"రంజిత్ ని ప్రేమించావా?"
"రంజిత్ అంటే నా కెంతో ఇష్టం ప్రేమించావా అని అడిగితే ఏం చెబుతాను అంకుల్!" ఈ మాట అని శీతల్ ఒక్కక్షణం ఆగింది. లోకేశ్వరరావు ముఖం మాడు ముఖంగా మారడం గమనించి నవ్వుకుంది. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది.
"అంకుల్! ప్రేమించడం అంటే ఏమిటి? ప్రేమ అనేది ఒక్క ప్రేమికులకే పరిమితమా! తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, తండ్రి, తాత, సోదరుడు వాళ్ళని మటుకు ప్రేమలు కావా? రంజిత్ ని ప్రేమించావా అని అడిగారు కదూ అంకుల్? రంజిత్ ని ప్రేమించాను. ఒక స్నేహితుడుగా, ఒక ఆప్తుడిగా, ఎస్, ఈ విధంగా ప్రేమించానని ధైర్యంగా చెప్పగలను" ఆవేశంగా పలికింది శీతల్.
లోకేశ్వరరావు ముఖం చింకిచాటంత అయింది. "ఇప్పుడు అర్ధమైనది విషయం" అన్నాడు.
"నన్నెందుకు ఎత్తుకు వచ్చారు?" వున్నట్టుండి టకీమని అడిగేసరికి శీతల్ ప్రశ్నకి వెంటనే ఏం జవాబు ఇవ్వాలో లోకేశ్వరరావుకి అర్ధం కాలేదు. కాస్త కంగారు పడ్డాడు. అంతలోనే తెప్పరిల్లి "దానికి చాలా పెద్ద కథ వుంది. తీరుబడిగా వివరిస్తాను. ఇక్కడ నీ కొచ్చిన భయం ఏమీ వుండదు కాని, జాగ్రత్తగా వుండాలి."
"జాగ్రత్తగా వుండడం అంటే..."
లోకేశ్వరరావు వివరిస్తుంటే శీతల్ కామ్ గా వింటూ కూర్చుంది.
* * * *
"మీరు బైటికి వెళ్ళకూడదు."
"ఎందుకు వెళ్ళకూడదు?"
"అయ్ గారి ఆజ్ఞలేదు."
"ఎవరికీ నీకా, నాకా?"
"నాకే అమ్మాయిగారు!"
"అయితే నీవు వెళ్ళకు అంతేగాని నన్ను వెళ్ళనియ్యకుండా మధ్యలో నీ పెత్తనం ఏమిటి?"
"అయ్ గారు చెప్పి వెళ్ళారు. అమ్మాయిగారు ఏది అడిగితే అది ఆఘమేఘాల మీద వెళ్ళి తెచ్చి ఇవ్వమని"
"ఆఘమేఘాలు అదేమన్నా వాహనం పేరా!"
"కాదండి ఇంగ్లీషులో యమర్జంటుగా వెళ్ళి రావటం తెలుగులో ఆఘమేఘాల మీద అంటారు"
"అయిసీ" అంటూ అక్కడే నుంచుని ఆలోచనలో పడింది శీతల్.
నౌకరు చేతులు కట్టుకుని నుంచున్నాడు. ఈ సంభాషణ అంతా శీతల్, నౌకరు మధ్య జరిగింది. వాడు పేరుకు నౌకరులాగా వున్నాడు గాని నౌకరు కాదు లోకేశ్వరరావు చేతికింద వున్న మెరికల్లాంటి మనుషులలో వీడొకడు. వాడు చెప్పింది మంచిగా వినిపించుకోక శీతల్ బైటికెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం చేతులు నులుముకుంటూ కూర్చోడు. శీతల్ నడుంని ఎడం చేత్తో పుచ్చుకుని వక్క విసురున గదిలో పారేసి, గది బైట గొళ్ళెం పెట్టగలడు. ఈ చిన్న విషయం శీతల్ కు తెలియక గాదు. ఈ శోధనలో భాగంగా ఆ ఇంట్లోంచి బైటికి వచ్చింది.
ఆ రోజు లోకేశ్వరరావు తగు జాగ్రత్తలు చెప్పాడు.
"నిన్ను మా మనుషులు ఎత్తుకు వచ్చారు. ఈ విషయం మీ డాడీకి తెలిస్తే నా మీద కేసు పెడతాడు. లేక పిట్టను కాల్చినట్టు కాల్చి చంపుతాడు. కనుక నీవు కొన్నాళ్ళుపాటు ఇక్కడ రహస్యంగా వుండడం మంచిది. నీకు ఏం కావాలన్నా నౌకర్లను కేకెయ్యి తెచ్చి ఇస్తారు. బైటికి వెళ్ళావనుకో నీ కోసం గాలిస్తున్న మీ డాడీ మనుషులు నిన్ను బలవంతాన ఎత్తుకెళతారు" అంటూ ఎన్నో చెప్పాడు.
"అలాగే అంకుల్! ఈ పెళ్ళి మీరు తప్పించారు. ప్రస్తుతం మీరు చెప్పినట్లే వింటాను" లోకేశ్వరరావు చెప్పింది విని బుద్దిమంతురాలిలాగా అంది శీతల్. కాని ఆమె ఆలోచనలు వేరు.
లోకేశ్వరరావు తన నుంచి ఏదో ఆశించి పెళ్ళి ఇంకో రెండు గంటలు వుందనగా ఎత్తుకు వచ్చాడు. వీడో పెద్ద దొంగ వెధవని ముఖం చూస్తేనే తెలుస్తున్నది. తన మీద చెడ్డకోరిక లేదు కనుకనే అంకుల్ గా పరిచయం చేసుకున్నాడు. జాగ్రత్తగా కూడా చూస్తున్నాడు. ఏ గల్ఫ్ దేశాలకో తనని అమ్మడు అనుకోవాలి. అమ్మాయిలపట్ల వాళ్ళ ట్రీట్ మెంట్ వేరుగా వుంటుంది. లోకేశ్వరరావు ఏదో ఆశించే తనని తీసుకొచ్చాడని...అంతవరకు అర్ధమవుతుంది. కనుక తగు సమయం వచ్చిందాకా తన జాగ్రత్తలో తానుంటే....! శీతల్ అలా ఆలోచించి జాగ్రత్తగా మెలుగుతూన్నది. ఆ పెద్ద ఇల్లు సముద్రానికి దగ్గరగావుంది. దూరంగా తప్ప మళ్ళీ ఇళ్ళులేవు. ఈ ఇంట్లో గుర్రమంత కుక్కలు రెండు వున్నాయి. నౌకర్ల వేషాలతో మనుషులు పదిమంది పైననే ఉన్నారు. కొందరిదగ్గర రివాల్వర్లు ఉన్నాయి. గేటు దగ్గర గూర్కా ఉన్నాడు. అతనిదగ్గర పదునైన ఆయుధాలు కుక్రీ ( గూర్కాలు వాడే కత్తి) వుంది. ఆయుధాలు ఉపయోగించకుండా ఉట్టిచేతులతోనే అవలీలగా అయిదుగురు మనుషులను చంపగల శక్తిగల మొరటు మనుషులు వాళ్ళు ఈ కాపలా అంతా తన కోపమే అని శీతల్ గ్రహించింది ఏమీ తెలియనట్లు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నది.
శీతల్ ఆలోచనలు వేరు. తనకేదన్నా విషమ పరిస్థితి సంభవిస్తే వీళ్ళని చేతులతో ఎదిరించే శక్తి తనకి లేదు వీళ్ళందరి కళ్ళుగప్పి పారిపోవాలి. అలా వెళ్ళగలగాలి అంటే ముందుగా ఈ పరిసరాలన్నీ క్షున్నంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే శీతల్ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చింది. వరండా దిగంగానే నౌకరు అడ్డు తగిలాడు.
"చూడు నీపేరేంటి" కాస్త ఆలోచించి శీతల్ అడిగింది.
"కొండ" నౌకరు వినయంగా చెప్పాడు.
"ఏ కొండ?"
"ఏ కొండ ఉంటుందండి? నా పేరు కొండ అంతే."
"అయ్యప్ప కొండ, అప్పలకొండ, ఏడుకొండలు ఇంకా చాలా కొండలు ఉన్నాయి. నీది ఏకొండా అని...."
"ఆ కొండలేవీ నావి కావండి, నాపేరు ఉత్తకొండ" కాస్త సిగ్గు అభినయిస్తూ చెప్పాడు నౌకరు కొండ.
"చూడు 'ఉత్తకొండా!"
"అయ్యయ్యో మళ్ళీ పొరపాటుపడ్డారు అమ్మాయిగారూ! 'ఉత్త' అన్నమాట కలిపాను అంతే. కొండఅని పిలవండి పలుకుతాను."
