కళ చిత్ర కలిసి గాజుల షాపుకు వెళ్ళారు. గాజులు తీయించి అందమైనవి ఎంచు కుంటున్నారు.
"హల్లో కళా ఎప్పుడొచ్చారు? గీత రాలేదా?"
భుజం మీద చెయ్యి పడటంతో కళ గాజుల మీది నుంచి చూపులు మళ్ళించి అటు చూసింది. ఖర హర ప్రియ నవ్వుతూ నిలబడి ఉంది.... గీత క్లాసు మేటు!
కళ చిరునవ్వుతో "పది రోజులు కావస్తుంది. గీత అక్కడే ఉండి పోయింది. ఎంత రమ్మన్నా రాలేదు....." అంది.
"మరీ మరీ రమ్మని చెప్తే గీత రాకుండా మానేసింది.... మెడ్రాస్ వెళ్ళాక దాని పని చెప్తాను!"
గాజులు చేతిలోకి తీసుకుంటూ వాటి అందచందాలను పరీక్షిస్తున్న చిత్రను చూపించి కళ "మా చెల్లెలు చిత్ర మీకు తెలుసనుకుంటాను" అంది.
చిత్ర తలెత్తి చూసి పలకరిస్తున్నట్టు నవ్వింది.
ఖరహర ప్రియ "ఒకటి రెండు సార్లు చూశాను" అంది.
ఇవతల కొచ్చేస్తున్నప్పుడు ప్రియ వాళ్ళింటికి రమ్మని పట్టు బట్టింది.
కళ "మరొకమాటు వస్తాం....ఏమనుకోకండి" అని తప్పించుకోబోయింది.
ప్రియ కోపగించుకున్నట్టుగా అంది.
'అదే మీ స్నేహితురాలెవరైనా రమ్మంటే మీరిలా కాదనేవారా?"
కళ వోడిపోయింది. ముగ్గురూ కలిసి బస్సు మీద మహారాణీ పేటకు వెళ్ళారు. ఏటవాలుగా ఉన్న రోడ్డు, రెండు వైపులా విశాలమైన చక్కని ఇళ్ళు, చల్లని సముద్రపు గాలి, చెవులకు సన్నగా వినిపించే హోరు-- ప్రియ పసుపు పచ్చని ఒక బంగాళా గేటు తెరిచి వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది. గేటుకు రెండు వైపులా ఉన్న ఖాళీ స్థలం లో గుబురుగా పెరిగిన చెట్లు ఆ ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. వరండా లో కుండీల్లో క్రోటన్స్ మొక్కలు, పూల మొక్కలు చల్లగాలి పాడుతున్న సంగీతాన్ని తలలూచి వింటున్నాయి.
మనోహరమైన ఆ రమణీయతలో లీనమై పోయిన చిత్ర హటాత్తుగా రైలు కూత వినిపించటం తో ఉలిక్కిపడింది.
"మీ యింటికి దగ్గరలో స్టేషను ఉందా" అనడిగింది చిత్ర చుట్టూ కలయజూస్తూ.
ప్రియ పకపకలాడింది.
"అది రైలు కూత కాదు. మా అన్నయ్య ఫ్లూటు ప్రాక్టీసు చేస్తున్నాడు!"
కళ, చిత్ర డ్రాయింగు రూం లో కూర్చున్నాక ప్రియ లోపలి కెళ్ళి అమ్మమ్మను, తీసుకొచ్చి పరిచయం చేసింది. వాళ్ళ తాతగారికి రెండు రోజులై వంట్లో బాగుండ లేదట. మేడ మీది గదిలో పడుకున్నారని చెప్పింది.
ప్రియ అమ్మమ్మ కాస్సేపు మాట్లాడి "మా బేబీ ఉండబట్టి మీరొచ్చారు... అది వెళ్ళి పోయినా అప్పుడప్పుడూ వస్తూ ఉండండమ్మా" అంది.
ఖరహర ప్రియను ఇంట్లో ముద్దుగా బేబీ అనిపిలుస్తారు.

కళ నవ్వింది.
"మాదీ మెడ్రాసే నండి ప్రియతో పాటు మేం కూడా వెళ్ళిపోతాం -- ' అంది.
ప్రియ కొంటెగా నవ్వింది.
"అదేం కాదులే అమ్మమ్మా! కళ మాత్రం ఇక్కడే ఉంటుంది. వాళ్ళ బావ చదువు పూర్తయింది.....
కళ ముఖం నల్లబడింది కాని కనబడకుండా కప్పి పుచ్చుకుంది. లేని నవ్వు తెచ్చుకుంటూ "మీ అన్నయ్యను మాకు పరిచయం చేయనే లేదేం?' అంది.
"పదండి! అన్నయ్య గదిలోకి మనమే వెళ్దాం. ఫ్లూట్ పుచ్చుకు కూర్చున్నాడంటే వాడికి మరో సంగతే జ్ఞాపకం ఉండదు...."
"పోనివ్వండి! ఆయన్ని డిస్టర్బ్ చెయ్యటం దేనికి?" అని వారించింది చిత్ర. కాని ప్రియ వినిపించుకోలేదు.
'అన్నయ్య మనల్ని చూసైనా ప్రాక్టీసు కట్టిపెడతాడు. ఆ కూతలు మీరేం భరించగలరు? అలవాటైన నేనే భరించలేను...." అంటూ ప్రియ వాళ్ళన్నయ్య గదిలోకి దారి తీసింది.
వాళ్ళన్నయ్య ఒక కుర్చీలో కూర్చుని ఫ్లూటు తో తంటాలు పడుతున్నాడు. కాళ్ళ దగ్గర ఒక కుక్క పడుకుని ఉంది. చిత్ర విస్మయంగా కుక్క కేసి చూపులు సారిస్తున్నంత లో అతను వెనక్కి తిరిగాడు ఫ్లూట్ చేతిలో పట్టుకుంటూ. చిత్ర ఉలిక్కిపడింది.
"మా అన్నయ్య సారంగ , అది వాడి కుక్క రంభ. ఆ కుక్కన్నా, ఆ ఫ్లూటన్నా వాడికి భలే ఇష్టం...." అని చిత్ర పరిచయం చేస్తుంటే చిత్రకూ నోట మాట పెగిలి రాలేదు. రంభట! ఊర్వశీ ని దొంగిలించి రంభ అని పేరు పెట్టుకున్నాడు కాబోలు! పేరు మారిస్తే మాత్రం కుక్కనేలా మార్చగలడు? చిత్ర మనస్సు కుతకుత లాడి పోయింది. అయినా పైకి నమ్రతగా నమస్కారం పెట్టింది.
కళ ఏదో రెండు మాటలు మాట్లాడింది. ప్రియ ఇల్లంతా చూపిస్తాను రమ్మని ముందుకు నడిచింది. చిత్ర కావాలని వెనక్కి ఉండిపోయింది. వాళ్ళలా వెళ్ళగానే చిత్ర చురచురా చూస్తూ "పోయి పోయి వూర కుక్కనే దొంగిలించుకురావాలా?' అనేసి విసురుగా ప్రియ, కళ దగ్గరకి వెళ్ళిపోయింది.
సారంగ చిత్ర నోటి దురుసుతనం చూసి నివ్వెర పోయాడు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా మొదటి ముక్కకే వస్తుందేమిటి? భలే! గడుసు పిల్లలా ఉందే? తనకు దొంగతనం అంట గడుతుందేమిటి? ఈ పిల్లకు ఎలా బుద్ది చెప్పాలి? కోపంతో సారంగ ముఖం జేవురించింది. గభాలున ఫ్లూటు బల్ల మీద పడేసి కుర్చీ లో నుంచి లేచి నిలబడ్డాడు....
ప్రియతో పాటు వాళ్ళు గదులన్నీ తిరిగి వస్తున్నారు. చిత్ర వంటరిగా కనబడుతుందేమో నని వోపిగ్గా చూశాడు సారంగ. కాని చిత్ర మళ్ళా అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు.గేటు తీసుకుని చిత్ర, కళ వెళ్తుంటే ఏం చేయలేక పళ్ళు కొరుక్కున్నాడు సారంగ.
* * * *
చీకటి పడింది. చిత్ర బీచి నుండి ఇంటి ముఖం పట్టింది. రోడ్డు కిరువైపులా బారులు దీర్చిన విద్యుద్దీపాలు దూరంగా 'వి' ఆకృతి లో కలుసు కుంటున్నాయి.
చిత్ర నడుస్తూ నడుస్తూ గభాలున 'అమ్మా!" అంటూ బాధగా జడ పట్టుకుని వెనక్కి తిరిగి చూసింది. తన జడ గుంజిన మనిషెవరో కంగారుగా పారిపోయాడు. రౌడీ వెధవ! కాకపోతే ఆడవాళ్ళ జడలు పట్టి గుంజట మేమిటి? పోకిరీ వెధవకు ఎంత ధైర్యం!... చటుక్కున చిత్రకూ ఆ మధ్య తన వెంట బడిన మోహన్ జ్ఞాపకం వచ్చాడు. మోహన్ తప్ప మరెవ్వరు చెయ్యగలరీ పని? సినిమా వాళ్ళు, నాటకాల వాళ్ళు అంటే తనకు పెద్ద మంచి అభిప్రాయం ఏదీ లేదు కాని బొత్తిగా ఇంత అన్యాయం అనుకోలేదు. ఈసారి మళ్ళా కనబడనీ!
చిత్ర తేలిగ్గా ఉన్న జడకేసి చూసుకుంది. ఇరవై రూపాయలు పెట్టి మధుర నించి తెప్పించుకున్న సవరం . అది జడలో పెట్టి అల్లుకుంటే అచ్చం మామూలు జడలానే ఉండేది! మళ్ళా అలాటిది ఎక్కడ దొరుకుతుంది? పమిటతో జడ కప్పుకుని నీరసంగా ఇల్లు చేరుకుంది చిత్ర....
శేఖర్ గదిలో శారద ఇంగ్లీష్ పుస్తకం ముందేసు కుని చదువు కుంటున్నది. మంచం మీద బావ మూలుగుతూ పడుకున్నాడు. అది ఇంజక్షన్ల బాధో తెలీదు, ఊర్వశే కోసం బెంగో తెలీదు. పక్కగదిలో కళ కుర్చీలో కూర్చుని తదేక దీక్షగా ఆలోచించు కుంటున్నది. చిత్ర ఆడుగుల సవ్వడి విని అటు చూసి కళ నిర్లిప్తంగా నవ్వింది. అతి దీనంగా ఉన్న చిత్రను చూసి కళ ఆశ్చర్యంగా అడిగింది "ఏం జరిగింది చిత్రా?' అంటూ.
చిత్ర మెల్లిగా గొంతుక తగించి చెప్పింది.
"సవరం....పోయింది..."
కళ నవ్వింది.
"పొతే పోయింది లెద్దూ. దాని కోసం బెంగే,మిటి? కావాలంటే ఇంకోటి కొనుక్కోవచ్చు... ఇంతకీ ఎలా పోయింది?"
"ఏం చెప్పటం?
"రిబ్బనేం వేసుకోలేదు... ఎక్కడో జారిపోయింది. నేను చూసుకోలేదు...." అని చెప్పింది చిత్ర దిగులుగా.
"నీ జడ నిక్షేపం లా ఉంటుంది. చెప్తే వినవు కాని...."
చిత్ర ఉక్రిషంగా అంది.
"నీ జడంత పొడుగు నాకూ ఉంటె నేను నీలానే కబుర్లు చెప్పేదాన్ని!...మధుర నించి తెప్పించుకున్న సవరం... ఎంచక్కా ఉండేది! మళ్ళా అలాంటిది దొరకటం కష్టం....."
పక్క గదిలో బావ మంచం మీద లేచి కూర్చున్నాడు. చిత్ర గతుక్కుమంది బావ తన సవరం గొడవ విన్నాడేమోనని.
రెండు మూడు రోజుల తర్వాత శేఖర్ సవరం సంగతి ఎత్తినప్పుడు చిత్ర మొదట సిగ్గుపడింది. తర్వాత కోపం కూడా వచ్చింది. కాని శేఖర్ అవేవీ పట్టించుకోకుండా, "చిత్రా! నా ఫ్రెండోకడు మదురై వెళ్తున్నాడు... నీకు సవరం కావాలంటే తెప్పించి పెడతాను...." అన్నాడు.
చిత్ర ఆతృతగా అడిగింది.
"నిజంగానా బావా? మీ ఫ్రెండ్ మళ్ళా ఎప్పుడు తిరిగొస్తాడు?"
"తొందర్లోనే తిరిగొస్తాడు.... నాలుగైదు రోజుల్లో రావచ్చు...."
చిత్ర కాస్సేపు సాలోచనగా వూరుకుని తర్వాత తల అడ్డంగా తిప్పింది.
"వద్దులే బావా! ఇప్పుడంత డబ్బు ఎక్కడ్నించి తేవటం?"
శేఖర్ ఏ మాత్రం తటపటాయించకుండా "డబ్బు సంగతి నీకెందుకు? నేను తెప్పించి పెడతాగా?" అన్నాడు ధీమాగా.
చిత్ర కృతజ్ఞత నిండిన కళ్ళతో శేఖర్ కేసి మవునంగా చూసింది.
* * * *
