Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 22

    ఆ దొంగ పాపం బిక్కమొహం  పెట్టాడు. "ఏం బాస్....ఈవేళ మీరేం శపధాలు చెయ్యరా?" అడిగాడు భయపడ్తూ.

    "లేదు....శపధాలు  చెయ్యడానికి ఏమీలేవు" ఆయాసపడ్తూ అన్నాడు మంగులు.

    "రాంబాబు, చిన్నారావ్ లని  ఖతం  చేస్తానని శపధం  చెయ్యరా?" మరో దొంగ అడిగాడు.

    "ఏరా....మీరు నా చేతిని చిలకడ దుంపలా  కాల్చేసే  ఉద్దేశంతో  వున్నారా?" మండిపడ్డాడు మంగులు. "వాళ్ళని  చంపుతానని ఇప్పటికి బోల్డన్నిసార్లు  శపధం చేశాను....ఇప్పుడు దాన్ని ప్లాన్  చెయ్యడమే" అని ఇద్దర్ని రమ్మన్నట్టు సైగ  చేశాడు.

    డేవిడ్, జాకబ్ అనబడే ఆ ఇద్దరు  గూండాలూ మంగులు ఎదురుగా వచ్చి  నిలబడ్డారు.

    "రాంబాబు, చిన్నారావ్ లు ప్రస్తుతం ఎక్కడ వున్నారు?" అడిగాడు మంగులు.

    "వాళ్ళిద్దరూ  హాస్పిటల్ లోనే   వున్నారు  బాస్! ఇంకా  డిశ్చార్జ్ గాలేదు" చెప్పాడు  డేవిడ్.

    "వాళ్ళిహ  బతకడానికి  వీల్లేదు....మీరు  హాస్పిటల్ కెళ్ళి  వాళ్ళని అక్కడే ఖతం చేసెయ్యండి" గర్జించాడు మంగులు.


                                            9


    డిప్పల్లో  నర్సింగ్ హూం  దగ్గర  మోటార్ బైక్  ఆపాడు డేవిడ్. "ఇదే నర్సింగ్ హూం" అన్నాడు బోర్డువంక చూస్తూ, వెనక సీట్లో  కూర్చుని  వున్న జాకబ్ తో.

    ఇద్దరూ మోటార్ బైక్  దిగారు. డేవిడ్ బైక్ కి  స్టాండ్ వేసి లాక్ చేశాడు. ఇద్దరూ డిప్పల్లో నర్సింగ్ హూం  గుమ్మంవైపు అడుగులు వేశారు.

    "ఇంతకీ వాళ్ళిద్దరూ ఏ వార్డ్ లో  వున్నారో?!" అన్నాడు జాకబ్  డేవిడ్ తో.

    "ముందు మనం హాస్పిటల్ లో  ఎడ్మిట్  అయిపోవాలి....ఆ తర్వాత రాంబాబు, చిన్నారావ్ లు ఎక్కడ వున్నారో ఆటోమేటిక్ గా తెల్సిపోతుంది. తర్వాత అదను చూసి ఇద్దర్నీ సఫా చేసెయ్యడమే" చెప్పాడు  డేవిడ్.

    "కానీ నర్సింగ్ హూంలో  ఎడ్మిట్  అవడం  ఎలా....?" బుర్రగోక్కుంటూ  అన్నాడు  జాకబ్.

    "చెప్తాగా....పద" అంటూ డిప్పల్లో  నర్సింగ్ హూంలోకి  దారితీశాడు  డేవిడ్.

    అతన్ని  అనుసరించాడు  జాకబ్.


                                                                   *    *    *    *


    డిప్పల్లో  హాస్పిటల్  లోపల  డాక్టర్  సింగినాధం  ఎదురుగా  యిద్దరు వ్యక్తులు కూర్చుని  వున్నారు.

    "ఆపరేషనంటే  మరేం  పర్లేదుకదండీ! నాకేంటో  గుండె దడగా వుందండీ" అన్నాడు మొదటి వ్యక్తి.

    "మా  ప్రాణానికేం  హాని లేదుకడండీ....! నాకు కాళ్ళు చేతులూ ఆడడం లేదండీ" అన్నాడు రెండో వ్యక్తి.

    డాక్టర్  సింగినాధం  చికాకుగా మొహం పెట్టాడు.

    అప్పటికి అరగంటనుండీ  ఇద్దరూ ఆయన మెదడ్ని  తినేస్తున్నారు.

    "ఏంటయ్యా బాబూ నన్ను చంపేస్తున్నారు? మీకు చేస్తున్నదేమైనా  కాన్సర్ ఆపరేషనా? లేపోతే గుండెకాయ్  ఆపరేషనా? ఆఫ్టరాల్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్! అయిదు నిముషాలు కూడా పట్టదు...." అన్నాడు డాక్టర్ సింగినాధంవాళ్ళతో విసుగ్గా.

    "అంతేనంటారా?" అన్నారు ఇద్దరూ కోరస్ గా.

    "సార్! మీకోసం మెడికల్ రిప్రజెంటేటివ్  వచ్చారు" లోపలికొచ్చి చెప్పాడు వార్డ్ బోయ్.

    "లోపలికి పంపు...." వార్డ్ బోయ్ తో అన్నాడు డాక్టర్ సింగినాధం. వార్డ్ బోయ్ బయటికెళ్ళాడు. "మీరు బయట బెంచీమీద కాస్సేపు వెయిట్ చెయ్యండి" ఇద్దరు  పేషెంట్స్ తో చెప్పాడు డాక్టర్  సింగినాధం.

    వాళ్ళిద్దరూ లేచి నిలబడ్తుండగా  మెడికల్  రిప్రజెంటేటివ్ లోపలికి  అడుగుపెట్టాడు.


                                *    *    *    *


    రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి డేవిడ్, జాకబ్ ల వంక విసుగ్గా చూశాడు.

    "కడుపునొప్పికి నర్సింగ్ హూమ్ లో   అడ్మిట్ చేస్కోరయ్యా బాబూ! ఔట్ పేషంట్ గానే ట్రీట్ చేస్తారు...." అన్నాడు  బాధని నటిస్తున్న వాళ్ళిద్దరితో.

    "ఇది మామూలు కడుపునొప్పి కాదు సార్...." పొట్ట పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతూ అన్నాడు  డేవిడ్, "నా ప్రాణాలు పోయేట్టుగా  వున్నాయ్!" అన్నాడు బాధగా.

    "విచిత్రంగా ఇద్దరికీ ఒకేసారి తీవ్రమైన  కడుపునొప్పి వచ్చిందే! అయినా మిమ్మల్ని నర్సింగ్ హోమ్ లో  అడ్మిట్ చేస్కొనే అవసరం ఉందో లేదో డాక్టర్ గారే చెప్పాలి. మీరిలా లోపలికి వెళ్ళి, కారిడార్  చివరిదాకా నడిచి, లెఫ్ట్ కి  తిరిగితే రెండో రూంలో  డాక్టర్  సింగినాధం గారుంటారు. ఆయన్ని కలవండి" అన్నాడు రిసెప్షనిస్టు.

    "ఏంటీ....డాక్టర్ సింగినాధమా! హి హి హి" జాకబ్ కి నవ్వొచ్చేసింది ఆ పేరు వినగానే.

    జాకబ్ వెనకనుండి  అతని  పిర్రని గట్టిగా  గిల్లేస్తూ, మెల్లగా అన్నాడు డేవిడ్   "నీకిప్పుడు విపరీతమైన కడుపునొప్పుంది. నువ్వలా నవ్వకూడదు."

    జాకబ్ నాలుక కర్చుకున్నాడు. "ఏంటీ....డాక్టర్ సింగినాధమా?" ఈ సారి బాధగా మొహం పెడుతూ అడిగాడు.

    "అవును!" ఇద్దరివంకా వింతగా  చూస్తూ  అన్నాడు  రిసెప్షనిస్ట్.

    డేవిడ్, జాకబ్ లు  అక్కడినుండి  కదిలి కారిడార్ లో మెల్లగా నడవడం  ప్రారంభించారు.


                                 *    *    *    *


    డాక్టర్ సింగినాధం  రూమ్  బయట  కూర్చున్న యిద్దరు వ్యక్తుల్లో  మొదటివాడు  రెండోవాడి  తొడమీద  గోకాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS