తీరిక దొరికితే ఏదో పుస్తకం పుచ్చుకుంటుందామె. ఆమె భర్త మంచిలైబ్రరే సేకరించారు. ఆయన సరసుడు, చమత్కారి, జీవితాన్ని అనుభవించటం తెలిసినవాడు. ఈ బ్రతుకు సుఖంగా బ్రతికేందుకే కానీ కష్టపడేందుకు కాదు అనే సిద్దాంతం ఆయనది. ఆయన కాలం అలాగే గడిచిపోయింది.
పిత్రార్జితాన్ని వ్యయించకుండా అయివేజులో నాలుగోవంతు దానధర్మాలకి కేటాయించి, మరోవంతు బ్యాంక్ లో డిపాజిట్ చేసి సగభాగం మాత్రం ఖర్చుచేసేవాడు. అక్కడికే రాజభోగంగా జరిగేది ఆయనకి. స్వయంగా పర్యవేక్షణకి వెళ్ళేవాడు. అయ్యగారు ఎప్పుడొస్తారో ఏమో ననే భయంతో పాలికావులు చాలా జాగ్రత్తగా వుండేవాళ్ళు. దాంతో పొలాలు విరగబండేవి. ఫలితం ముబ్బడిగా వచ్చేవి. అవీయివీ చూడటానికి ఓముసలి గుమాస్తా ఉండేవాడు.
హాయిగా త్రుళ్ళుతూ తిరుగుతూ వుండేనారాయణ ఎప్పుడూ మాయని చిరునవ్వుతో సహజ సుందరమైన ముఖంతో ఠీవి, దర్పం మూర్తీ భవించినట్టుగా ఉండేవాడు భార్యతో సరసాలాడేవాడు. ఆమెతోనే చమత్కారాలు చేసేవారు. మరో స్త్రీని కన్నెత్తకుండా భార్యతోనే సకల శృంగార జీవితాన్ని చవిచూశాడు. ఆయన పోయేసరికి నలభయి నిండలేదు. చెంపలుకూడా నెరియలేదు. పడుకున్నవాడు పడుకున్నట్టుగా వెళ్ళిపోయారు.
ఏదో శాపవశాత్తూ భూలోకానికి చూడటానికి వచ్చిన గంధర్వుడు శాపం తీరగానే వెళ్ళిపోయినట్టుగా పోయాడు. అదిగో! అప్పటి నుంచి అమ్మమ్మగారి జీవితవిధానమే మారిపోయింది. సెలయేరులామ్ త్రుళ్ళుతూ, సంగీతంలా ధ్వనిస్తూ, చిత్రపటంలా అందాలు కుమ్మరిస్తూ, శిల్పంలా ఠీవిని వెలారుస్తూ వుండేకృష్ణవేణమ్మగారు నిస్తేజులయ్యారు భర్తమరణంతో.
దాంతో ఆమె జీవనస్వరాలే మారిపోయి తర్వాత నలభైసంవత్సరాలు ఆమెకి ఎలా జరిగిపోయాయో తెలియలేదు. ఇల్లు- పిల్లలు-వాళ్ళాస్వాతంత్ర్యం ఆమెకి గిట్టలేదు. ఆఖరికి మనవరాలు ఒక్కతే ఆశాజ్యోతిలా కనిపించింది ఆమెకి. ఆ దీపం వెలుగులో బ్రతుకుమార్గాన్ని వెలిగించుకుంటోంది.
"అమ్మమ్మ!"
సుడిగాలిలా దూసుకునివచ్చి పడకమీద కూర్చుని అమ్మమ్మమెడచుట్టూ చేతులు వేసింది స్వప్న.
స్వప్నకి అమ్మమ్మగారే తల్లీతండ్రీ తోబుట్టువు సర్వస్వం. అందుకే ఏ నాడూ ఆమెకి వాళ్ళు గుర్తురారు. హాల్లో వుంటే తండ్రిని చూసినట్టుగా భయపడుతుంది. వంటింట్లో వుంటే అమ్మమ్మ గారు తల్లి అయి ఒకోసారి కొసరికొసరి వడ్డిస్తుంది.
ఇదో! యిలావుండి నెచ్చెలి, సోదరి అన్నీ అయిపోతుంది స్వప్నకి.
"ఏమ్మా! తల్లీ! ఏంకావాలి? ఎక్కడికివెళ్ళివచ్చావు? నవ్వుతూ అడిగింది అమ్మమ్మగారు.
"గీత యింటికి వెళ్ళివస్తున్నానమ్మమ్మ."
"ఎందుకమ్మ?"
"అమ్మమ్మా! నాదో కోరిక తీర్చవూ?"
"ఒకటేనామ్మా! అయితే ఫరవాలేదు. రెండయితేనే రామాయణమవుతుంది!"
"ఫో! అమ్మమ్మా!"
"ఎక్కడికి పోతాను స్వప్న! నీకు వరుడ్ని వెదికి తెచ్చి మీరిద్దరూ చిలకా గోరింకల్లా తిరుగుతూవుంటే చూస్తూ నీవు ఓ ముని మనవడిని కని నా ముఖాన పారేస్తే ఆడిస్తూ వుంటాను. నాకిప్పుడు డెబ్బై! మరో ఇరవయ్యేళ్ళు బ్రతుకుతానన్నారు శాస్త్రిగారు!"
"నువ్వు నిండా నూరేళ్ళు బ్రతకాలి అమ్మమ్మా!"
"ఎందుకేమిటి?"
"ఎందుకా? నాకోసం!"
"ఊ ఇలా అన్ననీవే రేపు మొగుడు పక్కలోకి వచ్చాక యీ ముసల్ది యింక బ్రతికే వుంది అనుకుంటావా!"
"అమ్మమ్మ! నువ్వు నవ్వుతూ తమాషాకి అలా అన్నా నేను ఓర్చుకోను నాకుముందు అన్నీ నువ్వే! తర్వాతే ఎవరయినా!
స్వప్న కళ్ళల్లో నీళ్ళు తిరగటం చూసి "పోన్లేమ్మా! నేను వూరకే అన్నాను. నీ మనస్సు నాకు తెలియదు.
