తన కధను వివరించాడు ఫిజో.
యోగి అతడి నిజాయితీని గుర్తించి ఎంతో ప్రసన్నుడయినాడు. మనిషిలో మిగిలిఉన్న మానవతకు అతడు ప్రతి నిధిలా అనిపించింది. సాటి మనిషి ఆపదలో ఉంటే తప్పుకు పోవటం మానవ నైజం కాని ప్రాణాలకు తెగించి సహచరుల కష్టాలను పంచుకునేందుకు సంసిద్ధులు అయేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి ఇతడు అని భావించాడు మౌని.
నిజాయితీని ప్రదర్శించే అతడి కోసం తాను చేయగలిగింది ఏదైనా ఉంటె అది తాను చేయాలనిపించింది.
"అయితే నేనునీకు చేయవలసినసాయం ఏదైనా చేస్తాను ఏంకావాలో అడుగు" అన్నాడు యాతరంగిత మైనస్వరాన.
"లోయలోకి దిగి వెళ్లేందుకు తగినన్ని సాధనాలు నా దగ్గరలేవు. అంతేకాక వాతావరణం ప్రతికూలమయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో చిక్కి నేను చనిపోవచ్చు. లేదా లోయలోకి దిగిన తర్వాత కెప్టెన్ మాలతిని ఎత్తుకుపోయిన అలాంటి ప్రాణితో ఉండి నన్ను కూడా అంతం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
రెండు విధాలుగా నేను మృత్యువును చేరువ అవుతూన్నాను. అయినా భయం లేదు. చనిపోవలసివస్తే ఈ ప్రయత్నంలో ప్రాణాలను అర్పించేందుకు నేను సిద్దంగానే ఉన్నాను.
కాని నేనుచనిపోయేలోగా కెప్టెన్ మాలతిని చూడాలి చూచి తీరాలి. అందునించి ఆలోయలోకి వీలయినంతత్వరగా స్వరంతో. మౌని అతని మాటలు విని నవ్వాడు.
అతడు చెప్పే లోయకు వ్యతిరేక మైన దిశలో అతడు వచ్చాడు. ఇలా ప్రయాణాన్ని కొనసాగించితే క్షణ క్షణానికి తన లక్ష్యానికి దూరమైపోయేవాడు. తుదకు దిక్కు తెలియక ప్రాణాపాయకరమైన చిక్కులలో పడిపోయేవాడు.
తనకు కన్పించటం అదృష్టమే. ఈ ప్ర్రాంతాలలో తానుకాక మరెవరూ మౌని చర్యకోసమయినా వచ్చినవారు లేరు. చలిబాధ. అడవి జంతువులు లోయలు గిరిశిఖరాలు.
క్షణం ఆలోచించిన తరువాత వెంటపెట్టుకుని ఒక మైదానం మీదికి తీసుకువచ్చాడు మౌని.
"అదిగో! నీవు చెప్పిన లోయ. నేరుగా దక్షిణానికి మూడు గంటలపాటు నడవాలి. ఆ పైనా పూర్వభాగానికి తిరిగితే నీ లక్ష్యమయిన లోయలోకి దిగటం ప్ర్రారంభిస్తావు. అడవిదారి ఆటంకాలను ఎదుర్కోగలిగిన ధైర్యం ఉన్న వాడివి అయితేనే నీవు ముందుకు పోవాలి" అంటూ హెచ్చరించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు మౌని. అతడు చూపినదారి వెంట కృత నిశ్చయంతో నడవసాగాడు ఫిజో.
9
వీపున కిట్టు తగిలించుకొని నడుస్తున్నాడు ఫిజో. ఓ గంట గడిచాక దారి మరింత అవరోధాలలో కన్పించసాగింది. ఒక చేతిలో ఉచ్చు బిగించిన తాడునూ, మరొక చేతిలో పిడి చాకునూ బిగించిపట్టుకుని మునుముందుకు నడువసాగాడు ఫిజో. ఏ క్షణంలో అయినా అడవిజంతువుల ప్రమాదం రావచ్చనే భయంతో.
అందునించి అతని నేత్రాలు నలు వంకలా నిశితంగా పరీక్షిస్తున్నాయి. కర్ణపుటాలు ఆ చుట్టుప్రక్కల అయ్యే ప్రతి చప్పుడును రికార్డు చేస్తున్నాయి. తాను ఒంటరి. పదుగురితో కూడి ఉన్నప్పుడు మనిషి ఎలా అయినా ప్రవర్తించవచ్చు.
కాని ఒంటరిగా ఉన్నప్పుడే అతనిలోని ధైర్యసాహసాలు రుజువు చేయబడతాయి. ఏవయినా ప్రమాదాలు రావచ్చునని ఫిజోకి తెలుసు వాటిని ఎదొర్కొనేందుకు మునుముందుకు పురోగ మించేందుకు ఫిజో సంసిద్ధుడవుతున్నాడే కాని, వాటినించి దూరంగాపోయేందుకు అతడు ప్రయత్నించలేదు.
కొంత దూరంముందుకు పయనించాక పొదలు మరింత చిక్కన అయినాయి. వృక్షాలు మరింత దట్టంగా ఎత్తుగా ఎదిగిపోయి కన్పించసాగాయి. వాటిమధ్య దారికోసం వెదుకుతూ మునుముందుకు పోసాగాడు ఫిజో.
పొదలలోంచి చిత్రవిచిత్రమైన శబ్దాలు అవుతున్నాయి ఆ కదలికల్ని అతిజాగ్రత్తగా గమనించసాగాడు. చేతిలో చురికను సిద్దంగానే ఉంచుకున్నాడు. కానిదానితో సాధించగలిగినది అతి స్వల్పమే అని అతనికి తెలుసు. అయినా అంతకు మించిన ఆధారం మరొకటి లేదు.
మరి నాలుగు అడుగులు ముందుకు వేశాక విపరీతమైన గాలి అతని శరీరాన్ని తాకింది. సుదీర్ఘమైన ఉచ్చ్వాసనిశ్వాసాలు అతనికి విన్పించసాగాయి. అంత శక్తివంతమైన ఉచ్చ్వాస నిశ్వాసాలు చేయగలిగిన ప్రాణి ఎంత పెద్దది అయివుంటుందో ఊహించసాగాడు ఫిజో.
దానివల్ల ఎదురు అయ్యే దాడిని గురించి అంచనా వేయసాగాడు. ఏది ఏమైనా అతడు అటువంటి విపత్కర మైన పరిస్థితులకు భయపడి పారిపోయే వ్యక్తికాదు. అడవులలో కొండల్లో తిరగటం అతని వృత్తి.
అస్సాం, నేపాల్ ప్రాంతాల్లోని అడవి దారులన్నీ అతడు గాలించి వదలిపెట్టాడు. క్రొత్త క్రొత్త మారుమూలలకు దగ్గర దారులు తను స్వయంగా కనిపెట్టాడు. ఎందరో సాహస యత్రికులకు అండదండలుగా నిలిచాడు.
అందునించి ప్రమాదాలను ఎదుర్కోవటమనేది అతనికి నిత్యకృత్యం. ఆ అలవాటుని అనుసరించి అతడు వెనుకంజ వేయలేదు. అతిజాగ్రత్తగా ఆ చప్పుడు వింటూ, వేయి కన్నులతో ప్రతి ఆకు, ప్రతి పొదలోని కదలికను గమనిస్తూ ముందుకు కదిలాడు.
మరికొంత దూరం నడిచాక ఆ ఉచ్చ్వాస నిశ్వాసాలు క్రియ మరింత సుదీర్ఘతరమైంది. మరింత బరువు అయింది. మరింత దగ్గరగా కూడా అయింది.
దాదాపు ఆ ఊపిరుల తాలూకు వాయు సమూహాలు అతని శరీరాన్ని చుట్టుముట్టినట్లు అన్పించినాయి. అతని ముఖమంతా రక్తవర్ణాన్ని చిమ్ముతున్న రవిబింబంలా అయిపోయింది.
క్షణంలో కాకున్నా మరుక్షణంలో ఎదురుకానున్న విపత్తునించే పారిపోవాలని ప్రయత్నించటం వృధా అనిపించింది. అందునించి అతడు సంశయాత్మకమైన ఆలోచనలు నిండారిన మనసుతో అలానిలిచిపోయాడు. ఎదురు కానున్న విపత్తుకు సంసిద్ధుడైనాడు.
బహుశా పొదల మాటునించి బెబ్బులి అయినా, అడవి దున్న అయినా, ఎలుగు అయినా దాడిచేయవచ్చునని ఊహించినాడతడు. పొదలవంక మరింత నిశిత దృష్టితో పరిశీలించి చూడసాగాడు.
