కొడుకు లిద్దరికీ అది సబబుగానే తోచింది. పెద్దవాడు వెంకట్రావు ఎప్పుడూ మైకంలోనే వుంటాడు. మత్తులోనుంచి బయటపడి "చివరోళ్ళ ఇద్దరి మాటేమిటి?" అని అడిగాడు.
"నోర్ముయ్! ఇంటి బాధ్యతలూ, తమ్ముళ్ళ, చెల్లెళ్ళ బరువు భారం నువ్వేదో మోస్తున్నట్లు మాట్లాడతావ్! పెళ్ళాం ఇంత నల్లమందు నలిపి చేతిలో వేస్తే మింగే వెధవ్వి! నీది నువ్వు తీసుకొని నోరుమూసుకో పో!" అన్నాడు బలరామయ్య.
బలరామయ్య రెండో పిల్లకు సంబంధాలు వెతికే సందర్భంగా కనకయ్య సహాయం కోరాడు. ఆ అదను చూసుకొనే కనకయ్య సాంబయ్య సంబంధం గురించి కదిలించి చెప్పుదెబ్బలు తినేంతవరకూ తెచ్చుకున్నాడు.
రెండో పిల్ల పెళ్ళయిన మూడు నెలలకే బలరామయ్య ఆస్తి పంపకాలు చేశాడు. కొడుకులకు పంచగా పద్దెనిమిదెకరాల మాగాణి బలరామయ్య వాటాకు వచ్చింది. దొడ్డిదోవలు పంచుకున్నారు. మేడ మాత్రం ఉమ్మడిగానే వుంది. బలరామయ్య తదనంతరం మాత్రమే ఇల్లు వుంచుకోవటంగానీ, అమ్మటంగానీ జరుగుతుంది. దానికి కొడుకు లందరూ ఒప్పుకున్నారు. ఇహ అప్పులు బయటపెట్టి అందరూ సమంగా పంచుకోవాలన్నాడు బలరామయ్య. మూడోవాడిమామ ససేమిరా ఒప్పుకోలేదు.
"ఉమ్మడి కుటుంబం మీద చేసిన అప్పు! ఆస్థికి హక్కుదారులైన వాళ్ళందరూ భరించడం న్యాయం" అన్నారు పెద్దమనుషులు.
"నా అల్లుడిమీద దమ్మిడీఖర్చు పెట్టలా! పైగా ఆదాయం కూడా వాళ్ళే తిన్నారు. ఇప్పుడు అప్పు మా నెత్తిన రుద్దుతారా? వీరభద్రయ్య మనవడు ఏభై ఎకరాలవాటా పంచుకొంటాడని నా బిడ్డ నిచ్చాను. ముష్టి పద్దెనిమిదెకరాలు! పైగా పదివేల అప్పుతెచ్చుకుంటాడని తెలిస్తే నా పిల్లనిచ్చేవాన్నా?"
బలరామయ్య గుండెలు చివుక్కుమన్నాయి.
"నేను చేసిన అప్పు నేనే మోస్తాను. పొలాలు కొలతలు వేసి దస్తావేజులు రాయించు కనకయ్యా!" అన్నాడు.
"తొందరపడుతున్నారు. ముందూ వెనకా చూసి మాట్లాడండి." బలరామయ్య ఋణభారం ఏ పరిమాణంలో వుందో తెలిసిన కనకయ్య అన్నాడు.
"కొడుకులకు అప్పులు పంచి ఇచ్చాననే అపవాదు నాకొద్దు." కళ్ళు తుడుచుకొన్నాడు బలరామయ్య. కనకయ్య, బలరామయ్య ముగ్గురు కొడుకులతో సంప్రదించి ఏర్పాటు చేశాడు, అప్పులకింద మేడ బలరామయ్య వాటాలోకి వచ్చేట్టు. దానికి వియ్యంకుడు కూడా తలఊపాడు.
బలరామయ్య కొడుకులకు భాగాలు పంచి ఇచ్చి మూడేళ్ళయింది. పెద్దవాళ్ళిద్దరూ ఆస్తులు అమ్ముకొని పోయారు. మూడోవాడి మామ ఇక్కడి పొలం అమ్మి తమ ఊళ్ళో కొన్నాడు. రెండోవాడి భార్య పోయింది. పిల్లల్ని అత్తవారింట్లో వదిలి దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. బలరామయ్య పెద్దకొడుకు ఏడాది క్రితమే గుండెజబ్బుతో పోయాడు. నాలుగోవాడు ప్రసాద్ తన వాటాకు వచ్చిన పొలం, దొడ్లూ దోవలూ అమ్ముకొని మద్రాసులో వుంటున్నాడు. వాడు డ్రామా యాక్ట్రెస్ ను ఒకదాన్ని ఉంచుకొని సినిమాతీసే ప్రయత్నంలో వున్నాడని కనకయ్యకు తెలిసింది. బలరామయ్యగారి మూడో అమ్మాయి భాగాలు పంచుకొనే నాటికి లంగావోణీలు వేసుకొని తిరిగే పిల్ల, ఇప్పుడు చీరలు కడ్తూంది.
అప్పట్లో "ఇంకా చిన్నపిల్ల ఇప్పట్లో దీనికి తొందరలేదు" అనుకోని సంతృప్తిపడ్డ బలరామయ్యకు కూతురు పెరిగి పెద్దదై ఇప్పుడు గుండెల మీద కుంపటయింది! రెండేళ్ళుగా పెళ్ళి సంబంధాలు గాలిస్తున్నాడు. ఎక్కడా అనువైన సంబంధం కుదర్లేదు. తన అంతస్తుకు తగ్గవాళ్ళతో వాళ్ళు కోరిన కట్నాలు ఇచ్చి తను తూగేస్థితిలో లేడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు లోగడ చేశాడు. సంబంధాలమీద సంబంధాలు వచ్చాయి ఆ రోజుల్లో. తాను కోరిన వియ్యం అందగలిగాడు. పరిస్టితులు తారుమారయాయి.
బలరామయ్యగారి మేడ ప్రహరీగేటు ముందుకొచ్చిన కనకయ్య ఓ నిమిషం తటపటాయించాడు. "కాగలకార్యం గంధర్వులే తీరుస్తారు" అన్న ధైర్యంతో లోపలకు అడుగుపెట్టాడు.
భోజనం చేసి ఆరుబయట పడక కుర్చీలో పడుకొని చుట్ట కాల్చుకొంటున్న బలరామయ్య సర్దుకొని 'రా! కనకయ్యా, రా! ఏమిటి విశేషం? పొద్దుపోయి వచ్చావ్!' అన్నాడు. జీతగాడ్ని కేకవేసి పెద్ద చేతుల కుర్చీ తెప్పించివేశాడు. కనకయ్య కుర్చీలో కూర్చుంటూ తను ఆ ఇంట్లో చేతులు కట్టుకొని నిలబడే మాట్లాడి వెళ్ళిన రోజులు గుర్తు చేసుకొన్నాడు.
"పొద్దున్న వచ్చిన వానా, పొద్దుగూకి వచ్చిన చుట్టం ఊరకే పోరంటారు" అన్నాడు కనకయ్య.
"అయితే గాలివాన తేలేదంటావ్?"
"చుట్టరికాలు కలపడానికే వచ్చాను."
"ఎవరితో?" ఆనందంగా నవ్వుతూ అన్నాడు బలరామయ్య.
"మీ తండ్రిగారు మీ కిచ్చినంత ఆస్తికి మీ మనవడు వారసుడవుతాడు."
"అది నీ పిచ్చి! అంతటి అదృష్టంవుంటే నా కొడుకు లెందుకు ఇట్లా అవుతారు? మా తాత ముత్తాతల ఆస్తి ఇట్లా ఎందుకు హరించుకు పోతుంది?" బాధగా అన్నాడు బలరామయ్య.
"మీ ఆఖరు అమ్మాయి పేరేమిటి? బుల్లి అమ్మాయిగారని తప్ప పేరు గుర్తులేదు."
"వరూధిని అందరికీ బాగానే జరిగిపోయింది. కడగొట్టు బిడ్డ దగ్గిర కొచ్చేసరికి బండి బోల్తాకొట్టింది. ఎంత గారాబంతో పెంచామో నీకు తెలుసుగా కనకయ్యా!"
"అయ్యో, తెలియకేం? అమ్మాయి వరూధిని అదృష్టజాతకురాలు! ఎవరి అదృష్టం ఎవరు కాదనగలరు?"
"ఏమిటి కనకయ్యా! నువ్వంటున్నది నిజమేనా? సంబంధం ఏ ఊరు? వాళ్ళ ఇంటిపేరేమిటి?" ఆశ్చర్యం, ఆనందం ఒరుసుకున్నాయి బలరామయ్య గొంతులో.
కనకయ్య ఉంగిడితిన్న గొడ్డు అయిపోయాడు. చెప్పాలని లోలోన కొట్టుకులాడుతున్న మాటలు పెదవులు దాటలేకపోయాయి.
"ఎనభై ఎకరాల మాగాణీ కవులు పాతికవేలదాకా వుంటుంది. ఒక్కడే కొడుకు." కనకయ్య ఎత్తుగడ మార్చాడు. ఒక్క అడుగు వెనక్కు తగ్గి కొత్త బలం, ఊపుతో మళ్ళీ ముందుకు సాగాడు.
"ఆఁహ! అట్లాగా?" బలరామయ్య కళ్ళు మెరిశాయి.
"అత్తా ఆడబిడ్డల పోరు లేదు. అమ్మాయికి రాణివాసం అంటే నమ్మండి?"
"భగవంతుడు చల్లగా చూస్తే ---- అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఏ ఊరు?"
"దూరాభార సంబంధం కాదు. దగ్గర్లోనే."
"నా బిడ్డ అదృష్టం అది."
"నే చెప్పేది అదేగదా?"
"కనకయ్యా!" తన కృతజ్ఞతను ఎలా తెలియజేయాలో తెలియక, పడక కుర్చీలోనుంచి ముందుకు వంగి, కనకయ్య చెయ్యి పట్టుకొన్నాడు.
"మీ ఉప్పు తిన్నవాడిని, మీ నుంచి లాభం పొందినవాడ్ని, ఉన్నమాట చెబుతున్నాను. నేను మీకు ఋణపడి ఉన్నాను. అది ఈ విధంగా తీర్చుకోగలిగితే అంతకంటే కావాల్సిందేమీ లేదు." కనకయ్య తడిపొడిగా గొంతు మార్చి అన్నాడు.
"సంబంధం ఖాయం చెయ్! వెనకా ముందు చూడొద్దు. ఆ! చెప్పలేదు. వియ్యాలవారిది ఏ ఊరు?"
"మన ఊరే!"
"మన ఊరా? అంతటివాళ్ళు మన వూళ్ళో ఎవరున్నారయ్యా నాకు తెలియకుండా?"
"ఇంటి ముందున్న రత్నాలు కన్పించవ్. దూరంగావున్న రాళ్ళ కుప్పలు కెలుకుతారు మనుషులు."
"ఎవరయ్యా ఆ రత్నాలు రాసులు పోసుక్కూర్చున్నవాళ్ళు?" ఉద్రేకాన్ని అణచుకోలేకపోయాడు బలరామయ్య.
"సాంబయ్య కొడుకు వెంకటపతి!"
కనకయ్యకు ఆ తర్వాత మాట పెగల్లేదు. బలరామయ్య మీద పిడుగు పడింది! మనిషి స్తంభించిపోయాడు. కనకయ్యకు ముచ్చెమటలు పోస్తున్నాయి. గేటుకేసి చూశాడు. తెరిచే వుంది. కనకయ్య గాలి కుంభించి, బలరామయ్య ఉచ్చ్వాస నిస్వాసాలు వింటున్నాడు. బలరామయ్య నిట్టూర్పు విడిచి కదిలాడు. పడక కుర్చీ కిరకిర మంది. కనకయ్య చెవులు రిక్కించుకొని గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొని విన్నాడు.

