ఆడపిల్లని కాపాడటం ఎంత కష్టం!! పనిపిల్ల కానీ, ఏ పిల్లకానీ....ఆడపిల్ల-ఆడపిల్లే!!
'అనవసరంగా దాన్ని కొట్టారు- పాపం... అది చెప్పింది నిజమే! శంకరన్ కానీ, సతీష్ కానీ ఫోను చేసి వుంటారు- అంతే!!' -జానకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఈ పిల్ల రాజీవ్ దగ్గరుంటే దాని బతుకు మరోలా వుండేది- తన దగ్గరుంచి, పాపం...సుబ్బీ!!
* * *
లీల, తులసమ్మ దగ్గరకొచ్చి, "ఏమిటి పిన్నీ.... ఎక్కడా సంతకం చేయకూ-
అంటూ తెగ చెప్తున్నావు దేనికీ, అసలు నాది ఏముందీ, ఇల్లు సుధాకర్ అమ్మేశాడని చెప్పాడా, నేనెవరికి కావాలీ, నా సంతకం ఎవరికి కావాలీ... చెప్పు!" అంది తులసమ్మ పక్కన కూచుని.
"విను- నీ మొగుడు వచ్చి ఈ కాగితం మీద సంతకం చేయి'... అని నీ చేత చేయిస్తాడనుకో! తర్వాత ఏం చేస్తాడూ- 'నేనే ఇష్టపూర్వకంగా నా భర్త నుంచి దూరంగా వుండాలనుకుంటున్నాను' అనో, 'అతను మరో పెళ్ళి చేసుకుంటే నా కభ్యంతరం లేదు' అనో, మరోటో, మరోటో రాసేస్తాడనుకో! ఆ తర్వాత దాన్ని తెచ్చి పెట్టుకున్నా, పెళ్ళి చేసుకున్నా నువ్వు నోరెత్తలేవు. ఇక్కడ ఇలాగే పడి వుండాల్సిందే!" అంది ఎంతో విచారంగా.
లీల ఆ మాటలు శ్రద్దగా వింది.
"నేను వద్దనుకునే మనిషి నాకెందుకూ?- నన్ను వదిలేసి మరో పెళ్ళి చేసుకుందామానుకునే వ్యక్తితో నేను కాగితం మీద సంతకం చేయనంత మాత్రాన, భార్యనవుతానా?- పిన్నీ, అదే నా విధిలో వుంటే నీవు ఆపగలవా?"
"అంటే...సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తావా?" అంది తులసమ్మ.
"అసలు... నన్ను వచ్చి అడుగుతారా- నన్ను కలుస్తారా? ఇక జీవితంలో అది కలే! - పిల్ల వెళ్ళిపోయింది. భర్త వద్దనుకుంటున్నాడు - నేను వెళ్ళిపోతే ఆ దేవుడి దగ్గరకి! తనువు ఉన్నంత కాలమే ఈ తాపత్రయాలు! -నా గురించి బెంగపడకు. నన్ను ఆ దేవుడే కాపాడుతాడు" అంది ధైర్యంగా.
ఆ మాట అంటుంటే ఓ నీడ అటూ ఇటూ కదిలినట్టయింది. ఎవరిదో దగ్గు...
ఎదురుగా చంద్రయ్య-
లీల లోపలకెళ్ళిపోయింది...
"ఓ మాట రహస్యంగా విను!" గొంతు తగ్గించాడు. "అక్కడ నుంచే వస్తున్నా...ఇల్లు అమ్మిన డబ్బులో కొంత లీలమ్మ పేర బ్యాంకులో వేయమన్నాడు. నాకివ్వాల్సింది ఇచ్చేసాడు. ఇంకదానికి అప్పుడే చెప్పకు, ఆ వీరాస్వామి కూతురుతో బెంగుళూరులో కాపురం పెట్టాడు. అయినా ఒకటి-భార్య లేకుండా ఎన్నిరోజులు వంటరిగా వుంటాడూ మగాడు? -ఇదేమో ఈ వరసాయె! -నువ్వేమో దాన్ని పూర్తిగా సన్యాసినిగా చేసేసావు!" అన్నాడు ఏదో రహస్యం చెప్తున్నట్టు - సుధాకర్ చేసిన పని మంచిదే అన్నట్టు.
తులసమ్మ ఏమీ అనలేదు- తను కాటికి కాళ్ళు చాపుకుంది. ఏ పరిస్థితి ఎలా వస్తే అది అలా స్వీకరిస్తుందంతే!
"చంద్రయ్యా...దాని బతుకు అలా వెళ్ళిపోనీ!" అంది.
"ఆ... అలా ఎలాగ? నేనెందుకొచ్చానంటావూ, నాతో తీసికెడతా దాన్ని!"
"ఎవర్నీ..."
"లీలని..!"
"ఎందుకూ..."
"వయసులో వున్న పిల్ల ఇక్కడుండటం బాగుండదు - మా ఆవిడకి తోడుగానూ వుంటుంది, దానికి ఓ ధారి కనిపించినట్టవుతుంది" వెకిలిగా నవ్వుతూ చంద్రయ్య అంటుంటే, తులసమ్మ ఒళ్ళు భగభగ మండిపోయింది.
ఏ వయసులో వున్న మగాడికైనా వంటరి ఆడదంటే అంత చులకన!
"చంద్రయ్యా, నీ ఉద్దేశమేమిటీ..?" అంది.
"తెలియలేదా నీకూ..!"
"అంటే... లీలని వుంచుకుంటారా?!" అంది.
"ఊ..." అన్నాడు తలూపి.
"లీలా... ఇటురా!" అని కేకపెట్టింది తులసమ్మ.
చంద్రయ్య చాలా ఆనందపడిపోయాడు. తులసమ్మకు ముందు చూపెక్కువ. లీలని ఇక్కడ పెట్టుకు ఏం చేస్తుందీ..? -పైగా లీల అందం, వయసు అంతా అడవి కాచిన వెన్నెలై పోతుంటే! -తులసమ్మ లీలని నాతో పంపిస్తే అంతకన్నా ఏం కావాలీ! -ఈ ముసలమ్మ ఋణం ఎలా తీర్చుకుంటానో..! అనుకుంటూ మురిసిపోతూ, లీలని తనతో పంపిస్తే ఓ చిన్న ఇల్లు కుదురుస్తా- అక్కడ వుంటుంది హాయిగా! - చంద్రయ్య ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు.
లీల లోపల కాఫీ పెడుతోంది... చంద్రయ్య కోసం!
తులసమ్మ లోపలకెళ్ళింది. శరీరంలో బలమంతా కూడగట్టుకుంది... పళ్ళు బిగించింది.
తల వంచుకు ఆలోచిస్తున్నాడు చంద్రయ్య.
తులసమ్మ చేతికర్ర దబ్బున చంద్రయ్య నెత్తిమీద పడింది... వరుసగా దెబ్బలు పడుతుంటే, "అమ్మో..." అంటూ లేచాడు.
"ఫో... ఇంకొక్కసారి ఈ గడప తొక్కావో బతకవు- ఫో! కూతురులాంటి పిల్లని వుంచుకుంటావా- నీ పాపం పండింది.... ఒక్కనిమిషం నిలబడితే నీ తల ముక్కలు చేస్తా!"
చంద్రయ్య తలపట్టుకు బయటికి పరిగెత్తాడు. ఓ వైపునుంచి తల చిట్లి రక్తం కారుతోంది.
కాఫీ కప్పు జారవిడిచి నిశ్చేష్టురాలైంది లీల.
తులసమ్మ రొప్పుతూ మంచంపై వాలిపోయింది. "పీడ వదిలిపోయింది- ఇంక చచ్చినా ఈ గడప తొక్కడు!" అంది.
అసలేమైందో తులసమ్మకి- ఎందుకంత కోపం కట్టలు తెచ్చుకుందో- ఎందుకు చంద్రయ్య తల పగిలిందో- అర్ధంకాని లీల.... 'మన చేతిలో ఏముంది? అంతా ఆ దేవుడే చేయిస్తాడు' అనుకుంది.
* * *
ఆరు కాకుండా సుబ్బిని నిద్ర లేపింది జానకి.
"షాంపూతో తల రుద్దుకో..!" అంది.
దానికి కొత్త గౌను వేసుకోమని యిచ్చింది. తన ముత్యాలహారం మెళ్ళో వేసింది.
"ఎలా వుండాలో చెప్పారుగా!" అంది సుబ్బితో.
ఏమీ అర్ధం కావటంలేదు, అయినా తలూపింది. "ఆ వచ్చే ఆయనెవరూ?"
"చెన్నమ్మా-ఆయన వచ్చాకే ఇడ్లీలు వేయి. సాంబారు రెడీ చేసావా...?" అంది జానకి.
ఇల్లంతా శుభ్రంగా ఉంది. సోఫాలకి కొత్త కవర్లు తొడిగింది. సుబ్బికి తను రాసుకునే పౌడరిచ్చింది. చిన్న ఎర్ర స్టిక్కరు బొట్టు పెట్టుకోమని సుబ్బికి యిచ్చింది. "ఫాను కింద కూచుని జుట్టు ఆరబెట్టుకో" అంది, చెన్నమ్మకీ అర్ధంకావడంలేదు ఇదంతా.
చెన్నమ్మ జానకి యింట్లో వంటమనిషిగా వున్నా వంట చేసి వెళ్ళిపోదు. పొద్దున్న వస్తే రాత్రిదాకా వుంటుంది. దాని భర్త ఫ్యాక్టరీ నుంచి ఇంటికెడుతూ దీన్ని తీసికెడతాడు.
చెన్నమ్మ పెద్దకూతురు హైదరాబాద్ లో వుంటోంది. భర్త, పిల్లల్తో సంసారం హాయిగా వుంది. కానీ, చెన్నమ్మ మనసులోంచి పోని దిగులు చిన్న కూతురి జ్ఞాపకాలే.....ఓ ఇంట్లో పనిమనిషిగా పెట్టింది.
ఆ పిల్ల పధ్నాలుగేళ్ళప్పుడు ఎంతో ఉత్సాహంగా వుండే పిల్ల వున్నట్లుండి బెంగపడిపోయింది. ఆ యింటికి పోననేది- పోకపోతే ఎలా పొట్టగడవటం..? అంటూ తనే బలవంతంచేసి పనికి పంపింది. అంతే, ఆరోజే ఆ ఇంట్లోనే ఉరేసుకు చచ్చిపోయింది ఆ పిల్ల. నిజంగా చచ్చిపోయిందా- అత్యాచారం చేసిన వాళ్ళే చంపేశారా..? న్యాయం ఎప్పటికి తేలుతుంది? - న్యాయం తేలినా తన చచ్చిపోయిన పిల్ల బతికొస్తుందా? -అసలు బీదవాళ్ళ తరపున న్యాయం పూర్తిగా జరగటం వుందా! ఆ డబ్బున్న ఇంటివాళ్ళ కొడుకు అమెరికాలో సీటొచ్చి చదువుకుందుకు వెళ్ళిపోయాడు! చెన్నమ్మ కాళహస్తి వదిలేసి మద్రాసు పొట్టచేత పట్టుకొచ్చేసింది - చెన్నమ్మ గంభీర సముద్రం- దయామూర్తి.... ఏ ఆడపిల్ల అనగానే ముందుగా చిన్న కూతురే కళ్ళలో కదులుతుంది.
చెన్నమ్మ ఇంట్లో జరిగే సంగతులన్నీ ఓ కంట కనిపెడుతూనే వుంటుంది.
ఆరోజు జానకమ్మ హడావిడేమిటో అర్ధంకాలేదు చెన్నమ్మకి..!
"అమ్మా... దీని పుట్టినరోజా ఇవాళ?" అంది జానకి మంచంమీద దుప్పటి మారుస్తూ.
"ఛీ... దీనికి ఓ పుట్టినరోజా? ఎవడికి పుట్టిందో, ఎక్కడ పుట్టిందో- చెన్నమ్మా అనవసరమైన విషయాలు ఆ సుబ్బికి చెప్పకే నువ్వు!"
ఆ గొంతు విని భయంగా చెన్నమ్మ వెనక్కి తిరిగి చూడగానే సిగరెట్ కాలుస్తూ గుమ్మంలో నుంచున్నాడు మాధవరావు.
చెన్నమ్మ దుప్పటీ, దిండు గలీబులూ మార్చి గదిలోంచి వెళ్ళిపోయింది.
గడియారం టైము చూపించింది....
"కారులో నేనెళ్ళి తీసుకురానా రాజీవ్ ని!" అంది జానకి భర్తవైపు చూస్తూ.
"ఎడ్రసు వెతుక్కురాలేడా- నిన్ను స్టేషన్ కి రమ్మని ఫోన్ చేసాడా?" సిగరెట్ చెప్పుతో ఆర్పాడు మాధవరావు.
సుబ్బి ముఖం కళకళ్ళాడిపోతోంది. నవ్వుతుంటే సొట్టలు పడే బుగ్గలు మరీ అందంగా కనిపిస్తున్నాయి ఈరోజు! 'రోజూ చూసే పనిపిల్లేనా యిది..?' అనిపిస్తోంది. సుబ్బి..! అమ్మగారి గదిలోకొచ్చి అడ్డం ముందు నిలబడి చూసుకుంటూ, 'గౌనెంత బావుందో, ఈ గొలుసెంత బావుందో, ఇది అమ్మగారు నాకిచ్చేసింది'... అని మురిసిపోయింది సుబ్బి.
