Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 23

 

     "మీ చేతికివ్వను అలక్ నందా క్షేమంగా వుందని కళ్ళారా చూశాకే ఇస్తాను" ఖచ్చితంగా అన్నాడు.   
    "వీరదాసు విడుదల కాకుండా ఆ అమ్మాయిని మా వాళ్ళు వదలరు."    
    "వీరదాసుని వెంటనే వదులుతున్నాను" విసుగ్గా అన్నాడు రాణా యస్సై వైపు తిరిగి, "ఏం? తాళాలు దొరికాయా?" అని అరిచాడు. కర్రా భయపడుతూ "వెతుకుతున్నాం సార్" అన్నాడు.    
    "నాన్సెన్స్ ఏం పోలీస్ స్టేషన్ ఇది? సెల్ లో మనిషిని విడుదల చెయ్యాలంటే తాళాలు కనబడవు. అయ్యో-ఇంకా రెండు నిముషాలే టైముందే ఎలా?" అంటూ నాయుడివైపు తిరిగి, "వెంటనే మీ వాళ్ళకు ఫోన్ చెయ్యండి-ఆ అమ్మాయిని ఏం చెయ్యొద్దని" అన్నాడు.    
    "వీరదాసు బయటికొస్తే ఏం చెయ్యరు."    
    ఈ లోపులో బ్రహ్మానందం బాలకిషన్ పోలీస్ స్టేషన్ పెరట్లోంచి ఒక గడ్డపార తెచ్చాడు. రాణా నాయుడితో "మీరేమీ కంగారు పడకండి. మా జైలు తాళాలు రానప్పుడల్లా గడ్డపలుగుతో ఇలా పగలకొట్టడం అలవాటే. ఆడిట్ అబ్జెక్షన్ లేదు" అంటూ ద్రాయిర్ తెరచి, అందులోంచి కవర్ జేబులో పెట్టుకున్నాడు. ఈ కవర్ మీ వాళ్ళకు అందజేసి అలక్ నందాని తెచ్చుకుంటాను, ఆ విధంగా మీ వాళ్ళకి చెప్పండి. మళ్ళీ అక్కడ వాళ్ళని గొడవేమీ చెయ్యొద్దని కూడా చెప్పండి. అరె, బాలకిషన్! అలా చూస్తావేమిట్రా తొందరగా ఆ వీరదసుని బయటికి తియ్యి, అక్కడ ఒక మనిషి ప్రాణాలు పోతున్నాయి. నాయుడుగారూ - ఇంకా అలా నిలబడ్డారేమిటండీ, మీ వాళ్ళకు చెప్పండీ."    
    అతని కంగారు చూస్తూంటే నాయుడికి నవ్వొస్తుంది.    
    'ప్రేమ గుడ్డిది' అని నవ్వుకున్నాడు. బయట కార్లో వున్నా తన మనుష్యులకు సైగ చేసి, "వెళ్ళు" అన్నాడు రాణాతో.    
    రాణా వెళ్ళిపోగానే నాయుడు పలుగుతో సెల్ తాళం మీది బలంగా ఒక దెబ్బ వేశాడు. అది వూడింది. లోపల వీరదాసుకి బయట ఏం జరిగిందో తెలీదు. అతడు బయటికొచ్చాడు. "ఏమైంది" అని అడిగాడు.    
    "వెళ్ళాక చెప్తాను" నాయుడి మొహంలో విజయగర్వంతో కూడిన చిరునవ్వు కదలాడుతోంది. ఇద్దరూ మరో కార్లో ఎమ్మెల్యే ఇంటివైపు బయల్దేరారు.    
    రాణా, నాయుడి మనుష్యుల్తో కలిసి అతడి రైస్ మిల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ మస్తాన్ వున్నాడు. "ఏదీ కాగితం తెచ్చావా?" అని అడిగాడు. రాణా మరు మాట్లాడకుండా జేబులోంచి కవర్ తీసి ఇచ్చాడు. మస్తాన్ దాన్లోంచి కాగితం బయటికి తీశాడు. టైప్ చేయబడి వున్న ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసి, రాణాతో "సరె, నువ్వెళ్ళు" అన్నాడు.    
    "మరి అలక్ నందా?"    
    "అలక్ నంద మా దగ్గిర్లేదు. అసలావిడని మేం చూడనే లేదు."    
    రాణా "ఇది అన్యాయం" అన్నాడు.    
    మస్తాన్ నవ్వేడు. "నువ్వు మరింత తెలివితేటల్తో ఉద్యోగం చెయ్యాలి భాయ్ అయినా మేం అయినా మేం అమ్మాయిని బంధించామనుకో ఇప్పుడు మళ్ళీ విడుదల చేసేమనుకో. చివరికి అదే అయింది కదా ఇంటికెళ్ళు ఆ అమ్మాయి అక్కడే క్షేమంగా వుంటుంది" అన్నాడు.    
    రాణా ఇంటికి వెళ్ళలేదు. అలక్ నందా గురించి అతఃడికి బెంగలేదు. ఆమెకు ఏదో అవుతుందన్న భయం సంగతి అలావుంచితే వీరదాస్ లాంటి క్రిమినల్ ని జైల్లో వుంచడం కోసం, అలక్ నందాని వదులుకోవడానికయినా అతడు సిద్దంగానే వున్నాడు.    
    రాణా ఎమ్మెల్యే ఇంటికి చేరుకునేసరికి ఎమ్మెల్యే కుర్ర లాయరు పేకాడుతున్నారు. అప్పుడే వీరదాసు విడుదల అయినట్టు తెలిసి, అక్కడ గుంపు పోగవుతోంది. ఎమ్మెల్యే ఆనందంతో తలమునకలవుతూ ఏదో జోకులు వేస్తున్నాడు.    
    రాణా రావటం చూసి విశాలమైన నవ్వుతో "రా....రాణా? నీ లవ్వర్ క్షేమంగానే వుందనుకుంటా మేమేదో సరదాగా ట్రిక్ చేశాం అంతా సుఖాంతమే కదా" అన్నాడు.    
    "నాకు సుఖాంతమే-"    
    స్ట్రయికర్ తో కొట్టబోతూన్న వీరదాసు తలెత్తాడు.    
    "అంటే-" నాయుడు అనుమానంగా అడిగేడు.    
    "జైలు గోడలు బ్రద్దలు కొట్టి బయటికొచ్చినందుకు వీరదాసు కోసం నాన్ బెయిలబుల్ వారంట్ తీసుకొచ్చాను."    
    ఒక్కసారిగా అక్కడ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. కుర్ర లాయర్ లేచి, "అండర్ సెక్షన్...." అంటూ ఏదో చెప్పబోయి, రాణా తీక్షణంగా చూడటంతో ఆగిపోయాడు.    
    "ఇది అన్యాయం" అరిచాడు నాయుడు. "తాళాలు పారేసింది నువ్వు సెల్ బ్రద్దలు కొట్టి...."    
    అతడి మాటలు మధ్యలో ఆపుచేస్తూ "సెల్ బ్రద్దలు కొట్టేటప్పుడు నేను అక్కడ లేను" అన్నాడు రాణా "....మా పోలీసులేమో గడ్డపార మీద మీ వేలిముద్రలున్నాయంటున్నారు అదే నిజమైతే వీరదాసుతోపాటు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యాలి. చెప్పండి అతడికి సాయంగా వుండటంకోసం మీరూ వస్తారా-వాడిని తీసుకెళ్ళమంటారా?" కావాలనే 'వాడు' అని వాడాడు. వీరదాసు మొహం ఎర్రబడింది. చెంప పగలగొడ్తాడేమో అన్నంత విసురుగా ఎమ్మెల్యే దగ్గిరకొచ్చి అతడి కాలర్ పట్టుకొని ఒక బూతుమాటతో తిట్టాడు. "సెల్ తాళాలు పోయాయనగానే, తాళంబ్రద్దలు కొట్టటమేనా?"    
    ఎమ్మెల్యే మాట్లాడలేదు. "నేను బ్రద్దలు కొట్టడం నువ్వూ చూశావు కదా" అనొచ్చు - అంత ధైర్యంలేదు! ఒక బజారు గూండా, ఎమ్మెల్యేని అత్యంత చౌకబారు బూతుమాటతో అందరి ముందూ తిట్టినా పడివుండవలసిన ప్రజాస్వామ్యం ఇది తిరిగి మాట అనగలడా?    
    అప్పటివరకూ ప్రేక్షకుడిలా వున్న రాణా "పద" అన్నాడు.    
    "డెత్ స్టేట్ మెంట్ మాకు ఇచ్చేసేవుగా ఇక కేసేమిటి?" వీరదాసు అడిగాడు.    
    "పోలీసు స్టేషన్ నించి కవరు జేబులో పెట్టుకుని నేను బయల్దేరిన మాట నిజమే. అది తీసుకుని మస్తాన్ 'అలక్ నందా అపహరణ కేవలం నాటకం. నువ్వు మరింత తెలివితేటల్తో పని చెయ్యాలి భాయ్' అని అన్నాడు. అయితే ఆ సంబరంలో నేను ఏ కాగితం ఇచ్చానో కూడా వాడు చూసుకోలేదు. "పోలీసు స్టేషన్-పరిసరాల పరిశుభ్రత" అన్న విషయం మీద మాకు అందిన సర్క్యులర్ కాపీ అది. రామాచారి మరణ వాంగ్మూలం 'చేతి వ్రాత'లో వుంటుంది. అని కూడా చూసుకోణంత మూర్ఖుడు నీ అసిస్టెంట్ మస్తాన్. పోలీస్ స్టేషన్ లోనే దాన్ని పరిశీలించాలీ అన్నంత తెలివితేటలు కూడా లేనివాడు నీ మరో అనుచరుడు ఎమ్మల్యే నాయుడు అర్ధమైందా వీరదాసూ! మర్డర్ కేసులోనీకు బెయిల్ దొరకొచ్చేమో కానీ, లాకప్ రూమ్ బ్రద్దలు కొట్టిన కేసులో మాత్రం దొరకదు. దేశమంతా ఎదురు నిల్చినాసరే- నీతో పోరాడతాను నేను."    
    రాణా మాటలు పూర్తిగా వినలేదు వీరదాసు. తనచుట్టూ వల ఎలా బిగుసుకుందో అర్ధమైంది. చూడటానికీ, వినటానికీ చాలా సిల్లీగా వుండే పాయింటు అది. కానీ జాగ్రత్తగా అల్లబడిన వల అది. ఈ నాయుడేగానీ తన అపూర్వమైన తెలివితేటల్తో ఇంత వెధవ ప్లాను వేయకపోయి వుంటే తానీపాటికి బెయిల్ మీద బయటికి వచ్చేసి వుండేవాడు.    
    జరిగినదంతా తల్చుకొని వీరదాసు పట్టలేని కోపంతో నాయుడి చెంపమీద లాగిపెట్టి కొట్టి రాణాతో కలిసి బయల్దేరాడు.    
    ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతున్న సమయానికి ఢిల్లీలో పులిరాజు ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాడు.    
    వీరదాసు వ్యవహారం ఆధారంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీని ఎలా కూలగొట్టాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు.    
    ఇటువంటి విషయాల్లో తను స్వయంగా పాల్గొనటం ఇష్టం లేనట్టు ప్రధానమంత్రి కొద్దిసేపు మాట్లాడి అక్కడనుండి తప్పుకున్నారు. మిగతా సంభాషణని, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ చీఫ్ కొనసాగించాడు.    
    పులిరాజు ఆనందంతో తలమునకలావుతున్నాడు. వీరదాసు అరెస్టు రాష్ట్ర పార్టీకి పెద్ద దెబ్బ అని తెలుసు. ఎమ్మెల్యే నాయుడి మీద అది తన వ్యక్తిగత విజయం! ఆ ఆనందంలో ఒకటికి రెండు జోడించి, తన గొప్పతనం గురించి చెప్పాడు. ఆ పార్టీ వాళ్ళు వీరదాస్ అరెస్టు సందర్భంగా ఏ విధంగా బంద్ నిర్వహించబోయిందీ, తమ కార్యకర్తల సాయంతో దాన్నెలా విధ్వంసపరిచిందీ వివరించి చెప్పాడు.    
    నగల చోరీ విషయంలో పేపర్లలో మొదటి పేజీలో ఆ విషయం ప్రచురించబడేలా తనెలా చేసిందీ, ప్రజల్లో ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ పార్టీపట్ల అసహ్యం పెంపొందటానికి ఎలా స్కీమ్ చేసిందీ చెప్పి, ఇక ఆ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులుండవు అన్నట్టు వర్ణించాడు. అసలు పులిరాజు ఆ గదిలోకి రాగానే, ఆనందోత్సాహాలు నిండిన కంఠంతో, "సబ్ హోగయా సాబ్, హమారీ స్టేట్ మే సక్సెస్" అన్నాడు.    
    "హిందీ ఖూనీ చెయ్యకు. ఇంగ్లీషులో మాట్లాడు" అన్నాడు పార్టీ చీఫ్. పులిరాజు బిక్కమొహంతో "ఐ నో- నో గుడ్ ఇంగ్లీష్ ట్రై అండర్ స్టాండ్" అన్నాడు. పార్టీ చీఫ్ కి పొలమారింది.    
    "నీ స్వంత భాషలో మాట్లాడు నాయనా" అన్నాడు.    
    ఢిల్లీలో ఇది చాలా సాధారణ విషయమయినట్టు- హిందీ ఇంగ్లీషూ రాని రాజకీయ నాయకుల కోసం వుండే తర్జుమాదారు, పై విషయాలన్నీ పార్టీ చీఫ్ కి అనువదించి చెప్పాడు. అంతా విని, "వీరదాస్ అంత పవర్ ఫుల్ మనిషన్న మాట" అన్నాడు పార్టీ చీఫ్ ఏమీ తెలియనట్టుగా.    
    "అవును సార్. చాలామంది ఎమ్మెల్యేలు అతనివల్లనే నెగ్గారు. వాడుగానీ బరిలో నిలబడితే ఇక ఎదురులేదు. రిగ్గింగ్ నుంచీ, అభ్యర్ధుల్ని చంపటం వరకు అన్నిటికీ వాడే ముందుంటాడు."    
    'అలాంటివాడు ఎదుటి పార్టీలో వున్నాడు. ప్రస్తుతం జైల్లో వున్నాడు."    
    'అవును ఇక తప్పించుకోలేడు మన పార్టీ ఆ విషయంలో చివరివరకూ పోరాడుతుంది."    
    "అతను జైల్లోంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా మన పార్టీ సానుభూతి అతనిమీద వుండాలి."    
    "అవును సార్ మన సహాయ సహకారాలు లేకుండా అతనేమీ చేయలేడు. చచ్చినా బయటకు రాలేడు. ఆ విధంగా అన్నీ పకడ్బందీగా నేను ఏర్పాటు చేశాను" గర్వంగా అన్నాడు పులిరాజు.    
    "అంత బలమైనవాడు మన ప్రత్యర్ధి గ్రూపులో వుంటే అతడికి సహాయ సహకారాలు అందించటం పోయి ఇక్కడికొచ్చి అదేదో గొప్ప ఘనకార్యంలా చెపుతావా? అసలు నువ్వు రాజకీయ నాయకుడివి ఎలా అయ్యావు పులిరాజూ?"    
    పులిరాజు అదిరిపడ్డాడు. ప్రెసిడెంటు నవ్వేడు.    
    "రాజకీయాల్లో చచ్చిన పాముని మరింత చంపకూడదు. మన వర్గంలోకి లాక్కొని కొంచెం పాలు పోసి పెంచి, బలం పుంజుకున్నాక ప్రత్యర్ధి మీదకే వదలాలి. అది మొదటి పాఠం."    
    పులిరాజు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రెసిడెంట్ అన్నాడు. "వీరదాసు మనవైపు పనిచెయ్యటం అనేది షరతుగా పెట్టు ఆ షరతుకి వప్పుకుంటే మన పార్టీకూడా అతడి విడుదలకి ప్రయత్నం చేస్తుందని చెప్పు."    
    "కానీ ఈ విషయం తెలిస్తే, ముఖ్యమంత్రి ఆ ఇన్ స్పెక్టర్ తో కలిసి కేసు మరింత బలం చేస్తాడు. ఇది రాష్ట్రానికి సంబంధించిన కేసు."    
    "తెలియాల్సిన అవసరం లేదు. వీరదాసు విడుదలయ్యే వరకూ అతడు తన మనిషే అనుకునేట్టు ముఖ్యమంత్రిని భ్రమలో వుంచుదాం. ముందు కర్టెన్ లేచేవరకూ వెనుక ఏం జరుగుతుందో తెలియజెప్పక పోవటం రాజకీయంలో రెండో పాఠం".    
    పులిరాజుకి పార్టీ ప్రెసిడెంటు చెప్పేది పూర్తిగా ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతూంది. అసలిదంతా ఎలా సాధ్యం? వీరదాసుని తమవైపు తిప్పుకునే ప్రయత్నం సులభం కావొచ్చు, కాకపోవచ్చు కానీ నాయుడు విషయం ఏమిటి? అతడెలా వూరుకుంటాడు? ఎందుకు వూరుకుంటాడు? ఎమ్మెల్యే నాయుడికి తెలియకుండా వీరదాసుని తమవైపుకి తిప్పుకుని, అతడిని విడిపించటం ఎలా కుదురుతుంది? లోకల్ గా తమ ఊళ్ళో వున్న ఎమ్మెల్యేకి అనుమానం రాకుండా, వీరదాసుకి ఎలా సాయం చేయటం? ఆ విషయమే పార్టీ ప్రెసిడెంట్ దగ్గర చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS