి తట్టుకోలేక! కానీ గమ్మత్తేమిటంటే యీ నా నిర్లక్ష్యం, మొండితనం, ధైర్యం యివన్నీ కూడా నీ దగ్గిరకి నేను వచ్చేట్టు చేయలేకపోతున్నాయంటే...."
    "నిన్ను పట్టి వెనక్కి లాగుతున్నది, వీటన్నింటికంటే శక్తివంతమయినదన్నమాట. నాపట్ల నీ ప్రేమని ఓడించి, జయించగలిగే శక్తి, అదేమిటి కల్యాణీ! నీ తల్లి హృదయంగాదూ.....చలంగాబోలు ఓచోట 'ఎంత ప్రేమించిన ప్రియుడికోసమన్నా సరే, హృదయం వున్న ఆడది పిల్లల్ని వదలదు' అంటాడు. ఆ మాటల్లో యెంత నిజముందో నిన్ను చూస్తే అర్ధమవుతూంది కల్యాణీ!"
    "బావా, చూడు! రేఖకి పద్దెనిమిదేళ్ళు రాగానే తొందరగా పెళ్ళి చేసేసి, రవి మైనారిటీ తీరగానే పెద్దవాడయిపోతాడు గనక హాస్టల్లో పెట్టేసి నీ దగ్గిరకి వచ్చేస్తాను. రవి మగాడు, వాడికి పెళ్ళికాలేదన్న భయం, చింత అక్కరలేదు గదా అప్పుడు నీ దగ్గిరకి రావడానికి నాకేం అడ్డుండదు బావా! ఇంక అప్పుడు యే శక్తీ నన్ను బంధించదు. పిల్లలు పెద్దవాళ్ళు కాగానే యీతల్లి చేసిన పని అసహ్యించుకోకుండా అంతా వాళ్ళకి చెప్పేస్తాను. నన్ను వాళ్ళు అర్ధం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఇంక అప్పుడు పిల్లలు నా దగ్గిరకే వస్తూంటారు" కల్యాణి అరామోడ్పు కన్నులతో ఊహాలోకంలో తేలిపోతూ ఆవేశంగా అంది.
    "తప్పకుండా ఆ రోజు కోసం, నీకోసం యెదురు చూస్తూంటాను. నా యింటి తలుపులు నీ కోసం యెప్పుడూ తెరిచి, నిన్నాహ్వానించడం కోసం రెండుచేతులూ చాపి సిద్దంగా వుంటాను. కల్యాణీ, నీవు యెప్పటి కయినా నా దగ్గిరకి వస్తావన్న ఆశతోనే రోజులు గడుపుతూంటాను" కల్యాణిని ఆవేశంతో ముద్దులు పెట్టుకొంటూ అన్నాడు ఆనంద్.
    "కానీ బావా, అప్పుడు యీ ముసలిదాన్ని యేం చేసుకుంటావు?" నవ్వింది కల్యాణి.
    "నే ప్రేమించేది, ప్రేమిస్తున్నదీ నీ అందాన్ని, నీ యవ్వనాన్ని కాదు, నిన్ను నీవు నాకుకావాలి. నీ సాహచర్యం నాకు కావాలి! నీ జుత్తు తెల్లబడి, నీ నడుం వంగి, మనవల తల్లివి అయి వచ్చినా సరే నిన్ను యీరోజులాగే ప్రేమిస్తాను. ఇలాగే' కౌగిట్లోకి తీసుకుంటాను. ఈ రోజు వున్న నా ప్రేమ, అనురాగం ఆ రోజూ వుంటాయి. మన ప్రేమసాక్షిగా చెపుతున్నాను కల్యాణీ" అన్నాడు ఆనంద్.
    ఆనంద్ కల్యాణి జుత్తు సవరించాడు ప్రేమగా, "నీవు నా దగ్గిరకి రావాలేగానీ, రాగలగాలేగాని అప్పుడు నీకోసం యెవరితోనయినాసరే, ఆఖరికి ఆ దేముడితోనయినా దెబ్బలాడి నిన్ను నా దగ్గిరుంచుకోగలను. ఈ ప్రపంచంలోనే భయపడేది యెవరన్నా వుంటే ఒకరే. ఎవరో చెప్పు చూద్దాం" ఆనంద్ హాస్యంగా అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS