"అర్జెంటుగా పది వైట్ పేపర్స్ కావాలి మేడం. ప్లీజ్!" అంది ఓ అమ్మాయి. అల్మారాలో వుంటాయని నాకు తెలుసు.
నేను డ్రాలో తాళాలకోసం వెదికాను. దొరకలేదు. "అనసూయ గార్ని అడిగి ఇస్తాను. వుండు" అంటూ లోపలికి వెళ్ళాను.
తలుపు కొద్దిగా తెరిచి ఆ దృశ్యం చూసి వెంటనే మూసేసి వెనక్కి వచ్చేసాను. నేను చూసిన విషయం లోపల వాళ్ళకి తెలీదు. నాకు గుండెదడదడా కొట్టుకుని ఒళ్ళంతా చెమట్లు పోశాయి.
"ఏమైంది మేడం?" అని ఆ అమ్మాయి నవ్వి,
"లోపల సార్ మేడం బిజీగా వున్నారా? అదంతేలెండి. మీకింకా కొత్త" అనేసి వెళ్ళిపోయింది.
ఔను నాకు కొత్తే! అనసూయ అలా గురుమూర్తిలాంటి వయసు మీరిన వ్యక్తితో శృంగారం చేస్తుందని నేను వూహించలేదు. నేను సంపెంగ అనుకున్నది గడ్డిపువ్వు అని తెలిసినంత నైరాశ్యం కలిగింది. తల టేబుల్ మీద ఆన్చి పడుకున్నాను.
సోఫాలో పడుకున్న గురుమూర్తి మీదకి ఒంగి ముద్దు పెడుతున్న అనసూయ రూపం తల విదిల్చినా మనసులోంచి మాయమవడం లేదు. శుక్రవారం తలంటు పోసుకుని కాళ్ళకి పసుపు రాసుకుని పాపిటలో సింధూరం, నుదుట పెద్ద బొట్టుతో వచ్చే అనసూయ పవిత్ర రూపం....పతివ్రత పతివ్రత! ఆ మాటలు మనసులో మననం చేసుకున్న కొద్దీ ఏదో అర్ధం స్ఫురిస్తోంది.
అనసూయ గదిలోంచి వచ్చింది. చెదిరిన కుంకుమ సరిచేసుకుంది. కుచ్చిళ్ళు ఓసారి సవరించుకుని "సుమతీ....ఈరోజు మా బాబు పుట్టిన రోజు. మా ఇంటికి రాకూడదూ!" అంది.
నేను ఆమె వైపు ధైర్యంగా చూడలేకపోయాను. ఇదేమిటి....తప్పు ఆమె చేస్తే నేను ధైర్యంగా చూడలేకపోవటం! ఆమెకి అది అలవాటు...నాకు చూడడం మొదటిసారి కాబట్టీ భయమేసింది.
"ఈ రోజు వద్దు ఒంట్లోబాలేదు" అన్నాను.
"అయ్యో! ఏమైందీ? తలనెప్పా?" ఆమె నా నుదురు తాకిచూసింది. అప్రయత్నంగా దూరం జరిగాను. గురుమూర్తిని ముట్టుకున్న చేత్తో నన్ను తాకడం భరించలేకేమో!
"తలనెప్పే..." దూరంగా జరిగి అన్నాను.
"పోనీ రేపు వస్తారా?" అడిగింది. మరునాడు ఆదివారం మాకు శలవు.
"ఊహూ! మా ఆయన ఇంట్లో వుంటారు" అన్నాను.
ఆమె ఏమీ మాట్లాడలేదు. హేండ్ బ్యాగ్ తీసుకుంటూ "మీకోసం కారొచ్చింది. నన్ను కాస్త మా ఇంటిదగ్గర దింపి వెళ్ళండి. మా బాబు ఎదురుచూస్తుంటాడు" అంది.
"సరే" అని లేచాను.
కారు స్టార్టయ్యాకా అనసూయే మాట్లాడింది.
"మా బాబుని మా పిన్ని దగ్గర గుడివాడలో పెట్టాను. పుట్టినరోజని మొన్న తీసుకొచ్చాను. మళ్ళీ రేపు దింపేసి వస్తాను. ఇక్కడుంటే చూసుకునే వాళ్ళు వుండరు."
"మీ ఆయనేం చేస్తారు?" అడిగాను.
"ఏమీ చెయ్యరు అదే ప్రోబ్లం!" అంది.
నాకెందుకో అతనిమీద విపరీతమైన జాలేసింది. ఉద్యోగం లేదుకాబట్టి ఈవిడ రాచకార్యాలు తెలిసినా తెలీనట్లు వుంటాడు కాబోలు!
"ఇక్కడే...డ్రైవర్ ఆపు" అని నాతో -
"ఓసారి లోపలికొచ్చి బాబు నెత్తిమీద నాలుగు అక్షింతలు వేసి వెళ్ళండి....ప్లీజ్!" అంది.
ఇంక బావుండదని దిగి లోపలికి వెళ్ళాను. మూడు గదుల పోర్షన్ అది. నీట్ గానే వుంది. ఒక వయసు మళ్ళినావిడ బాబుని ఎత్తుకుని వచ్చింది.
"అమ్మా..." అంటూ వాడు అనసూయ కాళ్ళని చుట్టుకున్నాడు. ఆమె వాడ్ని ఎత్తుకుని రెండు బుగ్గల మీదా గట్టిగా ముద్దులు పెట్టుకుంది. బాబు బొద్దుగా ముద్దుగా వున్నాడు. ఆ నిమిషాన అనసూయ మీద ఈర్ష్యగా అనిపించింది. ప్రొద్దుట నేను ముద్దు పెట్టుకోబోతే విదిలించుకునిపోయిన అల్పనా కొడుకు గుర్తొచ్చాడు.
"విశాల్...ఆంటీకి కూడా ముద్దు పెట్టు." అంది.
విశాల్ మూతి సున్నాలా చుట్టి వాళ్ళమ్మ చేతిలోంచే నాకు ఒంగి ముద్దు పెట్టాడు. వాడు అనసూయ కొడుగ్గా పుట్టినందుకు నాకు వాడిమీద జాలేసింది! ఏమిటి వీడి భవితవ్యం? అనుకున్నాను.
"విష్ యూ హేపీ బర్త్ డే!" అంటూ పర్స్ లోంచి రెండు వందలనోట్లు తీసి చేతిలో పెట్టాను.
"అలాంటి ఫార్మాలిటీస్ వద్దు సుమతి! మీరు రానని కూడా మళ్ళీ వచ్చారు. అంతేచాలు!" అంది అనసూయ.
"ఫర్లేదు బొమ్మలు కొనిపెట్టండి" అన్నాను.
"కూర్చోండి పిన్ని కాఫీ తెస్తోంది" అంది.
"వద్దు నాకు టైం లేదు" అన్నాను.
"కూర్చోండి కాస్త మాట్లాడాలి" అంది.
నేను కూర్చున్నాను.
ఆమె లోపలికెళ్ళి బాబుని వాళ్ళ పిన్నికి అప్పజెప్పి వచ్చింది.
"సుమతీ....ముసలి పులి నోట్లో తలపెట్టడం ఎంతటి నరకమో తెలుసా?" అంది.
అ ఉపోద్ఘాతం ఎందుకో అర్ధంకానట్లు చూశాను.
ఆమె శుష్కహాసం చేసి "సర్కస్ లో సామాన్యంగా అదో ఫీట్ గా చేయిస్తుంటారు. కడుపు తిప్పలకోసం అలా దాని నోట్లో తలపెట్టేవాడి బాధ వర్ణనాతీతం. కొరకలేదూ....నోట్లో వాసనా....సొల్లు కార్తుంటుందీ....భయంకరమైన పరిస్థితి" అంది.
అది వూహించి నేనూ నవ్వాను.
"అలాంటిది గురుమూర్తి కౌగిలిలో నా పరిస్థితి!" ఠక్కున అంది.
నేను షాక్ కొట్టినట్లుగా ఆమెవైపు చూశాను.
"సాయంత్రం నువ్వు చూసిన దృశ్యం గురించే నేను మాట్లాడుతున్నాను" అంది.
ఇది ఇంకో షాక్ ఆమె నన్ను చూసీ ఇంత మామూలుగా వుండగలిగిందా! సిగ్గూ, భయంలాంటివేం కలగనే లేదా?
"ఏమీ చెయ్యలేని ఆయనకి బోలెడు పర్వర్షన్స్ వున్నాయి. అవి తీర్చడం ఎంతటి నరకమో నీకు తెలీదు!" అంది.
"ఎందుకు అలాంటి బతుకు? హాయిగా ఇంకో ఉద్యోగం చూసుకుని మొగుడ్నీ బబునీ పోషించుకుంటూ వుండొచ్చుగా! ఇవన్నీ తెలిస్తే-మీ ఆయన ఎంత అసమర్ధుడైనా వూర్కుంటాడా?" కోపంగానే అన్నాను.
ఆమె లేచి కూలర్ ఆన్ చేసింది.
"అనసూయ అని నాకు మావాళ్ళు ఎందుకు పేరు పెట్టారో కానీ నాకూ ఆవిడ కథకీ చాలా పోలికుంది" అంది.
"ఛట్! కళ్ళుపోతాయి. ఆవిడ మహాపతివ్రత" అన్నాను.
ఆమె మళ్ళీ నవ్వింది. త్రిమూర్తులు ఆవిడ ఇంటికి వచ్చి బట్టలు విప్పి దిశమొలతో వడ్డిస్తేనే భోజనం చేస్తామన్న ఆ కథ నీకు తెలుసా?" అంది.
"అవును....అప్పుడు ఆవిడ వారిని చంటిపాపలుగా మార్చి..."
