Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 23

 

    "పిలుచుకు వస్తాను ఇప్పుడే" అంటూ వెళ్ళింది జయంతి.

    "గిరిజ ఏదే కనిపించడంలేదు" అంది కామేశ్వరమ్మ.

    "ఈరోజు మన కరణంగారింట్లో నలుగు పెడుతున్నారమ్మా ......అక్కడే భోజనం కూడా. ఓ అరగంట ఆగి వెళ్ళి తిసుకోస్తాం" అంది కస్తూరి.

    "అలాగా, మంచిది త్వరగా వెళ్ళి తీసుకురండి పొద్దుపోయింది" అంది కామేశ్వరమ్మ.

                                              11

    దాదాపు రెండువేల గడపలున్న ఆ వూరు వూరంతా సర్వోత్తమరావు ఇంటికి తరలి వచ్చింది. ఇప్పటికి దాదాపు అయిదు బంతులు జనం భోంచేసి లేచారు. ఇంకా సగం జనం వున్నారు. మధ్యాహ్నం పన్నెండుగంటలకు ప్రారంభమైయిన భోజనాలు సాయంత్రం మూడు గంటలవుతున్నా ఇంకా జనం వస్తూనే వున్నారు. అయిదు రకాల కూరలు, స్వీట్లు, హాటు, పరమాన్నం, దేనికి కొదవ లేకుండా అంతమందికి సరిసమానంగా వడ్డిస్తూన్నారు. వడ్డనకు సురేంద్ర స్నేహితులు, సర్విత్తమరావు దగ్గర పనిచేసే మనుషులు దాదాపు యాబై మంది అలుపు లేకుండా వడ్డిస్తూనే వున్నారు. ఓ వైపు వడ్డన, జరుగుతుంటే మరోవేపు వంటలు వండుతూనే ఉన్నారు. వంటల దగ్గర కస్తూరి, దాక్షాయణి, శివపార్వతి వుండి అన్ని సక్రమంగా జరిగేటట్టు చూస్తున్నారు. భోజనాలు చేసి వెళ్ళేవారు సర్వోత్తమరావుగారి పెళ్ళి భోజనం గూర్చి గొప్పగా చెప్పుకుంటు పోతున్నారు.

    "అబ్బ! ఇంతవరకు మన ఊర్లో ఇటువంటి పెళ్ళి భోజనం తినలేదురా....ఏం భోజనం.....ఏం భోజనం.....ఎంత కావాలంటే అంత వడ్డిస్తున్నారు" అన్నాడు కిళ్ళికొట్టు సాంబయ్య.

    "మరేమనుకున్నావోయ్ మా అయ్యగారంటే గిరిజమ్మ పెళ్ళే ఈ విధంగా చేస్తే ఇక జయంతమ్మ పెళ్ళి చూడు ఇంకా ఎట్లా చేస్తారో" అన్నాడు వెంకటేశం.

    "నిజమేరా అన్న కూతురు పెళ్ళే ఈ విధంగా చేస్తే ఇక సొంత కూతురి పెళ్ళి ఇంకెంత వైభవంగా చేస్తారో" అన్నాడు సాంబయ్య.

    "అ వచ్చేది ఎవరూ ప్రెసిడెంటుగారా" అన్నాడు సాంబయ్యా.

    "అవున్రా, ప్రెసిడెంటుగారే. ఇంత ఆలస్యంగా వత్తున్నాడెంటి? అన్నాడు వెంకటేశం ఆశ్చర్యంగా.

    "దండాలండి......రండి రండి" అన్నాడు వెంకటేశం,వాడిని పురుగును చూసినట్లు చూసి లోపలికి వెళ్ళాడు.

    "అరెరే! ప్రెసిడెంటు గారా! ఏంటి గోపాలరావుగారూ ! ఇంత ఆలస్యంగా వచ్చారు! మా అమ్మాయేది?' అన్నాడు సర్వోత్తమరావు.

    "ఆ....నేను పట్నం పనుండి వెళ్ళి అక్కడినుంచి నేరుగా వస్తున్నానండి....ఇంటికి వెళ్ళలేదు. ఇప్పటికే ఆలస్యమయిపోయింది. రాకపొతే మీరు మరోలా భావిస్తారని హడావుడిగా వస్తున్నాను" అన్నాడు.

    "ఆహా! ఎంత అందమైన అబద్దం అడారండి అతికినట్లు మహానుభావులు" అని లోపలే అనుకున్నాడు కరణం.

    "రా బావా రండి. ప్రెసిడెంటుగారుమీరూ ఇలా కూర్చోండి అన్నాడు సర్వోత్తమరావు.

    "నాదేముంది బావగారు....నేను తరువాతతింటాను, మన ప్రెసిడెంటుగారికి వడ్డించండి" అన్నాడు కరణం.

    "అయ్యో! అదేంటి ఇప్పటికే ఆలస్యమైతేను" అన్నాడు సర్వోత్తమరావు.

    "అరేయ్ సుందరం ఇలా రా. ప్రెసిడెంటుగారికి వడ్డించు" అంటూ తమ్ముడ్ని పిలిచాడు.

    "వస్తున్నానన్నయ్యా" అంటూ హడావుడిగా వచ్చి "నమస్తే ప్రెసిడెంటుగారూ' అన్నాడు సోమసుందరం.

    "నమస్తే! ఏమోయ్ ఎలా సాగుతున్నాయ్ నీ కంట్రాక్టు పనులు అన్నాడు అన్నం కలుపుకుంటూ.

    "ఆ ఏముందిలెండి ఏదో అలా సాగుతున్నాయి" అన్నాడు సోమసుందరం.

    "అవును కరణంగారూ .....మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు ఇద్దరు కలిసి వచ్చారా?" అన్నాడు సోమసుందరం.

    "అబ్బే! లేదయ్యా....దార్లో కలిశాం. ఆయనేమో పట్నం వెళ్లారట పనిమీద నేనేమో ఏదో స్థలం గొడవ పంచాయితీ జరిపించి వచ్చేసరికి ఇదిగో ఇంత ఆలస్యమైపోయింది" అన్నాడు కంగారును కప్పిపుచ్చుకుంటూ.

    ప్రెసిడెంటు కరణాన్ని ప్రశంసాపూర్వకంగా చూశాడు.

    నిజానికి ఇద్దరు కావాలనే ఆలస్యంగా బయల్దేరి వచ్చారు. మధ్యలో విడిపోయి విడివిడిగా వచ్చినట్లు నటించారు.

    "ఈరోజు అమ్మాయి పెళ్ళని తెలుసు కదండీ! ఈరోజు కూడా పంచాయితీలేంటి పెందరాడే  రావచ్చుకదా" అన్నాడు సోమసుందరం.

    "అన్నవూ.....ఏం చేద్దాం బాబూ కరణంగిరి అంటే అంతే! అందుకేగా  అన్నగారిని పోటీ చేయమంటుంది. ఈసారి ఎలక్షన్లలో మన ప్రెసిడెంటు గారు పోటీ చేయరట....రెండుసార్లు పోటీచేసి నెగ్గాను. ఇక నాకు ఈ ప్రెసిడెంటు గిరిమీద మోజు తగ్గిపోయిందంటున్నారు ప్రెసిడెంటుగారు" అన్నాడు కరణం.

    ప్రెసిడెంటు కోపంగా కరణం కాలు తొక్కాడు.

    "అయ్యో...ఆమ్మో" అన్నాడు.

    "ఎంటండి ఏమయింది?" అన్నాడు సుందరం కంగారుగా.

    "ఏం లేదులేబాబు. కాలు పట్టేసింది" అన్నాడు కరణం.

    అంతలో సర్వోత్తమరావు అక్కడికొచ్చి "ఏంటి బావా! ఎందుకలా అరిచావు" అన్నాడు ఆశ్చర్యంగా.

    "ఏంలేదులే బావా! అప్పుడప్పుడూ అరవటం అలవాటయిపోయింది ఈమధ్య" చెప్పాడు కంగారును కప్పిపుచ్చుకుంటూ.

    "ఏంటో నిదంతా అదోరకం" అన్నాడు సర్వోత్తమరావు.

    "ప్రెసిడెంటుగారూ! అన్నం పెట్టుకోండి" చెప్పాడు సర్వోత్తమరావు.

    "వద్దంది....చాలు తృప్తిగా భోంచేశాను. అన్ని కూరలు బ్రహ్మాండంగా వున్నాయి." చెప్పాడు ప్రశంశాపూర్వకంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS