Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 23


    "ఇంటికొచ్చిన అమ్మాయితో శివ ఇంత యాంత్రికంగా మాట్లాడటాన్ని యిష్టపడని రాఘవ ఉక్రోషంగా జోక్యం చేసుకున్నాడు. "అవును సుకృతీ! వీడు ఈ సినీ జనారణ్యంలో తపస్సు చేసుకునే ఓ మహర్షి.....దేనికీ చలించడు. పైగా ఇండస్ట్రీని ఉద్దరించటానికి కంకణం కట్టుకున్నాడు కూడా."
    "అదికాదు రాఘవా....."
    "ఎందుకలా ఆత్మవంచన చేసుకుంటావు? ఎందుకిలా జరిగిందని యిందాకటినుంచీ కుమిలిపోతున్న నువ్వు సీరియస్ గా తీసుకోలేదని అబద్దం చెబుతావేం?"
    "అంతలా కుమిలిపోవటానికి నేనేం నష్టపోలేదు."
    "నష్టపోయావురా" ఆవేశంగా అన్నాడు రాఘవ. "గురజాడ ఎవరో తెలీని దర్శక శిఖామణులున్న యిండస్ట్రీలో సాంప్రదాయిక సాహిత్యం మొదలుకొని స్టీల్ బర్గ్ మోడరన్ థియరీదాకా చదివిన నువ్వు చాలా నష్టపోయావు. బెన్ హర్ దర్శకుడు ఎవరో తెలీకపోయినా ఆ స్థాయి సినిమా తీయాలని డబ్బాలు కొట్టే సూడో దర్శకుల మధ్య నిలబడి ఆ సినిమా దర్శకుడు విలియం వైలర్ గురించి అనర్ఘళంగా మాట్లాడే నువ్వు నిజంగా నాశనమైపోయావ్. సెకండ్ కి యిరవైనాలుగు ఫ్రేమ్స్ కదిలే మూవీ కెమెరాల గురించి తెలీని దర్శకుడున్న చోట అసలు ఫిల్మ్ తయారీకి మూల పదార్ధమయిన ఎమల్షన్ గురించి ఆలోచించగలిగే నువ్వు సహనాన్ని కోల్పోయి నీకంటూ స్థానంలేకుండా చేసుకున్నావు."
    "రాఘవా...." నిశ్చలంగా అన్నాడు శివ "నామీద నీకున్న అభిమానానికి కృతజ్ఞుడ్ని. అయితే జ్ఞానం వేరు, ప్రపంచజ్ఞానం వేరు అని నమ్మే నేను యిప్పటికీ నేను నష్టపోలేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే సాక్స్ లేనివాడు అసలు వాళ్ళే లేనివాడికన్నా అదృష్టవంతుడు కాబట్టి అంతెందుకు.....మనముందు కూర్చున్న సుకృతిగార్ని వుదాహరణగా తీసుకుంటే...."
    ఉద్విగ్నంగా తల పైకెత్తింది సుకృతి.
    "పుట్టి పెరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే రెడ్ కార్పెట్ మీద నడవాల్సిన అమ్మాయి అయ్యుండీ యిప్పుడు మృగాల మధ్య ముళ్ళకంచెల్లో నడవటానికి సిద్దపడిందిగా. అంతకన్నా నేను నష్టపోయానా? అసలు యిండస్ట్రీయే మునిసిపల్ డ్రైనేజీ అయినప్పుడు నేను గంగలోనే అభ్యంగన స్నానం చేసినట్టు బ్రతుకుతాననుకోవడం ఎంతవరకూ న్యాయం? నేను మాట్లాడుతున్నది సుకృతిగార్ని నిరాశపరచాలని కాదు రాఘవా.....నిన్నగాక మొన్నటిదాకా సూపర్ స్టార్ కావ్యనాయిక అంటూ రాజ్యంగార్ని బ్రహ్మరథం పట్టారే.....ఏరీ? ఆ సోకాల్డ్ పెద్ద మనుషులు. ఆమె హృదయారణ్యాల మూలంగా పెరిగి పెద్దవాళ్ళయిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఆమెను గురించి పట్టించుకుంటున్నారా? బాస్టర్డ్..... బుచ్చార్మ్ ఆఫ్ చార్జేరియన్ సొసైటీ.....ఆ మహానటి రాజ్యంగార్ని తలచుకుంటూ సిగ్గుతో కుమిలి చావాల్సిన స్థితిలో సైతం గర్వంగా బ్రతికేయగా లేనిది నిజాయితీగల నేనెందుకు నష్టపోయాననుకోవాలి" నిట్టూర్పులా ఆగాడు శివ. "నేను పిరికివాడిలా పారిపోను రాఘవా....ఇక్కడే వుంటాను. ఎప్పుడుకయినా నేనేమిటీ అన్నది కాదు వాళ్ళేమిటీ అన్నది తెలియచెబుతాను ఐ స్వేర్."
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    అది తిరుగులేని విశ్లేషణ....అదికాదు.
    శివలో ఇలాంటి ఆవేశాన్ని అంతవరకూ చూసి వుండకపోవటం మూలంగానో పగిలిన అగ్నిపర్వతమంత వేడిగా అతడు స్పందించడాన్ని గమనించడంతోనో ఆత్మీయంగా అతడి భుజంపై చేయివేశాడు రాఘవ.
    సముద్రమంత ప్రశాంతంగా కనిపించే శివ నిజంగా రెచ్చిపోతే ఉప్పెనలా మారి ఇండస్ట్రీ కాలుష్యాన్ని కడిగి కొత్త మారగాలని తెరవగలడనే అతడి నమ్మకం నిజమైనట్టుగా ఆ మరుసటి రోజే తన ప్రయాణం ప్రారంభించాడు.
    ఉదయాన్నే ప్రకాష్ స్టూడియోకి వెళ్ళిన శివ అక్కడ షూటింగులో వున్న డైరెక్టర్ రెడ్డిని కలుసుకున్నాడు. శివ ఆలోచన ఒక్కటే....సరైన అవకాశం దొరికేదాకా అసోసియేట్ గా మరో డైరెక్టర్ దగ్గర పనిచేయాలి. రెడ్డికూడా యిండస్ట్రీలో పెద్ద దైరెక్టరే....పైగా అంతకుముందు ఒకటి రెండుసార్లు అసోసియేట్ గా రమ్మని అడిగాడు.
    శివని సాదరంగా ఆహ్వానించిన రెడ్డి తను వచ్చిందెందుకో చెప్పగానే ముందు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
    "నీలాంటి సమర్దుడైన వ్యక్తి అసోసియేట్ కావడం నా అదృష్టం శివా. రేపు నెలలో నాది కొత్త పిక్చరు ప్రారంభం కాబోతూంది. కాబట్టి దానికి పని చేద్దువుగాని. కాకపోతే చిన్న సలహా."
    "చెప్పండి"
    "ఆ సినిమాలో హీరోయిన్ రమ్యశ్రీ.....మరేంలేదు. నిన్న ఏదో గొడవయ్యిందటగా. ఆవిడ దగ్గర సరే అని ఓ మాట అనిపించుకుంటే మంచిదికదూ. ఎంతయినా నెంబర్ వన్ స్టార్ గా ఆ తర్వాత సమస్య వుండదని....పైగా పక్క ఫ్లోర్ లోనే సుదర్శనరావు పిక్చరు షూటింగ్ అవుతూంది. ఓసారి నువ్వు కలిస్తే బెటరు."
    శివ మరెటో చూస్తున్నాడు.
    "నామాట విను శివా. నీ టాలెంట్ మీద నాకు నమ్మకముంది. చిన్న వయసు నీది పంతం ఏమిటి చెప్పు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS