Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 24


    "ఇక్కడ నా భర్త కూడా అలాగే ఓరోజు ఏడుస్తూ వచ్చి తను ఆఫీసులో దొంగతనం కేసులో ఇరుక్కున్నాననీ, జైలుశిక్ష తప్పదనీ, అదిలేకుండా చెయ్యాలంటే నేను తన ఆఫీసర్ తో ఒక రాత్రి గడపాలనీ అన్నాడు. నేను ఒక వాక్యంలో చెప్పిన ఈ విషయం మూడు రాత్రుల పాటు మా మధ్యన ప్రచ్చన్న యుద్ధం రేపింది. అప్పటికే నాకు నెల తప్పింది. నన్నూ నా బిడ్డనీ పోషించదగ్గ ఆర్ధికస్థితి నా పుట్టింటివారికి లేదు. ప్రాణం తీసుకుందామంటే నేను నాతోబాటు మరో ప్రాణిని కూడా హత్యచేయాల్సొస్తుంది. నాభర్త నా ముందే నిప్పంటించుకు చస్తానని బెదిరిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో....ఈ అనసూయ కూడా అతిథికి ఆకలి తీర్చాల్సి వచ్చింది" ఆమె గొంతు వణికింది.
    
    చాలా ఇబ్బందికరమైన సన్నివేశం. నేను గొంతు సవరించుకుని ఎదురుగుండా వున్న మంచినీళ్ళ గ్లాసు అందుకుని ఓ గుటక వేసాను.
    
    "అలా మొదలయింది ఈ రకమైన జీవితం. మళ్ళీ ఓ నెలకల్లా నా భర్త ఇంకోడ్ని తీసుకొచ్చి వాడు బిజినెస్ లో నన్ను పార్టనర్ గా చేర్చుకుంటానంటున్నాడు......నువ్వు ఒక్కసారి వాడి కోరిక తీర్చు.....అంటూ ఒత్తిడి చేశాడు. నేను ఆ సంసారపు ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టలేక, అంగీకరించలేక అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక తెలిసింది ఒంటరిగా, నిరాధారంగా బ్రతుకుతున్న స్త్రీ జీవితం ఎంత అలుసో! హౌస్ ఓనర్ దగ్గరనుండి పచారి కొట్టువాడి వరకూ అదే కోరసాగారు. అప్పట్లోనే గురుమూర్తి దగ్గరకి ఇంటర్వ్యూకి వచ్చాను. ఆయన ఉద్యోగం ఇచ్చాడు. కొన్నాళ్ళకి ఒకనాడు ఏకాంతంలో తన భార్యవల్ల తనకు సుఖంలేదనీ తన కోరిక తీర్చమనీ అడిగేసాడు. నేను ఆలోచించాను. ప్రతీవాడూ అదే కోరిక కోరుతున్నప్పుడు కాస్త స్థోమతున్నవాడైతే ఇంకోడికి లొంగాల్సిన అవసరం వుండదుకదా అని ఒప్పేసుకున్నాను. ఆయన నాతో రకరకాలుగా తన కోరిక తీర్చుకుంటాడు. పెద్దతనం వల్ల ఆయన శరీరం సాధారణంగా సహకరించదు. అక్కడ ఉద్యోగం చెయ్యాలంటే ఆ కష్టం భరించక తప్పడంలేదు. అక్కడ మానేసినా ఇంకోచోటైనా ఇంతేనేమో అనిపిస్తుంది. అలా అని అందరు ఆడవాళ్ళూ ఇలాంటివి చేయాల్సొస్తోందని నా ఉద్దేశ్యంకాదు. కానీ నాలాంటి మొగుడు వదిలేసిన ఒంటరి ఆడది అంటే ప్రతివాడికీ చులకనే! ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంతలో ఏవో రోగాలు అంటించుకుని నా మొగుడు వచ్చాడు. అతని సామర్ధ్యానికి అతనికి లేని వ్యసనాలు లేవు. ఇంట్లోకి రానివ్వకాపోతే తాగి ఇంటిముందు నిలబడి ఆ జీవితం నతా బూతులతో బయట పెడతాడు. అందుకే లోనికిరానిచ్చాను. నా శరీరంతో వ్యాపారం చెయ్యడానికి చూస్తే గురుమూర్తిగారు పోలీస్ సాయంతో మెత్తగా తన్నించారు. ఆయన అండనాకు వుందని తెలిసి కాస్త అణిగివుంటున్నాడు. లేకపోతే మళ్ళీ యధేచ్చగా నా శరీరాన్ని బేరం పెట్టేవాడు. ఆశ్చర్యంగా వుందా....రక్షించాల్సిన భర్త నుండే నా శీలానికి రక్షణ లేక రక్షకభటుల సహాయం కోరాల్సివచ్చింది. ఇటువంటి కథలు భర్తచాటు సంసారం చేసుకునే ఏ స్త్రీకి చెప్పినా "ఛీ! చెడి కట్టుకథలు చెప్తోంది..."అని ఈసడిస్తుంది. కానీ నేను పడుతున్న మనోవేదన అర్ధం చేసుకోదు. అర్ధంకాకపోయినా ఫరవాలేదు. నా గురించి మరో రెండు జోడించి సూదుల్లాంటి మాటలతో చూపులతో కుళ్ళబొడుస్తారు. అందుకే ఈ మొగుడు అనేవాడ్ని భరిస్తూ ఈ నల్లపూసలూ, మట్టెలతో బాబుకోసం ఈ బాధలన్నీ భరిస్తూ బ్రతుకీడుస్తున్నాను. కనీసం నీకైనా నాబాధ చెప్పుకోవాలనిపించింది. సుమతీ! ఎందుకో నిన్ను చూడగానే ఇలాంటి చెల్లెలుంటే బావుండ్ను" అనిపించింది" అంది కన్నీళ్ళతో అనసూయ.
    
    ఆ అందమైన కళ్ళల్లో కన్నీళ్ళు! బొమ్మనిచేసి ప్రాణంపోసి ఇష్టం వచ్చినట్లు ఆడే ఆ పైవాడిననాలి. నాకు దూరమైన సుందరమైన ఆనందకరమైన సంసార జీవితాన్ని ఆమె అనుభవిస్తోందని వూహించాను. ఆ చెవిజూకా వూగుతున్నప్పుడూ ...ఆ ముంగురులు నుదుటిమీద అల్లనల్లన ఆడినప్పుడూ....ఆ చెక్కిలి నొక్కులు పడి మెరిసినప్పుడూ ఓ అందమైన యువకుడు ఆ సౌందర్యాన్ని గ్రోలుతూ రసవృష్టిలో తేలియాడతాడనీ ఆమెని పరియిష్టిని చేస్తాడనీ అనుకున్నాను ....కానీ...ఆ కళ్ళక్రింద వలయాలూ, మనసులోని నైరాశ్యం నాకంత పడినవేళ భరించలేకపోతున్నాను.
    
    నాకు భర్తవల్ల ధనం వుంది. సంతానంలేదు! ఆమెకు సంతానం వుంది. ధనంలేదు. కామన్ గా ఇద్దరికీ సుఖంలేదు. ఒకే బోటులో ప్రయాణం సాగిస్తున్న సహప్రయాణీకులం. ఆమెని అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాను.
    
                                                               * * *
    
    "పునీతని కలవాలి. క్లాస్ ఎప్పుడు అవుతుందీ?" అడిగిందావిడ వయసు నలభై పైనే వుండచ్చు. కాని డబ్బూ, పోషణా వల్ల ఆరోగ్యంగా స్టెయిల్ గా కనిపిస్తోంది.
    
    "క్లాస్ అయిపోయింది వచ్చేస్తుంటుంది" అన్నాను.
    
    ఆవిడ లేత కనకాంబరం రంగు ప్లైన్ సిల్క్ శారీ కట్టుకుని, భుజాలమీదుగా షాల్ కప్పుకుని వుంది. ఎక్సర్ సైజ్ రెగ్యులర్ గా చేసే బాడీ అని షేప్స్ చెపుతున్నాయి. ఆవిడ కాలి స్లిప్పర్స్ నుండి వెనిటీ బ్యాగ్ వరకూ చాలా ఖరీదుగా వున్నాయి. ఆవిడలో చాలా ఆకర్షణ వుంది. ముఖ్యంగా ఆ కంఠం ఎంత స్వీట్ గా వుందంటే ఇంకోసారి మాట్లాడితే బావున్ను అనిపించింది.
    
    ఆవిడ చాలా అసహనంగా అటూ ఇటూ పచార్లు చెయ్యసాగింది.
    
    "కూర్చోండి మేడమ్!" అన్నాను.
    
    ఆవిడ నోరు విప్పలేదు. తల ఆడించి వూరుకుంది.
    
    క్లాస్ అయిపోయి స్టూడెంట్స్ బయటకొస్తున్నారు.
    
    "హాయ్ మమ్మీ!" అంటూ పునీత ఆవిడ దగ్గరకొచ్చింది. నాకు అదేదో టాయ్ లెట్ సోప్ ఎడ్వర్ టైజ్ మెంట్ గుర్తొచ్చింది. ఆవిడ ఆమెకి అక్కన్నా కూడా నమ్మొచ్చు.
    
    "ఎంత సేపయ్యిందమ్మా వచ్చి?" అడిగింది పునీత.
    
    "జస్ట్ టెన్ మినిట్స్" అందావిడ.
    
    వాళ్ళిద్దరూ తల్లీ కూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ముచ్చటగా అనిపించింది.
    
    "ఏమిటలా చూస్తున్నావు?" అడిగింది అనసూయ.
    
    "పునీతా వాళ్ళ మమ్మీ వచ్చారు" అన్నాను.
    
    "అహల్యగారా?" అంది.
    
    ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించి "నీకు తెలుసా...?" అన్నాను.
    
    అనసూయ నావంక విచిత్రంగా చూస్తూ "ప్రఖ్యాత సింగర్ ఆవిడ. మన చిన్నప్పుడు చాలా సినిమాల్లో కూడా ప్లేబాక్ పాడింది. ఆ పేరు వినలేదూ?" అంది.
    
    నాకు అహల్య పేరు ఎక్కడ విన్నానో గుర్తొచ్చి చాలా థ్రిల్లింగ్ అనిపించింది.
    
    "అదీ సంగతి...అందుకే ఆ వాయిస్ అంత స్వీట్ గా వుంది" అన్నాను.
    
    "ఆవిడ ఆ వరాన్ని మనకి దూరం చేసేసి చాలా సంవత్సరాలు అయింది" అంది అనసూయ.
    
    "ఏం?" అన్నాను.
    
    "ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్ రఘురాం ఆవిడ్ని పెళ్ళిచేసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆవిడ పాడడం మానేసింది. పునీత వాళ్ళ అమ్మాయే. నేను మొదటిసారి ఆవిడ్ని చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యానో తెలుసా? పరిగెత్తుకెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను" అంది.
    
    నేను ఈ సంగతి మాధవికి ఉత్తరం వ్రాయాలి అనుకున్నాను. జీవితంలో గొప్ప వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త ప్రదేశాలకి వెళ్ళడం దైనందినాల్ని ఉత్సాహభరితం చేస్తాయి. ఒకే రకమైన వంట చేసుకుని తింటూ, ఒకే రకమైన పనిచేస్తూ ఒకేలా రోజులు దొర్లించేసే వాళ్ళే మనదేశంలో ఎక్కువశాతం. ఇతర దేశాల్లో సంసారం కూడా ఒకే విధంగా వుండకుండా చూసుకుంటారు. మరీ అంచ అచంచలంగా వుండకుండా చూసుకుంటారు. మరీ అంత చంచలంగా వుండకపోయినా కొంతయినా వెరైటీ వుండాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS