Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 22

   
    "నిజం! సంధ్య అచ్చం ఈ పిల్లలాగే ఉండేది. ఇలాగే పెద్ద పెద్ద కళ్ళు! ఇలాగే అమాయకంగా చూసేవి ఆ కళ్ళు!"

    "....ఇలాగే తీర్చిదిద్దినట్టుగా ఉండే కనుబొమలు, సంపెంగలా ఉండే ముక్కు, సున్నా చుట్టినట్టుగా ఉండే మూతి. ఇదేగా నీ వర్ణన? ఎప్పుడూ బాల్య స్నేహితురాలిని స్మరణ చేసే బదులు ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుందిగా? ఈ ధ్యాస తగ్గుతుంది."

    "నిజమే! వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకొన్నామో! ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు. అమ్మకి కూడా ఎప్పుడూ రుక్మిణి అత్తా, సంధ్యా గుర్తుకువస్తుంటారు! ఒకసారి రాజానగరం వెళ్ళిరావాలిరా అంటూనే సంవత్సరాలు గడిచిపోయాయి!"

    "బాబూ, ధర్మం చేయండి!"

    ప్రతిమ తన హాండ్ బాగ్ లోంచి పదిపైసల బిళ్ళతీసి ఆ పిల్ల చేతిలో వేసింది.

    ఆ పిల్ల అక్కడి నుండి కదిలి మరో భక్తుడి ముందు నిలబడింది. "బాబూ, ధర్మం చేయండి!"

    "ఆ ఊరు బాగుంటుందా? నన్ను తీసుకెడతావా నువ్వు వెడితే?"

    "చాలా బాగుంటుంది. అమ్మ చెరువని చాలా పెద్ద చెరువు. వర్షాకాలంలో చెరువునిండి అలుగు ప్రవహిస్తూనే ఆ సీన్ ఎంతో బాగుంటుంది చూడ్డానికి! చెరువుచుట్టూ, ఊరిచుట్టూ వరిపైరులు, మెట్టపైరులు ఎటుచూసినా పచ్చగా. దసరా వచ్చిందంటే, సద్ద కంకులూ, పచ్చిపల్లీలతో కడుపు నిండిపోయేది. దగ్గరే కొండలయ్య గుట్ట! ఆ గుట్టమీద వెంకటేశ్వరస్వామి రాళ్ళమీద వెలిశాడు. శ్రావణ శనివారాలొస్తే ఆ గుట్టకి వెళ్ళే భక్తుల్లోనేనూ ఉండేవాణ్ణి! అలుగుకి అటువైపు అసలు ఊరంతా. ఇటువైపు వేణుగోపాలస్వామి ఆలయం. ఆలయానికి సమీపంలో వనపర్తి రాజాగారి పాలెస్ కాని, అందులో ఎప్పుడూ మనుషులుండేవాళ్ళు కాదు. తలుపులు మూసి ఉండేవి. ఆ బంగళా ముందు ఇసికలో కారంపూలు, రామబాణాల పూలు ఏరుకొనేవాళ్ళం! బంగళా పెరటిగోడల్లో పెద్ద పొగడ చెట్టుండేది. పొగడ పువ్వులు ఏరి పూలు గ్రుచ్చడంలో సంధ్యకి సాయంచేసే వాణ్ణి!

    "ఆలయానికి సమీపంగా ఒకింట్లో ఉండేవాళ్ళం! అద్దె ఏం లేదు ఇల్లు పాడుబడకుండా దీపం పెట్టుకు ఉంటే చాలునని ఇచ్చారు ఇంటివాళ్ళు. అక్కడున్న ఆ పది పన్నెండేళ్ళు ఎంతో ప్రశాంతంగా గడిచిపోయాయంటుంది అమ్మ. అక్కడ గడిచిన నా బాల్యం తలుచుకొంటే ఒక కమ్మని కలలా అనిపిస్తుంది."

    ప్రతిమని వాళ్ళింటి దగ్గర దించేసి, ఇంటికి వస్తూ మరునాడు రాజానగరం వెళ్ళడానికి ప్రయాణం ఫిక్స్ చేసుకొని, ఇంటికి వస్తూనే తల్లికి చెప్పాడు అరుణ్.

    "ఇన్నాళ్ళకి పడుతుందా మనకి రాజానగరం ప్రయాణం? తెల్లారేసరికి అవాంతరాలేమీ రావుకదా!"

    "ఏం రావమ్మా! ఈసారి తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే!"

    తరువాత ప్రతిమకి ఫోన్ చేశాడు అరుణ్. "ప్రతిమా, రేపు ఉదయం ఆరుగంటలకు ప్రయాణం ఫిక్స్ చేశాను. ఎక్కడికో చెప్పు!"
   
    "రాజా నగరమా?"

    "అవును. అమ్మకి కూడా చెప్పేశాను! ఆవిడ సంతోషంగా తయారవుతూంది. పట్టుకెళ్ళడానికి పళ్ళు, స్వీట్లూ రెడీ చేస్తూంది!"

    "అరే! గుడి దగ్గరనుకోలేదుగా ఇంత తొందరగా ప్రయాణమని!"

    "ఇవాళ నాకు రాజానగరం మీద ధ్యాస భలేతిరిగింది. ఇక వెళ్ళకుండా ఆగడం సాధ్యం కాదు! ఈసారి తప్పకుండా వెళ్ళాల్సిందే!"

    "నాకు రేపు రావడానికి వీలుకాదు, అరుణ్! ఎల్లుండేగా నా బర్త్ డే? రేపంతా నాకు అరేంజ్ మెంట్లతో సరిపోతుంది. నా బర్త్ డే అయిపోయాక వెడదాం. ఏం?"

    "ఈసారి మానడానికి వీల్లేదు, ప్రతిమా! ఇలాగే ఎన్నోసార్లు ప్రయాణం అయి, ఏవో అవాంతరాలతో మానేశాను. ప్రతీసారిలా అమ్మని నిరుత్సాహపరచలేను. ఈ తడవకి అమ్మా, నేనూ వెడతాం. మరోసారి నువ్వూ నేను వెడదాం, ఏం?"

    "నేను వెంట లేకుండా నీ కా ప్రయాణంలో థ్రిల్ ఏముంటుంది? నీ స్నేహితురాలిని నేను చూడొద్దా?" గోముగా, నిష్ఠూరంగా అంది.

    "నీకు వీలు కాదంటున్నావు కదా?"

    "అందుకే రేపు ప్రయాణం వద్దంటున్నాగా?"

    "ఈసారి మానడానికి వీల్లేదంటున్నాగా?"

    "అయితే మానకు!" ప్రతిమ కోపంగా ఫోన్ పెట్టేసింది.

    తెల్లవారితే ప్రయాణం. రాత్రంతా స్నేహితురాలికివ్వాలనుకొన్న బహుమతులు రెడీ చేసి పెట్టుకొంది జానకమ్మ. అయిదువందలు పెట్టి పట్టుచీర కొంది. ఒక బుట్టనిండా పళ్ళు తీసుకొంది. బోలెడన్ని చేమంతులు కొంది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS