స్వప్న ఓ క్షణం ఆగింది.
"ఏమిటో చెప్పమ్మా?"
"అమ్మమ్మా? మాకంతా పిక్నిక్ కి వెళ్ళాలనుందమ్మమ్మా?"
"ఈ వర్షాకాలంలో పిక్నిక్కేమిటే చిత్రంగా."
"అవునమ్మమ్మా! ఇప్పుడే పల్లెటూళ్ళు బావుంటాయి. మెట్టపైర్లు బాగా వుంటాయి. మాగాళ్ళు పెరుగుతూ వుంటాయి. కాలువలు, బోదులు అన్నీ నిండుగా వుంటాయి. పైరు వున్నపుడే పిక్నిక్ అమ్మమ్మా?"
"వర్షం వస్తే అంతా తలక్రిందులై ఖరాబైపోతుంది. తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుంది నీకు. ఇప్పుడు వద్దులేమ్మా వర్షాకాలం వెళ్ళనీ.
"అమ్మమ్మా!" గునిసింది స్వప్న.
"ఏమ్మా!"
"ఈ ఒక్కసారికి పర్మిషనివ్వవూ? మా ఫ్రెండ్సంతా తయారయ్యారు. అంతా ఆడపిల్లలమే. ఉదయంవెళ్ళి రాత్రికి వచ్చేస్తాం. లేదా మరుసటి రోజు అంతే! రేపు ఎల్లుండి వర్షాలొచ్చే సూచనలు వాతావరణం చెప్పలేదు. ఏఖాతంలోనూ వాయుగుండాలు పుట్టలేదు. ఇంకెక్కడి వర్షమమ్మమ్మా?"
నవ్వింది అమ్మమ్మగారు "ఒట్టిపట్టుదల! దొంగపిల్లా! అన్నీ మీ తాతయ్యబుద్దులే. ఆయనకీ అంతే! అనుకున్నది సాధించేదాకా నిద్రపోయేవారు కాదు."
"ఊఁ తాతయ్య గుర్తుకొస్తున్నాడన్నమాట"
"పిచ్చిపిల్లా! ఈ ముఫ్ఫై ఏళ్ళలో ఆయన్ని నేనుమరిచిపోయిందెప్పుడే!" కళ్ళు తుడుచుకుంది ఆమె.
"అమ్మమ్మా"
"ఏ వూరికమ్మా."
"మనవూరికే."
"మనవూరికా?" ఆశ్చర్యంగా అడిగింది.
"అవునమ్మమ్మా. అవును. మనవూరికే, మన ఊరెళ్ళి మనపొలం, తోటలు , దొడ్లు, బంగళా అన్నీ చూసి రావాలి. ముఖ్యంగా ఎలమావితోట చూడాలి. నువ్వేచెప్పేదానివి కదా తోటలో మాధవీలత వున్నాయని అవి తాతయ్య గారు నాటేరని మీ దాంపత్యానికి చిహ్నమనీ భావోద్రేకంతో చెప్పుకుంటూ వెళుతోంది స్వప్న.
ఆ దృశ్యాలన్ని కళ్ళముందు తిరుగుతున్నాయి అమ్మమ్మగారికి ఆమె ముఖం అలౌకికానందం తో వెలిగిపోతోంది.
"మరివెళ్ళిరామా అమ్మమ్మా."
ఉలిక్కిపడింది ఆమె. "ఊహూఁ స్వప్నా. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నీ పెళ్ళయి నీవూ నీ భర్తా యిద్దరూ వెళ్ళేదాకా నువ్వు వెళ్ళకూడదు. అక్కడమనయిలవేలుపు మందరేశ్వరస్వామిని మీరిద్దరూ జంటగా దర్శించాలి. అంతే. కఠినంగా అంది. కృష్ణవేణమ్మగారు.
స్వప్న ముఖం చిన్నబోయింది. ముఖం అటు తిప్పుకుని చాలా నిష్ఠూరంగా అవున్లే. నేను నా ఫ్రెండ్స్ ముందు ఫెయిలైనా నీకేం ఫర్వాలేదు. ఫూల్ నయినా సంతోషం అంతగా లేకపోయినా నీకు పర్లేదు. నేడో రేపో పెళ్ళిఅయ్యి అంతా అత్తారింటికి వెళ్ళేవాళ్ళే ఏదో తమాషాగా ఒక్కరోజు - ఒకే ఒక్క రోజు అలాకారులో వెళ్ళి చూసి తిరిగొస్తామన్నా నీకు గిట్టటం లేదు. అమ్మమ్మా నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నీమాట మీరానా? ఈ ఒక్క సారేనా కోరిక తీర్చవూ?" దీనంగా అడిగింది స్వప్న.
లేయెండకి కరిగేమంచాల్లే అమ్మమ్మగారి పట్టుదల సడలిపోసాగింది.
"ముందుగానే నీ కష్టం లేదని తెలిస్తే యీ ప్రపోజల్ కి అంగీకరించేదాన్నేకాదు. ఏదో మన ఊరు -మనతోట - అనివాళ్ళు అడిగితే గొప్పగా సరేనన్నారు. నాకేం తెలుసునీవు ఊహూ అంటావని?"
"స్వప్న!"
"అమ్మమ్మా! ప్లీజ్!"
"సరేనమ్మా! వెళ్ళిరా నేను నిన్నెందుకు వద్దన్నా నో నీకిప్పుడు తెలియదు. తిరిగొచ్చి తెలియజెపుతాను. అయితే నువ్వు నాకో మాటయివ్వాలి."
